Sun, February 07, 2016

Type in English and Give Space to Convert to Telugu

'గులాబీ.. సునామీ''మాట నిలబెట్టుకుంటాం''నౌకా సంరంభం నేడే''కక్షతోనే పార్లమెంటులో రగడ!''వ్యూహాత్మక విజయం''ఆఖర్లో వచ్చారు.. అదరగొట్టారు!''సమర సేనాని''పర్యాటకులకు మణిహారం''ముద్రగడ ఆమరణ దీక్ష''హైదరాబాద్‌లో మరో రెండు పెద్దాసుపత్రులు'
సెజ్‌ పేరుతో జరిగింది దోపిడీనే!
కృష్ణపట్నం ఇన్‌ఫ్రా అంతా అడ్డగోలే
తేల్చిచెప్పిన నరసింహమూర్తి అండ్‌ కో
‘ఈనాడు’ వద్ద నివేదిక ప్రతి 
వైఎస్‌ దోపిడీ పాలనకు ఇదో నిదర్శనం
ఎన్‌. విశ్వప్రసాద్‌
ఈనాడు - హైదరాబాద్‌
నరులను, భూములను అందినకాడికి దోచుకోవటం, అయినవాళ్లకు అడ్డగోలుగా దోచిపెట్టటమే ధ్యేయంగా సాగిపోయిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలనా వికృతాలు ఒక్కటొక్కటిగా నిర్ధారణ అవుతున్నాయి. లెక్కాపత్రం లేకుండా.. ఒక జీవో గానీ, ఎంఓయూ గానీ లేకుండా వైఎస్‌ అడ్డగోలుగా అస్మదీయుల ‘కృష్ణపట్నం ఇన్‌ఫ్రాటెక్‌’ కంపెనీకి భారీగా 4,731 ఎకరాల భూమిని సంతర్పణ చేసెయ్యటం అతిపెద్ద గోల్‌మాల్‌ వ్యవహారమని ఇప్పుడు స్పష్టంగా బట్టబయలైంది. నాటి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో.. అనుంగుల మీటింగులో.. నోటి మాటగా జరిగిపోయిన ఈ పంపకాల వ్యవహారాన్ని గత ఏడాది జూన్‌లో ‘ఈనాడు’ బయటపెట్టినప్పుడు.. ‘సాక్షి’ పత్రిక తేలు కుట్టిన దొంగలా బుకాయింపుల పర్వానికి దిగింది. తగుదునమ్మా అంటూ అబద్ధాలు వండి వార్చింది. అవన్నీ వట్టి బుకాయింపులేనని, అంతిమంగా అదో దోపిడీ వ్యవహారంలానే మిగిలిపోతోందని తాజాగా ‘ఏపీఐఐసీ’ నియమించిన ఆడిట్‌ కంపెనీ కూడా నిర్ధారణకు రావటం విశేషం.
కృష్ణపట్నం ఇన్‌ఫ్రాటెక్‌ వ్యవహారాలపై ముసురుకున్న వివాదాల నేపథ్యంలో ప్రభుత్వ సూచన మేరకు ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) ప్రముఖ కాస్ట్‌ అక్కౌంటెంట్స్‌ కంపెనీ అయిన ‘నరసింహమూర్తి అండ్‌ కో’తో పనితీరు తనిఖీ (పెర్‌ఫార్మెన్స్‌ ఆడిట్‌) చేయించింది. తనిఖీలో భాగంగా ఈ సంస్థ రికార్డులన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించింది. క్షేత్రస్థాయిలో భూములకు కూడా వెళ్లింది. తనిఖీ పూర్తయ్యాక ఒక సమగ్ర నివేదికను రూపొందించి ఇటీవలే ప్రభుత్వానికి సమర్పించింది. ఆ నివేదిక ప్రతిని ‘ఈనాడు’ సంపాదించింది. 
కృష్ణపట్నం ఇన్‌ఫ్రాటెక్‌, దాని గ్రూపు కంపెనీలు ప్రభుత్వాన్ని తేరగా తీసుకున్న భూములను వివిధ బ్యాంకుల్లో తాకట్లు పెట్టి రూ.1000 కోట్లకు పైగా రుణాలు రాబట్టుకుని, ఆ నిధులను ఇతర వ్యాపారాలకు వినియోగించుకోవటం తప్పించి ఇప్పటి వరకూ అక్కడ సెజ్‌ పనులేవీ మొదలు పెట్టలేదని నరసింహమూర్తి అండ్‌ కో తన నివేదికలో విస్పష్టంగా పేర్కొంది. తద్వారా భూముల విక్రయ ఒప్పందాల్లో ఏపీఐఐసీ పేర్కొన్న నియమ నిబంధనలకు భంగం వాటిల్లిందని వివరించింది. అసలా కంపెనీకి భూముల కేటాయింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అవగాహన ఒప్పందాన్నీ కుదుర్చుకోలేదని పరిశ్రమల శాఖ కార్యదర్శి ఏపీఐఐసీకి తెలిపారని నివేదికలో పేర్కొంది.

