Wed, February 10, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ఈ హనుమంతుడు మృత్యుంజయుడు!''విద్యా విలీనం''ఆ నాటి హామీలను నెరవేర్చండి''తెరాస గూటికి కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే''కాల్పుల్లో అనూహ్య మలుపు''ఉగ్ర మూలం ఐఎస్‌ఐ''వెనక్కు పంపాం.. బహిష్కరణ కాదు''సుశీల్‌ కొయిరాలా కన్నుమూత''వెళ్లిరా నేస్తమా...''రాజ్యాంగం పవిత్రతను కాపాడాలి'
పొత్తు తిరిగేదెటు!
పొత్తులపై ఒకవైపు తెదేపా, భాజపా సమాలోచనలు
మరోవైపు తెరాస, భాజపా మధ్య జోరుగా చర్చలు
చంద్రబాబుకు ఫోన్‌ చేసిన నరేంద్ర మోడీ
రంగారెడ్డి, హైదరాబాద్‌, ఖమ్మం జిల్లాలపై తకరారు
తెరాసతోనే మేలంటున్న భాజపా తెలంగాణ శాఖ
నేడు భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ నిర్ణయం!
తెదేపా, భాజపా మధ్య పొత్తుపై ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ వరకు చర్చలు సాగుతున్నా ఒక కొలిక్కి మాత్రం రాలేదు. ఒకవైపు ఈ రెండు పార్టీల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతుండగా, మరోవైపు భాజపా, తెరాస మధ్య పొత్తు ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఇటీవల ఈ రెండు పార్టీల నేతల మధ్య ఈ విషయమై చర్చలు జరిగినట్లు సమాచారం. తెదేపాతో కంటే తెరాసతో పొత్తు పెట్టుకుంటే మేలని సూచిస్తూ భాజపా రాష్ట్ర శాఖ పార్టీ అధిష్ఠానానికి వర్తమానం పంపినట్లు తెలిసింది. తెరాసతో పొత్తు పెట్టుకుంటే తెలంగాణలో అధికారం వస్తుందని కూడా అందులో పేర్కొన్నట్లు సమాచారం. ఈ అంశంతోపాటు తెదేపాతో పొత్తు వ్యవహారంపైనా సోమవారం ఢిల్లీలో జరిగే భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో చర్చించనున్నారు. పొత్తులపై ఈ భేటీలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఆదివారం పొత్తు చర్చల్లో పలు పరిణామాలు చోటుచేసుకున్నాయి. తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పొత్తు విషయమై ఉదయమే భాజపా ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి ఫోన్‌ చేశారని సమాచారం. దీని గురించి తాను పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ సింగ్‌కు చెబుతానని మోడీ ఆయనతో అన్నట్లు తెలిసింది. తర్వాత మోడీ భాజపా సీనియర్‌ నేత వెంకయ్యనాయుడితో మాట్లాడారు. తెదేపా ఇస్తానంటున్న సీట్ల సంఖ్య పార్టీకి ఆమోదయోగ్యం కాదని, రెండు రాష్ట్రాల పార్టీ శాఖలు తెదేపా ప్రతిపాదనకు ఒప్పుకోవడం లేదని వెంకయ్య ఆయనకు వివరించినట్లు తెలిసింది. తర్వాత రాజ్‌నాథ్‌తోపాటు భాజపా సీనియర్‌ నేతలు అరుణ్‌ జైట్లీ, ప్రకాశ్‌ జవదేకర్‌ కూడా వెంకయ్యతో మాట్లాడినట్లు సమాచారం. ఒకవైపు ఈ పరిణామాలు జరుగుతుండగా- మరోవైపు చంద్రబాబు నివాసంలో తెదేపా పొలిట్‌బ్యూరో సమావేశం జరిగింది. తెలంగాణలో భాజపా 55 శాసనసభ స్థానాలతో జాబితా ఇచ్చి వాటిలో 45 స్థానాలు అడుగుతోందని, అలాగే లోక్‌సభ స్థానాలు ఎనిమిది అడుగుతోందని ఆయన పార్టీ నాయకులకు చెప్పారు. సీమాంధ్రలో 25 శాసనసభ స్థానాలు, ఆరు లోక్‌సభ స్థానాలు అడుగుతోందని వెల్లడించారు. తెలంగాణలో అన్ని స్థానాలు ఇచ్చే పరిస్థితి లేదని తెలంగాణ తెలుగుదేశం నేతలు అభిప్రాయపడినట్లు తెలిసింది. ఎన్ని ఇవ్వొచ్చనే దానిపై తర్వాత చర్చలు జరిగాయి. తెలంగాణ తెదేపా నేతలు చంద్రబాబుతో మరోదఫా సమావేశమయ్యారు. 38 స్థానాల వరకు ఇవ్వొచ్చనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. ఏడు ఎంపీ స్థానాలు ఇవ్వొచ్చని అనుకున్నారు. భాజపా నేతలు కొందరు తొందరపాటుతో వ్యవహరిస్తూ అన్ని స్థానాల్లోనూ పోటీచేస్తామనడం సరికాదని వారు అభిప్రాయపడ్డారు. మరోవైపు పలువురు తెలంగాణ తెదేపా నేతలు భాజపా నేతలతోను ఫోన్‌లో మాట్లాడారు. ఒక దశలో పొత్తు అయిపోయిందని, సీట్ల సంఖ్యపై అవగాహనకు వచ్చామన్న ప్రచారం ఇరు పక్షాల నుంచీ జరిగింది. సాయంత్రానికి మళ్లీ పరిస్థితి మారింది. సీట్ల సంఖ్య, ఏయే సీట్లు అన్నదానిపై ఏకాభిప్రాయం రాలేదని తెలిసింది.

