Mon, February 08, 2016

Type in English and Give Space to Convert to Telugu


బ్రహ్మోత్సవం.. ఇది బ్రహ్మోత్సవం..
శేషాద్రి శిఖరాన వేంకటేశ్వరస్వామి కలియుగంలో ప్రజల పాపాల్ని ప్రక్షాళన చేసి అందరికీ ధర్మమార్గాన్ని బోధించేందుకు కొలువై ఉన్నాడు. ఆ ఏడుకొండల వాడికి ప్రతి ఏడాదీ బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. ఈ వేడుకలకు ఉన్న పురాణ ప్రాశస్త్యం గురించిన అంశాల్ని వివరించి చెబుతుందీ కథా సందర్భం. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఒక్కో ప్రత్యేక వాహనాన్ని అధిరోహించి ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు తిరువీధుల్లో వూరేగుతుంటాడు. ఆ వాహనాల విశేషాల్ని ఈ కథాసందర్భం పేర్కొంటోంది.

స్కంధపురాణం, భవిష్యోత్తర పురాణాల్లో శ్రీవేంకటేశుడికి జరిగే బ్రహ్మోత్సవాల గురించి వివరణ కనిపిస్తుంది. భక్త జనులకు కొంగు బంగారమై కోరిన కోరికలు తీరుస్తాడని ప్రతి భక్తుడూ భావించే ఆ వేంకటేశ్వరస్వామి అర్చావతారంలో తిరుమలలో శేషపర్వతం మీద వేంచేసి ఉన్నాడు. ఆయనకు ప్రతి ఏడాదీ కన్యామాసం అంటే అశ్వయుజమాసం శుక్లపక్షంలో వచ్చే శ్రవణ నక్షత్రంలో అవభృధాన్ని సంకల్పిస్తారు. అంటే చక్రస్నానాన్ని సంకల్పిస్తారు. ఇలా సంకల్పించి తొమ్మిది రోజులపాటు ఉత్సవాలు చేస్తారు. దీనిలో ముందుగా ధ్వజారోహణం జరుగుతుంది. అంతకుముందు రోజు అంకురార్పణ చేస్తారు. అదేరోజు సాయంకాలం దేవతల సేనాధిపతి అయిన విష్వక్సేనుడికి చతుర్వీథుల ఉత్సవం నిర్వహిస్తారు. తొమ్మిది రోజుల్లో మొదటి రోజు సాయంకాలం ఈ ధ్వజారోహణం ఉంటుంది. ఆ తర్వాత నుంచి ప్రతిరోజూ ఉదయం, రాత్రి నిర్ణీత వాహనాల మీద వేంకటేశ్వరస్వామి వూరేగుతాడు. ఇదే బ్రహ్మోత్సవం.

బ్రహ్మదేవుడు బ్రహ్మోత్సవాలకు ఆహూతులైన మహర్షులతో, మహారాజులతో, భక్తజనకోటితో, చతురంగ బలాలతో కలిసి పాడ్యమినాడు వైఖానసులచేత బ్రహ్మోత్సవానికి అంకురార్పణ చేయిస్తాడు. విదియనాడు రత్నమయమైన పల్లకీలో శ్రీనివాసుడిని వూరేగించి ధ్వజారోహణాన్ని చేయించినట్లు చెబుతారు. స్కంధపురాణంలో బ్రహ్మదేవుడే తొలిగా వేంకటేశ్వరస్వామికి బ్రహ్మోత్సవాలు చేయించినట్లు కనిపిస్తుంది. నాటి ఆ ఉత్సవ సంరంభాన్ని ఏటా భక్తులంతా గుర్తుకు తెచ్చుకోవాలన్న లక్ష్యంతోనే వేడుకలు జరుగుతుంటాయి. మానవులు, దేవతలు, గంధర్వులు, సిద్ధులు, సాధ్వులు, స్వామి బ్రహ్మోత్సవంలో పాల్గొనటానికి వస్తూ ఉంటారని స్కంధపురాణంలో వేంకటాచల మహాత్మ్యం పదిహేడో అధ్యాయం వివరిస్తోంది.

