Wed, February 10, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ఈ హనుమంతుడు మృత్యుంజయుడు!''విద్యా విలీనం''ఆ నాటి హామీలను నెరవేర్చండి''తెరాస గూటికి కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే''కాల్పుల్లో అనూహ్య మలుపు''ఉగ్ర మూలం ఐఎస్‌ఐ''వెనక్కు పంపాం.. బహిష్కరణ కాదు''సుశీల్‌ కొయిరాలా కన్నుమూత''వెళ్లిరా నేస్తమా...''రాజ్యాంగం పవిత్రతను కాపాడాలి'
తెదేపా గెలుపు... బీసీల ఇజ్జత్‌కా సవాల్‌!
ఈనాడు హైదరాబాద్‌
సైకిల్‌కు ఓటేయకుంటే బీసీలమంతా అల్పజాతిగా చరిత్రహీనులమవుతాం!
డబ్బుకో, మందుకో, విందుకో లొంగిపోవద్దు
తెరాస, కాంగ్రెస్‌లకు ఓటేస్తే మిగిలేది అవమానాలే
రాజ్యాధికారం పొందే సువర్ణావకాశం వచ్చింది
మనల్ని మనం పాలించుకుంటేనే ఆత్మగౌరవం
సామాజిక తెలంగాణ... తెదేపాతోనే సాధ్యం
సీమాంధ్రలోనూ చంద్రబాబును గెలిపిస్తేనే అభివృద్ధి
తెలంగాణలో వైకాపా ఉనికే లేదు
తెరాస గెలిస్తే వచ్చేది దొరల, గడీల పాలన
కాంగ్రెస్‌ది అవినీతి, అసమర్థ పాలన
ఈనాడుతో ముఖాముఖిలో తెదేపా తెలంగాణ సీఎం అభ్యర్థి ఆర్‌.కృష్ణయ్య
‘‘మనిషి పోరాటం ఆకలి తీర్చుకోవడానికి మొదలైనా... అంతిమంగా ఆత్మగౌరవం నిలబెట్టుకునేందుకు ముందుకు సాగాలి. సీఎం పదవి బీసీలకు ఇస్తామని ప్రకటించి చంద్రబాబునాయుడు అద్భుతమైన అవకాశమిచ్చారు. ఈ పదవి దక్కితే బడుగుల అభివృద్ధితో పాటు ఆత్మవిశ్వాసం, ధైర్యం వస్తాయి. ఈ ఎన్నికల్లో ఇక్కడ తెదేపా అధికారంలోకి రాకపోతే... అవకాశం ఇచ్చినా ఉపయోగించుకోలేని అల్పజాతిగా అందరిలో అవమానాల పాలై చరిత్రహీనులమవుతాం! ఇప్పుడు తెదేపా గెలుపన్నది బీసీల ఇజ్జత్‌కా సవాల్‌గా తీసుకుని అంతిమ పోరాటం చేస్తున్నాం’’ అని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, తెదేపా తెలంగాణ ప్రచార కమిటీ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర సీఎం అభ్యర్థి ఆర్‌.కృష్ణయ్య స్పష్టం చేశారు. ఎల్‌బీ నగర్‌ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి తెదేపా అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నారు. నిర్విరామ ప్రచారంలో మునిగిన కృష్ణయ్య ఈనాడుకిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు అంశాలపై కుండబద్దలు కొట్టినట్లుగా మాట్లాడారు. ముఖాముఖి ముఖ్యాంశాలు...!
ఎల్బీనగర్‌లో అంగ, అర్ధ బలమున్న సిట్టింగ్‌ ఎమ్మెల్యేతో ఢీకొంటున్నారు కదా...గెలుపుపై నమ్మకం ఏర్పడిందా?
కచ్చితంగా గెలుస్తా! ఇక్కడున్న విద్యావంతులు, మేధావులు, స్వచ్ఛందంగా ముందుకొచ్చి తెదేపాకు ఓటేస్తామని చెపుతున్నారు. వారంతా ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి చెందాలని గట్టిగా కోరుతున్నారు. అది తెదేపాతోనే సాధ్యమని వారే అంటున్నారు. ఎంత డబ్బున్నవారైనా ప్రజలందరినీ, వారికి నాపైనా, తెదేపాపైనా ఉన్న అభిమానాన్ని కొనలేరు. ప్రజాబలం ముందు ఏ ధనం నిలవదు...గెలవదు.