ఈ నివేదిక నేపథ్యంలో కృష్ణపట్నం ఇన్‌ఫ్రాటెక్‌కు కేటాయించిన భూములను రద్దుచేసి వెనక్కి తీసుకునేందుకు అనుమతి కోరుతూ ఏపీఐఐసీ ఇటీవలే ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా విజ్ఞాపన కూడా పంపింది. దాంతో పాటు నరసింహమూర్తి అండ్‌ కో నివేదికనూ ఏపీఐఐసీ తమకు పంపిందని ప్రభుత్వ ఉన్నత స్థాయి వర్గాలు ధ్రువీకరించాయి. అయితే ప్రస్తుతం పరిశ్రమల శాఖకు మంత్రికానీ, ముఖ్యమంత్రికానీ లేనందున వెంటనే నిర్ణయం సాధ్యం కావటం లేదని ఆ వర్గాలు తెలిపాయి. కొత్త ప్రభుత్వం రాగానే దీనిపై నిర్ణయం తీసుకుంటుందని వివరించారు.

జీవో లేదు.. ఎంఓయూ లేదు
కృష్ణపట్నం ఇన్‌ఫ్రాటెక్‌కు భూముల కేటాయింపు వ్యవహారం పరిపాలనా చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయంగా చెప్పవచ్చు. ఈ వ్యవహారంలో అత్యంత దారుణంగా నిబంధనలన్నింటినీ ఉల్లంఘించారు. ఒక జీవో కానీ ఎంఓయూ కానీ లేకుండా వైఎస్‌ రాజశేఖరరెడ్డి తన క్యాంపు కార్యాలయంలో జరిగిన ఒక సమావేశంలో అధికారులకు ఇచ్చిన ఆదేశం ఆధారంగా ఈ కేటాయింపులు జరిగిపోయాయి. 2008 ఫిబ్రవరి 22న జరిగిన ఈ సమావేశంలో అప్పటి సలహాదారు కె.వి.పి.రామచంద్రరావు కూడా పాల్గొనడం విశేషం. నెల్లూరు జిల్లాలో బకింగ్‌హామ్‌ కాలువకు ఇరువైపులా పారిశ్రామిక పార్కు, సెజ్‌ల కోసం కలెక్టర్‌ గుర్తించిన 6284 ఎకరాలను మూడు నెలల్లో ఏపీఐఐసీకి బదలాయించాలని, ఏపీఐఐసీ వాటిని కృష్ణపట్నం కంపెనీకి కేటాయించాలని ఆ సమావేశపు మినిట్స్‌లో పేర్కొన్నారు.

