Sun, February 07, 2016

Type in English and Give Space to Convert to Telugu


గర్వం అనర్థదాయకం
ఎంతటివారికైనా గర్వం పనికిరాదని, అవివేకం వల్ల కలిగే గర్వం అవమానాలను తెచ్చి పెడుతుందని తెలియచెప్పే ఈ కథ శివపురాణం రుద్రసంహితలోని మొదటి మూడు అధ్యాయాలలో కనిపిస్తుంది. పూర్వం బ్రహ్మ మానసపుత్రుడైన నారదుడు మహోగ్ర తపస్సుకు ఉపక్రమించాడు. నారదుడు చేస్తున్న ఆ తపస్సు సంపూర్ణమైతే తన ఇంద్రపదవి ఎక్కడ పోతుందోనని నాటి దేవేంద్రుడు కలత చెందాడు. వెంటనే వసంతుడిని, మన్మథుడిని చేరపిలిచి తనకు సహాయం చేయమని మరీ మరీ అభ్యర్థించాడు. గతంలో ఓసారి శివుడి చేతిలో అవమానం పొందినప్పటికీ వసంతుడు, మన్మథుడు ఇంద్రుడి మాటలను కాదనలేకపోయారు. ఆ ఇద్దరూ నారదుడు తపస్సు చేస్తున్న ప్రాంతానికి వెళ్ళి తమ ప్రతాపాన్నంతా ప్రదర్శించారు. కానీ ఇసుమంత కూడా లాభం లేకపోయింది. నారదుడు ఏ మాత్రమూ చలించలేదు. చేసేదిలేక ఆ ఇద్దరూ మళ్ళీ ఇంద్రుడి దగ్గరకు వెళ్ళి తమ అసమర్థతను తెలిపి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొంత కాలానికి నారదుడు తపస్సు పూర్తి చేశాడు. తనను వసంతుడు, మన్మథుడు ఏమీ చేయలేకపోయారని, తన తపోనిష్ఠ ఎంతో గొప్పదని భావించుకున్నాడు నారదుడు. అలా ఆ దేవమునిని అహంకారం ఆవరించింది. వెంటనే తన తండ్రి అయిన బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి తపస్సు గురించి, వసంత మన్మథుల పరాజయాన్ని గురించి చెప్పాడు. వెను వెంటనే బ్రహ్మదేవుడు తన మనస్సులోనే మహేశ్వరుడి పాదపద్మాలను స్మరించుకున్నాడు. అప్పుడాయనకు గతంలో జరిగిన కామదహన సన్నివేశం గుర్తుకొచ్చింది. మన్మథుడిని స్వయంగా నారదుడు జయించలేదని, అదంతా ఈశ్వర కృపేనని తెలుసుకున్నాడు. పూర్వం శివుడు తపస్సు చేస్తుండగా మన్మథుడు ఆయనను తన బాణాలతో మోహింపచేశాడు. అప్పుడు ముక్కంటి నేత్రాగ్నికి మన్మథుడు దహించుకుపోయాడు. రతీదేవి ఇతర దేవతల ప్రార్థనల మేరకు శివుడు ప్రసన్నుడై మన్మథుడిని తిరిగి బతికించాడు. అయితే మన్మథుడు దేహం లేకుండా రతీదేవి పక్కనే ఉంటాడని వరమిచ్చాడు. అంతేకాక మన్మథుడి ప్రభావం తాను తపస్సు చేసిన ప్రదేశంలో మాత్రం ఫలించదని, ఈశ్వరుడు వరమిచ్చిన సంగతిని బ్రహ్మ నారదుడికి తెలియజెప్పాడు. ఆ ప్రదేశంలోనే నారదుడు తపస్సు చేసిన కారణంగానే మన్మథుడు ఆ తపస్సును చెడగొట్టలేకపోయాడని వివరించాడు బ్రహ్మదేవుడు. అంతేకానీ అది నారదుడి గొప్పతనం కాదన్నాడు. ఆ విషయాలను నారదుడు గర్వాహంకారాల వల్ల నమ్మలేదు. తన గొప్పతనం శ్రీమహావిష్ణువుకు కూడా చెప్పాలని వెంటనే విష్ణులోకానికి వెళ్ళాడు. తన తపస్సు గొప్పతనం గురించి విష్ణువుకు చెబుతున్నప్పుడు ఆయన కూడా మహేశ్వరుడి పాదపద్మాలను మనస్సులో స్మరించుకున్నాడు. గర్వితుడై ఉన్న నారదుడికి శివుడే సత్యాన్ని బోధించగలడని అనుకొని నారదుడిని సమాదరించి పంపాడు. ఆ బ్రహ్మమానసపుత్రుడు తన నివాసానికి తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో ఇంద్రలోకాన్ని మరిపించే రీతిలో గొప్ప నగరం కనిపించింది. ఆ నగరమంతా ఎంతో కోలాహలంగా ఉంది. నారదుడు క్షణకాలం పాటు ఆగి అది శ్రీమహావిష్ణువు భక్తుడైన శీలనిధి