Tue, February 09, 2016

Type in English and Give Space to Convert to Telugu


ఉత్తమ మిత్ర లక్షణం
మిత్రుడంటే కష్టకాలంలో ఎలా ఆదుకోవాలో, అవతలి వ్యక్తికి ధైర్యం చెప్పి విజయమార్గాన ఎలా పయనింపచేయాలో చేసి చూపిన వానర వీరుడు సుగ్రీవుడు. శ్రీరాముడికీ, సుగ్రీవుడికీ అగ్నిసాక్షిగా మైత్రి కుదిరింది. అంతటి పవిత్రమైన బంధాన్ని సుగ్రీవుడు ఎంత ఆదర్శవంతంగా నిలుపుకొన్నాడన్నది రామాయణం యుద్ధకాండ ప్రధమ సర్గలో వాల్మీకి మహర్షి వర్ణించి చూపాడు.

హనుమంతుడు శతయోజన పర్యంతమైన సముద్రాన్ని దాటి లంకానగరాన్ని చేరి సీతమ్మ జాడ తెలుసుకొని తిరిగి వచ్చాడు. ఆ శుభ వర్తమానాన్ని శ్రీరాముడికి తెలియచెప్పాడు. అప్పుడు శ్రీరాముడు అన్నిటికంటే విలువైన బహుమానంగా ఆనందంతో పులకరించిన శరీరంతో హనుమంతుడిని కౌగిలించుకొన్నాడు. శ్రీరాముడి ఆ ఆనందం ఎంతో సేపు నిలువలేదు. అంత పెద్ద సముద్రాన్ని ఎలా దాటాలా అని ఆలోచనలో పడ్డాడు. అప్పుడు సుగ్రీవుడు రాముడి మనసులోని విచారాన్ని గుర్తించి తగిన విధంగా ధైర్యం చెప్పటం ప్రారంభించాడు. సామాన్యుడు మాత్రమే విచారిస్తాడని, తెలివి కలిగినవాడు కృతఘ్నుడి స్నేహాన్ని వదిలిపెట్టినట్టు విచారాన్ని వదిలిపెట్టాలన్నాడు. మతిమంతుడు, ప్రాజ్ఞుడు, పండితుడు అయినవాడు పురుషార్థాన్ని పాడు చేసే ఉత్సాహభంగకరమైన విచారాన్ని విడిచి పెట్టాలన్నాడు. నిరుత్సాహం వల్ల ధైర్యం నశిస్తుందని చెప్పాడు. ఎవరైనా సరే దైన్యంతో ఉంటే శోకం పుడుతుందని, మనస్సు వ్యాకులపడుతుందని, అదే అన్ని కార్యాలూ చెడిపోవటానికి ప్రధాన కారణమై తీరుతుందన్నాడు. సీతాదేవిని ఎత్తుకు పోయిన పగవాడిని పరాక్రమంతో వానరులంతా కలసి సంహరించగలరని, అయితే శ్రీరామచంద్రుడు కేవలం ఒక్క ధైర్యాన్ని మాత్రమే కలిగి ఉంటే సరిపోతుందని సుగ్రీవుడు అన్నాడు. శతయోజన పర్యంతమైన సముద్రం దాటడం ఏమంత కష్టమైన పనికాదని, దాని మీద సేతువు కట్టి కార్యాన్ని సాధించవచ్చని చెప్పాడు. విచారం అంతటినీ నాశనం చేస్తుందని కనుక దాన్ని వదలి పెట్టడమే మేలని, కొద్ది పాటి విచారం మనసులో ఉన్నా అది మనిషి శౌర్యం మొత్తాన్నీ తుడిచి పెట్టేస్తుందన్నారు. కష్ట సమయాలలో పరాక్రమం, ధైర్యం, శౌర్యం చూపెట్టాలని, రాముడి వంటి శూరులు, మహాత్ములు శోకించటం సబబు కాదన్నాడు. శోకం వల్ల కార్యాలన్నీ నాశనమవుతాయే తప్ప వేరొక ప్రయోజనం ఉండబోదని అన్నాడు. సకల శాస్త్రాల అర్థాలు తెలిసిన రాముడంతటి వాడు తన లాంటి మిత్రుల సహాయంతో శత్రువులను పారదోలాలి కానీ ధైర్యాన్ని కోల్పోతూ బేలతనంతో ప్రవర్తించకూడదన్నాడు. రాముడు ధనుస్సు పట్టుకొని నిలుచుంటే ఆయన ముందు నిలువగల వాడు మూడు లోకాలలోనూ మరెవడూ ఉండబోడని వివరించి చెప్పాడు. ప్రస్తుత సమయానికి తగినట్టుగా విచారాన్ని వీడి శత్రువు మీద క్రోధం పెంచుకోవాలని, విజయ మార్గాన పయనించాలన్నాడు. తమ వానర సేనంతా ఎలాగైనా సముద్రాన్ని దాటగలిగితే ఆ తరువాత గెలుపు అనేది శ్రీరాముడి పిడికిట్లో ఉన్నట్లు లెక్కని, వానరులంతా శూరులు, కామరూపులు కనుక శత్రువులైన రాక్షసులతో జరిగే యుద్ధంలో రాళ్ళు, చెట్ల వాన కురిపిస్తారన్నాడు. ఇక మాటలనవసరం అని, రాముడికి యుద్ధంలో గెలుపు నిశ్చయమని సుగ్రీవుడు శ్రీరాముడికి ఎంతగానో ధైర్యం చెప్పాడు.

