Sun, February 07, 2016

Type in English and Give Space to Convert to Telugu


కేసరి - అంజన
ఆంజనేయస్వామిని కేసరినందనుడు, అంజనసుతుడు అని కీర్తిస్తుంటారు. అలా ఆంజనేయస్వామినే కాక ఆయన తల్లిదండ్రులను కూడా ఆ స్వామి భక్తులు స్మరించటం జరుగుతుంటుంది. అయితే ఈ కేసరి ఎవరు? అంజన ఎవరు? వారి జన్మ విశేషాలేమిటి? అనే విషయాల గురించి పెద్దగా ఎవరూ ఆలోచించరు. కానీ కొందరికి వారెవరో తెలుసుకోవాలన్న ఆసక్తి బలంగా ఉంటుంది. కేసరి గురించి, అంజన గురించి ఏ ఒక్కచోటనో తప్ప మొత్తం కథంతా కనిపించదు. వారి చరితలు తెలుసుకోవాలంటే ఎన్నెన్నో పురాణాలు, గ్రంథాలు పరిశీలించాలి. అంతటి శ్రమ చేయటానికి అందరికీ తగిన సమయం దొరక్క పోవచ్చు. అలాంటి వారికి సులభంగా హనుమ తల్లిదండ్రులు, హనుమను గురించిన మరిన్ని విశేషాలను తెలియచెప్పటానికి పదిహేడో శతాబ్దంలో పుష్పగిరి తిప్పనార్యుడు ఓ చక్కని ప్రయత్నం చేశాడు. ఆయన ఆంజనేయస్వామికి సంబంధించిన ప్రధాన విషయాలన్నిటినీ సేకరించి ‘సమీరకుమార విజయం’ అనే పేరున ఓ పద్య కావ్యంగా రాశాడు. రచనాశైలికి అనుగుణంగా ఆ కావ్యంలో మంచి విషయాలతోపాటు విశేషమైన వర్ణనలు ఉన్నాయి. అదంతా పద్యకావ్యం. ఆ కావ్యాన్ని అందరూ ఇంకా సులువుగా చదువుకోవాలన్న ఆలోచనతో సుప్రసిద్ధ పండితులు విశ్వనాధం సత్యనారాయణమూర్తి ‘సంపూర్ణ హనుమత్‌ చరిత్రము’ అనే పేరున వచన కావ్యంగా దాన్ని రాశారు. ఆ కావ్యాన్ని రామకృష్ణమఠం ప్రచురించింది. దీనిలో ఆంజనేయుడి తల్లిదండ్రులు కేసరి, అంజనల విషయాలతో పాటు ఆంజనేయస్వామి ఏకపాద రుద్రుడి అవతారమని తెలియచెప్పే విశేషాంశాలు ఎన్నెన్నో ఉన్నాయి. ఆ కావ్యాన్ని అనుసరించి చూస్తే కేసరి కథ ఇలా ప్రారంభమవుతుంది.

పూర్వం గొప్ప శివ భక్తుడైన కేసరి అనే వానర ముఖ్యుడు ఉండేవాడు. అరవై వేల మంది వానరులు ఆయనను సేవిస్తూ ఉండేవారు. ఆ కేసరి శివుడి గురించి తీవ్రంగా తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చి శివుడు ఆయనకు స్వేచ్ఛావర్తనం, ధర్మదయాపరత్వం, మహత్తర జ్ఞానం, రోగ, జరామరణజయం అనే లాంటి గొప్ప శక్తులను వరాలుగా ఇచ్చాడు. అదే రోజుల్లో శంబసాధనుడు అనే ఓ రాక్షసుడుండేవాడు. ఆ రాక్షసుడు కూడా బ్రహ్మ గురించి తీవ్రంగా తపస్సు చేసి గొప్ప వరాలను పొందాడు. వర గర్వితుడైన ఆ రాక్షసుడు ముల్లోకాలను పీడిస్తూ ఉండేవాడు. దేవతలంతా బ్రహ్మ దగ్గరకు వెళ్లి ఆ రాక్షసుడి వల్ల తమకు కలుగుతున్న కష్టాన్ని వివరించారు. అప్పుడు బ్రహ్మ వారందరినీ కేసరి దగ్గరకు వెళ్ళి విషయం చెప్పమన్నాడు. దేవతలు అలానే చేశారు. కేసరి శంబసాధనుడి అంతానికి కంకణం కట్టుకున్నాడు. ఈలోగా నారద మహర్షివల్ల ఆ రాక్షసుడు కేసరి విషయం తెలుసుకొని యుద్ధానికి తరలి వచ్చాడు. కేసరికీ, ఆ రాక్షసుడికి నడుమ భీకరంగా యుద్ధం జరిగింది. చిట్టచివరకు కేసరి చేతిలో రాక్షసుడు అంతమయ్యాడు. దేవతలంతా ఎంతో ఆనందించారు. అప్పటికి కేసరికింకా వివాహం కాకపోవటంతో వివాహం చేసుకొని గొప్పదైన గృహస్థాశ్రమాన్ని స్వీకరించమని వారంతా ఆయనను ఆశీర్వదించారు. దేవతల సూచన ఆ వానరేంద్రుడికి బాగానే నచ్చింది. తనకు తగిన కన్య కోసం అన్వేషణ ప్రారంభించాడు.

