Thu, February 11, 2016

Type in English and Give Space to Convert to Telugu

'హైదరాబాద్‌కు యాపిల్‌''కారెక్కిన ఎర్రబెల్లి''మేయర్‌ బొంతు రామ్మోహన్‌!''హనుమంతప్ప పరిస్థితి మరింత విషమం''భాగ్యనగరం తరహాలో ఖేడ్‌ అభివృద్ధి''మహా జాతరకు శ్రీకారం''ఓటుకు నోటు కేసులో మరో తెదేపా ఎమ్మెల్యే అరెస్టు?''ప్రయాణికులపై మళ్లీ వడ్డింపు?''గవర్నర్లు రాష్ట్రాలకు ఉత్ప్రేరకాలు''మహానగర అభివృద్ధికి 100 రోజుల ప్రణాళిక!'
చేసింది మోసం.. జరిగింది ఘోరం!
కాగ్‌ అభిశంసనలు చాలవా? ఇంతకన్నా ఇంకెవరు చెప్పాలి!
ఈనాడు హైదరాబాద్‌
జలయజ్ఞం కాదు ధనయజ్ఞమని... విపక్షాలంటే.... చూసి ఓర్వట్లేదని ఎకసెక్కాలాడారు! మీడియా విమర్శిస్తే ... మాకు వ్యతిరేకమంటూ ముద్ర వేయజూశారు ఎవరు వేలెత్తి చూపితే వారిపై ఎదురుదాడి చేశారు! కానీ... మనదేశంలో ప్రతి పైసా ఖర్చునూ... ప్రతి లెక్కనూ దుర్భిణీపెట్టి చూసి... అవినీతిని పాతాళంలో ఉన్నాసరే పసిగట్టే... కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) కూడా జలయజ్ఞం విషయంలో వైఎస్‌ ప్రభుత్వాన్ని కడిగేసింది! ప్రతి ప్రాజెక్టునూ జల్లెడ పట్టి జలజలమంటూ పారిన అవినీతిని నిగ్గు తేల్చింది! ఓటేసి గెల్పించే ప్రజలకెలా టోపీ పెట్టారో కళ్ళకు కట్టినట్లు చూపింది! కాగ్‌ చెప్పిన వైఎస్‌ అండ్‌ కో వంచన వైనాల్ని... చదవండి ఎన్నికల వేళ!

2004లో వై.ఎస్‌. అధికారంలోకి వచ్చాక 26 సాగునీటి ప్రాజెక్టులతో జలయజ్ఞం కార్యక్రమం ఆరంభించారు. కానీ ఆ తర్వాత ప్రాజెక్టుల సంఖ్య పెంచుకుంటూ పోయి 2012 నాటికి 86కు చేర్చారు.

ఏం చేశారు: ఈ యజ్ఞం ఆద్యంతం అవకతవకల మయమని సాక్షాత్తూ కాగ్‌ కడిగేసింది. సాధారణంగా ఏటా కొన్ని పనులను తీసుకొని అధ్యయనం చేసే ‘కాగ్‌’ జలయజ్ఞానికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా 2004 నుంచి 2012 వరకు చేపట్టిన మొత్తం పనులపై సమగ్రంగా అధ్యయనం చేసి 2013 ఆరంభంలో నివేదిక విడుదల చేసింది. దీనిలో- కాంట్రాక్టు ప్రక్రియలో పారదర్శకత లోపించిందనీ, ప్రభుత్వ ఆర్థిక ప్రయోజనాలను సరైన రీతిలో పరిరక్షించ లేదనీ స్పష్టంగా నిగ్గు తేల్చింది. ప్రాజెక్టుల ఆర్థిక భారం భవిష్యత్తులో సుధీర్ఘకాలం పాటు ఖజానాకు సవాలుగా మారనుందని జలయజ్ఞంపై అధ్యయనం చేసిన ‘కాగ్‌’ స్పష్టం చేసింది.

