Fri, February 12, 2016

Type in English and Give Space to Convert to Telugu


మహా మృత్యుంజయ మంత్ర ఆవిర్భావం
చాలా మంది విశ్వసించి, జపించి, ఫలితాన్ని పొందామని భావించే మహా మృత్యుంజయ మంత్ర ఆవిర్భావం వెనుక ఉన్న కథ ఇది. ఈ మంత్రాన్ని తొలిగా ఎవరు ఎవరికి చెప్పారు? అనే విషయాన్ని వివరించే ఈ కథా సందర్భం శివ మహాపురాణం రుద్రసంహిత సతీఖండం ముప్పై ఎనిమిదో అధ్యాయంలో కనిపిస్తుంది.

పూర్వం క్షుపుడు అనే ఓ మహారాజు ఉండేవాడు. ఓ సారి ఆయనకూ, దధీచి మహర్షికీ... తపస్సు చేసేవారు గొప్పా? రాజు గొప్పా? అనే విషయం మీద వివాదం ఏర్పడింది. క్షుపుడు రాజు కనుక తనే గొప్ప అని, కనుక నీవు ఒప్పుకొని తీరాల్సిందేనని పట్టుపట్టాడు. దధీచి అంతకన్నా గట్టిపట్టే పట్టి తపస్సు చేసి దివ్యశక్తిని సంపాదించటమంటే సామాన్యం కాదు. కనుక తపస్సు చేసేవారే గొప్ప అని ఒప్పుకోమని కూర్చున్నాడు. క్షుపుడు మరింతగా వాదిస్తూ రాజు ఎనిమిది మంది లోకపాలకుల దేహాల్ని తాను ధరించి ఉంటాడని, రాజ్యంలో ధర్మాన్ని నిలబెడుతూ ఉంటాడని, మన వేదాలూ సర్వదేవతా స్వరూపుడు రాజు అని... అంటున్నాయని వివరంగా చెప్పి రాజు మాత్రమే గొప్ప అని ఒప్పుకోమన్నట్టు దధీచి వంక చూశాడు. తపస్సంటే ఎంతగొప్పదో దధీచి కూడా వివరించాడు. రాజు వినక పోవటంతో కోపం పట్టలేక ఎడమ చేయి పిడికిలి బిగించి, గట్టిగా క్షుపుడి నెత్తిన కొట్టాడు దధీచి. దాంతో రాజుకు కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే తన దగ్గరున్న ఖడ్గంతో దధీచిని రెండు ముక్కలుగా చీల్చాడు. ఖడ్గపు దెబ్బ తగిలే ముందు ఆ మహర్షి శుక్రాచార్యుడిని స్మరించాడు. వెంటనే శుక్రుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అంతలోపే మహర్షి శరీరం రెండు ముక్కలై పడింది. శుక్రుడు ఆ రెండు ముక్కల్నీ జాగ్రత్తగా అతికించి మహర్షిని మళ్ళీ బతికించాడు. అంతేకాక దధీచికి ఆ క్షణాన్నే ‘త్య్రంబకం యజామహే’ అనే మహామృత్యుంజయ స్తోత్రాన్ని ఉపదేశించాడు.