యుద్ధకాండలోని ఈ సంఘటన మిత్రుడు సరైన సమయానికి వచ్చి ఎలా కార్యోన్ముఖుడిని చేయాలో తెలిపేదిగా కనిపిస్తుంది. సుగ్రీవుడి మనసులో ఏ మాత్రమైనా స్వార్థం ఉన్నా శ్రీరాముడిని అలా ప్రోత్సహించేవాడు కాదు. వాలిని సంహరించిన తరువాత సుగ్రీవుడికి అడ్డు తొలగిపోయింది. తన పని నెరవేరిన అనంతరం కూడా తన సర్వస్వాన్ని కృతజ్ఞతా పూర్వకంగా ఉత్తమ మిత్ర లక్షణంతో సుగ్రీవుడు శ్రీరాముడికి బాసటగా నిలిచాడు. అంతేకాదు రాముడు ఈ ఘట్టంలో మానసికంగా విపరీతంగా కుంగిపోయినప్పుడు సుగ్రీవుడు చెప్పిన ఒక్కొక్క ధైర్య వచనం రాముడికి ఎంతో గొప్ప ప్రోత్సాహాన్నిచ్చింది. ఇదే శ్రీరాముడు రావణ సంహారం చేసే దిశలో ఒక ప్రధానమైన మలుపుగా మారింది. ఉత్తముడైన మిత్రుడు ఇలా తగిన సమయంలో తగిన విధమైన ధైర్యాన్ని చెప్పి తన స్నేహితుడిని ఆదుకొని తీరాలి అని తెలియజెప్పటమే ఈ కథా సందర్భంలోని అంతరార్థం.

-డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు
Puranam
మరిన్ని మన పురాణాలు...
41
31
32
33
34
35
 36
 37
 38
39
40
21
22
23
24
25
26
27
28
29
30
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మరిన్ని జాతీయాలు...
21
22
23
24
25
 26
       
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

పదుగురి కోసం ఆరుగురం!

కాలేజీ స్నేహితులకో వాట్స్‌యాప్‌ గ్రూప్‌ చిన్నప్పటి మిత్రులకో ఫేస్‌బుక్‌ గ్రూప్‌ బంధువులందరినీ కలిపేందుకు గూగుల్‌ ప్లస్‌.. ఇలా నేటి సామాజిక మాధ్యమాలని మస్తుగా వాడుకుంటోంది...

అనుష్కలా పేరు తెచ్చుకుంటా!

ోడలింగ్‌లో రాణిస్తూ... వ్యాపార ప్రకటనల్లో మెరుస్తూ సినిమా పరిశ్రమ దృష్టినీ ఆకర్షిస్తుంటారు కొందరు భామలు. అలా కథానాయికలుగా అవకాశాల్ని అందుకొన్నవాళ్లు చాలా...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net