Tue, February 09, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ఔషధనగరిలో ప్రపంచశ్రేణి విశ్వవిద్యాలయం''భూసేకరణ, పునరావాసాలకేరూ. 8,000 కోట్లు''నెట్‌ సమానత్వానికే ట్రాయ్‌ మొగ్గు!''ముద్రగడ దీక్ష విరమణ''తెలంగాణ ప్రణాళిక భేష్‌''విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయాలా?''డాక్టర్‌.. ధనాధన్‌..''రసాయన పరిశ్రమలో పేలుడు''నడి వీధిలో పైశాచికం''పాక్‌ నుంచే కుట్ర'
సంకెళ్లు సిద్ధం
కేవీపీ అరెస్టుకు కౌంట్‌డౌన్‌
సీఐడీకి చేరిన రెడ్‌కార్నర్‌ నోటీసు
రేపోమాపో వారెంటు.. అందగానే అరెస్టు
తదుపరి చర్యలు నిలువరించండి
హైకోర్టుకు కేవీపీ.. దక్కని ఉపశమనం
ఇప్పటికిప్పుడు విచారించలేమన్న న్యాయస్థానం
సాధారణ పిటిషన్‌ వేసుకోవాలని సూచన
ఈనాడు - హైదరాబాద్‌
హం బ్రహ్మస్మి అన్నట్లు.. అన్నీ తానై.. ప్రభుత్వాధినేతకు ఆత్మగా.. అక్రమాలకు అంతరాత్మగా చక్రం తిప్పిన కేవీపీకి కౌంట్‌డౌన్‌ మొదలైంది. అయన అరెస్టుకు ఢిల్లీలోని సీబీఐ విభాగం వారెంటు సిద్ధం చేస్తుండగా.. అది అందగానే అమలు పరిచేందుకు రాష్ట్ర సీఐడీ అధికారులు సన్నద్ధమయ్యారు. చట్టపరంగా ఎలాంటి ఉపశమనం లభించని పక్షంలో నాలుగైదు రోజుల్లోనే కేవీపీ అరెస్టయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తన అరెస్టు తప్పదని భావించిన కేవీపీ.. తదుపరి చర్యలను నిలిపివేతకు ఆదేశాలివ్వాలని హైకోర్టును ఆశ్రయించారు. అయితే అక్కడా ఆయనకు ఉపశమనం లభించలేదు. ఇప్పటికిప్పుడు విచారణ సాధ్యం కాదని తేల్చిన హైకోర్టు సాధారణ పిటిషన్‌ దాఖలు చేయాలని ఆయన తరపు న్యాయవాదికి సూచించింది. మరోవైపు కేవీపీపై జారీ అయిన రెడ్‌కార్నర్‌ నోటీసు సీఐడీకి అందినా అరెస్టు వారెంటు మాత్రం రాలేదు. దాని గురించి సీఐడీ అధికారులు సీబీఐతో సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే నేరగాళ్ల అప్పగింత ఒప్పందంలో భాగంగా ఆయనను అమెరికా పంపించడానికి మాత్రం మరికొంత సమయం పట్టవచ్చు.

ఐదేళ్ళ కాలంలో రాష్ట్రంలోని సహజవనరులను అడ్డగోలుగా దోచిపెట్టిన మాజీ ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డికి ఆత్మగా పిలుచుకునే కేవీపీ రామచంద్రరావుపై టైటానియం ప్రాజెక్టు కుంభకోణానికి సంబంధించి అమెరికా న్యాయస్థానంలో ఛార్జిషీట్‌ దాఖలైన సంగతి తెలిసిందే. దాంతో కేవీపీనీ అమెరికా రప్పించేందుకు ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్విస్టిగేషన్‌ (ఎఫ్‌బీఐ) ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా ఈ కుంభకోణంలో నిందితులైన ఆరుగురిపై ఇంటర్‌పోల్‌ ద్వారా రెడ్‌కార్నర్‌ నోటీసు జారీ చేయించారు. కేవీపీపై జారీ అయిన నోటీసును గత మంగళవారం ఢిల్లీలోని ఇంటర్‌పోల్‌ వ్యవహారాలు చూసే సీబీఐ విభాగం రాష్ట్ర సీఐడీ అధికారులకు పంపింది. రెడ్‌కార్నర్‌ నోటీసు శుక్రవారం తమకు అందిందని రాష్ట్ర సీఐడీ అదనపు డీజీ కృష్ణప్రసాద్‌ తెలిపారు. అయితే అరెస్టు వారెంటు మాత్రం రాలేదని, దీనికి సంబంధించిన వివరాలు కోరుతూ తాము సీబీఐకి ఫ్యాక్స్‌లో లేఖ పంపామన్నారు. సీబీఐ నుంచి వారెంటు అందిన తర్వాత మిగతా ప్రక్రియ పూర్తిచేస్తామని ఆయన స్పష్టం చేశారు.