నిజానికి ముఖ్యమంత్రి నిర్వహించే సమీక్షా సమావేశాల అనంతరం మినిట్స్‌లో నమోదైన అంశాలను కేవలం ప్రభుత్వ ఉద్దేశాలుగా మాత్రమే పరిగణిస్తారు. వాటిని అమలు చేసేందుకు సంబంధిత శాఖల్లో జరిగాల్సిన అధికారిక ప్రక్రియను నిర్వహించాల్సిందే. ఇందుకు ఎలాంటి మినహాయింపులూ ఉండవు. ప్రభుత్వం తాను సేకరించిన భూములను ప్రయివేటు సంస్థలకు కేటాయించేందుకు వీలుగా ఏపీఐఐసీకి బదలాయిస్తూ రెవెన్యూ శాఖ ద్వారా జీవోలు జారీ చేస్తుంది. అలాంటి జీవో అనేది లేకుండానే కృష్ణపట్నం కంపెనీకి వైస్‌ సర్కారు భూములు అప్పగించేసింది. ఒక జీవో అనేది లేకుండా ఇలా భూములు ఇవ్వడం చట్టపరంగా తీవ్ర ఉల్లంఘన అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 29.05.2009న ప్రభుత్వం 4409.72 ఎకరాల భూముల అడ్వాన్సు పొసెషన్‌ కూడా ఆ కంపెనీకి దఖలు పరచి కీలక ప్రక్రియను పూర్తి చేసింది. తదుపరి 2009 అక్టోబరు 1న 2682.77 ఎకరాల భూములకు రిజిస్ట్రేషన్లు చేశారు. మిగిలిన 2048.38 ఎకరాలకు 2010 సెప్టెంబరు 15న రిజిస్ట్రేషన్లు పూర్తి చేశారు. 

ఇక పరిశ్రమల స్థాపనకు భారీఎత్తున భూములు కేటాయించేటప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కంపెనీతో ఎంవోయూ (అవగాహన ఒప్పందం )కుదుర్చుకుంటుంది . తీసుకున్న భూములను ఏ విధంగా ఎప్పటిలోపు అభివృద్ధి చేయాలి, ఎంత మందికి ఎప్పటిలోపు ఉపాధి కల్పించాలి తదితర విషయాలపై అందులో లక్ష్యాలను పేర్కొంటారు. అలాంటి ఎంఓయూ అనేది లేకుండానే వైఎస్‌ సర్కారు కృష్ణపట్నం కంపెనీకి భూసంతర్పణ కావించింది.

నరసింహమూర్తి అండ్‌ కో నివేదికలోని కీలక అంశాలు
* ప్రభుత్వం నుంచి భూములను తీసుకున్నా బహుళ ఉత్పత్తుల సెజ్‌ అభివృద్ధి పనులను కృష్ణపట్నం ఇన్‌ఫ్రాటెక్‌ కంపెనీ ఇంత వరకూ ప్రారంభించనే లేదు. 

* ఈ కంపెనీని నమోదు చేసినప్పుడు (08-01-2008న) సి.శ్రీధర్‌, సి.శశిధర్‌ చెరో ఐదేసి వేల వాటాలను కలిగి ఉన్నారు. ఒక్కో వాటా విలువ రూ. 10. నాడు ఒక్కొరికి 50 శాతం వంతున వాటాలున్నాయి. 16-09-2013 నాటికి వాటాల సంఖ్య 82960000కు చేరింది. ఇందులో కృష్ణపట్నం పోర్టు కంపెనీకి 44.54 శాతం వాటాలు, నవయుగ ఇంజినీరింగ్‌ కంపెనీకి 12.65 శాతం, నవయుగ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌కు 42.78 శాతం వాటాలు ఉన్నాయి. శ్రీధర్‌, శశిధర్‌లు అయిదేసి వేల షేర్లతో ఒక్కొకరు 0.006 వాటా కలిగి ఉన్నారు.

* నవయగ ఇంజినీరింగ్‌ కంపెనీ, కృష్ణపట్నం పోర్టు కంపెనీ ప్రమోటర్‌ (సి.విశ్వేశ్వరరావు) కుమారులే శ్రీధర్‌, శశిధర్‌. వీరిద్దరికీ ఆ కంపెనీలతో సంబంధాలున్నాయి. దీన్నిబట్టి కృష్ణపట్నం ఇన్‌ఫ్రాపై తొలిరోజు నుంచీ నవయుగ గ్రూపు నియంత్రణ ఉందనేది సుస్పష్టం. 

