Wed, February 10, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ఈ హనుమంతుడు మృత్యుంజయుడు!''విద్యా విలీనం''ఆ నాటి హామీలను నెరవేర్చండి''తెరాస గూటికి కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే''కాల్పుల్లో అనూహ్య మలుపు''ఉగ్ర మూలం ఐఎస్‌ఐ''వెనక్కు పంపాం.. బహిష్కరణ కాదు''సుశీల్‌ కొయిరాలా కన్నుమూత''వెళ్లిరా నేస్తమా...''రాజ్యాంగం పవిత్రతను కాపాడాలి'
మోడీకే ఓటేయండి
తప్పుని తప్పని చెప్పగల జాతీయ నేత ఆయనే
ఈ ఎన్నికల్లో నేను పోటీ చేయను
విశాఖ ‘జనసేన’ సభలో పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలు
ఈనాడు - విశాఖపట్నం
ప్రస్తుత శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. కాంగ్రెస్‌ వ్యతిరేక ఓట్లు చీల్చడం.. అభ్యర్థుల విజయావకాలను దెబ్బ తీయడం ఇష్టంలేకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నిజానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కలిపి 28 లోక్‌సభ, 96 శాసనసభ స్థానాల్లో స్వతంత్రంగా పోటీ చేసేందుకు అభ్యర్థులను గుర్తించామని, ఆ తర్వాత నిర్ణయం మార్చుకున్నామని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా సమాజం కోసం చిత్తశుద్ధితో పనిచేసే యువ నాయకులు లభించేంత వరకూ ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. ప్రస్తుత ఎన్నికల్లో సీమాంధ్రకు సమగ్రమైన కొత్త రాష్ట్ర రాజధాని నిర్మించే విషయమై మీకు ఎవరిపై నమ్మకం ఉంటే వారికే ఓట్లేయండని యువతకు పిలుపునిచ్చారు. అవినీతి రహిత సమాజం కావాలని గుండె లోతుల్లోంచి కోరుకుంటే తప్పకుండా వస్తుందన్నారు. ప్రజల తరపున మాట్లాడేందుకు తానున్నానని ప్రకటించారు. గురువారం సాయంత్రం విశాఖపట్నంలోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించిన జనసేన బహిరంగ సభలో భారీగా తరలివచ్చిన యువతను ఉద్దేశించి పవన్‌ కల్యాణ్‌ ఏకధాటిగా 75 నిమిషాల పాటు ప్రసంగించారు. తన పార్టీ విధానాలను వివరించడంతో పాటు కాంగ్రెస్‌ పార్టీని తూర్పారబట్టారు. దేశానికి సమర్థ నాయకుడు మోడీయేనని చెప్పారు. విభజన జరిగిన తీరుపై పవన్‌ కల్యాణ్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. బొత్స, కావూరి వంటి కాంగ్రెస్‌ నేతలు కాంట్రాక్టులు, వ్యాపారాల కోసం ఏమైనా చేస్తారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు..

అలాంటి యువత కావాలి: రాష్ట్రం విడిపోవడం కన్నా విభజన ప్రక్రియలో కాంగ్రెస్‌ అనుసరించిన తీరు నాకు ఎక్కువ బాధ కలిగించింది. తెలుగు గడ్డ నుంచి ప్రశ్నించే వారు లేరనే కాంగ్రెస్‌ నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరించి, ఇంత అన్యాయానికి తెగబడ్డారు. చూస్తూ వూరుకుంటే భవిష్యత్తులో ఇలాంటివి ఎన్నో చూడాలి. అందుకే ఇలాంటి పార్టీలను, నాయకులను తెలుగు జాతి తరపున నిలదీయాలనే ప్రధాన లక్ష్యంతో జనసేన పార్టీని స్థాపించాను. కాంగ్రెస్‌ పార్టీనీ, కుళ్లిన రాజకీయాలను కూకటి వేళ్లతో పెకలించాలి. స్వార్థపరులు, లంచగొండులైన రాజకీయ నాయకులను ప్రశ్నించగలిగే సత్తా ఉన్న యువత కావాలి. అలాంటి వారు మీలోనే ఉన్నారు. అన్యాయాలను ఎదిరించే దమ్ము, ధైర్యం గల యువత ముందుకు రావాలి. అలాంటి యువ నాయకత్వం లభిస్తే ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ లోనూ పోటీ చేస్తాం. 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో ఎవరు అధికారంలోకి వచ్చినా.. ప్రజా సమస్యలను విస్మరించి.. స్వలాభం కోసం నీతి, నియమాలు తప్పి అవినీతికి పాల్పడితే జనసేన ఉద్యమ స్వరూపం చూపిస్తాం. అంతవరకూ మాట్లాడను... అంతా వింటాను. ఆ తర్వాత మా సత్తా చూపిస్తాం. నమ్మిన సిద్ధాంతాల కోసం తుది శ్వాస వరకు పోరాడుతూనే ఉంటా. ప్రాణత్యాగానికైనా సిద్ధమే.

