Sat, February 13, 2016

Type in English and Give Space to Convert to Telugu


సర్వాధిపతి గణపతి
భాద్రపద శుద్ధ చవితి నాడు గణేశ చతుర్ధిని జరుపుకోవటం తరతరాలుగా అందరూ గమనిస్తున్న విషయమే. ఇంతకీ ఎప్పటివాడు ఈ గణేశుడు అనంటే ఇప్పటివాడా... వేదకాలం నాటి వాడని పండితులంతా నిగ్గుతేల్చి చెబుతున్నారు. దీనికి ఉదాహరణగా రుగ్వేదంలోని గణపతి ప్రార్థనకు సంబంధించిన ‘గణానాం త్వా గణపతిగ్‌ జౌ హవామహే...’ అనే మంత్రాన్ని ఉదాహరణగా పేర్కొంటున్నారు. ఈ వేద మంత్రాలలో ‘జ్యేష్ఠరాజః’ అనే పదముంది. దీన్ని బట్టి గణపతి తొలి దేవుడని స్పష్టమవుతోంది. సకల దేవతా గణాలకూ, సకల విశ్వానికీ ఆయన పాలకుడు. గణపతి అనే పదానికి సంస్కృతంలో ప్రజానాయకుడని అర్థం ఉంది. ఇలా చూసినా గణపతి అక్షరాలా రాజే. వేదకాలం నుంచి దేవతలతోపాటు అందరి పూజలూ అందుకొంటూ వస్తున్న ఆ ఆదిదేవుడి రూపం ప్రణవ రూపంలో ఉండటం మరీ విశేషం. అంటే వినాయకుడిని చూసినప్పుడు సంస్కృత లిపిలోని ఓంకారంతో పోలిక కనిపిస్తుంది. వక్రతుండం, తలపై అర్ధచంద్రుడు, నుదిటిన మూడో కన్ను, లంబోదరం... ఇవన్నీ సమీకరించుకొని చూస్తే ఓంకారం కచ్చితంగా దర్శనమిస్తుంది. గణపతి ఆధర్వశీర్షం అనే మంత్రం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది . ఓంకారంలో కుడివైపునకు తిరిగి ఉండే వంపే వక్రతుండం. అర్ధచంద్ర రూపం అర్ధానుస్వారం. దానికి పైన ఉండే చుక్క ఫాలనేత్రం. వీటన్నిటి మధ్య లంబోదరం దర్శనమిస్తుంది. గణేశుడి ఆకారాన్ని జ్యోతిష, యోగశాస్త్రాలు తమకు సంబంధించినదిగా అన్వయించుకొంటున్నాయి. మంత్రశాస్త్రంలో గణేశుడికి సంబంధించిన అనేక రూపాలు, వాటికి సంబంధించిన మంత్రాలు విడివిడిగా కనిపిస్తాయి. వీటి ప్రస్తావన గణేశపురాణం లీలా ఖండంలో కనిపిస్తుంది. సృష్టికి ఆదిలో ప్రణవం ఉన్నట్లే, ప్రణవ రూపుడైన గణపతి తొలి దేవుడన్న భావనే అందరూ ఆయనను పూజించటానికి ప్రధాన కారణమవుతోంది. మంత్ర శాస్త్రంలో ముప్ఫై రెండు గణపతుల ప్రస్తావన కనిపిస్తుంది. వీటిలో వల్లభ గణపతి రూపం ఒకటి ప్రత్యేకంగా ఉంది. గణపతి ఎడమ తొడ మీద వల్లభాదేవి కూర్చొని ఉండి, ఆమె కుడి చేయి గణేశుడి భుజం మీద వేసినట్లు ఉంటుంది. ఎడమ చేతిలో కలువపూవును పట్టుకొన్నట్టు ఉంటుంది. గణేశుడి చేతిలో అంకుశం, మొక్కజొన్నపొత్తు, పాశం, ఏకదంతం, పద్మం ఉంటాయి. కొంత మంది ఈ రూపాన్నే లక్ష్మీ గణపతిగా భావిస్తుంటారు. కానీ లక్ష్మీగణపతి రూపం మరొకటుందని, ఆ రూపాన్నే లక్ష్మీ గణపతి మంత్రంతో పూజించాల్సి ఉంటుందని కొందరు పెద్దలు, పండితులు వివరిస్తున్నారు. గణపతికి అటూ ఇటూ భూదేవి, శ్రీదేవి ఉండే రూపం లక్ష్మీ గణపతి. ఆ స్వామి కొన్ని చోట్ల నాలుగు చేతులతోనూ, మరికొన్ని చోట్ల ఎనిమిది చేతులతోనూ ఉన్నట్లు కనిపిస్తుంది. వల్లభేశోపనిషత్తు గణపతి వల్లభేశుడిగా ఎలా అయ్యాడో వివరిస్తోంది. ఈ ఉపనిషత్తులో రెండో అధ్యాయంలో కశ్యపుడు అడిగిన ప్రశ్నలకు మరీచి మహర్షి ఇచ్చిన సమాధానాలలో సిద్ధ లక్ష్మిని గణపతి పొందిన విధానంతోపాటు ఏయే దేవతలను ఎలా గణేశుడు రక్షించాడన్న విషయం ప్రకటితమవుతుంది.

