Sun, February 07, 2016

Type in English and Give Space to Convert to Telugu


గురుభక్తి.. సర్వ శుభదీప్తి
గురుభక్తి ఉన్న వ్యక్తి సర్వ శుభాలనూ పొందగలడు. తాత్కాలికంగా పరీక్షా సమయంలో వచ్చే కష్టాలను అధిగమించి విజయాలను సొంతం చేసుకోగలడని తెలియజెప్పే కథా సందర్భం ఇది. వ్యాసకృత మహాభారతం ఆదిపర్వంలో ఉన్న ఈ కథ గురుభక్తి మహిమను వివరిస్తుంది. దృష్టి దోషాలను పోగొట్టి చక్కటి చూపునూ, సౌభాగ్యాన్ని ఇచ్చే అశ్వినీ దేవతా స్తోత్ర ఆవిర్భావానికి సంబంధించిన నేపథ్యాన్ని ఈ కథ ప్రకటిస్తుంది. శిష్యులు తనకంటే గొప్పవారు కావాలని గురువులు నిరంతరం ఆకాంక్షిస్తూనే ఉంటారు. ఆ శిష్యులకు పరీక్షలు పెట్టి వారి శక్తి ఎంతటిదో తెలుసుకోవాలని తగిన ప్రయత్నాలు చేస్తుంటారు. ఇది బంగారాన్ని ఒరిపిడి రాయితో రుద్ది పరీక్షించటం లాంటిదే. అంతే తప్ప శిష్యుడిని అనవసరంగా కష్టపెట్టడం వారికి ఇష్టం ఉండదు. శిష్యులకు శుభం కలిగితే ముందుగా సంతోషించేది గురువులే. శిష్యులకు కష్టం వస్తే అది తమకే వచ్చినంతగా బాధపడుతుంటారు ఆ గురువులు. ఈ విషయాన్ని ప్రతిపాదిస్తుంది ఉపమన్యువు అనే ఓ శిష్యుడి గురుభక్తి కథ.

పూర్వం అయోదధౌమ్యుడు అనే గురువు ఆశ్రమంలో ఉపమన్యువు విద్యాభ్యాసం చేస్తుండేవాడు. గురువు చెప్పింది చెప్పినట్టు అభ్యాసం చేయటం, విద్య మీద మంచి ఆసక్తి ఉండటం లాంటి సద్గుణాలను కలిగి ఉండేవాడు. దాంతోపాటు అతడు ఆశ్రమానికి చెందిన గోవులను అడవికి తీసుకెళ్ళి ప్రతిరోజూ మేపుకొని వస్తూ ఉండేవాడు. ఓసారి తన శిష్యుడిని పరీక్షించాలనుకున్నాడు అయోదధౌమ్యుడు. ఈ క్రమంలో ఉపమన్యువు భిక్షాటనకు వెళ్లి తెచ్చిన ఆహారాన్నంతటినీ ముందుగా తనకే ఇమ్మన్నాడు. ప్రతి రోజూ భిక్షాటనకు వెళ్లి తెచ్చిన భిక్షనంతటినీ గురువుకే సమర్పిస్తుండేవాడు. అలా చాలా కాలం పాటు గడిచింది. గురువు శిష్యుడు తనకిచ్చిన భిక్ష నుంచి కొద్దిగా కూడా శిష్యుడికి ఇచ్చేవాడు కాదు. అయినా శిష్యుడు నీరసపడక దృఢంగానే కనిపిస్తుండేవాడు. తెచ్చిన భిక్షనంతటినీ తానే తీసుకొంటున్నప్పుడు ఉపమన్యువు ఆహారమేమీ తినకుండా ఎలా దృఢంగా ఉండగలుగుతున్నాడో గురువుకు అర్థం కాలేదు. అదే విషయం గురించి తన శిష్యుడిని అడిగాడు.