అనే ఓ మహారాజు నగరమని, ఆ రాజు కుమార్తె శ్రీమతి అనే కన్యకు స్వయంవరం జరగబోతోందని తెలుసుకొన్నాడు. శీలనిధి కూడా నారదుడిని గమనించి ఎదురెళ్ళి సత్కరించి తన కుమార్తె విషయాన్ని చెప్పి ఆమె భవిష్యత్తు ఎలా ఉండగలదో వివరించమని వేడుకొన్నాడు. నారదుడు ఆ రాజు పక్కనే ఉన్న శ్రీమతిని చూసి మోహవశుడయ్యాడు. ఆమెను ఎలాగైనా చేపట్టాలనుకున్నాడు. అప్పటికి తన మనసులోని మాటను బయట పెట్టక రాజు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా శ్రీమతికి దేవతా సంబంధమైన పురుషుడు వరుడవుతాడని చెప్పి బయటకు వచ్చాడు. కానీ నారదుడు శ్రీమతి మీద వ్యామోహాన్ని పోగొట్టుకోలేకపోయాడు. వెంటనే ఆయనకు ఓ ఆలోచన వచ్చింది. శీలనిధి, ఆయన కుమార్తె ఇద్దరూ శ్రీమహావిష్ణువు భక్తులు కనుక తాను విష్ణు స్వరూపంతో స్వయం వరానికివెళితే శ్రీమతి తననే వరిస్తుందని అనుకొన్నాడు. వెంటనే విష్ణులోకానికి వెళ్ళాడు. శ్రీమహావిష్ణువుకు నమస్కరించి తన మనసులో మాటను చెప్పి తనకు సహాయం చెయ్యమని కోరి విష్ణుస్వరూపంతో స్వయంవర సభకు వచ్చాడు నారదుడు. కానీ శివమాయవల్ల అక్కడున్న రాజులందరికీ నారదుడు స్వస్వరూపంలోనే కనిపించాడు. శ్రీమతికి మాత్రం నారదుడు విష్ణురూపంతో ఉన్నప్పటికీ ముఖం మాత్రం కోతి ముఖంగా కనిపించింది. వరమాలతో వస్తున్న శ్రీమతి తనను తప్పక వరిస్తుందనుకున్నాడు నారదుడు. కానీ ఆమె ముఖం తిప్పుకొని అసహ్యించుకొని వెళ్ళింది. శ్రీమతి తనకు నచ్చిన వరుడి మెడలో వరమాల వేసింది. అంతా ఎటువారు అటువెళ్ళిపోయారు. అక్కడ ఇద్దరు శివ దూతలు బ్రహ్మణుల వేషంలో సంచరిస్తూ నారదుడికి శరీరమంతా విష్ణురూపంలాగే ఉన్నా ముఖం మాత్రం కోతి ముఖంలా ఉందని, నారదుడు స్వయంవర సభలో అడుగుపెట్టిన దగ్గర నుంచి చెబుతూనే ఉన్నా అతడు వినిపించుకోలేదు. చిట్టచివరలో మళ్ళీ ఆ ఇద్దరూ నారదుడికి ఆ విషయాన్ని వివరించారు. కామమోహంతో నారదుడు ధర్మ విరుద్ధంగా ప్రవర్తించినందువల్ల అలా కోతిముఖం ప్రాప్తించిందని, శివుడే ఆ విధంగా తన మాయను ప్రయోగించాడని, నారదుడు మన్మథుడిని జయించినట్లు గర్వపడటం హాస్యాస్పదమని చెప్పారు శివదూతలు. అప్పటికి నారదుడికి తాను చేసిన తప్పేమిటో తెలిసివచ్చింది. ఇలా ఎంతటి వారికైనా గర్వాహంకారాలు, అనవసర వ్యామోహాలు అనర్థదాయకాలనే విషయాలను తెలియజెప్తోంది ఈ కథా సందర్భం.
 
Puranam
మరిన్ని మన పురాణాలు...
41
31
32
33
34
35
 36
 37
 38
39
40
21
22
23
24
25
26
27
28
29
30
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మరిన్ని జాతీయాలు...
21
22
23
24
25
 26
       
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

వెలుగు వైపు నా అడుగులు...

బడిగంట కొట్టగానే పిల్లలందరూ బిలబిలమంటూ బయటకు పరుగుతీశారు. టీచర్లూ ఇంటిదారిపట్టారు. ఒకరిద్దరు తప్ప నిర్మానుష్యంగా మారిన ఆ బడిలో..

పరిశ్రమ వదిలి వెళ్లిపోదామనుకున్నా!

మానవీయ కోణాల్ని స్పృశిస్తూ సినిమాలు తీయడంలో దర్శకుడు మదన్‌ది ప్రత్యేక శైలి. మనిషి, మనసు, అనుబంధాల మధ్య సంఘర్షణల్ని ఆయన తెరపైకి తీసుకొచ్చే విధానం బాగుంటుంది.

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net