బీసీల అభివృద్ధికి కృషి చేస్తామని అన్ని పార్టీలూ ఇప్పుడు చెబుతున్నాయి కదా... మరి తెదేపాకే ఓటేందుకు వేయాలి?
దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి బీసీలను అభివృద్ధి చేస్తామని అన్నీ పార్టీలు చెపుతూనే ఉన్నాయి. అదేమీ కొత్తగా చెప్పే విషయం కాదు... నినాదం అంతకన్నా కాదు. పూర్వకాలంలో ఆకలి తీర్చుకోవడానికి బడుగు, బలహీన వర్గాలు పోరాడాయి. ఇప్పుడు ఆకలి, అభివృద్ధి అనేవి సమస్యలు కావు. ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం, ధైర్యం అనేవి ఈ వర్గాలకు దక్కాలి. అవి రావాలంటే రాజ్యాధికారం దక్కాలి. బీసీ నేతకు రాజ్యాధికారం దక్కితేనే ఆత్మగౌరవం సాధ్యం. వందల మంది ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా బీసీలుగా ఉన్నా చేయలేనిది ఒక ప్రధానిగానో, సీఎంగానో బీసీ నేత ఉంటే చేయగలరు. పాలించే పూర్తి అధికారం ఉన్న సీఎం, ప్రధాని పదవులు బీసీలకు దక్కనంతకాలం ఏ అభివృద్ధి చేసినా బడుగులకు ఆత్మగౌరవం ఉండదు. సీఎం పదవి ఇస్తానని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అపూర్వ అవకాశం ఇచ్చారు. దీన్ని మంచి అవకాశంగా ఉపయోగించుకోవాలంటే ఇప్పుడంతా తెదేపాకు ఓటేసి గెలిపించాలి. అది జరక్కపోతే... ఇక బీసీలకు ఈ ఎన్నికల తరవాత ఏ పార్టీ కూడా విలువ ఇవ్వదు. బీసీలంతా అమ్ముడుపోయే అల్పజాతిగా అవమానాలకు గురవుతారు. అది జరగకూడదంటే తెదేపా గెలిచి తీరాల్సిందే.

బీసీలు ఎన్నో ఏళ్లుగా వివిధ పార్టీల్లో పనిచేస్తూ అక్కడే ఎదిగారు కదా! ఇప్పుడు బీసీ సీఎం పదవి ఇస్తామనగానే వారంతా తెదేపాకు ఓటేస్తారని ఎలా అనుకుంటున్నారు?
ఇది చాలా మంచి ప్రశ్న. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయింది. బీసీలు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఎదిగారన్నది అందరూ ఆలోచించుకోవాల్సిన తరుణమిది. తెదేపా వచ్చిన తరవాతే బీసీలకు కొంత గుర్తింపు వచ్చింది. ఇప్పుడు సీఎం పదవి ఇస్తానని చంద్రబాబు చెప్పగానే... నేను పలు కుల సంఘాలతో వెళ్లి మిగతా పార్టీలను కూడా దానిపై హామీ ఇవ్వమని అడిగాను. కానీ చంద్రబాబులా ఎవరూ స్పందించలేదు. రాష్ట్రంలో ఉన్న బీసీలందరికీ ఒక్కటే చెప్పదలుచుకున్నా! అభివృద్ధి కావాలని ఇంతకాలం బడుగులుగా మనం చేసిన పోరాటం అంతా ఒక ఎత్తు. రాజ్యాధికారం దక్కించుకోవడానికి ఇప్పుడు చేస్తున్న ఎన్నికల పోరాటం మరో ఎత్తు. రాజ్యాధికారంతో వచ్చే ఆత్మగౌరవం కోసం ఎవరూ కత్తులు, తుపాకులు పట్టుకుని పోరాడాల్సిన పనిలేదు. పోలింగునాడు వచ్చి సైకిల్‌ గుర్తుపై మీట నొక్కితే చాలు. ఎవరు ఏ పార్టీలో ఉన్నా సరే... రాష్ట్రాన్ని పాలించే సీఎం పదవిని ఇస్తామన్న తెదేపాకు ఈసారి ఓటేసి గెలిపించమని అందరినీ కోరుతున్నా. ఇప్పుడు ఇక బీసీలకు పార్టీలు ముఖ్యం కాదు. రాష్ట్ర పాలనాధికారం ప్రధానం. అది తెదేపా ఇస్తుంది. అందుకే ఇతర పార్టీల్లో ఉన్నవారు కూడా సైకిల్‌ గుర్తుకే ఓటేయాలని కోరుతున్నా.

