ప్రేమలు మెరిసే.. తారలు మురిసే!

ప్రేమ ఓ అనీర్వచనీయమైన అనుభూతి. ప్రేమలో పడితేనే దాని మాధుర్యం ఏంటో తెలిసేది. నిజ జీవితాల్లోనే కాదు వెండితెరపైనా ప్రేమ అద్భుతమైన విజయాలు అందించింది....

మా వూరికి మంచి నీళ్లు...

బాగా ఆస్తిపాస్తులున్న వాళ్లని శ్రీమంతులంటారు.మహేశ్‌బాబు నటించిన ‘శ్రీమంతుడు’ చూశాక ఆ అర్థం మారిపోయిందనే చెప్పవచ్చు. ఎక్కడ పెరిగినా, స్థిరపడినా సొంతూరి...

దోమకాటుకు తెర!
తాబ్దాలుగా దేశాన్ని పట్టిపీడిస్తున్న మహమ్మారి మలేరియాపై నరేంద్ర మోదీ ప్రభుత్వం యుద్ధభేరి మోగించింది. మశక సంతతి ద్వారా ఏటా లక్షల మందికి వ్యాపిస్తున్న మలేరియాను 2030 సంవత్సరంలోగా భారత్‌ నుంచి నిర్మూలించే లక్ష్యంతో, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తాజాగా జాతీయ కార్యాచరణ వ్యూహం ప్రకటించింది. అధికారిక గణాంకాల ప్రకారం, నిరుడు ఒక్క ఏడాదే దేశవ్యాప్తంగా 11.3లక్షల మలేరియా కేసులు వెలుగులోకి వచ్చాయి. ఆగ్నేయాసియా ప్రాంతంలోని మలేరియా కేసులు, సంబంధిత మరణాల్లో 70శాతం దాకా ఇండియాలోనే నమోదవుతున్నాయి. ఒకటిన్నర దశాబ్దాల కాలావధిలో ఈ అప్రతిష్ఠను నామరూపాలు లేకుండా తుడిచిపెట్టేందుకే జాతీయ మలేరియా నిర్మూలన చట్రాన్ని లక్షించారు. 2024నాటికి దేశంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రతి వెయ్యిమందికి ఒక్క కేసుకన్నా తక్కువ నమోదయ్యేలా మలేరియా ఉద్ధృతిని కట్టడి చేయాలన్నది ప్రవచిత ధ్యేయం! దేశానికి స్వాతంత్య్రం లభించే సమయానికి ఏటా ఏడున్నర కోట్ల మలేరియా కేసులు, ఎనిమిది లక్షల వరకు మరణాలు జాతిజనుల్ని భీతావహం చేసేవి. 1965నాటికి లక్షలోపు కేసులు నమోదయ్యేంతగా నియంత్రణ వ్యూహం ఫలించినా, దశాబ్దం గడిచేసరికి పరిస్థితి చేజారిపోయింది. అప్పట్లో ఎకాయెకి 65లక్షల మేర నమోదైన వార్షిక కేసుల ఉద్ధృతి పోనుపోను తగ్గినా, ఇప్పటికీ 11 లక్షల మేర కొత్తగా వ్యాధిపీడితుల గోడు సాంక్రామిక దురవస్థను చాటుతోంది. రాష్ట్రాల్ని కూడగట్టి మలేరియా నిర్మూలన స్వప్నాన్ని సాకారం చేస్తామంటున్న కేంద్రం, వ్యాధి వ్యాప్తికారక దోమల విస్తృతి నివారణకు ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేయాల్సి ఉంది!