గణేశుడు విశ్వానికంతటికీ ఆధిపత్యాన్ని వహిస్తూ చింతామణి ద్వీపాధిపతిగా అయ్యాడు. ఆ స్వామికి సంబంధించిన విశుద్ధ సత్వ మాయయే సిద్ధలక్ష్మి. మరీచి ఆ సిద్ధలక్ష్మి గురించి తపస్సు చేశాడు. అప్పుడామె ఆ తపస్సుకు మెచ్చి వల్లభ అనే పేరుతో మరీచికి కుమార్తెగా జన్మించింది. చింతామణి ద్వీపాధిపతి అనంతర కాలంలో గణపతిగా మూర్తిని ధరించి మరీచి కుమార్తె అయిన వల్లభను విధిప్రకారంగా వివాహమాడాడు. ఆనాటి నుంచి గణపతి వల్లభ గణపతి అయి తనను ఆరాధించిన వారందరికీ చతుర్విధ పురుషార్థాలను ప్రసాదిస్తూ వస్తున్నాడు.

ఈ గణపతి భండాసుర వధ సమయంలో లలితాదేవిని అనుగ్రహించి అసుర సంహారం జరిగేలా చేశాడు. ఒకప్పుడు కారణాంతరాల వల్ల శివుడి మూడో కంటి అగ్నికి గురైన లక్ష్మీదేవి దగ్ధమైంది. అప్పుడు విష్ణువు వల్లభేశుడి గురించి తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన గణపతి మారేడు చెట్టుతో లక్ష్మిని ఉజ్జీవింపచేసి విష్ణువుకిచ్చి ఆనందపరిచాడు. పార్వతీదేవి గణపతిని గురించి తపస్సు చేసినప్పుడు ఈశ్వరుడితో కలిపి ఆమెకు వరాలనిచ్చాడు. దక్షయజ్ఞంలో సతీదేవి దగ్ధమైన తర్వాత దక్షిణామూర్తి రూపుడైన శివుడు గణపతి గురించి తపస్సు చేశాడు. అప్పుడు గణపతి శివపార్వతులను మళ్ళీ కలిపి ఆనందాన్ని పంచాడు. వరాహ రూపుడైన విష్ణువుతో భూదేవిని కలిపాడు. కుమారస్వామి తనను గురించి తపస్సు చేసినప్పుడు తారకాసురుడిని సంహరించేందుకు కావలసిన శక్తి ఆయుధాన్ని ఇచ్చాడు. అనంతరం వల్లితో కుమారస్వామి వివాహాన్ని జరిపించాడు గణపతి.

ఇలా గణేశుడు యుగయుగాలుగా అందరినీ కాచి కాపాడే దేవతగా ఉండటం వల్లనే తొలిపూజలందుకొంటున్నాడు. ఎవరికివారు ఆయన రూపాన్ని చూసి తమ వాడిగా భావించుకొనేంత ఆత్మీయత ఆ స్వామి స్వరూపంలో ఉండటం విశేషం. చాటంత చెవులను చూసినప్పుడు విద్యార్ధులు పాఠాలను జాగ్రత్తగా వినాలనే సూచన కనిపిస్తుంది. అదే రైతులు చూస్తే ధాన్యాన్ని చాటలతో గాదెలలోకి చేరవేసే శుభ సందర్భం గుర్తుకు వస్తుంది. ఇలా ఒక్క చెవులే కాదు ఆయన సర్వస్వరూపం మానవాళికి శుభ సందేశాలను అందిస్తూనే కనిపిస్తుంది. వినాయక చవితినాడు ఆ స్వామికి సమర్పించే ఇరవై ఒక్క రకాల పత్రి, ఉండ్రాళ్ళు లాంటి వాటి వెనుక ఆరోగ్య సూత్రాలు ఇమిడి ఉన్నాయి. అందుకే చిన్నా, పెద్దా, అన్ని వర్గాలు, తరగతుల వారంతా వినాయక చవితి వస్తోందంటే తెగ సంబరపడిపోతుంటారు.

- డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు
Puranam
మరిన్ని మన పురాణాలు...
41
31
32
33
34
35
 36
 37
 38
39
40
21
22
23
24
25
26
27
28
29
30
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మరిన్ని జాతీయాలు...
21
22
23
24
25
 26
       
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మా వూరికి మంచి నీళ్లు...

బాగా ఆస్తిపాస్తులున్న వాళ్లని శ్రీమంతులంటారు.మహేశ్‌బాబు నటించిన ‘శ్రీమంతుడు’ చూశాక ఆ అర్థం మారిపోయిందనే చెప్పవచ్చు. ఎక్కడ పెరిగినా, స్థిరపడినా సొంతూరి...

ప్రేమలు మెరిసే.. తారలు మురిసే!

ప్రేమ ఓ అనీర్వచనీయమైన అనుభూతి. ప్రేమలో పడితేనే దాని మాధుర్యం ఏంటో తెలిసేది. నిజ జీవితాల్లోనే కాదు వెండితెరపైనా ప్రేమ అద్భుతమైన విజయాలు అందించింది....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net