ఎప్పటికి వసూలయ్యేనో? గుత్తేదారు కూలీలను సమకూర్చుకునేందుకు ఐదు శాతం, యంత్రాల కొనుగోలుకు ఐదు శాతం కలిపి మొత్తం పది శాతం మొబిలైజేషన్‌ అడ్వాన్సు కింద ప్రభుత్వం చెల్లించింది. ఇలా ఇచ్చిన అడ్వాన్సు మొత్తాన్ని పని పూర్తయిన తరవాత ఇచ్చే బిల్లుల్లో సర్దుబాటు చేస్తారు. పలు ప్యాకేజీల పనుల్లో కదలిక లేదు. ఫలితంగా మొబిలైజేషన్‌ అడ్వాన్సు పేరిట ఇచ్చిన ప్రభుత్వ సొమ్ము భారీగా గుత్తేదారుల దగ్గర స్తంభించిపోయింది. 349 ప్యాకేజీల్లో రూ.3627.40 కోట్లు అడ్వాన్సుగా ఇచ్చింది ప్రభుత్వం. ఇందులో రూ.1138.87 కోట్లు ఇంకా వసూలు కావలసి ఉందని కాగ్‌ వెల్లడించింది.

1. నీరు లేకుండానే...
ఎక్కడైనా ఇల్లు అద్దెకు తీసుకోవాలంటేనే నీటి వసతి ఉందో లేదో... అన్ని కాలాల్లో నీళ్ళు అందుబాటులో ఉంటాయో లేదో చూసుకుంటాం! వందలు, వేల రూపాయల అద్దెకే ఇంత జాగ్రత్త పడితే మరి వేల కోట్ల రూపాయలతో చేపట్టే ప్రాజెక్టు నిర్మించేటప్పుడెంత జాగ్రత్త పడాలి? కానీ... రాజన్న రాజ్యం తీరే వేరు! నీరుందో లేదో చూసుకోకుండానే ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారని కాగ్‌ మొట్టికాయలు వేసింది! కాగ్‌ ఏమందంటే...

* ప్రాజెక్టులకు అవసరమైన మేర జలాలు, తగినంత విద్యుత్తు లభ్యత లాంటి ప్రాథమిక అంశాల విషయంలో సాధ్యాసాధ్యాలు అధ్యయనం చేయకుండా, కేంద్ర జలసంఘం వ్యక్తం చేసిన అభ్యంతరాలను కూడా నిర్లక్ష్యం చేశారు.

* కృష్ణా, పెన్నాపై ప్రాజెక్టులకు అవసరమైన నీరు, అందుబాటులో ఉన్న నీటి పరిణామం కన్నా చాలా ఎక్కువ! కాబట్టి వరద జలాలను ప్రాజెక్టుల కోసం వాడుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఏటా వరద ప్రవాహాల సమాచారం విశ్లేషించినట్లు లేదు.

* కృష్ణా నదీజలాల పంపకాన్ని సమీక్షించటం కోసం 2004 ఏప్రిల్‌లోనే భారత ప్రభుత్వం కృష్ణా ట్రిబ్యునల్‌-2ను ఏర్పాటు చేసినప్పటికీ... రాష్ట్ర ప్రభుత్వం ఆగకుండా 23,093 కోట్ల భారీ వ్యయంతో గాలేరు-నగరి, హంద్రీనీవా, వెలిగొండ, శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం, నెట్టెంపాడు పథకాలను చేపట్టింది.

* 245 టీఎంసీల మిగులు జలాలను వినియోగించుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌కు అనుమతుందని నీటిపారుదల శాఖ చేస్తున్న వాదన ఆమోదయోగ్యం కాదు. ఎందుకంటే... కృష్ణా ట్రిబ్యునల్‌-1లో మిగులు జలాలను వాడుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చినా, మిగులు జలాలపై రాష్ట్రానికి సంపూర్ణ హక్కులు ఉండబోవనీ, ఆ మిగులు జలాలను రాష్ట్రానికే కేటాయించినట్లుగా భావించకూడదనీ నిబంధన విధించారు.

