Tue, February 09, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ఔషధనగరిలో ప్రపంచశ్రేణి విశ్వవిద్యాలయం''భూసేకరణ, పునరావాసాలకేరూ. 8,000 కోట్లు''నెట్‌ సమానత్వానికే ట్రాయ్‌ మొగ్గు!''ముద్రగడ దీక్ష విరమణ''తెలంగాణ ప్రణాళిక భేష్‌''విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయాలా?''డాక్టర్‌.. ధనాధన్‌..''రసాయన పరిశ్రమలో పేలుడు''నడి వీధిలో పైశాచికం''పాక్‌ నుంచే కుట్ర'
పండితే నాది.. కాయైతే భాజపాది
తెలంగాణ బిల్లుపై ఇదే కాంగ్రెస్‌ వ్యూహం
ఈనాడు - న్యూఢిల్లీ
తెలంగాణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందడంపై కాంగ్రెస్‌ పార్టీలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ‘‘బిల్లును పార్లమెంటుకు తీసుకుపోవడం వరకు మా పని, ఆ తర్వాత అక్కడ ఏం జరుగుతుందో ఎవరేం చెప్పగలరు?’’ అని ఏఐసీసీ వ్యాఖ్యానిస్తోంది. బిల్లు పాస్‌ అయితే తమ గొప్పతనంగా చెబుతామని, గట్టెక్కలేని పరిస్థితి ఉంటే భాజపా ద్వంద్వ వైఖరిని బట్టబయలు చేస్తామని వ్యక్తిగత సంభాషణల్లో నేతలు చెబుతున్నారు. ఏఐసీసీ ముఖ్యనేత ఒకరు తన సంభాషణల్లో మొత్తం సమస్యను విశ్లేషణాత్మకంగా అంచనా వేశారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బిల్లును తిరస్కరించడానికి 65 శాతం అవకాశం ఉన్నట్లు మేం ముందే అంచనా వేశాం. అది మీకు తెలియకపోవచ్చు. సభలో సమైక్యాంధ్రకు మద్దతిచ్చే వారే ఎక్కువ మంది ఉన్నారని తెలిసినప్పటికీ మేం నిర్ణయం తీసుకున్నాం. దాని పర్యవసనాల వల్ల ఎదురయ్యే ఫలితాలను అనుభవించడానికీ సిద్ధంగా ఉన్నాం. ఈ బిల్లు యూపీయే ప్రభుత్వమే పాస్‌ చేయాల్సి ఉంటుంది. కాబట్టి లాభమైనా, నష్టమైనా మాకే వస్తుంది. ఒకవేళ మేం నిర్ణయం తీసుకోకపోయి ఉంటే విలేకర్లే ప్రతిరోజూ మాపై దాడి చేసేవారు. నాలుగేళ్లయినా ఎందుకు నిర్ణయం తీసుకోలేదని నిలదీసేవాళ్లు. ఇప్పుడు అసెంబ్లీ తిరస్కరించినంత మాత్రాన పక్కన పెట్టాలని లేదు. అసెంబ్లీకి వీటో అధికారమేమీ లేదు. అలా చెప్పడం రాజ్యాంగ వ్యతిరేకం కూడా. అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడం చెడు సంప్రదాయమేమీ కాదు. సాధారణంగా ఇలాంటి విషయాల్లో రాష్ట్రంలో ఒక ప్రాంత ప్రజలు అవునంటే మరో ప్రాంతం కాదంటుంది. మూడు రాష్ట్రాల ఏర్పాటు సమయంలో భాజపా ఏకాభిప్రాయం సాధించిందని చెబుతున్నారు. కానీ అందులోని వాస్తవాలు వేరుగా ఉన్నాయి. దాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఉత్తరాఖండ్‌ భౌగోళికంగా పూర్తి భిన్నం. జార్ఖండ్‌ పరిస్థితి కూడా అంతే. తెలంగాణ అలా కాదు. అది ఆంధ్రప్రదేశ్‌ మధ్యలో ఉంది. సహజంగా ఇలాంటి పరిస్థితుల్లో ఏకాభిప్రాయ సాధనకు సుదీర్ఘ సమయం పడుతుంది. ఇలాంటి వివాదాస్పద విషయంలో ఎప్పుడు నిర్ణయం తీసుకున్నా తీవ్రమైన భావోద్వేగాలు తలెత్తుతాయి. మేం మూడు నెలల క్రితం దీనిపై నిర్ణయం తీసుకున్నాం. అందుకు తగ్గ ఫలితం అనుభవిస్తున్నాం. ఈ నిర్ణయం రెండు మూడేళ్ల క్రితమే తీసుకొని ఉండాల్సిందని మీరంటున్నారు. కానీ స్థానిక నేతలకు నచ్చజెప్పడానికి ఎంతో కాలం నుంచే ప్రయత్నిస్తూ వచ్చాం. కానీ ఏకాభిప్రాయం అసాధ్యమని గుర్తించాం. ఈ అంశంలో పీసీసీ నిలువునా చీలిపోయింది. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయవాదులు చీలిపోయారు. చివరకు న్యాయమూర్తులు కూడా భోజనానికి ఒకేచోట కూర్చోలేని పరిస్థితి వచ్చింది. అందువల్ల వాస్తవాన్ని గుర్తించాలి. నిర్ణయంలో జరిగిన జాప్యాన్ని మమ్మల్ని బాధ్యుల్ని చేస్తున్నారు. కానీ ఏకాభిప్రాయం కోసం ఎంతో ప్రయత్నించాం. కానీ అసాధ్యమని తేలింది. అందువల్ల ఏదైతే అదికానీ అని చివరకు ఈ నిర్ణయం తీసుకున్నాం. మమ్మల్ని శిక్షిస్తారో... అభినందిస్తారో... ఏది చేయాలనుకుంటే అది చేయనివ్వండి. ఈ బిల్లు భవిష్యత్తు ఎలా ఉంటుందో పార్లమెంటులోనే తెలుస్తుంది. వాస్తవానికి భాజపా తెలంగాణకు కట్టుబడి ఉంది. అయితే మా హయాంలో తెలంగాణ ఏర్పాటుకు వారు ఇష్టపడటం లేదు. అందుకే బిల్లును ఓడించారని పేరు రాకుండా అడ్డుకోవడానికి వారు చూస్తారు. ఇదంతా పార్లమెంటులోనే తెలుస్తుంది. ఒకవేళ బిల్లు పాస్‌ కాకపోతే వారిని ఎక్స్‌పోజ్‌ చేస్తాం. ఎందుకు చేయలేక పోయామో చెబుతాం. సీమాంధ్రుల ఆకాంక్షలు నెరవేర్చాలన్న భాజపా డిమాండ్‌లో అర్థంలేదు. సీమాంధ్రులంతా సమైక్యాంధ్రనే కోరుకుంటున్నారు కాబట్టి వారి ఆంక్షను నెరవేర్చడం సాధ్యం కాదు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌, ఆరు అవినీతి వ్యతిరేక బిల్లుతో పాటు తెలంగాణ బిల్లు పాస్‌ చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. తెలంగాణ అంశానికి మద్దతిచ్చిన పార్టీల సభ్యులను లెక్కిస్తే రాజ్యాంగ సవరణకు అవసరమైన 2/3 మెజార్టీ కూడా సాధ్యమే. కాంగ్రెస్‌, భాజపాలు కలిస్తేనే అది సరిపోతుంది. ఎవరైనా బయటికి మద్దతిస్తున్నట్లు చెప్పి వెన్నుపోటు పొడిస్తే మేం చేయగలిగిందేమీ లేదు. మహిళా బిల్లుకు అన్ని పార్టీలు మద్దతిస్తున్నప్పటికీ సభలో గందరగోళం కారణంగా పాస్‌ చేయలేక పోయాం. తెలంగాణ విషయంలో మేం అలాంటి గందరగోళం తలెత్తుతుందని అనుకోవడంలేదు. ఒకవేళ ఎంపీలు సభకు అడ్డుంకులు సృష్టిస్తే దీని పరిస్థితి కూడా మహిళా బిల్లులాగా అవుతుందేమో చెప్పలేం. ఆ అవకాశాలను ఎవ్వరూ కొట్టిపారేయలేరు. అయితే బిల్లు పట్ల మాకున్న నిబద్ధతను చాటుకున్నాం. దాన్ని పాస్‌ చేయడానికి ప్రయత్నించబోతున్నాం. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో ఏం జరిగిందో మీరు చూశారు. కొందరు వలయంగా ఏర్పడ్డారు. గందరగోళం సృష్టించారు. ఇక్కడకూడా అలాంటి పరిస్థితి వస్తే ఎవరేం చేయగలరు. కానీ మేం మా ప్రయత్నం చేస్తాం. ఆ తర్వాత ఏం అవుతుందో చెప్పలేం’’ అని పేర్కొన్నారు.

పదుగురి కోసం ఆరుగురం!

కాలేజీ స్నేహితులకో వాట్స్‌యాప్‌ గ్రూప్‌ చిన్నప్పటి మిత్రులకో ఫేస్‌బుక్‌ గ్రూప్‌ బంధువులందరినీ కలిపేందుకు గూగుల్‌ ప్లస్‌.. ఇలా నేటి సామాజిక మాధ్యమాలని మస్తుగా వాడుకుంటోంది...

ఆటో నడిపిన సినీనటుడు అఖిల్‌

సినీనటుడు అఖిల్‌ మంగళవారం ఖమ్మం నగరంలో ఆటో నడిపి సందడి చేశాడు. స్థానిక నరసింహస్వామి దేవాలయ సమీపంలో కిడ్నీ వ్యాధితో.....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net