సీమాంధ్రదీ అదే పరిస్థితి: సీమాంధ్రలోనూ సీట్ల సంఖ్యపై ఒక నిర్ణయానికి రాలేదు. సీమాంధ్రలో 25శాసనసభ, 6 లోక్‌సభ స్థానాలను భాజపా అడుగుతోందని చంద్రబాబు చెప్పినప్పుడు- పొలిట్‌బ్యూరో సభ్యులు అన్ని స్థానాలు ఇవ్వలేమని అన్నట్లు తెలిసింది. తెదేపా ఇస్తామంటున్న 12 స్థానాలకు తప్పదనుకుంటే ఒకట్రెండు స్థానాలు అదనంగా ఇవ్వొచ్చని వారు అభిప్రాయడినట్లు సమాచారం. దేశ, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పొత్తుకు సుముఖమేనని, కానీ ఎవరే స్థానాలు గెలుస్తారనేది చూసుకుని సీట్ల సంఖ్యపై నిర్ణయానికి రావాలని అనుకున్నారు. నరసాపురం, రాజంపేట, తిరుపతి, ఒంగోలు, నెల్లూరు లోక్‌సభ స్థానాల్లో ఏవైనా నాలుగు భాజపాకు ఇవ్వొచ్చనే ప్రచారమూ జరిగింది. అయితే భాజపా నేతలు తక్కువలో తక్కువ 18 శాసనసభ స్థానాలు, ఐదు లోక్‌సభ స్థానాలు కావాలని అంటున్నట్లు తెలిసింది.