మోడీని ఎందుకు కలిశానంటే..: కేంద్రంలో యూపీఏ ప్రభుత్వ విధానాలతో విసిగిపోయా. కాంగ్రెస్‌ ఎంపీలు తమ వ్యాపారాలు, కాంట్రాక్టులనే ప్రధానంగా భావించారు. అందుకే వారికి వ్యతిరేకంగా మాట్లాడాలని నిర్ణయించుకున్నా. నాకు భయం లేదు. దేశ క్షేమం కోసం ఎవరికీ భయపడను. ప్రాణాలపైనా మమకారం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో భాజపాతోనే అభివృద్ధి సాధ్యమని విశ్వసిస్తున్నా. తప్పును తప్పని ఖచ్చితంగా చెప్పగల నాయకుడు దేశంలో ఒక్కరైనా ఉన్నారా? అలాంటి లక్షణాలు మోడీకి మాత్రమే ఉన్నాయి. అందుకే ఆయన్ను ప్రధానిగా చూడాలనుకుంటున్నా. ఈ దేశాన్ని సమర్థంగా, అభివృద్ధి పథాన నడిపిస్తారనే నమ్మకంతోనే ఆయనను కలిశా. ఈ బహిరంగ సభ ద్వారా ఆయనకు నా సందేశాన్ని ఇవ్వాలనుకున్నా. మిమ్మల్ని ప్రధానిగా చూడాలని అనుకుంటున్నాం. మా పూర్తి మద్దతు మీకే ఉంటుంది. మీరు తప్పకుండా ప్రధాని అవుతారు

సోనియా క్షమాపణ చెప్పాలి
విభజన ప్రక్రియలో సోనియాగాంధీ పక్షపాతంతో వ్యవహరించారు. పిల్లల్లాంటి తెలంగాణ, సీమాంధ్రలో ఒక ప్రాంతాన్ని ముద్దాడి.. మరో ప్రాంతాన్ని చీదరించుకున్న సోనియా తల్లి ఎలా అవుతుంది? తెలంగాణ ప్రజలు ఆమెను తల్లిగా భావిస్తున్నా అలాంటి లక్షణాలు ఆమెలో లేవు. సోనియా తెలుగు జాతికి క్షమాపణ చెప్పాలి. అప్పుడే ఆమెను గౌరవిస్తాం

కాంగ్రెస్‌ది రాజకీయ వికృత క్రీడ
దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇంతవరకూ ఇలాంటి రాజకీయ వికృత క్రీడ ఎన్నడూ చూడలేదు. ఆ ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుంది. విభజనతో ప్రజలను రోడ్డుపైకి తీసుకొచ్చారు. ఎన్నికల్లో ఎలా విజయం సాధించాలని 11.30 గంటలు చర్చించిన కాంగ్రెస్‌ నాయకులు రాష్ట్ర విభజన విషయాన్ని మాత్రం ఒక గంటలోనే తేల్చి పారేశారు. ఎంగిలి మెతుకులు చల్లినట్లు కాంగ్రెస్‌ నాయకులు రాష్ట్రాన్ని విభజించి ప్యాకేజీలు జల్లడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు న్యాయం చేయగలరా? అందుకే కడుపు మండి జనసేన పార్టీ స్థాపించా.

