Mon, February 08, 2016

Type in English and Give Space to Convert to Telugu

'పట్టణాభిషేకం''వాస్తవాల ప్రతిబింబంగా బడ్జెట్‌''నీటిపై నిప్పుల వాన''సీఎం మొండి అయితే.. నేను జగమొండి''తీరప్రాంత దేశాల మధ్య సహకారం పెరగాలి''ఉత్తర కొరియా రాకెట్‌ ప్రయోగం''చిరుతకు చిక్కి .. ప్రాణాలతో బయటపడి''మౌఖికంలో మార్కులు ఖాయం''ఎయిమ్స్‌కు 220 ఎకరాలు కేటాయింపు''‘అంకుర’ భయాలొద్దు'
ఐదు రోజుల పెళ్లి..
మారుతున్న నవతరం ఆలోచనలు
నూరేళ్ల జ్ఞాపకంగా నిలిచిపోవాలన్న ఆకాంక్ష
మళ్లీ ఐదు రోజుల పెళ్లిళ్ల వైపు చూపు
కాలంతోపాటు రూపుమారుతోంది
తెలుగు లోగిళ్లలో ఉత్తరాది పద్ధతులు
అంతా చకచక!
తినే తిండైనా ... చూసే క్రికెట్‌ మ్యాచైనా!
టైమ్‌ లేదు... ఫటాఫట్‌... ధనాధన్‌!
అందుకే ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు... టీట్వంటీ మ్యాచ్‌లూ కిటకిట...
ఇలా అన్నింటిలోనూ.... వేగాన్ని కోరుకునే
యువతరం టేస్టు పెళ్ళికొచ్చేసరికి మాత్రం మారుతోంది!
టీట్వంటీలు, వన్డేలకంటే ‘టెస్టు’ల తీరుపై మనసు పడుతోంది!
ఒక్కరోజు పెళ్లిళ్ల నుంచి మూడు, ఐదురోజుల పెళ్లిళ్లను ఇష్టపడుతోంది!
మళ్లీ తాతముత్తాతల కాలం నాటి సంప్రదాయానికి తోరణాలు కడుతోంది!
‘తాటాకులతో పందిరి వేయాలి.. మామిడాకులతో తోరణాలు కట్టాలి... అరిటాకుల్లో భోజనాలు పెట్టాలి...’ అంటూ పెళ్లిని సంప్రదాయబద్ధంగా ఎలా చేయాలో త్రివిక్రమ్‌ ఓ సినిమాలో చెప్పారు. అదే సినిమాలో మారుతున్న పెళ్లి పద్ధతులపై సెటైర్‌ కూడా వేశారు - ‘ఇల్లు మనం చూపిస్తే షామియానా వాళ్లు వేస్తారు... బిల్లు మనం కడితే వంటలు వాళ్లు చేస్తారు... మగపెళ్లి వాళ్లను మనం చూపిస్తే మర్యాదలు వాళ్లు చేస్తారు... ముహూర్తం మనం చెబితే ముత్తయిదువుల్ని వాళ్లు సప్లయ్‌ చేస్తారు..’ అని! నవతరం ఆ సంప్రదాయాన్నీ సెటైర్‌నీ కలబోసి వివాహ వేడుకల్ని చేసుకొనేందుకు ముచ్చటపడుతోంది. ఆ ముచ్చటను నూరేళ్ల జ్ఞాపకంగా మలచుకొంటోంది. నేటి యువత అలనాటి ఐదు రోజులు, మూడు రోజుల పెళ్లిళ్లు చేసుకోవాలని తపిస్తోంది. ఫలితంగా తెలుగు సంప్రదాయాలకు ఉత్తరాది వివాహ పద్ధతుల్ని జోడించి మరింత శోభాయమానం చేస్తున్నారు. ఉన్నతాదాయ వర్గాల్లో మొదలైన ఈ విధానం క్రమంగా మధ్య తరగతిలోకీ పాకుతోంది.