కీలకంగా మారిన రంగారెడ్డి, హైదరాబాద్‌, ఖమ్మం జిల్లా స్థానాలు: తెలంగాణలో సీట్ల సంఖ్యపై వ్యత్యాసం ఉండటంతోపాటు రంగారెడ్డి జిల్లా శాసనసభ సీట్లపై పీటముడి పడింది. ఎల్‌బీనగర్‌, ఉప్పల్‌, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్‌, మహేశ్వరం స్థానాలను భాజపా అడుగుతుండడం, తెదేపా కూడా తామిక్కడే బలంగా ఉన్నామని భావిస్తుండటంతో చర్చల్లో పురోగతి సాధ్యం కావడం లేదు. ఉప్పల్‌ స్థానానికి తెదేపా తరపున సీనియర్‌ నేత దేవేందర్‌గౌడ్‌ కుమారుడు వీరేందర్‌గౌడ్‌ ఇప్పటికే ప్రచారంలో ఉన్నారు. ఎల్‌బీనగర్‌ స్థానంలోనూ తెదేపా టికెట్‌ కోసం హోరాహోరీ పోరు నెలకొంది. సామ రంగారెడ్డి, కృష్ణప్రసాద్‌ ఈ స్థానంలో టికెట్‌ కోసం పోటీపడుతున్నారు. అదే సమయంలో భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల చంద్రశేఖర్‌రావు కూడా ఇక్కడి నుంచే టికెట్‌ కోసం గట్టి ప్రయత్నం చేస్తున్నారు. మల్కాజిగిరి నుంచి తెదేపాకు చెందిన మెదక్‌ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, బి.కె.మహేష్‌, రాధాకృష్ణ యాదవ్‌ టికెట్‌ ఆశిస్తున్నారు. అయితే ఇదే స్థానం నుంచి భాజపా రాష్ట్ర నేత ఎన్‌.రామచంద్రరావు కూడా పోటీ చేయాలని బలంగా అనుకుంటుండడంతో ఆ సీటును భాజపా అడుగుతోంది. మిగతా స్థానాల్లోనూ తాము బలంగా ఉన్నామని తెదేపా, తామైనా విజయం సాధిస్తామని భాజపా అంటున్నాయి. మరోవైపు కూకట్‌పల్లి స్థానాన్ని కూడా భాజపా అడుగుతోంది. ఇక్కడి నుంచి తెదేపా తరఫున మాధవరం కృష్ణారావు పోటీచేయాలని గట్టిగా కోరుకొంటున్నారు. ముషీరాబాద్‌ స్థానాన్ని భాజపా సీనియర్‌ నేత కె.లక్ష్మణ్‌ కోసం ఆ పార్టీ అడుగుతుండగా, తెదేపా నేత ముఠా గోపాల్‌ తదితరులు ఈసారైనా తమకే ఈ స్థానం ఉంచాలని కోరుతున్నారు. ఖైరతాబాద్‌ స్థానం నుంచి తెదేపా తరపున మాజీ మంత్రి విజయరామారావు ప్రచారంలో ఉన్నారు. పార్టీ సీనియర్‌ నేత చింతల రామచంద్రారెడ్డి, పార్టీ హైదరాబాద్‌ శాఖ అధ్యక్షుడు వెంకటరెడ్డిలలో ఒకరి కోసం భాజపా ఖైరతాబాద్‌ స్థానాన్ని అడుగుతోంది. ఈ సీట్లపై ఏకాభిప్రాయం రావడం లేదు. ఖమ్మం జిల్లాలో ఏ స్థానాలూ అడగొద్దని తెదేపా చెబుతోంది. మహబూబ్‌నగర్‌, కొల్లాపూర్‌, కల్వకుర్తి, నల్గొండ, మునుగోడు, సూర్యాపేట, ఆలేరు, హనుమకొండ, పరకాల, పెద్దపల్లి, కోరుట్ల, నిజామాబాద్‌ అర్బన్‌, బాల్కొండ, ఆదిలాబాద్‌, ముథోల్‌, నిర్మల్‌, సంగారెడ్డి, పటాన్‌చెరువు, అంబర్‌పేట, ముషీరాబాద్‌, కార్వాన్‌, చాంద్రాయణగుట్ట, మలక్‌పేట, గోషామహల్‌ తదితర స్థానాలను భాజపా అడుగుతోంది.

20 శాసనసభ, ఐదు లోక్‌సభ స్థానాలకు భాజపా అభ్యర్థుల ప్రకటన?: సోమవారం పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ముగిశాక తెలంగాణలో 20 శాసనసభ, 5 లోక్‌సభ నియోజకవర్గాలకు అభ్యర్థులతో భాజపా తొలి జాబితాను ప్రకటించే అవకాశముందని ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సోమవారం ఉదయం భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. ఆదివారం రాత్రి తెలంగాణ భాజపా ఎన్నికల కమిటీ సమావేశమై అభ్యర్థుల ఎంపిక కసరత్తును దాదాపుగా పూర్తిచేసినట్లు సమాచారం.

మమ్మల్నీ ఉద్యోగులే అనుకున్నారు!

బయోటెక్నాలజీ రంగాన్ని చాలా ఇష్టంగా ఎంచుకున్నారా ఇద్దరు..!కానీ ఆ చదువుకు తగ్గ ఉద్యోగాల్లేవు.. ఈ పరిస్థితుల్లో ఎవరయినా ఉన్నచోటే వేరే ఉద్యోగాలు చూసుకోవడమో...

హాలీవుడ్‌లో మెరుస్తున్న బాలీవుడ్‌

హాలీవుడ్‌లో బాలీవుడ్‌ జెండా ఎగరేస్తే ఎంత బాగుంటుందో... చాలాకాలంగా బాలీవుడ్‌ను వూరిస్తూ వచ్చిన ఈ లక్ష్యాన్ని మన తారలు ఒక్కొరొక్కరిగా సాధిస్తూ వస్తున్నారు....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net