* వివిధ శాఖల అనుమతుల్లేకుండానే ప్రాజెక్టులు చేపట్లారు.

2. టెండర్లలో మాయ: టైమివ్వకుండా చేశారు!
నిబంధనలను తుంగలో తొక్కుతూ అస్మదీయులకు ప్రాజెక్టులు కట్టేందుకు వైఎస్‌ ప్రభుత్వం ‘ఈపీసీ’ విధానాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసింది. అందుకే ‘దీనివల్ల కేవలం గుత్తేదారులకు మాత్రమే లాభించింది, రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనాలూ దక్కలేదు’ అని కాగ్‌ నిర్ద్వంద్వంగా తేల్చి చెప్పింది. అసలీ పథకం ఆద్యంతం గుత్తేదారుల ప్రయోజనాలకే ఉపయోగపడిందని, టెండర్లలో ఎక్కడా పారదర్శకతే లేదని కాగ్‌ అభిప్రాయపడిందంటే అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో అనుసరిస్తున్న టెండర్ల విధానాన్ని వదిలేసి ప్రభుత్వం జలయజ్ఞం కోసం ఈపీసీ పద్ధతికి తెర తీసింది. ఈ విధానంలో గుత్తేదారే పనులను డిజైన్‌ చేసి, అవసరమైన సామగ్రిని కొనుగోలు చేసి, నిర్మాణం చేస్తారు. దీనివల్ల నిర్దేశిత సమయానికి ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఈ డిజైన్ల తయారీకి, అంచనాల కోసం వారికి తగినంత సమయం ఇవ్వాలి. కానీ ప్రభుత్వం టెండర్లలో పోటీకి అవసరమైన సమయాన్ని ఇవ్వలేదు. పలు కాంట్రాక్టులను సింగిల్‌ టెండర్‌ ప్రాతిపదికన అప్పగించారు. టెండర్లు దాఖలు చేసేవారు తగినంత లేకపోతే ఈపీసీ విధానం సరైనది కానేకాదని కాగ్‌ అభిప్రాయపడింది. జలయజ్ఞం చాలా ప్యాకేజీల్లో బిడ్‌ దాఖలు చేసేందుకు ఇచ్చిన సమయం 30 రోజుల కంటే తక్కువే! వైఎస్‌ ప్రభుత్వం ఎక్కువ మంది పోటీదార్లు రంగంలో లేకుండా అస్మదీయులకు కట్టబెట్టేందుకే ఈ పని చేసిందన్న విమర్శలున్నాయి.

3. ఎంపికలో అక్రమం: అనుభవం లేని వారికీ అప్పగింత
‘ఈపీసీ’ విధానం ప్రత్యేకత ఏమంటే- జలాశయాలు, డ్యాములు, పంప్‌ హౌస్‌ల నిర్మాణం, ఎత్తిపోతల కోసం పంపులు, మోటార్లు ఏర్పాటు, కాలువల తవ్వకం, పైపు లైన్లు వేయటం.. ఈ పనులే కాదు.. సర్వే, ఇన్వెస్టిగేషన్‌, డిజైన్‌ లాంటి పనులూ గుత్తేదారులే చెయ్యాలి. అందుకే ఈ పనులన్నింటిలో గుత్తేదారు సంస్థకు అనుభవం ఉండటం చాలా అవసరం. కానీ రాష్ట్రప్రభుత్వం ఈ నిబంధనకు నీళ్లొదిలి.. ఏదో ఒక పని సంతృప్తికరంగా పూర్తి చేసి ఉంటే చాలని కొత్త నిబంధన పట్టుకొచ్చింది. అనుభవం లేనివాళ్లు కూడా అర్హులైపోయారు. అలాగే మొదట్లో ఎంపిక చేసిన సంస్థలకు గరిష్ఠంగా 3 ప్యాకేజీలు మాత్రమే ఇస్తామని ప్రకటించారుగానీ.. ఆ తర్వాత దానికీ స్వస్తి పలికి కొందరికి పనిగట్టుకుని ఎక్కువ ప్రాజెక్టులు కట్టబెట్టారు.

