Tue, February 09, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ఔషధనగరిలో ప్రపంచశ్రేణి విశ్వవిద్యాలయం''భూసేకరణ, పునరావాసాలకేరూ. 8,000 కోట్లు''నెట్‌ సమానత్వానికే ట్రాయ్‌ మొగ్గు!''ముద్రగడ దీక్ష విరమణ''తెలంగాణ ప్రణాళిక భేష్‌''విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయాలా?''డాక్టర్‌.. ధనాధన్‌..''రసాయన పరిశ్రమలో పేలుడు''నడి వీధిలో పైశాచికం''పాక్‌ నుంచే కుట్ర'
నిర్మాణాలు సరే.. నిర్వహణ మాటో..!
సర్కారు బడుల్లో ఆగమేఘాలపై మరుగుదొడ్ల నిర్మాణం పనులు
సుప్రీం ఆదేశాలతో కదిలిన తెలంగాణ విద్యాశాఖ
ప్రైవేటు పాఠశాలలకూ నోటీసులు
డీఈవోలకు ఆదేశాలు
ఈనాడు - హైదరాబాద్‌
రుగుదొడ్లు, మంచినీటి వసతి లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ఇక ఒక్క పాఠశాల కూడా కన్పించదు. ఈ సదుపాయాలు లేని బడుల్లో మరో పదిరోజుల్లో వాటిని వెంటనే ఏర్పాటుచేయాలని అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులను ప్రభుత్వం ఆదేశించింది. సుప్రీంకోర్టు తాజా ఆదేశాల మేరకు ఈ పనులు చకచకా సాగుతున్నాయి. కోర్టు ఆదేశాల పుణ్యమా అని అన్ని స్కూళ్ళలోనూ సర్కారు రూ.కోట్లు ఖర్చుచేసి పై ఏర్పాట్లు చేస్తున్నా... సమస్య పరిష్కారమైపోవట్లేదు. ఎందుకంటే... ప్రభుత్వ పాఠశాలల్లో వీటి నిర్వహణే అసలు సవాలు! మరుగుదొడ్లను రోజూ ఎవరు శుభ్రం చేయాలి? నీటి సౌకర్యం లేని చోట ఎలా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎందుకంటే... వీటి నిర్వహణ కోసం స్కూళ్ళలో ఎలాంటి సిబ్బంది లేరు. ‘‘ఇప్పటికే ఈ సదుపాయాలున్న పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణ అధ్వానంగా ఉంది. ఒకరకంగా చెప్పాలంటే... అసలు లేదనే చెప్పాలి! ఎవరినో ఒకర్ని బతిమిలాడి... ఎంతో కొంత ఇచ్చి చేయించుకోవాల్సి వస్తోంది. మా జేబుల్లోంచి డబ్బులిచ్చి మరీ శుభ్రం చేయిస్తున్నాం! వీటి నిర్వహణకు శాశ్వత ఏర్పాట్లు చేయకుండా ఎన్ని కొత్త ఏర్పాట్లు చేస్తే మాత్రం ఏంటి లాభం?’’ అని రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట సమీపంలోని ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వ్యాఖ్యానించారు.

సర్వశిక్ష అభియాన్‌ పరిధిలో స్కూలుకు నిర్వహణ కింద రూ.ఏడువేలు మంజూరవుతుంటే... అందులో నెలకు రూ.500లతో మరుగుదొడ్ల శుభ్రత పనులు చేయించవచ్చు. కానీ అంతతక్కువ మొత్తానికి ఎవరూ ముందుకు రావట్లేదన్నది ఉపాధ్యాయుల ఆవేదన. ‘‘మా స్కూల్లో ప్రతి సోమవారం మాకు పెద్ద పని ఉంటుంది. ఆదివారం వచ్చిందంటే చాలు... ఎవరో వచ్చి పాఠశాల ఆవరణలో తాగి సీసాలన్నీ పారేసి పోతున్నారు. తరగతి గదుల్లో మలమూత్ర విసర్జన చేస్తున్నారు. సోమవారం పిల్లలు రాకముందే వాటన్నింటినీ శుభ్రం చేయాల్సి వస్తోంది. పాఠశాలలకు వాచ్‌మెన్‌ లేరు. విలువైన వస్తువులకూ దిక్కులేదు. మంచినీటి సౌకర్యం కూడా అలాంటిదే! నీటిని నిలువ ఉంచే సంపులుగానీ, ట్యాంకులనుగానీ శుభ్రపరిచేవారే ఉండరు. అసలు 90 శాతం స్కూళ్ళలో వూడ్చేందుకు స్వీపర్లు లేరు. అటెండర్లు లేరు. అన్నీ మేమే చేసుకోవాల్సి వస్తోంది. ప్రతి స్కూల్లోనూ ఇలాంటి నిజమైన సవాళ్ళు బోలెడన్ని ఉన్నాయి. వీటిని పరిష్కరించినప్పుడే సౌకర్యాల ఏర్పాటుకు సార్థకత’’ అని హైదరాబాద్‌ నడిబొడ్డున ఉన్న స్కూలు పధానోపాధ్యాయుడన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కనీస సదుపాయాలు కల్పిస్తున్న ప్రభుత్వం మరి వాటి నిర్వహణకు ఎలాంటి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తుందన్నది అసలైన సవాలు!

