Sun, February 14, 2016

Type in English and Give Space to Convert to Telugu

'భారత్‌లో తయారీకి బ్రహ్మరథం''ఐపీఎస్‌లను పెంచండి''పాకిస్థాన్‌కు అధునాతన ఎఫ్‌-16 యుద్ధవిమానాలు''ఖేడ్‌లో 81.72 శాతం పోలింగ్‌''దిండి మొదటి దశ పనులకు త్వరలో టెండర్లు''మెదక్‌ నిమ్జ్‌లో చైనా పెట్టుబడులు..''చెలకల్లో.. అవినీతి మొలకలు!''మార్చి 10 నుంచి శాసనసభ సమావేశాలు''మళ్లీ తెరపైకి ఓటుకు నోటు కేసు''కళతో సామాజిక సందేశం'
పొన్నాలా చర్చకు రా!
ఆంధ్ర అక్రమ ప్రాజెక్టులకు అనుమతులిచ్చింది నువ్వే
టీపీసీసీ అధ్యక్షుడివయ్యాక నాపై విమర్శలు చేస్తావా: కేసీఆర్‌
ఈనాడు, హైదరాబాద్‌: టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య నీటిపారుదలశాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఆంధ్ర ప్రాంతంలోని అక్రమ ప్రాజెక్టులకు అనుమతులిచ్చారని, వాటి నిర్మాణాన్ని ప్రోత్సహించారని తెరాస అధ్యక్షుడు కేసీఆర్‌ ఆరోపించారు. పొన్నాల మంత్రిగా ఉన్నప్పుడే గాలేరు-నగిరి, హంద్రీనీవా, వెలుగోడు, వెలిగొండ, పోతిరెడ్డిపాడు వంటి అక్రమ ప్రాజెక్టులను నిర్మించారన్నారు. ఆంధ్రవారికి సహకరించిన ఆయన ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారుడిలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. చిత్తశుద్ధి ఉంటే పొన్నాల తనపై వ్యక్తిగత విమర్శలను మానుకోవాలని, దమ్ముంటే చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. తన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. కరీంనగర్‌ జిల్లా జగిత్యాలకు చెందిన వైద్యుడు సంజయ్‌ బుధవారం తెలంగాణభవన్‌లో కేసీఆర్‌ సమక్షంలో తెరాసలో చేరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి, స్థానిక నేతలు రాజేశంగౌడ్‌, జితేందర్‌రావు, ఓరుగంటి రమణారావు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయని, కాంగ్రెస్‌ నాయకులు ఎన్నడూ ఉద్యమాల్లో కనిపించలేదన్నారు. సకల జనుల సమ్మె జరిగితే దాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారని, పదవుల్లో కూర్చొని ఉయ్యాలలూగారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఉత్త పుణ్యానికి తెలంగాణ ఇవ్వలేదని.. రాష్ట్రం కోసం అనేక బలిదానాలు జరిగాయన్నారు. సుదీర్ఘ ఉద్యమం జరిగిందని.. ఎన్నో దీక్షలు, ధర్నాలు జరిగాయని, అన్నింటినీ చూశాక అనివార్య పరిస్థితుల్లోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి అంగీకరించారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయాలని చూసిందని, తెరాస ఉనికి లేకుండా చేసే కుట్రలకు పాల్పడిందని ఆరోపించారు. తానూ, తెరాస కార్యకర్తలూ మొండి పట్టుదలతో పార్టీని, తెలంగాణ ఉద్యమాన్ని రక్షించుకోగలిగామని చెప్పారు.