కేవీపీ అభ్యర్థన.. తోసిపుచ్చిన న్యాయస్థానం
టైటానియం కుంభకోణం వ్యవహారంలో రెడ్‌కార్నర్‌ నోటీసు, ప్రొవిజనల్‌ అరెస్టు వారెంటుపై తదుపరి చర్యలు నిలువరించేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థిస్తూ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు శుక్రవారం లంచ్‌మోషన్‌లో (అత్యవసరంగా) వాదనలు వినిపించడానికి అవకాశం ఇవ్వాలని చేసిన అభ్యర్థనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఈ వ్యవహారంలో అంతర్జాతీయ పోలీసు సంస్థ ఇంటర్‌పోల్‌ జారీ చేసిన రెడ్‌కార్నర్‌ నోటీసు, ప్రొవిజనల్‌ అరెస్టు వారెంట్లపై తమ పరిధి ఏమేరకు ఉందన్న అంశాన్ని పరిశీలించాల్సి ఉందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నూతి రామమోహన్‌రావు వ్యాఖ్యానించారు. ఇప్పటికిప్పుడు విచారణ చేపట్టడం సాధ్యం కాదని.. సాధారణ పద్ధతిలో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసుకోవాలని కేవీపీ తరపు సీనియర్‌ న్యాయవాది ఎస్‌.సత్యనారాయణప్రసాద్‌కు న్యాయమూర్తి సూచించారు. దీంతో సాధారణ పద్ధతిలోనే కేవీపీ తరపు న్యాయవాది శుక్రవారం సాయంత్రం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వచ్చే సోమవారం ఈ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. టైటానియం కుంభకోణంలో తనకు ఏ విధమైన సంబంధం లేదని, అమెరికా చట్టాలను తాను ఉల్లంఘించలేదని కేవీపీ తన పిటిషన్‌లో వెల్లడించారు. మరోవైపు అక్కడి చట్టాలు భారతదేశంలో అమలుకు అర్హమైనవి కాదన్నారు. ఒకవేళ ఏమైనా ఉల్లంఘనలు జరిగితే నేర శిక్షాస్మృతి ప్రకారం భారతదేశంలోనే విచారణ జరపాలి కానీ విదేశాల్లో కాదన్నారు. ఇంటర్‌పోల్‌ జారీ చేసిన నోటీసు ఆధారంగా పోలీసులు తనను అదుపులోకి తీసుకుంటే అది తన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనన్నారు. కాబట్టి రెడ్‌కార్నర్‌ నోటీసు ఆధారంగా సీఐడీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్లో కేవీపీ అభ్యర్థించారు.

మరోవైపు ఇది అంతర్జాతీయ నేరం కాబట్టి... ఈ కేసులో కేవీపీని అరెస్టు చేయాలంటే పలు విధి విధానాలను పాటించాల్సి ఉంది. ఇందులో కొన్నింటి అమలు ఇప్పటికే మొదలయింది.

రెడ్‌కార్నర్‌ నోటీసు
నిందితుడు పారిపోవడానికి అవకాశం ఉందని భావించినప్పుడు రెడ్‌కార్నర్‌ నోటీసు జారీ చేస్తారు. ఇంటర్‌పోల్‌లోని 190 దేశాలకు ఇది వెళుతుంది. దీనివల్ల నిందితులు ఏ దేశంలో ఉన్నా సరిహద్దులు దాటిపోకుండా చూడటానికి వీలవుతుంది. ఏ దేశంలో ఉన్నప్పటికీ మరో దేశం వెళ్లాలని ప్రయత్నిస్తే విమానాశ్రయంలో పట్టుకొని అరెస్టు చేస్తారు.

ప్రొవిజనల్‌ అరెస్టు వారెంటు: కేవీపీ మన రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆయనపై జారీ అయిన రెడ్‌కార్నర్‌ నోటీసును సీఐడీకి కూడా పంపారు. కేవీపీÏని అరెస్టు చేయాలంటే ప్రొవిజినల్‌ అరెస్టు వారెంటు కావాలి. విదేశాల్లో ఉన్న నేరగాళ్లు.. తప్పించుకునే అవకాశం ఇవ్వకుండా తక్షణమే వారిని స్థానిక దర్యాప్తు సంస్థలు తమ అదుపులో ఉంచుకునేలా చేసేదే ప్రొవిజినల్‌ అరెస్టు వారెంటు.

