Sat, February 13, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ప్యాకేజీ ఇవ్వండి''విలీనమా.. అనర్హతా?''అదనపు పనులన్నీ పాత గుత్తేదారులకే''భారతమాతను కించపరిస్తే సహించం''‘తెలంగాణ బ్రాండ్‌’ పేరుతో అమ్మకాలు''శాశ్వత ఉత్సవంగా మేడారం జాతర''కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయం''విలీన లేఖపై ఏమి చేయాలి?''వీరసేనానికి కన్నీటి వీడ్కోలు''అమ్మతనానికి అండ'
తిరుమల.. భద్రత భళా!
రూ.69 కోట్లతో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు
అలిపిరి సహా అంతటా సీసీ కెమేరాల నిఘా
అత్యాధునికి పర్యవేక్షక కేంద్రం
ఏడాదిన్నరలోగా అన్నీ సిద్ధం
ఈనాడు - హైదరాబాద్‌
ఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని ఆనంద నిలయం కొలువైన కలియుగ వైకుంఠం తిరుమల శత్రుదుర్భేద్యం కానుంది. దేవదేవుని సన్నిధిలో దానవ చేష్టలకు అస్కారం లేకుండా భద్రత మరింత కట్టుదిట్టం కానుంది. భక్తచింతామణి శ్రీనివాసుడి కోవెల సహా శ్రీవారికి చెందిన పురాతన, ఆధునిక ఆలయాలు, కట్టడాలు ఆధునిక రక్షణ ఛత్రం పరిధిలోకి రానున్నాయి. శ్రీ వేంకటేశుని ఆలయ పరిసరాలను శత్రుదుర్భేద్యంగా మలచేందుకు రూ.కోట్ల వ్యయంతో ప్రణాళిక అమలుకు అధికారులు సిద్ధమయ్యారు.

తిరుమల శ్రీవారి ఆలయానికి ఉగ్రవాదులు, ఇతర అసాంఘిక శక్తుల నుంచి పొంచి ఉన్న ముప్పు నేపథ్యంలో తిరుమల భద్రతకు సంబంధించిన తీసుకోవలసిన చర్యలపై నిఘావర్గాలు ఓ నివేదికను రూపొందించాయి. దానిని అమలు చేసేందుకు అధికారులు రూ.69 కోట్లతో బృహత్తర ప్రణాళికను రూపొందించారు. ఈ పనులను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ముగ్గురు అధికారులతో కూడిన ఒక నిపుణులు కమిటీని నియమించింది. ఇటీవల తిరుపతి సమీపంలో ఉగ్రవాద ముఠాను పోలీసులు అరెస్టు చేయటం..శేషాచలం కొండల్లో ఎర్రచందనం స్మగ్లర్లు అటవీ సిబ్బందిపై దాడి చేసిన నేపథ్యంలో తిరుమల భద్రతపై అధికారులు మరో దఫా సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రణాళిక అమలులో భాగంగా చేపట్టిన పనులను వేగవంతం చేయాలని నిర్ణయించారు.

అటవీ మార్గాలు నిఘా పరిధిలోకి
తిరుమల కొండ మీదకు వెళ్లే సుపరిచిత నాలుగు మార్గాలతో బాటు అటవీ మార్గాల ద్వారా కొండపైకి వెళ్లేందుకు గల పదికి పైగా మార్గాలనూ నిఘా పరిధిలోకి తీసుకువస్తున్నారు. ఇందుకోసం ఆయా ప్రాంతాల్లో సాయుధులతో కూడిన అవుట్‌పోస్టులు ఏర్పాటు చేయనున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో వాచ్‌ టవర్లు నిర్మిస్తారు. తిరుమలలో అణువణువూ జల్లెడ పట్టేందుకు రెండు వేల నిఘా కెమేరాలను బిగిస్తున్నారు. అంతర్గత రక్షణ వలయం(ఇన్నర్‌ కార్డన్‌), బాహ్య రక్షణ వలయం(అవుటర్‌ కార్డన్‌) పేరిట రెండంచెల రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం రక్షణ ఏర్పాట్లను ఏడాది నుంచి ఏడాదిన్నరలోగా పూర్తి చేసేందుకు అధికారులు కృతనిశ్ఛయంతో ఉన్నారు.