తెలంగాణ కోసం ఉద్యమించిన వారికే ఓట్లేయాలి... తెరాసను గెలిపిస్తేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని కేసీఆర్‌ గట్టిగా చెబుతున్నారు. తెదేపా ప్రచార కమిటీ అధ్యక్షుడిగా దీనికి మీరెలా స్పందిస్తారు?
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనేది ముగిసిన అధ్యాయం. ఆ విషయం పాతబడిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఎందుకు కావాలని తెరాస చెప్పిందో ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. ‘‘మా ప్రాంతం మేం పాలించుకుంటాం...మా ఆత్మగౌరవం కోసం తెలంగాణ కావాలి’’ అనే నినాదంతో ప్రజలు ఉద్యమించారు. తెలంగాణలో 80 శాతం మంది ప్రజలు బడుగు, బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులే. మరి ఇప్పుడు రాష్ట్రం ఏర్పాటయ్యాక... ఉద్యమంలో చెప్పిన ప్రకారం వారికే రాజ్యాధికారం దక్కాలి కదా. అప్పుడే కదా వారికి ఆత్మగౌరవం. బడుగులకు రాజ్యాధికారం దక్కితేనే సామాజిక తెలంగాణ ఏర్పాటు సాధ్యమవుతుంది. అదే తెదేపా చెబుతోంది. అంతే తప్ప దొరల పాలన కోసం తెలంగాణ రావాలని ఎవరూ పోరాడలేదు. ఇప్పుడు తెరాసకు ఓటు వేసి గెలిపిస్తే... గొర్రెలకు తోడేళ్లను, పులులను కాపలా పెట్టినట్లు అవుతుంది. పేదలను పాలించే అధికారం దొరలకు ఇస్తే గడీల పాలన మళ్లీ వచ్చి ప్రజలు ఆగమవుతారు.

తెలంగాణ తెచ్చింది మేమే...ఇచ్చింది మేమే...మాకే ఓటేయండని కాంగ్రెస్‌ ప్రజలను కోరుతోంది. తెదేపా దీనికేం చెబుతుంది?
కాంగ్రెస్‌ది అవినీతి, అసమర్థ పాలన. తెలంగాణ ఇస్తామని 2004లో చెప్పి అప్పుడే ఎందుకు ఇవ్వలేదు. కాంగ్రెస్‌ గెలిస్తే బడుగులు ముఖ్యంగా బీసీ నేత సీఎం కాలేరు. మీకొక ఉదాహరణ చెప్పాలి. గతంలో కాంగ్రెస్‌ హయాంలో ఒకసారి జగన్నాథరావు, మరోసారి రాజారాంకి, 2004లో డి.శ్రీనివాస్‌కు సీఎం పదవి చేపట్టే అవకాశం ఉన్నా కాంగ్రెస్‌ ఇవ్వలేదు. ఆఖరికి రోశయ్యను సీఎం పదవి నుంచి తప్పించిన తరవాత డజను మంది సీనియర్‌ బీసీ నేతలు సీఎం పదవికి అర్హులుగా ఉన్నారు. కానీ చెక్క బొమ్మలాంటి కిరణ్‌కుమార్‌రెడ్డికి ఆ పదవి ఇచ్చి రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ భ్రష్టు పట్టించింది. తెలంగాణ ఇచ్చామని కల్లబొల్లి మాటలు చెప్పి మళ్లీ అగ్రకులాలకు అధికారం అప్పగించేందుకు ప్రజలను కాంగ్రెస్‌ మభ్యపెడుతోంది. ఆ పార్టీ మాయలో ప్రజలు ఈసారి పడరు.

మీరు తెలంగాణ రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారు...మరి రాష్ట్రమంతా ప్రచారానికి ఎందుకు వెళ్లడం లేదు?
మీరన్నది నిజమే...నేను వెళ్లాలి. కానీ ఎల్‌బీనగర్‌లో నేను తెదేపా, భాజపా శ్రేణులను కలుపుకొని పోవడానికి చాల సమయం పడుతోంది. మరికొన్ని నియోజక వర్గాలకు వెళ్లడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నా. గత 40 ఏళ్లుగా బీసీలు, పేదల కోసం పోరాడుతూ ప్రజల్లోనే ఉన్నా! ఇటు తెలంగాణ, అటు సీమాంధ్రలోనూ నాకు ఎంతో మంది అనుచరులున్నారు. వారందరినీ ఇప్పుడు నేను ప్రత్యక్షంగా కలవలేకపోయినా అందరూ తెదేపాకే మద్దతిస్తారు. తెలంగాణలోనే కాదు... పార్టీ పిలిస్తే సీమాంధ్రలోనూ ప్రచారానికి వెళతాను. అక్కడా చంద్రబాబుకే ఓటేసి ప్రజలు గెలిపించాలి. అప్పుడే సీమాంధ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది.