4. పేరుకే విదేశీ సంస్థలు: చేసింది పెద్ద మోసం!
రికార్డుల్లో పోలవరం ఎడమ కాలువ తవ్వకం పనులు దక్కించుకుంది ఇరాన్‌కు చెందిన సబీర్‌డ్యాం వాటర్‌ వర్క్స్‌ కంపెనీ! ఈ సంస్థ ఇక్కడికొచ్చి ఎప్పుడైనా పని చేసిందా అంటే లేదు.. కనీసం టెండర్లలో పోటీపడి పని దక్కించుకొని ఉపగుత్తేదారుకు ఇచ్చి పని చేయించిందీ లేదు. ఈ విదేశీ సంస్థ పేరును కాగితాల్లో మాత్రమే వాడుకుంటూ.. ఈపీసీ పద్ధతిలో చేపట్టిన టెండర్‌ ప్రక్రియలో అంతర్జాతీయ స్థాయి గుత్తేదారులు పోటీపడ్డారని భ్రమలు కల్పిస్తూ.. పని ‘లాగించేశారు’. విదేశీ సంస్థల నిర్వాకాన్ని కాగ్‌ స్పష్టంగా తప్పుబట్టింది. విదేశీ సంస్థలు సమర్పించిన అనుభవ పత్రాలేవీ కూడా భారతదేశంలో చేసినవి కావు. ఆ విదేశీ సంస్థల పేరుతో పనులు పొందడం తప్ప పనులు చేయడంలో ఈ సంస్థల ప్రమేయం లేదు. పనుల అప్పగింతలో బహిరంగ పోటీయే మెరుగైన, పారదర్శక విధానమైనా ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరించింది. ప్రాణహిత-చేవేళ్లలో కొన్ని సంస్థలే పలుసార్లు తమ భాగస్వామ్య సంస్థలను మార్చుకొని ఎక్కువ పనులను పొందాయని కాగ్‌ గుర్తించింది. 2004లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి జలయజ్ఞం చేపట్టగానే అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్‌.కు సన్నిహితంగా ఉండే ఓ కాంగ్రెస్‌ ముఖ్య నాయకుడు ఇరాన్‌కు చెందిన సబీర్‌డ్యాం వర్క్స్‌ను అరువుకు తెచ్చుకొని ఆ కంపెనీ నుంచి పవర్‌ ఆఫ్‌ అటార్నీ తీసుకొని పనులు దక్కించుకొన్నాడు. పోనీ ఈయన అయినా చేశాడా అంటే అదీ లేదు. పర్సంటేజీలు తీసుకొని ఉప గుత్తేదారులకు ఇచ్చేశారు. ఈ కంపెనీ పోలవరం కాలువలే కాదు వెలిగొండ, సోమశిల-స్వర్ణముఖి, గాలేరు-నగరి, గోరకల్లు ఇలా అనేక ప్రాజెక్టులు తీసుకుంది. విశేషమేమంటే- ఒక్కో చోట ఒక్కో నాయకుడు దీన్ని అరువుకు తీసుకొన్నారు. ఇదే కాదు చైనా, రష్యాతోపాటు అనేక దేశాలకు చెందిన సిఆర్‌18జి, సినోహైడ్రో, యు.ఇ.ఎస్‌, జడ్వీఎస్‌, ఎబిబి-ఎఎజి ఇలా అనేక కంపెనీలు 40కి పైగా ప్యాకేజీల పనులు దక్కించుకొన్నాయి. ఇవేవీ ఇక్కడ పని చేసింది లేదు.