ఆ మంత్రం పరమేశ్వర పరమైనది. ముల్లోకాలకు తండ్రి, రక్షకుడు, అగ్ని, చంద్ర, సూర్య మండలాల్ని సృష్టించినవాడు, సత్వరజస్తమోగుణాలపై పరిపూర్ణ ఆధిపత్యం కలవాడు శివుడు. శ్లేష్మ, వాత, పిత్తాలనే మూడు శరీరాలనూ, ఆవహనీయం, గార్హపత్యం, దక్షిణాగ్ని అనే మూడు అగ్నుల్నీ ఆయన పాలిస్తుంటాడు. పృధ్వీ, జలం, అగ్ని అనే మూడు బాహువుల వంటి మూడు భూతాలతో సర్వం వ్యాపించి ఉన్నాడు ఆ స్వామి. స్వర్గాది లోకస్వరూపుడు సర్వత్రా సుఖదుఃఖ మోహాత్మకమైన జగత్తులో వ్యాపించి ఉన్నవాడు త్రిమూర్తి స్వరూపుడు అయిన శివుడిని పూజిద్దాం. ఆ మహాదేవుడు సర్వ భూతాలు, సర్వప్రాణులు, సత్వరజస్తమోగుణాలు, సర్వ కర్మల్లో సుగంధంలా వ్యాపించి ఉన్నాడు. ఆ దేవదేవుడు పుష్పాల్లో సుగంధంలా, ఇంద్రియాలు, ఇతర దేవతలు, శివగణాల్లో వ్యాపించి ఉన్నాడు. మహత్తు మొదలుకొని పరమాణుగత విశేషం వరకూ వివిధ కార్యరూపాల్లో ఉన్న ప్రకృతికి చెందిన పుష్టి(బలం) ఆ శివుడి నుంచే లభించింది. విష్ణువుకు, బ్రహ్మకు, మనీశ్వరులకు, ఇంద్రుడికి, దేవతలకు పుష్టిని ఇవ్వటం చేతనే శివుడికి పుష్టివర్ధనుడు అనే పేరొచ్చింది. అమృత స్వరూపుడైన ఆ రుద్రదేవుడికి వేద విహిత కర్మానుష్ఠానంచేత కానీ, తపస్సు చేత కానీ, వేదాధ్యయనం, యోగం, ధ్యానాల చేతకానీ ఆరాధించాలి. సత్యం చేతకానీ ఇతర ఆరాధనా పద్ధతితో కానీ పూజలందుకొనే ఆ శివుడు తీగ నుంచి పుచ్చకాయ లేదా దోసకాయ వంటివి ఎలా అయితే సులభంగా విడిపోతాయో అలాగే తన భక్తుడిని ఎంతో భయంకరమైన మృత్యుపాశ బంధం నుంచి అత్యంత సులువుగా విడగొడతాడు. శుక్రాచార్యుడు మహామృత్యుంజయ స్తోత్రానికి సంబంధించిన భావాన్ని ఇలా వివరించి చెప్పాడు. ఆ మంత్రం మృత సంజీవని మంత్రమని దానికి సంబంధించిన ధ్యానం లాంటి వాటన్నింటినీ తెలియచెప్పి నిరంతరం ఆ మహామృత్యుంజయ స్తోత్రాన్ని జపిస్తూ ఉండాలని, మృత్యు బంధం సులువుగా తొలగి పోతుందని అన్నాడు శుక్రుడు. దధీచి మహర్షి ఆ మంత్రరాజాన్ని జపించటం అప్పటి నుంచే ప్రారంభించి తగిన ఫలితాన్ని పొందాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకూ ఈ మంత్రాన్ని నిరంతరం భక్తులు అనుష్ఠిస్తూనే ఉన్నారు. శివ మహాపురాణం మహా మృత్యుంజయ మంత్ర ఆవిర్భావ విశేషాలను ఇలా తెలియచెబుతోంది.

- డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు
Puranam
మరిన్ని మన పురాణాలు...
41
31
32
33
34
35
 36
 37
 38
39
40
21
22
23
24
25
26
27
28
29
30
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మరిన్ని జాతీయాలు...
21
22
23
24
25
 26
       
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

సమంత@100 కేజీలు

మొదటి సినిమాలో సన్నగా సన్నజాజి తీగలా కనిపించి..రెండో చిత్రానికి వచ్చేసరికి బొద్దుగుమ్మగా దర్శనమిచ్చారు ఎంతో మంది కథానాయికలు....

మణిరత్నం వీరాభిమానిని!

హను రాఘవపూడి... తీసింది ‘అందాల రాక్షసి’ ఒక్కటే. దాని చుట్టూ బోలెడు కామెంట్లు.. కాంప్లిమెంట్లు. ‘మణిరత్నం ప్రభావం కుర్రాడిపై చాలా ఎక్కువ ఉంది’ అనుకొన్నారు చాలామంది....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net