Mon, February 15, 2016

Type in English and Give Space to Convert to Telugu


భగవదనుగ్రహ సోపానం
దేవుడిని ఎలా ఆరాధిస్తే కనిపిస్తాడు? కనికరిస్తాడు? అనే ప్రశ్నలు సర్వసాధారణం. ఇవి ఈనాటివి కావు. ఈ సందేహాలు యుగయుగాల నుంచి చాలామందికి కలుగుతూనే ఉన్నాయి. అశ్వశిరుడు అనే రాజుకు కూడా పూర్వం ఈ సందేహాలు కలిగాయి. ఆయనకు ఇద్దరు రుషులు సమాధానాలు ఇచ్చారు. ఆ రాజు, ఆయన సందేహాలు, రుషులు చెప్పిన విధానం... ఇదంతా వరాహపురాణం నాలుగో అధ్యాయంలో కనిపిస్తుంది.

పూర్వం అశ్వశిరుడు అనే మహారాజు చక్కగా రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు. దైవప్రీతి కోసం అనేక యజ్ఞ, యాగాలను కూడా చేస్తూ ఉండేవాడు. ఇన్ని చేసినా ఎప్పటి నుంచో శ్రీమహావిష్ణువును దర్శించాలన్న ఆయన కోరిక తీరలేదు. భగవద్దర్శనానికి ఏదైనా ప్రత్యేక విధివిధానం ఉందేమోనని తనకెదురైన పెద్దలనందరినీ నిత్యం అడుగుతుండేవాడు. ఓ రోజున అశ్వశిరుడి దగ్గరకు కపిలుడు, జైగీషవ్యుడు అనే యోగులు వచ్చారు. ఆ యోగుల గొప్పతనాన్ని గురించి రాజు అంతకు ముందే విన్నాడు. ఆ ఇద్దరికీ ఏదైనా ప్రత్యేక ఆరాధన ఉందా? ఉంటే చెప్పండి అని అడిగాడు. యోగులిద్దరూ రాజుతో ‘అదేంటి మహారాజా! నీవు చూడాలనుకుంటున్న నారాయణుడు నీముందే ఉన్నాడు కదా! ఆ నారాయణుడు మా ఇద్దరిలోనూ నీకు కనిపించటం లేదా?’ అని అన్నారు. అప్పుడు రాజు ఆ యోగులతో ‘మహాత్ములారా! అదేమిటి అలాగంటారు? మీరు యోగులు. ఆ రూపాలతోనే నాకు కనిపిస్తున్నారు. అయినా భగవంతుడైన ఆ నారాయణుడు మీరేనని చెప్పడం నాకు వింతగా అనిపిస్తోంది. ఆ జనార్దనుడి చేతుల్లో శంఖం, చక్రం, గద ఉంటాయి. పచ్చని పట్టుబట్ట కట్టుకొని ఉంటాడు. గరుడ వాహనాన్ని ఎక్కి ఉంటాడు. మీరేమో నాకలా కనిపించటం లేదు’ అని బదులిచ్చాడు. ఆ రాజు మాట వినగానే కపిలుడు స్వయంగా విష్ణు రూపంలోనూ, జైగీషవ్యుడు గరుత్మంతుడిగానూ మారిపోయారు. అయినా ఆ రాజు తృప్తి చెందలేదు. ‘విష్ణువంటే ఆయన నాభి నుంచి కమలం బయటకు వచ్చి ఉంటుంది. దానిలో బ్రహ్మదేవుడు ఉంటాడు. ఆ బ్రహ్మదేవుడికి రుద్రుడు పుట్టి ఉంటాడు. నాకు కనిపిస్తున్న విష్ణురూపంలో ఇవేమీ లేవు కదా’ అని అశ్వశిరుడు అన్నాడు. అప్పుడు యోగులిద్దరూ తమ యోగశక్తిని ప్రదర్శించారు. నాభికమలం, ఆ కమలం మధ్యలో బ్రహ్మదేవుడు, ఆయన ఒడిలో ఓ పసిబాలుడు ఉండే విష్ణురూపంతో కపిల, జైగీషవ్యులు కనిపించారు. కపిలుడు అలా పద్మనాభుడిగానూ, జైగీషవ్యుడు కమలంలో ఉండి, పసివాడి (రుద్రుడి)ని ఒడిలో ఉంచుకొన్న బ్రహ్మగానూ అవతరించి ‘నారాయణుడిని దర్శించినట్టేనా?’ అని రాజును అడిగారు. అందుకు రాజు మళ్లీ తల అడ్డంగా ­పి శ్రీమన్నారాయనుడంటే లక్ష్మీదేవితో కూడి సర్వత్రా వ్యాపించి ఉంటాడు. విశ్వాంతరాళం మధ్యన ఆయన ఉంటాడని విన్నాను. నాకు అలా కనిపించాలి గదా అని అన్నాడు. అలా అతను అంటూ ఉండగానే సకల చరాచర సృష్టి, ఆ మధ్యలో శ్రీమహావిష్ణువు ఉండటమనే దృశ్యం అక్కడ కనిపించింది. అప్పుడు రాజు ఎంతో సంతృప్తి చెంది తనకు కనిపిస్తున్న నారాయణుడికి నమస్కరించాడు. అలా నమస్కరిస్తున్న రాజును చూసి యోగులు ఇలా అన్నారు. ‘అశ్వశిర మహారాజా! నారాయణుడిని ఆరాధించటం ఎలా? ఆయన దర్శనాన్ని పొందటం ఎలా ? అని నీవు అడిగిన ప్రశ్నలకు, నీకు కలిగిన సందేహాలకు మేమిస్తున్న సమాధానం ఇదే. మేము మామూలు యోగులమని నీకు తెలుసుకదా! మాలో ముందు నీవు కోరుకున్న శ్రీహరిని చూడలేకపోయావు. ఆ తరువాత దృష్టి కేంద్రీకరించి మేం చెబుతున్న మాటలను అవగతం చేసుకుంటూ మాలోనే ఆ దేవదేవుడిని చూడగలిగావు. దైవదర్శన రహస్యం ఇక్కడే ఇమిడి ఉంది. కేవలం మాలోనే కాదు, ప్రతి ప్రాణిలోనూ ఆ శ్రీమన్నారాయణుడి రూపం ఒదిగి ఉంటుంది. అయితే భక్తితో, నమ్మకంతో నిశితంగా పరిశీలించాలి. అలా చేస్తే ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ సమయంలోనైనా ఆ శ్రీమన్నారాయణుడు కనిపించి తీరుతాడు. ఇలా ప్రవర్తించడమే దైవదర్శనానికి కావాల్సిన దైవారాధన విధానం, యజ్ఞాలు, యాగాలు, సర్వకర్మకాండలు పెద్దలు చెప్పినట్టుగా చేస్తూనే ఉండాలి. అయితే దానితోపాటు ప్రతి ప్రాణిలోనూ ఆ దేవుడున్నాడని గుర్తుంచుకోవాలి. అలా ఆ దేవుడిని చూడగలిగిన వాడే నిజమైన భక్తుడూ, నారాయణుడికి ఇష్టుడూ అవుతాడు’ అని కపిల, జైగీషవ్యులు అశ్వశిరుడికి బోధించారు. ఈ కథా సందర్భంలో గమనించాల్సిన విషయం ఒకటుంది. కొంతమంది పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు అంటూ అవి మాత్రమే చేస్తూ తమ ఎదుట ఉన్న మనుషులనూ, ఇతర ప్రాణులనూ తక్కువగా చూస్తుంటారు. కొన్ని సందర్భాల్లో హింసిస్తుంటారు. ఇది సరైన పద్ధతి కాదని, దైవభక్తితోపాటు సర్వభూత దయను కలిగి ఉన్నప్పుడే దైవ సాక్షాత్కారం కలుగుతుందని ఈ కథా సందర్భం పేర్కొంటోంది.

-డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు
Puranam
మరిన్ని మన పురాణాలు...
41
31
32
33
34
35
 36
 37
 38
39
40
21
22
23
24
25
26
27
28
29
30
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మరిన్ని జాతీయాలు...
21
22
23
24
25
 26
       
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

వలచి...గెలిచి..

ప్రేమికుల రోజూ.. అదే సూర్యుడు. అవే ఇరుసంధ్యలు. అదే గాలి. అవే దిక్కులు. ఎప్పట్లాగే ఇరవై నాలుగ్గంటలు!! మరేమిటీ ప్రత్యేకం? ఏముంది? ప్రేమే!!...

సీసీఎల్‌-6 విజేత తెలుగు వారియర్స్‌

సెలెబ్రిటీ క్రికెట్‌ లీగ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ తెలుగు వారియర్స్‌ ఫైనల్లో అదిరిపోయే ప్రదర్శనతో కర్ణాటక బుల్డోజర్స్‌ను మట్టికరిపించి రెండోసారి విజేతగా నిలిచింది. ఉప్పల్‌లో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో 208 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన అఖిల్‌...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net