అనారోగ్యకర, అపరిశుభ్ర పరిసరాల్లో అంటురోగాలు, విషజ్వరాలు ఇట్టే ప్రబలుతాయి. మురుగునీరు, చెత్తకుప్పలున్న చోట్ల అసంఖ్యాకంగా విస్తరిల్లే దోమల సంతతి వ్యాధుల వ్యాప్తిలో ముఖ్యపాత్ర పోషిస్తుంది! ఆ యథార్థాన్ని ఆకళించుకుని పకడ్బందీ వ్యూహాలు అమలుపరుస్తున్న దేశాలే, దోమలపై యుద్ధంలో పైచేయి సాధిస్తున్నాయి. పదిహేనేళ్లుగా మలేరియా నిర్మూలనకు కట్టుబాటు చాటుతున్న 106 దేశాల్లో 75 వరకు, కొత్త కేసుల నమోదులో 50-75 శాతం మేర తగ్గుదల నమోదు చేయగలిగాయి. ఇటీవలి కాలంలో అర్జెంటీనా, అర్మీనియా, శ్రీలంక, యూఏఈ, ఉజ్బెకిస్థాన్‌ ప్రభృత దేశాల్లో కొత్తగా ఒక్క మలేరియా కేసూ వెలుగు చూడలేదు. అయినా, ఇప్పటికీ ప్రపంచంలో 340 కోట్లమందికి మలేరియా సోకే ముప్పుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవలే ప్రమాద ఘంటికలు మోగించింది. నిరుడు ఒక్క ఏడాదే విశ్వవ్యాప్తంగా 4,38,000 నిండుప్రాణాలను మలేరియా కర్కశంగా కబళించిందని అంచనా. 2030నాటికి ఆ మరణాలను 90శాతం దాకా నియంత్రించాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యసాధన కోసం వచ్చే అయిదేళ్లలో 300కోట్ల పౌండ్ల (రూ.30వేలకోట్ల) దాకా వెచ్చించనున్నట్లు బ్రిటన్‌ ప్రభుత్వం, బిల్‌గేట్స్‌ ఫౌండేషన్‌ పక్షం రోజుల క్రితమే వెల్లడించాయి. జికా వైరస్‌ అందరినీ హడలెత్తిస్తున్న నేపథ్యంలో అమెరికా, ఫ్రాన్స్‌, బ్రెజిల్‌ తదితర దేశాలూ దోమల నియంత్రణపై దృష్టి సారిస్తున్నాయి. దోమకాటు ద్వారా రోగాల వ్యాప్తి అంతర్జాతీయ సమస్యగా ముమ్మరించిన దృష్ట్యా, దేశీయంగానూ సమర సన్నద్ధత ప్రాధాన్యం ఎవ్వరూ విస్మరించరానిది. మలేరియాతోపాటు డెంగీ, గున్యా తదితరాల ప్రజ్వలనానికీ పుణ్యం కట్టుకొంటున్న దోమల కట్టడిని జాతీయ అజెండాగా ఉద్యమస్ఫూర్తితో పట్టాలకు ఎక్కించడం కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల ఉమ్మడి బాధ్యత!

హిమాచల్‌ప్రదేశ్‌, జమ్మూకశ్మీర్‌ మినహా దేశంలో మిగతా రాష్ట్రాలన్నీ మలేరియా బారిన పడేవేనని డాక్టర్‌ పదమ్‌సింగ్‌ ప్రధాన్‌ అధ్యయన నివేదిక లోగడే హెచ్చరించింది. మలేరియా ముప్పు తీవ్రతరంగా ఉన్నట్లు గుర్తించిన రెండు వందల జిల్లాల జాబితాలో ఛత్తీస్‌గఢ్‌, గుజరాత్‌, ఝార్ఖండ్‌, కర్ణాటక, ఈశాన్య భారతంతోపాటు తెలుగు నేల పేరూ చోటుచేసుకుంది. ప్రధానంగా గ్రామీణ, గిరిజన, మారుమూల ప్రాంతాల్లోనే 90శాతం మేర మలేరియా కేసులు జోరెత్తుతున్నట్లు అధ్యయనాలు స్పష్టీకరిస్తున్నా, దీటైన సర్కారీ వ్యూహాలు ఇన్నేళ్లూ ఎండమావినే తలపించాయి. 2014లో మలేరియా నియంత్రణ పేరిట వ్యయీకరించిన మొత్తంలో 90శాతానికి పైగా జీతభత్యాలు, పాలన ఖర్చుల కింద కరిగిపోగా, దోమలపై సమరానికి సరైన సాధన సంపత్తి కొరవడింది. మలాథీన్‌, పైరిథ్రాయిడ్‌ లాంటి మందులు చల్లని గిరిజన ఆవాసాల్లో దోమతెరల పంపిణీ సైతం అటకెక్కి- ఆనవాయితీగా విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. దోమల మందు పిచికారీ, మురుగునీటి కాల్వల మరమ్మతులు, పారిశుద్ధ్య కార్యక్రమాలు చతికిలపడిన కాలనీల్లోనూ మలేరియా కేసులు పెచ్చరిల్లుతున్నాయి. నిధుల కేటాయింపులో ప్రభుత్వాలు ఉదారంగా వ్యవహరించినంత మాత్రాన, ఈ దురవస్థకు విరుగుడు సాధ్యపడదు. ప్రతి ఆరుగురిలో ఒకరు దోమకాటుకు గురవుతూ ఏటా రూ.13వేలకోట్ల దాకా ఉత్పాదకతను నష్టపోతున్న దేశం, పౌర సమాజం క్రియాశీలక భాగస్వామ్యంతోనే కుదుటపడగలిగేది. ఇటీవలి జాతీయ పారిశుద్ధ్య సర్వే ఇండియా నలుమూలలా మురుగు వాస్తవాల్ని కళ్లకు కట్టింది. స్వచ్ఛభారత్‌ కోసం నినదిస్తున్న మోదీ ప్రభుత్వమే, జాగృత జన చేతనోద్యమంతో దోమలపై పోరాటాన్ని కదం తొక్కించాలి. రాష్ట్రాలు, స్వచ్ఛంద సంస్థలు సైతం బృహదాశయ స్ఫూర్తితో అందుకు కూడివస్తేనే- స్వస్థ భారతావని ఆవిష్కరణకు మేలుబాటలు పడేది!