సంపూర్ణ క్రాంతి జనసేన అజెండా
ప్రజలకు సంపూర్ణ క్రాంతి అందించడమే జనసేన అజెండా. పార్టీకి ‘ఇజం’ పుస్తకమే మేనిఫెస్టో. పార్టీ గుర్తుగా ఉన్న నక్షత్రంలో 6 కోణాలుంటాయి. ఒక్కో కోణం ఒక్కో సిద్ధాంతానికి నిదర్శనం. చట్టాలు ఎవరికీ చుట్టాలు కారాదు. ధనవంతుడికో రీతి.. పేదవాడికో రీతి తరహా ఉండకూడదు. ఇలాంటి వివక్షల వల్ల నిజాయితీగా వ్యవహరించే సీబీఐ, పోలీసు అధికారులు బలిపశువులు అవుతున్నారు. జేడీ లక్ష్మీనారాయణ ఉదంతమే దీనికి నిదర్శనం. ఏసీబీ అధికారులు చిరుఉద్యోగుల్ని పట్టుకుంటూ లక్షలకోట్లు దోచుకునే పెద్దచేపల్ని వదిలేస్తున్నారు. పవన్‌ కల్యాణ్‌ తప్పు చేసినా వాడి తలకాయ తీసే చట్టం రావాలి. సమాజ సంక్షేమం కోసం పాటుపడే మంచి వ్యక్తులు దొరికే వరకు జనసేన ఎన్నికల్లో పోటీ చేయదు. నిస్వార్థంగా సేవ చేసే లక్షణాలున్న యువకులు ఈ సభకు హాజరైన వారిలో ఎందరో కనపడుతున్నారు. జనసేన పార్టీ ఏర్పాటు తరువాత అనూహ్య స్పందన వచ్చింది. విజయనగరానికి చెందిన ఓ 70 ఏళ్ల ఎన్నారై ఓ ఉత్తరం రాశారు. అందులో ఆయన ప్రజాసేవ చేసేందుకు ముందుకు వస్తే ఎన్ని అడ్డంకులు సృష్టించారో వివరించారు. ప్రస్తుత నాయకులు వారు సేవ చేయకపోవడమే కాకుండా చేద్దామనుకున్న వారినీ నిరోధిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఖద్దరు వస్త్రాలు దొరకడం లేదు. ఎందుకంటే ఎన్నికలు కదా.. నేతలంతా ఆ దుస్తులే ధరిస్తున్నారు. ఖద్దరు ధరించడం కాదు.. ఆ స్ఫూర్తి గుండెల్లో ఉండాలి. చాలామంది నాయకులు నాకు పొలిటికల్‌ మైండ్‌ లేదంటున్నారు. అదే లేకపోతే ఇక్కడ ఇంతమందిమి ఎందుకు సభ నిర్వహిస్తాం?
సిద్ధాంతాల కోసం తపించా..
ప్రాంతాల మధ్య విద్వేషాల్ని రెచ్చగొట్టి, ప్రజల మధ్య చిచ్చుపెట్టే రాజకీయ నాయకులు పెచ్చరిల్లి పోతున్నారు. ఇదే పద్ధతి కొనసాగితే శ్రీలంకలో ఎల్‌టీటీఈ తరహాలో వేర్పాటువాద ఉద్యమాలు తలెత్తే ప్రమాదం ఉంది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు తలెత్తకుండా ఉండేందుకు పార్టీ స్థాపించాలనుకున్నా. ఐదేళ్లకోసారి కాంగ్రెస్‌ తరహాలో సిద్ధాంతాలు మార్చుకొని, జెండాలు, కండువాలు మారే నాయకులకు దీటైన సమాధానం చెప్పాలనుకున్నా. రాబోయే ఎన్నికల కోసం కాకుండా.. భవిష్య తరాల కోసం రచించిన దీన్ని మీ ముందే జాతికి అంకితం ఇస్తున్నాను. సముద్రం ఎవరి కాళ్ల ముందు మోకరిల్లదు.. పర్వతం ఎవరికీ తలవంచదు. నేను పిడికెడు మట్టినేకావచ్చు.. కానీ జాతీయ జెండాకు ఉన్నంత పొగరు ఉంది నాలో. రాజు నీతి తప్పితే.. నేల సారం తప్పుతుంది. తమకు ఏదో మంచి చేస్తారనే ఉద్దేశంతో దశాబ్దాలుగా చట్టసభలకు పంపిస్తున్న ప్రజాప్రతినిధులు స్వలాభానికి పాల్పడి నీతి తప్పుతున్నారు. దానికి పర్యవసానమే రాష్ట్ర విభజన.

ఆ ఇద్దరు ఎవరో?: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు శాసనసభ్యుల గురించి వారి పేర్లను ప్రస్తావించకుండా పవన్‌ కల్యాణ్‌ విమర్శనాత్మకంగా మాట్లాడారు. తాను డబ్బు కోసం సినిమాల్లో నటిస్తుంటే.. వారు మాత్రం మోసం, దోపిడీ కోసం నటిస్తారని ఆరోపించారు. ‘‘డబ్బు కోసం ఎంతటికైనా తెగించే వారిద్దరూ చివరి వరకూ మన వెనుకే ఉంటూ మనకే వెన్నుపోటు పొడిచారు. కొత్త రాజధాని ఏర్పాటు విషయంలో వీరిద్దరూ వ్యంగ్యంగా మాట్లాడుకోవడం వార్తల్లో చూశాను. ప్రజా సమస్యల పరిష్కారం పట్ల బాధ్యత లేకుండా వ్యవహరించే ఇటువంటి నాయకుల్ని నిలదీయండి’ అని యువతకు పిలుపునిచ్చారు.

మమ్మల్నీ ఉద్యోగులే అనుకున్నారు!

బయోటెక్నాలజీ రంగాన్ని చాలా ఇష్టంగా ఎంచుకున్నారా ఇద్దరు..!కానీ ఆ చదువుకు తగ్గ ఉద్యోగాల్లేవు.. ఈ పరిస్థితుల్లో ఎవరయినా ఉన్నచోటే వేరే ఉద్యోగాలు చూసుకోవడమో...

‘ముఠామేస్త్రీ’ రానా

నటుడు దగ్గుబాటి రానా ముఠామేస్త్రీ అయ్యారు. మంచు లక్ష్మి వ్యాఖ్యాతగా ప్రసారం కానున్న ‘మేముసైతం’ .........

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net