* భూమికోసం కంపెనీ మొత్తం రూ. 149.05 కోట్లు ( అడ్వాన్సులతో కలిపి) ఖర్చుపెట్టింది. మూలధనం నుంచీ, షేర్ల జారీకి ముందస్తుగా తీసుకున్న అడ్వాన్సు నుంచి ఈ డబ్బును ఖర్చుపెట్టింది.

* ఏపీఐఐసీ ఇచ్చిన భూములను కుదువ పెట్టి సెజ్‌ అభివృద్ధి కోసం అంటూ కృష్ణపట్నం ఇన్‌ఫ్రాటెక్‌ రూ.200 కోట్లను బ్యాంకు నుంచి రుణంగా తీసుకుంది. అలాగే దాని గ్రూపు కంపెనీలు మరో 850 కోట్లను ఈ భూములను బ్యాంకులకు కుదువపెట్టడం ద్వారా రుణాలను పొందాయి. అంటే ఇలా పొందిన రుణాలు మొత్తం రూ.1050 కోట్లు అన్న మాట. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

* గ్రూపు కంపెనీలు తాము కృష్ణపట్నం ఇన్‌ఫ్రాలో పెట్టిన పెట్టుబడితో పోలిస్తే అనేక రెట్లు రుణాలను పొందాయి. కానీ వాటిని సెజ్‌ అభివృద్ధి కోసం కాక, సొంత అవసరాల కోసం ఉపయోగించుకున్నాయి. 

* సెజ్‌కు సంబంధించిన పనులపై గ్రూపు కంపెనీలకే ఈపీసీ కాంట్రాక్టు ఇచ్చినట్లు చూపి దాని కింద, అడ్వాన్సుల రూపేణా కృష్ణపట్నం ఇన్‌ఫ్రా నుంచి 227 కోట్లను గ్రూపు కంపెనీల్లోకి వెనక్కి తీసేసుకున్నారు. భూముల్లో చూస్తే సెజ్‌ పనుల పురోగతి లేదు. 

* సెజ్‌ అనుమతుల కోసం మొత్తం 4731 ఎకరాల భూమిని తమకు పూర్తి హక్కులు ఉండేలా విక్రయం ద్వారా ఇవ్వాలని కంపెనీ అడిగి తీసుకుంది. కానీ ప్రతిపాదిత సెజ్‌ విస్తీర్ణం మాత్రం 2528 ఎకరాలు మాత్రమే.

అంతా జగన్మాయ
కృష్ణపట్నం కంపెనీకి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సకల నిబంధనలనూ పాతిపెట్టి మరీ భూములు ఇవ్వడానికి కారణం... ఇదంతా జగన్మాయ కావడమే. సిక్కింలో 330 మెగావాట్ల విద్యుత్తు కర్మాగారం నిర్మించేందుకు అనుమతి ఉన్న హిముర్జా ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ జగన్‌ పరం అయ్యే ప్రక్రియలో కృష్ణపట్నం ఇన్‌ఫ్రాటెక్‌ డైరెక్టర్లు అయిన శ్రీధర్‌, శశిధర్‌ కీలక పాత్ర పోషించారు. 28-11-2005న నమోదు అయిన ఈ కంపెనీలో ప్రారంభంలో వారిద్దరూ డైరెక్టర్లుగా వ్యవహరించారు. 12-05-2008న జగన్‌కు చెందిన సజ్జల దివాకరరెడ్డి, గంగిరెడ్డి అందులో డైరెక్టర్లు అయ్యారు. కొంతకాలానికే జగన్‌ మనుషులే అయిన హరీష్‌ సి.కామర్తి, జె.జె.రెడ్డి డైరెక్టర్లుగా చేరడం, శ్రీధర్‌, శశిధర్‌ తప్పుకోవడం జరిగాయి. 2009 అక్టోబరులో జగన్‌ సతీమణి భారతి కంపెనీ యజమాని అయ్యారు. హిముర్జా ఇన్‌ఫ్రాకు మాతృసంస్థ అయిన హిముర్జా ప్రైవేట్‌ లిమిటెడ్‌లో కృష్ణపట్నం గ్రూపు కంపెనీ రూ. 10 కోట్లు పెట్టుబడిగా పెట్టింది.
అడ్డగోలు సాక్షి
కృష్ణపట్నం ఇన్‌ఫ్రాటెక్‌ భూకుంభకోణం వ్యవహారాన్ని గత జూన్‌లో ఈనాడు బయటపెట్టింది. దానిని కప్పిపుచ్చేందుకు, వైఎస్‌ సాగించిన కేటాయింపులన్నీ సవ్యమే అని నమ్మించేందుకు జగన్‌కు చెందిన సాక్షి దినపత్రిక పచ్చి అబద్ధాలకు పాల్పడింది. జీవో లేకుండానే కృష్ణపట్నం ఇన్‌ఫ్రాటెక్‌కు వైఎస్‌ భూములు కేటాయించారనడం నిజం కాదని... 2009 ఫిబ్రవరిలో రెవెన్యూశాఖ ద్వారా వైఎస్‌ ప్రభుత్వం విడుదల చేసిన 223, 300 నెంబర్ల జీవోలు వీటికి సంబంధించినవేనని బుకాయించజూసింది. నిజానికి ఆ జీవోలు నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తమ్మినపట్నం, మోమిడి గ్రామాలకు సంబంధించినవి. ఆ రెండు గ్రామాలకూ, కృష్ణపట్నం ఇన్‌ఫ్రాటెక్‌కు ఇచ్చిన భూములకూ ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయాలను ఈనాడు అప్పట్లోనే ఆధారాలతో సహా ప్రచురించింది.