అప్పుడా శిష్యుడు ప్రతిరోజూ తొలిసారి భిక్షాటనకు వెళ్ళి తెచ్చిన భిక్ష నంతటినీ గురువుకే ఇస్తూ రెండోసారి మాత్రం తన కోసం భిక్షకు వెళుతున్నట్లు చెప్పాడు. అప్పుడు ఆ గురువు అలా రెండోసారి భిక్షకు వెళ్ళటం అధర్మమని, అలా చేయొద్దన్నాడు. సరేనన్నాడు శిష్యుడు. మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత శిష్యుడిని చూశాడు గురువు. అయినా దృఢంగానే కనిపించాడు. రెండోసారి భిక్షకు వెళ్ళటం లేదు కదా! ఆహారం ఏమీ తీసుకోవటం లేదు కదా. మరి నీరసం లేకుండా బలంగా ఎలా ఉన్నావు చెప్పు అని అన్నాడు ధౌమ్యుడు. మేపటానికి తీసుకెళ్లిన గోవుల పాలను తాగుతున్నట్లు చెప్పాడు ఉపమన్యువు. అలా కూడా చేయొద్దని మళ్ళీ ఆజ్ఞాపించాడు ధౌమ్యుడు. సరేనన్నాడు శిష్యుడు. కొంతకాలం తర్వాత గురువు శిష్యుడిని పిలిచి చూసినప్పుడు అతడు బలంగానే కనిపించాడు. ఇదెలా సాధ్యం? భిక్షాటనకు వెళ్ళటం లేదు, గోవుల పాలను తాగటం లేదు, అయినా నీరసంగా లేకుండా బలంగా ఎలా ఉండగలుగుతున్నావో చెప్పమన్నాడు ధౌమ్యుడు. అన్నం తినటం లేదు, పాలు తాగటం లేదు. కానీ గోవుల దగ్గర దూడలు పాలు తాగుతున్నప్పుడు ఆ దూడల నోటి నుంచి వస్తున్న నురుగును స్వీకరిస్తున్నాను. దాంతో ఆకలి తీరి బలంగా ఉంటున్నానన్నాడు ఉపమన్యువు. అప్పుడు గురువు ‘నీ మీద జాలిపడి ఆవు దూడలు పాలను నురుగులాగా విడుస్తున్నట్లున్నాయి. అలా వాటికి చెందాల్సిన ఆహారాన్ని నీవు తీసుకోవటం సమంజసం కాదు కనుక నురుగు కూడా స్వీకరించ వద్దు’ అని ఆజ్ఞాపించాడు గురువు. సరేనన్నాడు శిష్యుడు. ఆ తరువాత ఉపమన్యువు ప్రతిరోజూ ఆశ్రమానికి సంబంధించిన ఆవులను మేపటం కోసం అడవికి తీసుకెళుతూ ఆవుపాలు, నురుగు ఏవీ స్వీకరించకుండా ఉన్నాడు. కానీ ఓ రోజు ఆకలికి తట్టుకోలేక జిల్లేడు ఆకులను తినసాగాడు. జిల్లేడు ఆకులలోని పాలు కళ్ళల్లోపడి చూపు పోయింది. ఆశ్రమానికి దారి కనపడక తడుముకుంటూ నడుస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు పాడుపడ్డ బావిలో పడి ఓ చెట్టుకొమ్మ ఆధారంగా నిలదొక్కుకొని కూర్చున్నాడు.

ఆ రోజున శిష్యుడు ఎంతకీ ఆశ్రమానికి తిరిగి రాకపోయేసరికి ఇతర శిష్యులను వెంటపెట్టుకొని ధౌమ్యుడు ఉపమన్యువును వెతుక్కుంటూ అడవికి వెళ్ళాడు. ఎక్కడా శిష్యుడు కనిపించకపోయే సరికి బిగ్గరగా అరిచి పిలిచాడు. అప్పుడు ఉపమన్యువు కంటి చూపును కోల్పోయి తాను బావిలో పడి ఉన్నానని బదులు పలికాడు. వెంటనే గురువు నేత్ర దృష్టిని ప్రసాదించే దేవ వైద్యులైన అశ్వినీ దేవతలను స్తుతించమన్నాడు. అప్పుడా శిష్యుడు ఆర్తితో ఆ దేవతలను స్తుతించాడు. ఆ స్తోత్రానికి మెచ్చిన దేవతలు అతడికి ఒక దివ్య భక్ష్యాన్ని ఇచ్చి దాన్ని తింటే చూపు వస్తుందని చెప్పారు. కానీ ఉపమన్యువు గురువుకు నివేదించనిదే, ఆయన ఆజ్ఞ లేనిదే తాను తిననని చెప్పాడు. అశ్వినీ దేవతలు ఎంతగా చెప్పినా సడలని గురుభక్తితో ఆ భక్ష్యాన్ని తాను తిననంటే తిననన్నాడు ఉపమన్యువు. అతడిలోని అచంచల గురుభక్తి అశ్వినీ దేవతలకు బాగా నచ్చింది. వెంటనే అతడికి చూపు ప్రసాదించారు. ఆ తర్వాత గురువు ఆశీర్వచనం పొందిన ఆ శిష్యుడు సకల శాస్త్రాలను సులభంగా పొంది వృద్ధిలోకి వచ్చాడు.

భారతంలోని ఈ కథా సందర్భంలో శిష్యులు గురువుల విషయంలో ఎంతటి ఓర్పు వహించి ఉండాలో, ఎంతటి అచంచల భక్తిని కలిగి ఉండాలోనన్న విషయం ప్రకటితమవుతోంది. ఈ కథలో మరో విశేషం ఉంది. ఆనాడు ఉపమన్యువు అశ్వినీ దేవతలను స్తుతిస్తూ చెప్పిన స్తోత్రం అశ్వినీదేవతా స్తోత్రంగా ఈనాటికీ ప్రచారంలో ఉంది. నేత్ర సంబంధ రోగాలు పోయి చక్కటి చూపు, సుఖ భోగాలు కావాలనుకున్న వారు ఈ స్తోత్రాన్ని దీక్షతో పారాయణ చేస్తూ లబ్ధి పొందుతుండటం కనిపిస్తుంది.

- డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు
Puranam
మరిన్ని మన పురాణాలు...
41
31
32
33
34
35
 36
 37
 38
39
40
21
22
23
24
25
26
27
28
29
30
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మరిన్ని జాతీయాలు...
21
22
23
24
25
 26
       
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

వెలుగు వైపు నా అడుగులు...

బడిగంట కొట్టగానే పిల్లలందరూ బిలబిలమంటూ బయటకు పరుగుతీశారు. టీచర్లూ ఇంటిదారిపట్టారు. ఒకరిద్దరు తప్ప నిర్మానుష్యంగా మారిన ఆ బడిలో..

మరోసారి నీరజ్‌పాండే దర్శకత్వంలో అక్షయ్‌కుమార్‌

బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఇటీవల విడుదలై రూ.100 కోట్ల కలెక్షన్లతో భారీ........

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net