ఏం చేస్తారంటే...
నేరగాళ్ల అప్పగింత ఒప్పందంలో ఉన్న ఈ ప్రత్యేక నిబంధన ప్రకారం కేవీపీని తమకు అప్పగించాలని అమెరికా కోరుతోంది. దీని ప్రకారం ఢిల్లీలోని సీబీఐలో ఉన్న ఇంటర్‌పోల్‌ విభాగం అధికారులు నేరగాళ్ల అప్పగింత ఒప్పందం వ్యవహారాలు చూసే పాటియాలాహౌస్‌లో పిటిషన్‌ దాఖలు చేస్తారు. కేవీపీపై వచ్చిన అభియోగాలు, అరెస్టుకు దారి తీసిన పరిస్థితులను ఇందులో వివరిస్తారు. ఈ న్యాయస్థానం జారీ చేసిన అరెస్టు వారెంటును దాన్ని అమలు చేయాల్సిన రాష్ట్రంలోని సీఐడీ అధికారులకు పంపుతారు. ఈ వారెంటు ఆధారంగా సీఐడీ అధికారులు కేవీపీని అరెస్టు చేసి ముందు నాంపల్లిలోని సీఐడీ న్యాయస్థానంలో ప్రవేశపెడతారు. ఆ తర్వాత ప్రిజనర్స్‌ ట్రాన్సిట్‌ వారెంటుపై పాటియాలాహౌస్‌ కోర్టుకు తరలిస్తారు. ఆ న్యాయస్థానం నిందితుడికి రిమాండు విధిస్తుంది. నిందితుడు తమ అదుపులో ఉన్న విషయాన్ని సీబీఐ కేంద్ర ప్రభుత్వం ద్వారా అమెరికాకు వెల్లడిస్తుంది. అప్పుడు నిందితుడిని తమకు ఎందుకు అప్పగించాలని కోరుతున్నామో చెబుతూ దానికి సంబంధించిన అభియోగాలను, ఆధారాలను ఎఫ్‌బీఐ మన కేంద్ర ప్రభుత్వానికి పంపుతుంది. దీనిపై పాటియాలాహౌస్‌ న్యాయస్థానంలో వాదనలు జరుగుతాయి. నిందితుణ్ణి అప్పగించాలా.. వద్దా అనే విషయంపై ఆ న్యాయస్థానమే నిర్ణయం తీసుకుంటుంది. ఒకవేళ కేవీపీని అమెరికాకు అప్పగించాలని ఆ న్యాయస్థానం ఆదేశిస్తే ఆయనను ఎఫ్‌బీఐకి అప్పగిస్తారు. వారు ఆయనను అమెరికా తీసుకెళ్లి ఛార్జిషీట్‌ దాఖలు చేసి నార్త్‌ఇల్లినాయిస్‌ న్యాయస్థానంలో ప్రవేశపెడతారు. అయితే ఈ లోపు అరెస్టును అడ్డుకునేందుకు కేవీపీకి హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు వెళ్లొచ్చు. ముందస్తు బెయిల్‌ పొందడానికి లేదా అరెస్టయిన తర్వాత బెయిల్‌ పొందడానికి కూడా చట్టపరమైన వెసులుబాటు ఉంది. అలానే మామూలు నేరాల్లో మాదిరిగానే తాను నిర్దోషినని వాదన వినిపించుకునే అవకాశం కూడా కేవీపీకి ఉంది. అరెస్టు ప్రక్రియ వెంటనే ముగిసినా అమెరికాకు అప్పగించే ప్రక్రియ మాత్రం కాస్త నెమ్మదిగా జరుగుతుంది. నేరస్తుణ్ని అప్పగించే అంశంలో తమ పాత్ర ఏమీ ఉండదని, కేవలం వారెంటు ప్రకారం అరెస్టు చేసే అధికారమే తమకు ఉందని పోలీసు ఉన్నతాధికారి ఒకరు ‘ఈనాడు’కు తెలిపారు. అయితే వారెంటు అందిన వెంటనే దాన్ని అమలు చేస్తామని, సాధారణంగా ఇలాంటి విషయాల్లో ఆలస్యం ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఈ లెక్కన రోజుల వ్యవధిలోనే కేవీపీ అరెస్టయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

పదుగురి కోసం ఆరుగురం!

కాలేజీ స్నేహితులకో వాట్స్‌యాప్‌ గ్రూప్‌ చిన్నప్పటి మిత్రులకో ఫేస్‌బుక్‌ గ్రూప్‌ బంధువులందరినీ కలిపేందుకు గూగుల్‌ ప్లస్‌.. ఇలా నేటి సామాజిక మాధ్యమాలని మస్తుగా వాడుకుంటోంది...

పచ్చబొట్టేసి...జోలీకి నచ్చేసి!

ఏంజెలీనా జోలీకి రెండంటే మహా ఇష్టం. ఒకటి పిల్లలు, రెండు టాటూలు. ముగ్గురు కన్నబిడ్డలతో పాటు మరో ముగ్గురు అనాథలను దత్తత తీసుకుని పెంచుకుంటోంది జోలీ...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net