రక్షణ ఛత్రం పరిధిలోకి మాడవీధులు: శ్రీవారి ప్రధాన ఆలయం చుట్టూ ఉన్న ప్రాంతాన్ని అంతర్గత భద్రతా వలయంగా గుర్తించారు. స్వామి వారు వూరేగే మాడవీధుల చుట్టూ కంచెతో నిర్మాణం చేపట్టారు. ప్రధాన ఆలయాంతో కలుపుకుని అర కిలోమీటరు వృత్తాన్ని పూర్తిగా ప్రధాన రక్షణ పరిధిలోకి తీసుకు వస్తున్నారు. ఆలయానికి నలు దిక్కులా రక్షణ కంచెలను నిర్మిస్తున్నారు. ఉత్తర దిక్కు మినహా మిగిలిన మూడు వైపులా నిర్మాణాన్ని ఇప్పటికే పూర్తి చేశారు. మాడవీధుల్లో జరిగే శ్రీవారి ఉత్సవాలను వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆ ప్రాంతానికి వస్తారు. ఆ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వర్గాల నియంత్రణలో ఆ ప్రాంతం ఉండేలా చర్యలు చేపట్టారు. ఇందుకు తగ్గట్టుగా ఏర్పాటు చేస్తున్న కంచెల వద్ద మెటల్‌ డిటెక్టర్లతో కూడిన ప్రత్యేక ద్వారాల నుంచి మాత్రమే భక్తులు పరిమితంగా లోపలికి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. నాలుగు వైపులా కంచె నిర్మాణం పూర్తి అయితే అనుమానాస్పద వ్యక్తులు ఆలయ పరిసరాలకు చేరుకోవటం దుర్లభంగా మారుతుంది.

రింగు రోడ్డు వెంటే రెండో అంచె...
తిరుమలకు హద్దులను నిర్ధారించేందుకు బాహ్యవలయ రహదారిని(అవుటర్‌ రింగు రోడ్డు) నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా తిరుమల చుట్టూ 9 కిలోమీటర్ల పరిధిలో దీనిని నిర్మిస్తారు. పనుల సైతం ప్రారంభం అయ్యాయి. ఈ రోడ్డు ఆధారంగా బాహ్య రక్షణ వలయాన్ని రూపొందించాలని నిర్ణయించారు. కాలుష్యాన్ని నివారించేందుకు బ్యాటరీ ఆధారిత వాహనాలు మాత్రమే అవుటర్‌ రింగు రోడ్డు లోపల నడుపుతారు.

త్వరలో 2000 వేల కెమేరాలు: భద్రతను పటిష్ఠం చేసే క్రమంలో నిఘా కెమేరాల సేవలు విస్తృతం కానున్నాయి. తిరుపతి, తిరుమలలో ప్రస్తుతం మూడు వందల వరకు నిఘా కెమేరాలు ఉన్నాయి. తాజాగా మరో రెండు వేల కెమేరాలను తిరుపతిలోని అలిపిరి ఘాట్‌లో సహా తిరుమలలో ఏర్పాటు చేయనున్నారు.

వేగానికీ కళ్లెం...: తిరుమల ఘాట్‌ రోడ్డులో ప్రైవేటు వాహనాల అధిక వేగానికి అధికారులు కళ్లెం వేశారు. ఓ వాహనానికి అలిపిరి నుంచి తిరుమల వెళ్లేందుకు 28 నిముషాలు, కొండ నుంచి కిందకు వచ్చేందుకు 40 నిముషాల వ్యవధిని నిర్ధారించారు. అంతకన్నా ముందు వచ్చిన వాహనాలపై అపరాధ రుసుమును విధిస్తారు. ఒకే వాహనం పదేపదే నిబంధనలను అతిక్రమించిన పక్షంలో వాటిని అదుపులోకి తీసుకుంటున్నారు. అలిపిరి వద్ద తనిఖీలు పూర్తి చేసుకున్న తరువాత టోల్‌గేటు వద్ద కంప్యూటర్‌తో అనుసంధానం చేసిన రెండు స్లిప్పు (కొండపైకి వెళ్లేందుకు, కిందకు వచ్చేందుకు)లు ఇస్తారు. వెళ్లేటప్పుడు ఇచ్చిన స్లిప్పులను కొండపైన ఉన్న గరుడాద్రినగర్‌ చెక్‌పోస్ట్‌ వద్ద కంప్యూటర్‌ సహాయంతో ఎంత సమయంలో వాహనం పైకి వచ్చిందన్న విషయాన్ని గుర్తిస్తారు. అదేవిధంగా కొండ దిగిన తరువాత సమయాన్ని చెక్‌ చేస్తారు. ఈ ప్రయోగంతో ప్రమాదాల సంఖ్య తగ్గుముఖం పట్టినట్లు అధికారుల స్పష్టం చేస్తున్నారు.

మా వూరికి మంచి నీళ్లు...

బాగా ఆస్తిపాస్తులున్న వాళ్లని శ్రీమంతులంటారు.మహేశ్‌బాబు నటించిన ‘శ్రీమంతుడు’ చూశాక ఆ అర్థం మారిపోయిందనే చెప్పవచ్చు. ఎక్కడ పెరిగినా, స్థిరపడినా సొంతూరి...

ప్రేమలు మెరిసే.. తారలు మురిసే!

ప్రేమ ఓ అనీర్వచనీయమైన అనుభూతి. ప్రేమలో పడితేనే దాని మాధుర్యం ఏంటో తెలిసేది. నిజ జీవితాల్లోనే కాదు వెండితెరపైనా ప్రేమ అద్భుతమైన విజయాలు అందించింది....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net