పోలవరం
పోలవరం ప్రాజెక్టు అప్పగించి ఏడేళ్లయినా మట్టి తవ్వకాలకే పనులు పరిమితమయ్యాయి. కేంద్ర జలసంఘం 2006లో పోలవరం డ్యాం డిజైన్‌ను మార్చింది. రాష్ట్ర ప్రభుత్వం 2009లో ఒప్పందాలను రద్దు చేసింది. ఫలితంగా రూ.1049 కోట్ల అదనపు భారం పడింది. స్టీలు వినియోగంలో మార్పు చేయడం వల్ల గుత్తేదారుకు రూ.45.53 కోట్ల మేర ప్రయోజనం కలిగింది. కాలువ పనుల్లో అవసరం లేనివి చేయడం వల్ల రూ.284.76 కోట్ల అదనపు భారం పడింది.
కల్వకుర్తి
కల్వకుర్తి ప్రాజెక్టులో ఎకరాకు రూ.15వేల చొప్పున లెక్కగట్టడంతో రూ.119 కోట్ల మేర అంచనాలు పెరిగాయి. చేసిన పనులు, పరిమాణాలతో సంబంధం లేకుండా చెల్లింపులు చేయడం వల్ల గుత్తేదార్లకు రూ.242 కోట్ల అనుచిత లబ్ది చేకూరింది. లిప్టు-2, లిప్టు-3 ప్యాకేజీలలోని సొరంగం పనులకు సంబంధించి గుత్తేదార్లకు వాస్తవంగా చెల్లించాల్సిన దానికంటే రూ.122.32 కోట్లు అధికంగా చెల్లించారు.
ఎల్లంపల్లి
ఎల్లంపల్లి రెండో స్టేజి మొదటి దశలో వివిధ చెరువుల కింద రెండు లక్షల ఎకరాల ఆయకట్టును అభివృద్ది చేయాలని నిర్ణయించారు. ఇందులో మూలవాగు కూడా ఒకటి. ఈ చెరువు కింద ఉన్న 13,500 ఎకరాల ఆయకట్టును తరవాత ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకంలోని ఒక ప్యాకేజి కింద చేర్చారు. ఒకే ఆయకట్టును రెండు ప్యాకేజీల కింద చేర్చారు. అంచనాలను తప్పుగా తయారు చేయడం, ప్రభుత్వ ప్రయోజనాలను కాపాడే నిబంధనలు ఈపీసీ ఒప్పందాల్లో లేకపోవడంతో గుత్తేదారుకు రూ.359 కోట్ల అనుచిత లబ్ధి కలిగింది.
వెలిగొండ
ఈ ప్రాజెక్టుకు నీటి లభ్యతను ఖరారు కూడా చేయలేదు. మొదటి సొరంగం ప్యాకేజీ అంతర్గత విలువను నిర్ణీత అంశాలను ఆధారం చేసుకొని నీటిపారుదల శాఖ రూ.693 కోట్లుగా లెక్కగట్టింది. అయితే పనులు జరుగుతున్నప్పుడు రూ.172.06 కోట్లు పెంచేశారు. సొరంగం తవ్వకపు పనిలో పురోగతి మందకొడిగా ఉంది. సొరంగానికి నీరందించే కాలువ కూడా నిర్దిష్ట గడువులోగా పూర్తి కాలేదు.

నీళ్ల సీసాలపై మీ పేర్లు!

‘మంచి వ్యాపారవేత్త కావాలంటే ఎంబీఏలే చదవాల్సిన అవసరంలేదు. సామాజిక చొరవ ఉంటే చాలు! చక్కటి ఆలోచనతో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా ఈ ఏడాదిన్నరలో రెండు...

వెండితెరపై కోట్ల ‘కాంతి’

సినిమా అనేది కచ్చితంగా వ్యాపారమే. ఏ కథానాయకుడికి ఎంత మార్కెట్‌ ఉంది? అనే లెక్కలు ఎప్పుడూ అవసరమే. పెట్టిన ప్రతీపైసాకీ గ్యారెంటీ ఉందన్న నమ్మకం కుదిరిన...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net