Tue, February 09, 2016

Type in English and Give Space to Convert to Telugu


దశావతార వ్రతం
కోర్కెలను సిద్ధింపజేసి భగవంతుడి సాయిజ్యాన్ని ప్రాప్తింపచేసే మంచి వ్రతంగా దశావతార వ్రతం పేరొందింది. వ్రత గ్రంథాలు దీని మహత్వాన్ని గురించి వివరించి చెబుతున్నాయి. ఇది ఉపవాస పూర్వకంగా నిర్వర్తించి తీరాల్సిన వ్రతం. భాద్రపద శుక్ల దశమినాడు వీలైతే రోజంతా కానీ లేదంటే కనీసం ఒక పూటైనా ఉపవాసం ఉండి వ్రతం చేయాలి. పూర్తిగా సంప్రదాయాన్ని అనుసరించేవారు దేవతలకూ, రుషులకూ, పితృదేవతలకూ తర్పణాలిస్తారు. ఇలా చేయటం వల్ల సత్సంతానం, సౌభాగ్యం ప్రాప్తిస్తాయన్నది నమ్మకం. దశావతార వ్రతంనాడు భగవానుడికి సంబంధించి పది అవతారాల ప్రతిమలను పూజించాల్సి ఉంటుంది. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ, కల్కి అవతారాల ప్రతిమలను పూజ ప్రదేశంలో ఉంచి పూజ చేయాలి.

భగవానుడి అవతారాల విషయానికొస్తే అవి అనంతమని పెద్దలు చెప్పారు. భాగవతాది గ్రంథాలలో ఇరవై ఒకటిగా, మరో చోట మరో సంఖ్యతోనూ ఈ అవతార క్రమం కనిపిస్తుంది. కానీ ఆ స్వామి ధరించిన అవతారాలలో ఓ పదింటికి మరీ మరీ విశేషాలున్నాయి. కనుక ఆ పది అవతారాలనూ ధ్యానిస్తూ వాటికి పూజలు చేయటం మేలని పూర్వ రుషులు నిర్దేశించారు.

ఈ అవతార క్రమంలో మొదటిది మత్సా్యవతారం. వైకుంఠవాసుడు ఓ సాధారణ మత్స్యంగా ఎందుకు అవతరించాడు అనంటే సమాజానికి ఉపకరించే వాటిని దుర్మార్గులు అపహరించుకు పోయినప్పుడు వారిని అంతం చేసి ధర్మాన్ని రక్షించటం కోసమే ఆనాడు అనంత విజ్ఞాన నిధులైన వేదాలను సోమకాసురుడు అపహరించి ఎవరికీ ప్రవేశించటానికి వీలులేని నీటి అడుగున ఉన్న ఓ రహస్య ప్రదేశంలో వాటిని దాచిపెట్టాడు. దానికి తగ్గట్టుగానే మత్సా్యవతారాన్ని ధరించి అసుర సంహారం చేసి వేద, ధర్మోద్ధరణ చేశాడు స్వామి.

సమాజం కష్టాలపాలైనప్పుడు వైకుంఠంలో హాయిగా కూర్చోడు ఆ స్వామి. తాను కూడా ఆ కష్టాలలో పాలు పంచుకొని ధర్మోద్ధరణ చేసి సమాజ హితానికి కారకుడవుతాడు. ఈ విషయాన్నే తెలుపుతుంది కూర్మావతారం. క్షీరసాగర మధన వేళ అమృతం కోసం అంతా కష్టపడుతున్నప్పుడు దానికి తగ్గట్టుగా ఓ తాబేలుగా అవతారాన్ని ధరించి సముద్రపుటడుగునకు వెళ్లి కవ్వం లాంటి మందరగిరిని తన వీపున మోపించుకొని ఆ బాధను అనుభవిస్తూ దేవతలకు అమృతం అందేలా చేశాడు. స్వామి మూడో అవతారం వరాహవతారం. ఇది చాలా ప్రధానమైన అవతారం. ఏకంగా భూమిని నీళ్లల్లోకి తోసేసి జీవజాలం మొత్తాన్ని అంతం చేయాలనే ఓ దుర్మార్గపుటాలోచన చేసిన అసుర శక్తిని సంహరించి భూమి ఉద్ధరణతో పాటు ధర్మాన్ని ఉద్ధరించి తన తత్త్వాన్ని నిరూపించాడు ఈ అవతారంలో ఆ స్వామి.