ఇక ఎంఓయూ లేకుండా భూముల కేటాయింపు జరిగిందనే విషయాన్ని కప్పిపుచ్చేందుకు జగన్‌పార్టీ వైకాపా కూడా రంగంలోకి దిగింది. 1996 ఆగస్టు 12నే సెజ్‌ కోసం ఒప్పందం జరిగిందంటూ ఆ పార్టీ ఒక కాగితాన్ని విలేకరులకు చూపింది. తీరా చూస్తే అది 1996లో ఏపీఐఐసీకి, నాట్కో కంపెనీకి మధ్య జరిగిన ఒప్పందం. కృష్ణపట్నం పోర్టు ప్రాంతంలో భారీ పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయడానికి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసి, ఒక నివేదికను రూపొందించడానికి కుదిరిన ఒప్పందం మాత్రమే అది. భూముల పందేరానికి సంబంధించిన వ్యవహారం కాదు ఇది. ఈ విషయాన్ని ఏపీఐఐసీ ఇంతకు ముందు అధికారికంగా చెప్పింది. తాజాగా నరసింహమూర్తి అండ్‌ కో రూపొందించిన నివేదికలోనూ దీనినే ప్రస్తావించారు. కృష్ణపట్నం కంపెనీతో తాము ఎలాంటి ఎంవోయూ కుదుర్చుకోలేదని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తమకు నివేదించినట్లు నరసింహమూర్తి అండ్‌ కో స్పష్టంగా పేర్కొంది. ఈ కుంభకోణాన్ని కప్పిపుచ్చేందుకు జగన్‌ పార్టీ, ఆయన పత్రిక కూడా అంత పచ్చిగా దిగజారి వ్యవహరించడానికి కారణం ఆయనకు జరిగిన లబ్ధి కాక మరేముంటుంది?

జీన్స్‌ ప్రభ!

కొన్నిరోజులు వాడగానే జీన్స్‌ బిగుతైపోతాయి. అలాగని వాటిని పారేయలేం. ఎందుకంటే చూడ్డానికేమో కొత్తగా ఉంటాయి. అలాంటి జీన్స్‌నే రీసైకిల్‌ చేసి కొత్త ఉత్పత్తులుగా మార్కెట్‌లోకి...

బుల్డోజర్స్‌పై విజయం మాదే: అఖిల్‌

సినీతారల క్రికెట్‌ మ్యాచ్‌లకు అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోందని తెలుగు వారియర్స్‌ జట్టుకు సారథ్యం వహిస్తున్న యువ కథానాయకుడు అఖిల్‌....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net