తెదేపాను ఆంధ్రోళ్ల పార్టీ... చంద్రబాబుకు ఓటేస్తే మునిగిపోతారని తెరాస నేత కేసీఆర్‌ విమర్శిస్తున్నారు కదా?
కేసీఆర్‌వి నైతిక విలువలు లేని చౌకబారు విమర్శలు. బీసీల వ్యతిరేక ధోరణితో దబాయించేలా కేసీఆర్‌ మాట్లాడుతున్నారు. తెదేపా ఆంధ్రోళ్ల పార్టీ అయితే కాంగ్రెస్‌ అధినేత సోనియాగాంధీ ఇటలీ నుంచి వచ్చారు. మరది ఇటలీ పార్టీనా? నిజానికి కాంగ్రెస్‌ను ఆంగ్లేయులు స్థాపించారు...అంటే కాంగ్రెస్‌ ఆంగ్లేయుల పార్టీ అనుకోవాలా? తెరాస దొరల పార్టీ! అగ్రకులాల అహంకారంతో బీసీలను తెరాస వ్యతిరేకిస్తోంది. చౌకబారు విమర్శలు, రాజకీయ కుట్రలతో రాజ్యాధికారాన్ని కాజేయాలని కేసీఆర్‌ చూస్తున్నారు. ప్రజల సెంటిమెంటుతో ఆడుకుంటూ అధికారం కోసం అడ్డదారులు తొక్కడం సరికాదు. ఏం...ఆంధ్రోళ్లు మనుషులు కాదా? పేదలపై కేసీఆర్‌కు ప్రేమ ఉంటే బీసీలకు సీఎం పదవి ఇస్తానని ఎందుకు చెప్పడం లేదు. తెదేపాకు కాదు... తెరాసకు ఓటేస్తేనే తెలంగాణ ప్రజలు మునిగిపోతారు.
వైకాపా కూడా తెలంగాణలో చాలాచోట్ల పోటీ చేస్తోంది. వారి నుంచి మీకు పోటీ ఉన్నట్టేనా?
ఆ పార్టీకి తెలంగాణలో అసలు ఉనికే లేదు. దాని గురించి ఎవరైనా మాట్లాడుకోవడం అనవసరం.

మీరు అణగారిన వర్గాల నేతగా ఎదిగారు. మరి ఈ రోజుల్లో ఎన్నికలంటే ఖరీదైన వ్యవహారం. డబ్బు ఖర్చు చేయకుండా గెలవగలమని నమ్మకముందా ?
డబ్బుతోనే గెలుస్తామనుకుంటే చాలా పొరపాటు. అదే నిజమైతే 1983లో ఎన్టీఆర్‌ ఎలా గెలిచారు? డబ్బుంటేనే చాలు అనుకుంటే...టాటాలు, బిర్లాలు, అంబానీలు...వారి ప్రతినిధులను నిలబెట్టి ఒక్కో నియోజకవర్గానికి రూ.50 కోట్లు ఇచ్చి గెలిపించుకుంటారు కదా! దేశంలో పార్టీలకు ప్రజాబలముంటేనే గెలుస్తాయి. డబ్బు ఖర్చు పెట్టినట్లు అక్కడక్కడా కొద్దిగా అలా కనిపిస్తుందంతే! అది శాశ్వతం కాదు. నేను పోటీ చేస్తున్నానగానే రాష్ట్రం నలుమూలల నుంచి ఎందరో ఫోన్లు చేసి ప్రచారం చేయడానికి వస్తామంటున్నారు. న్యాయవాదులు, విద్యార్థులు, ఉద్యోగులు స్వచ్ఛందంగా వచ్చి ప్రచారం చేస్తున్నారు. వారందరికీ నేనేమీ ఇవ్వడం లేదు. డబ్బుతోనే నేతలు ఎదుగుతారన్నది నిజమైతే... 40 ఏళ్లుగా పేదల పక్షాన పోరాడుతున్న నేను ఈ రోజు ఇంత ప్రజాభిమానం ఎలా సంపాదించుకుంటాను? తెదేపాకు, నాకు ప్రజల ఆదరణ ఉంది. అది చాలు!