బ్రహ్మోత్సవాల్లో వేంకటేశ్వరస్వామి ప్రతిరోజూ వూరేగే వాహనాల విశేషాల్ని అన్నమయ్య ఎంతో చక్కగా పాటకట్టి వినిపించాడు. తిరువీధుల మెరసీ దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను||

తిరుదండెల పైనేగీ దేవుడిదే తొలినాడు సిరుల రెండవనాడు శేషుని మీద మురిపేన మూడోనాడు ముత్యాలపందిరి కింద పొరి నాలుగోనాడు పువ్వు కోవిల లోను||

గక్కన ఐదవనాడు గరుడుని మీద ఎక్కెను ఆరవనాడు యేనుగు మీద చొక్కమై ఏడవనాడు సూర్యప్రభలోనను యిక్కువ తేరును గుర్ర మెనిమిదోనాడు||

కనకపుటందలము కదిసి తొమ్మిదోనాడు పెనచి పదోనాడు పెండ్లీపీట కనసి శ్రీవేంకటేశుడింతి అలమేల్మంగతో వనితల నడుమను వాహనాల మీదను||

తొలి రోజున పల్లకీలో వూరేగుతాడు. అదేరోజు రాత్రి శేషవాహనం మీద తిరువీధులలో తిరుగుతాడు. రెండోనాడు ఉదయంపూట శేషవాహనాన్ని ఎక్కితే రాత్రికి హంస వాహనం మీద అలరారుతాడు. మూడోనాడు ఉదయం పూట సింహవాహనాన్ని ఎక్కి రాత్రికి ముత్యాల మండపం కింద వూరేగుతూ భక్తుల్ని మురిపిస్తాడు. నాలుగోనాడు ఉదయం పూట కల్పవృక్షం, రాత్రికి సర్వభూపాల వాహనం, ఐదోనాడు ఉదయం పల్లకి, రాత్రికి గరుడవాహనం ఆయన వూరేగే వాహనాలు. ఆరోనాడు ఉదయం హనుమత్‌ వాహనం, సాయంవేళ మంగళగిరి వాహనం రథరంగ డోలోత్సవం, రాత్రికి గజ వాహనం మీద వూరేగుతాడు. ఏడోనాడు సూర్యమండల వాహనం, సాయంకాలం మంగళగిరి వాహనం, రాత్రికి చంద్రమండల వాహనాన్ని అధిరోహిస్తాడు. ఎనిమిదోనాడు రథవాహనం, రాత్రికి అశ్వవాహనం వేంకటపతి వూరేగింపు కోసం సిద్ధంగా ఉంటాయి. తొమ్మిదోనాడు పల్లకి, రాత్రికి మంగళగిరి వాహనం ఉంటాయి.

ఇలా తొమ్మిది రోజులపాటు ఏడుకొండలవాడు ఎంచక్కా నిర్ణీత వాహనాల్లో దేవేరులతో తిరువీధుల్లో నిండుగా తిరుగుతాడు. పూర్వం బ్రహ్మదేవుడు ఉత్సవాల్ని ప్రారంభించినప్పుడు పదకొండు రోజులపాటు ఉత్సవాలు జరిపించాడు. ఆ కారణంగానే ఈనాటి బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ప్రతి ఉత్సవంలోనూ ముందుగా బ్రహ్మరథం అనే పేరుతో చక్కగా అలంకరించి ఉన్న ఓ చిన్న రథం ముందు వెళుతూ ఉంటుంది. గోవింద నామస్మరణలతో తిరుమల ప్రాంతం, తిరువీధులు ప్రతిధ్వనించేలా ఈ ఉత్సవాలు జరుగుతుంటాయి.

- డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు
Puranam
మరిన్ని మన పురాణాలు...
41
31
32
33
34
35
 36
 37
 38
39
40
21
22
23
24
25
26
27
28
29
30
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మరిన్ని జాతీయాలు...
21
22
23
24
25
 26
       
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మాధవన్‌ పళ్లురాలగొట్టాను..!

సినిమా కోసం ఉత్తుత్తినే కాదు.. నిజంగానే అంతపని చేసిందట రితిక. గత వారం విడుదలై సంచలన విజయం సాధించిన ‘సాలా ఖడూస్‌’ చిత్రం కథానాయిక. అప్పుడెప్పుడో పరుగుల రాణీ...

మోగ్లీ.. ఏప్రిల్‌ 15న వస్తున్నాడు

వాల్ట్‌డిస్నీ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ‘ది జంగిల్‌ బుక్‌’ అనే యానిమేషన్‌ చిత్రాన్ని పేరణగా తీసుకుని అదే పేరుతో మళ్లీ తెరకెక్కిస్తున్నారు. గతంలో...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net