స్వామి నాలుగో అవతారం నరసింహావతారం. అధర్మంగా ఆలోచించేవారు ఎంతగా దైవాన్ని మోసం చేయాలనుకున్నా ఆ దైవం చేతిలో చివరకు అంతం కావలసిందేనన్న సందేశం కనిపిస్తుంది. హిరణ్యకశిపుడు శ్రీహరి మీద పగతో నరనరాన ఆ స్వామి మీద ద్వేషాన్ని పెంచుకొని ఆయన నామస్మరణతోనే కాలం గడుపుతుండేవాడు. ద్వేషంతోనైనా పగతోనైనాసరే తన పేరు తలచుకొంటూ బతికాడు కనుక తన ఒడిలోనే ఆ అసురుడికి మోక్షాన్ని ప్రసాదించాడు ఆ స్వామి. అనంతర అవతారం వామనావతారం. ఈ అవతారంలో దానం విలువను చాటి చెప్పాడు ఆ స్వామి. ఆ తర్వాత కనిపించేది పరశురామావతారం. దీనినే భార్గవ రామావతారం అని అంటారు. ఈ అవతారంలో సౌమ్యంగా ఉన్న వారిని అనవసరంగా ఇబ్బంది పెట్టకూడదని, అలా చేస్తే అనంత నష్టాలు ప్రాప్తిస్తాయన్న సందేశం కనిపిస్తుంది.

పరిపూర్ణమైన మానవుడంటే ఎలా ఉండాలో తెలియజెప్పేది శ్రీరామావతారం. మనిషిగా బతికేవాడు అందరికీ ఆదర్శంగా ఎంతో క్రమశిక్షణతో ఉండాలి అనే నైతిక జీవన విధానాన్ని ఉద్భోదిస్తుంది ఈ అవతారం. కోపం లేనంత వరకూ ఎవరైనా ఎంత శాంతంగా ఉంటారో అదే కోపం కలిగితే ఎంత భీకరంగా మారుతారోనన్న విషయాన్ని రామావతారం తెలియజెబుతోంది.

అధర్మం మీద యుక్తాయుక్తంగా భగవానుడు చేసిన యుద్ధానికీ, ధర్మోద్ధరణకూ ప్రతీక కృష్ణావతారం. సత్యబోధ నేపథ్యంలో అవతరించిన భగవానుడి అవతారమే బుద్ధావతారం. కలిలో తలెత్తిన అన్యాయాలన్నిటినీ హరించే అవతారం కల్కి అవతారం. ఈ దశావతారాలను దశావతార వ్రత సందర్భంగా స్మరించుకొంటూ వైకుంఠవాసుడైన ఆ శ్రీహరి చూపిన ధర్మ మార్గంలో నడుచుకొనే ప్రయత్నం ప్రతి వారూ చేయాలని తెలియ చెప్పటమే ఈ దశావతార వ్రత ఆచరణలోని అంతరార్థంగా కనిపిస్తుంది.

-డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు
Puranam
మరిన్ని మన పురాణాలు...
41
31
32
33
34
35
 36
 37
 38
39
40
21
22
23
24
25
26
27
28
29
30
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మరిన్ని జాతీయాలు...
21
22
23
24
25
 26
       
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

పదుగురి కోసం ఆరుగురం!

కాలేజీ స్నేహితులకో వాట్స్‌యాప్‌ గ్రూప్‌ చిన్నప్పటి మిత్రులకో ఫేస్‌బుక్‌ గ్రూప్‌ బంధువులందరినీ కలిపేందుకు గూగుల్‌ ప్లస్‌.. ఇలా నేటి సామాజిక మాధ్యమాలని మస్తుగా వాడుకుంటోంది...

పచ్చబొట్టేసి...జోలీకి నచ్చేసి!

ఏంజెలీనా జోలీకి రెండంటే మహా ఇష్టం. ఒకటి పిల్లలు, రెండు టాటూలు. ముగ్గురు కన్నబిడ్డలతో పాటు మరో ముగ్గురు అనాథలను దత్తత తీసుకుని పెంచుకుంటోంది జోలీ...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net