పూర్వం బ్రహ్మదేవుడు అందాలరాశి లాంటి ఓ కన్యను సృష్టించి ఆమెకు అహల్య అని పేరు పెట్టాడు. రూపలావణ్యాలతో పాటు ఆశ్రమవాస జీవనానికి తగిన గుణగణాలతో కనిపించింది అహల్య. అందుకే ఆమెను గౌతమ మహర్షికిచ్చి వివాహం చేశాడు. అహల్యా గౌతములకు ఒక ఆడ శిశువు జన్మించింది. ఆ శిశువుకు అంజన అని పేరు పెట్టాడు గౌతమ మహర్షి. అంజన అందచందాలు తెలివితేటలతో పెరిగి పెద్దదైంది. ఇంతలో ఇంద్రుడు గౌతమ మహర్షి ఆశ్రమానికి రావటం లాంటి సంఘటనలు జరిగాయి. గౌతముడికి ఇంద్రుడొచ్చిన విషయాన్ని అంజన చెప్పిన కారణంగా అంజనను అహల్య కపికాంతవై సంచరించమని శపించింది. జరుగుతున్నదంతా దైవ సంకల్పమని భావించి గౌతముడు అంజనను వెంటపెట్టుకొని హిమగిరుల సమీపానికొచ్చాడు. అంజనకు అహల్య ఇచ్చిన శాపాన్ని గురించి గౌతముడు ఆలోచించసాగాడు. ఇంతటి అందమైన పిల్ల కపి రూపంలో ఎలా సంచరించగలదు, దీనికి కారణమేమిటా అని ఆమె పూర్వజన్మ గురించి తన దివ్య దృష్టితో చూశాడు. పూర్వ జన్మలో అంజన సుకంఠి అనే ఓ అందమైన యువతి. ఆమె ఓ రోజు స్నేహితురాళ్లతో వన విహారానికొచ్చి క్రీడించసాగింది. ఇంతలో శంకర తేజాన్ని ధరించి, దానిని భరించలేక రొప్పుతూ, తూలుతూ వెళుతున్న వాయుదేవుడు ఆమెకు కనిపించాడు. ఆయన పడుతున్న పాట్లను చూసి సుకంఠి హేళనగా యౌవన గర్వంతో నవ్వింది. అప్పుడు ఆ వాయుదేవుడు నీవు అందగత్తెవని గర్వంతో నన్ను చూసి పరిహాసం చేశావు కనుక మరుసటి జన్మలో ఓ కోతికి భార్యవై నేను మోస్తున్న శంకర తేజాన్నే నీవు కూడా గర్భాన ధరించి మరో వానర ప్రముఖుడికి జన్మనిస్తావు అని శపించి వెళ్ళిపోయాడు. దివ్య దృష్టివల్ల గౌతముడు ఈ విషయాన్ని తెలుసుకొని అంజనకు చెప్పాడు. తర్వాత అంజన, గౌతమ మహర్షులకు కుంజరుడు అనే ఓ వానర శ్రేష్ఠుడు కనిపించాడు. ఆ వానరుడి భార్య పేరు వింధ్యావళి. దంపతులిద్దరూ వృద్ధాప్యంలో ఉన్నారు. కుంజరుడు తనకు పుత్రుడు కావాలని శివుడి గురించి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై కుంజరుడు పూర్వ జన్మలో తగినంత పుణ్యం చెయ్యనందువల్ల అతడికి సంతానం కలిగే యోగ్యత లేదని, అయితే భవిష్యత్‌లో గౌతమ మహర్షి తన కుమార్తెను కుంజరుడికి అప్పచెబుతాడని, ఆమెకు వివాహం చేసి ఆమె సంతానంతో ఆనందాన్ని పొందమని కుంజరుడికి శివుడు చెప్పి అంతర్థానమయ్యాడు. అప్పటి నుంచి కుంజర దంపతులు గౌతమ మహర్షి కోసం ఎదురు చూడసాగారు. ఆ ఎదురు చూపులు ఇన్నాళ్ళకు ఫలించాయి. గౌతముడు అంజనను కుంజర దంపతులకు అప్పగించి తాను తపస్సు చేసుకోవటానికి వెళ్ళిపోయాడు.

ఓసారి వనవిహారం చేస్తుండగా అంజనను కేసరి చూశాడు. కేసరిని కూడా అంజన చూసింది. ఆ ఇద్దరికీ ఒకరికొకరు నచ్చారు. ఆ తర్వాత కేసరి ఆమె పూర్తి వివరాలు తెలుసుకొని కుంజరుడి దగ్గరకు పెద్దవారిని పంపి తన మనస్సులోని మాటను చెప్పించాడు. కుంజర దంపతులు ఎంతో ఆనందించి తమ పెంపుడు కుమార్తె అయిన అంజనకు వానర శ్రేష్ఠుడైన కేసరినిచ్చి వివాహం చేశారు. ఇది హనుమంతుడి తల్లిదండ్రులైన అంజనాకేసరుల గురించి ‘సమీరకుమార విజయం’లో ఉన్న విషయం.

- డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు
Puranam
మరిన్ని మన పురాణాలు...
41
31
32
33
34
35
 36
 37
 38
39
40
21
22
23
24
25
26
27
28
29
30
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మరిన్ని జాతీయాలు...
21
22
23
24
25
 26
       
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

వెలుగు వైపు నా అడుగులు...

బడిగంట కొట్టగానే పిల్లలందరూ బిలబిలమంటూ బయటకు పరుగుతీశారు. టీచర్లూ ఇంటిదారిపట్టారు. ఒకరిద్దరు తప్ప నిర్మానుష్యంగా మారిన ఆ బడిలో..

అనుక్షణం ఉత్కంఠగా... ‘క్షణం’

అనుక్షణం ఉత్కంఠభరితంగా సాగే కథనంతో తెరకెక్కిన చిత్రం ‘క్షణం’. పీవీపీ సినిమా బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రానికి రవికాంత్‌....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net