వేగం పెంచండి.. డీఈవోలకు ఆదేశం: శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన 13 జిల్లాల విద్యాశాఖాధికారుల సమావేశంలో మరుగుదొడ్లు, మంచినీటి పనుల వేగాన్ని సమీక్షించారు. ఇంకా అదనపు నిధులు అవసరమైన చోట్ల తక్షణమే ఆయా జిల్లాల కలెక్టర్ల నుంచి మంజూరు చేయించుకొని...సోమవారం పునఃసమీక్షకు హాజరవ్వాలని డీఈవోలను విద్యాశాఖ కార్యదర్శి వికాస్‌రాజ్‌ ఆదేశించారు.ఈ నెల మూడోవారంలో మళ్ళీ సుప్రీంకోర్టులో కార్యదర్శి స్వయంగా హాజరై పరిస్థితిని వివరించాల్సి ఉన్నందున పనుల్లో వేగం పెంచుతున్నారు. లేని చోట్ల కొత్తగా మరుగుదొడ్ల ఏర్పాటు; ఉన్నవాటిని మెరుగుపర్చటం; విద్యార్థుల సంఖ్య ఆధారంగా అదనపు ఏర్పాట్లు చేయటం... ఇవన్నీ చకచకా కానిస్తున్నారు. ప్రతి 40 మంది బాలికలు, ప్రతి 80 మంది బాలురకు ఒక టాయిలెట్‌ బ్లాక్‌ ఏర్పాటు చేయాలనేది కేంద్ర మానవవనరుల మంత్రిత్వ శాఖ నిబంధనగా చెబుతున్నారు. దీని ఆధారంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోనైతే నిర్మల్‌ భారత్‌ అభియాన్‌ కింద నిధులతోనూ, పట్టణ ప్రాంతాల్లోనైతే సర్వశిక్ష అభియాన్‌ నిధులతోనూ వీటిని నిర్మిస్తున్నారు. మంచినీటి సౌకర్యం విషయంలో కూడా స్థానిక లభ్యత దృష్ట్యా చర్యలు తీసుకుంటున్నారు. అవసరమైన చోట బోరు వేయించుకోవాలని సూచించారు. అదీ వీలుగాని చోట ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయించుకోవచ్చు. మొత్తానికి మంచినీరు లేని స్కూలుండకూడదనేది లక్ష్యం. ప్రైవేటు పాఠశాలలకు కూడా వీటికి సంబంధించి నోటీసులు జారీ చేస్తారు. నిర్ణీత గడువులోపు విద్యార్థుల నిష్పత్తిలో సౌకర్యాలు కల్పించకుంటే ఆయా పాఠశాలల గుర్తింపును రద్దు చేయాలని డీఈవోలకు ఆదేశాలు జారీచేశారు.

ప్రైవేటు పాఠశాలల వాహన డ్రైవర్లకు అవగాహన తరగతులు...: మాసాయిపేట దుర్ఘటన నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కొన్ని చర్యలు ప్రతిపాదించింది. మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లు ఉన్న ప్రాంతాల్లో అన్ని ప్రైవేటు స్కూళ్ల బస్సులు, వాహనాల డ్రైవర్లకు వాటి యాజమాన్యాలు అవగాహన తరగతులు నిర్వహించాలని నిర్దేశించింది.

పదుగురి కోసం ఆరుగురం!

కాలేజీ స్నేహితులకో వాట్స్‌యాప్‌ గ్రూప్‌ చిన్నప్పటి మిత్రులకో ఫేస్‌బుక్‌ గ్రూప్‌ బంధువులందరినీ కలిపేందుకు గూగుల్‌ ప్లస్‌.. ఇలా నేటి సామాజిక మాధ్యమాలని మస్తుగా వాడుకుంటోంది...

ఆటో నడిపిన సినీనటుడు అఖిల్‌

సినీనటుడు అఖిల్‌ మంగళవారం ఖమ్మం నగరంలో ఆటో నడిపి సందడి చేశాడు. స్థానిక నరసింహస్వామి దేవాలయ సమీపంలో కిడ్నీ వ్యాధితో.....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net