అప్పుడే ఉద్యమానికి సార్థకత: తెరాస అధికారంలోకి వస్తేనే ఉద్యమానికి సార్థకత చేకూరుతుందని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. తెరాసకు మాత్రమే తెలంగాణ ప్రజల బాగోగులపై శ్రద్ధ ఉంటుందన్నారు. తెలంగాణకు వనరులు, వసతులున్నాయని.. కష్టపడి పనిచేసే రత్నాల్లాంటి మానవ సంపద కూడా ఉందని తెలిపారు. వీటి సాయంతో తెలంగాణను దేశంలోనే నంబర్‌వన్‌ స్థానంలో నిలబెట్టొచ్చని వివరించారు. తలచుకుంటే అసాధ్యమన్నదేదీ లేదన్నారు. తాను 14 ఏళ్ల క్రితం ఉద్యమాన్ని ప్రారంభించినపుడు చాలామంది అనుమానంతో చూశారని, కానీ చివరకు రాష్ట్రాన్ని సాధించామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు ఇప్పుడు అప్రమత్తంగా ఉండాలని, తమ తలరాతను తామే మార్చుకునే తరుణం వచ్చిందన్నారు. ఇది తెలంగాణ ప్రభుత్వంతోనే సాధ్యమని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో పేదలకు ఏడాదికి లక్ష పక్కాగృహాలను నిర్మించి ఇస్తామని ప్రకటించారు. మొదటి రెండు సంవత్సరాలు విద్యుత్‌లోటు తప్పదని, మూడో సంవత్సరం నుంచి రైతులకు 24 గంటల విద్యుత్‌ ఇస్తామన్నారు. గిరిజనులకు, ముస్లింలకు 12 శాతం చొప్పున రిజర్వేషన్లు ఇస్తామని, తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు అమలు చేస్తామని తెలిపారు. పార్టీ ఎన్నికల ప్రణాళికను రూపొందిస్తున్నామని, త్వరలోనే దీన్ని గ్రామ గ్రామానికి తీసుకెళ్తామని చెప్పారు.

జగిత్యాలను జిల్లా చేస్తాం: కరీంనగర్‌ జిల్లాలోని 13 శాసనసభస్థానాల్లోనూ తెరాసనే గెలవాలని, జగిత్యాలలో గులాబీ జెండా ఎగరాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలను పునర్విభజిస్తామని, జగిత్యాలను జిల్లాగా మారుస్తామని ప్రకటించారు. డాక్టర్‌ సంజయ్‌ని జగిత్యాల నియోజకవర్గానికి తెరాస అభ్యర్థిగా ప్రకటిస్తున్నామని, ఆయనను భారీ ఆధిక్యంతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కరీంనగర్‌ జిల్లా తెలంగాణ ఆత్మగౌరవ బావుటాను ఆకాశానికి ఎత్తిందని, తాను కరీంనగర్‌ నుంచే ఉద్యమం ప్రారంభించానని గుర్తుచేశారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారాన్ని కూడా అక్కడ్నుంచే ప్రారంభిస్తానని వెల్లడించారు. తాము అధికారంలోకి వచ్చాక కరీంనగర్‌-హైదరాబాద్‌ రైలుమార్గాన్ని పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లోని సుల్తాన్‌బజార్‌, మొజంజాహీ మార్కెట్‌, శాసనసభ, అమరవీరుల స్తూపం మీదుగా మెట్రోరైలు వెళ్తొందని కేసీఆర్‌ పేర్కొన్నారు. ఇక్కడ తెలంగాణ చారిత్రక ప్రదేశాలు ఉన్నందున భూగర్భ రైలు మార్గాన్ని నిర్మించాలని తాను మెట్రోరైలు అధికారులను, ఎల్‌ అండ్‌ టీ సంస్థను కోరానని.. వాళ్లు కూడా అంగీకరించారని తెలిపారు.

వలచి...గెలిచి..

ప్రేమికుల రోజూ.. అదే సూర్యుడు. అవే ఇరుసంధ్యలు. అదే గాలి. అవే దిక్కులు. ఎప్పట్లాగే ఇరవై నాలుగ్గంటలు!! మరేమిటీ ప్రత్యేకం? ఏముంది? ప్రేమే!!...

ఫైనల్‌లో వారియర్స్‌

రెండోసారి సీసీఎల్‌ ట్రోఫీ గెలవాలన్న తెలుగు వారియర్స్‌ నెరవేరడానికి ఇంకా ఒక్క అడుగు దూరంలో ఉంది. శనివారం హైదరాబాద్‌లో ఉత్కంఠభరితంగా జరిగిన రెండో సెమీఫైనల్‌లో...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net