మిమ్మలి సీఎం అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించారు. సీఎంగా ఎన్నికైతే రాష్ట్ర ప్రజలకు మీరేం చేస్తారు?
గత 40 ఏళ్లుగా పేదల కోసం పోరాడుతున్న నాకు తెలిసినంతగా వారి సమస్యలు మరెవరికీ తెలియవు. అవినీతి లేని పారదర్శక పాలన అందిస్తా. పాలనా వ్యవస్థను ప్రక్షాళన చేస్తా. ఐటీ, ఫార్మసీ పరిశ్రమలను పెద్దయెత్తున ఏర్పాటు చేయించి ఏటా 4 లక్షల ఉద్యోగాలు లభించేలా చూస్తా. ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న ప్రతి ఉద్యోగాన్ని భర్తీ చేస్తా. నిరుద్యోగులందరికీ ఉపాధి కల్పించడమే నా ప్రధాన ధ్యేయం. పార్టీ మేనిఫెస్టో ప్రకారం అన్నీ వర్గాల అభివృద్ధికి కృషి చేస్తా. ప్రతి పేద కుటుంబం సంతోషంగా ఉండేలా పాలన సాగించాలన్నదే నా ధ్యేయం. పార్టీలో అందరినీ కలుపుకొని తెలంగాణను బాగా అభివృద్ధి చేస్తా.

భాజపా మతతత్వ పార్టీ... దానితో పొత్తు పెట్టుకున్న తెదేపాకు ఓటేయవద్దని కాంగ్రెస్‌, తెరాసలు ప్రజలను కోరుతున్నాయి. దీన్నెలా తిప్పికొడతారు?
భాజపా మతతత్వ పార్టీ అనడం సరికాదు. అలా అంటే హిందువులందరినీ అవమానించడమే. భాజపా అభ్యుదయ భావాలున్న బాధ్యతాయుతమైన పార్టీ. దేశభక్తి, అంకిత భావమున్న భారతీయులను మతం అనేది విడదీయలేదు. గతంలో భాజపా వాజ్‌పేయి నేతృత్వంలో ఆరేళ్లు దేశాన్ని పాలించింది. అప్పుడు ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు రాలేదు కదా. ఇప్పుడు ముస్లింలు ఆలోచించాల్సిన అవసరముంది. దేశ, రాష్ట్ర అభివృద్ధిని కోరుకునే పార్టీలను గెలిపించాలి. కేంద్రంలో ఎన్డీఏ గెలవబోతోంది. ఆ కూటమిలో తెదేపా చేరితేనే ఇక్కడ రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవచ్చు. కేంద్రంతో సఖ్యత లేకుండా రాష్ట్ర అభివృద్ధి ఎలా సాధ్యమన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి.
పదేళ్లుగా రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశామని కాంగ్రెస్‌ అంటోంది. తెలంగాణ నిర్మాణం తమతోనే సాధ్యమని కాంగ్రెస్‌ నేతలంటున్నారు...!
గత పదేళ్లుగా కాంగ్రెస్‌ పార్టీ దేశాన్ని, రాష్ట్రాన్ని నాశనం చేసింది. ఆ పార్టీ పాలనలో అవినీతి, ధరలు విపరీతంగా పెరిగాయి. కంపెనీలకు వేలాది ఎకరాలు ధారాదత్తం చేసి జేబులు నింపుకొన్నారు. సెజ్‌ల పేరుతో అయినవారికి ఆస్తులు కట్టబెట్టారు. అవినీతి అడ్డగోలుగా పెరిగిపోయింది. అసమర్థ పాలన సాగించింది. మళ్లీ అవినీతి, అసమర్థ కాంగ్రెస్‌ పాలన వస్తే తెలంగాణ అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది? రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన చరిత్ర తెదేపాకు ఉంది. తెదేపాను గెలిపిస్తేనే తెలంగాణ నిర్మాణం సాధ్యం!

మమ్మల్నీ ఉద్యోగులే అనుకున్నారు!

బయోటెక్నాలజీ రంగాన్ని చాలా ఇష్టంగా ఎంచుకున్నారా ఇద్దరు..!కానీ ఆ చదువుకు తగ్గ ఉద్యోగాల్లేవు.. ఈ పరిస్థితుల్లో ఎవరయినా ఉన్నచోటే వేరే ఉద్యోగాలు చూసుకోవడమో...

ఉగ్రవాదులకు శ్రీకాంత్‌ ‘టెర్రర్‌’

హీరో శ్రీకాంత్‌ ఇంటెలిజెన్స్‌ పోలీస్‌ అధికారిగా ఉగ్రవాదంపై చేసే పోరాటమే ‘టెర్రర్‌’. ఓ పోలీస్‌ అధికారి నగరాన్ని ముట్టడించిన ఉగ్రవాదులను ఎలా ఎదుర్కొన్నాడు అనే అంశాన్ని దర్శకుడు ఎంతో...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net