దశాబ్దాల కిందట ఇవే పద్ధతుల్ని ఏడు రోజులు, ఐదు రోజులు, మూడు రోజులపాటు ఘనంగా చేసేవారు. అన్ని రోజులూ బంధుమిత్రులు పెళ్లి సందట్లో మునిగి తేలేవారు. ఇప్పుడు ఉరుకులు పరుగుల జీవితంలో అన్ని రోజులపాటు పెళ్లి వేడుకల్లో పాలుపంచుకొనే అవకాశం ఉండటం లేదు. అందుకే ఉదయాన్నే పెళ్లి కొడుకును చేయడం నుంచి ముహూర్తం వేళ జీలకర్ర బెల్లం పెట్టించే వరకూ అన్ని సంప్రదాయాల్నీ నిమిషాల్లెక్కన పరుగులు పెట్టించేందుకు అలవాటు పడిపోయారు. అయితే క్రమంగా మళ్లీ వెనకటి రోజులకు వెళ్లి... ఇప్పటి బిజీ జీవితాలకు అనుగుణంగా ఐదు, మూడు రోజుల పెళ్లిళ్లు చేసుకొంటున్నారు. మెహందీ, సంగీత్‌ వేడుకలంటూ సందడి చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఎక్కువగా ఉన్న ఈ ధోరణి ఇప్పుడిప్పుడే విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ లాంటి నగరాలకీ విస్తరిస్తోంది.

సందడే సందడి
పెళ్లికి రెండు రోజుల ముందు నుంచే సందడి మొదలు పెట్టేస్తోంది నవతరం. మొదటి రోజు మెహందీ వేడుకలు చేస్తున్నారు. దగ్గరి బంధువులు, సన్నిహితుల్నీ ఆహ్వానించి గోరింటాకు పెట్టుకోవడం చేస్తున్నారు. ఆ తరవాతి రోజు రాత్రి సంగీత్‌ హంగామా ఉంటుంది. వధూవరుల కుటుంబాలు కలిసి సంగీత్‌లో పాల్గొంటున్నారు. ఇందులో పెళ్లికొడుకు, పెళ్లి కూతురు మిత్రులదే హవా! దాదాపు నాలుగు గంటలపాటు సాగే ఈ సందడి నృత్యాలతో హోరెత్తుతోంది. ధనవంతులు ఈ వేడుకల్ని ప్రత్యేక శ్రద్ధతో నిర్వహించేందుకు కొన్ని వారాల ముందు నుంచే కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కొరియోగ్రాఫర్లు, కాస్ట్యూమ్‌ డిజైనర్లనీ ఏర్పాటు చేసుకొంటున్నారు. కొరియోగ్రాఫర్ల దగ్గర ఏ పాటకు ఎలాంటి స్టెప్పులు వేయాలో కూడా శిక్షణ పొందుతున్నారు. తమ పిల్లల సంగీత్‌ వేడుకలో పాల్గొనే బంధుమిత్రులకు అవసరమైన వస్త్రాల్ని కూడా డిజైన్‌ చేయించి ఇచ్చేవారూ ఉన్నారు. ఈ వేడుకలో పాల్గొనేందుకు వధూవరులు ప్రత్యేకంగా దుస్తులు డిజైన్‌ చేయించుకొంటున్నారు. ఇటీవల హైదరాబాద్‌కి చెందిన ఓ సెలబ్రిటీ తన కుమార్తె సంగీత్‌కి హాజరయ్యే ఆహ్వానితులకు ముందే ఒక్కొక్కరికీ రూ.25వేలు విలువైన డిజైనర్‌ వస్త్రాల్ని అందించారు. ‘‘పిల్లల పెళ్లిళ్లకు ఖర్చు చేసేందుకు ఎవరూ వెనుకాడటం లేదు. ఒక్కో పద్ధతికీ ఒక్కో తరహా డిజైన్‌ వస్త్రాలు, నగలు ఉండాలని కొన్ని నెలులు ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకొంటున్నారు. వాటికి రూ.లక్షల్లో బిల్లులు చెల్లించేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. కొందరైతే ఒక్కో హారానికి రూ.కోట్ల వ్యయం చేస్తున్నారు. ఇదంతా మారుతున్న ట్రెండ్‌లో భాగమే.’’ అని డిజైనర్లు చెబుతున్నారు. కొందరు సెలబ్రిటీలు పెళ్లికి నెల ముందే తమ ఇంటికే దర్జీలను పిలిపించుకొని డిజైనర్లు చెప్పిన విధంగా వస్త్రాలు కుట్టించుకొంటున్నారు. సంగీత్‌ వేడుకలో పాల్గొనేందుకు హిందీ సినీ తారలను సైతం ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. ఇందుకు పారితోషికం కూడా చెల్లిస్తుంటారు. మెహందీ, సంగీత్‌ లాంటి ఉత్తరాది పద్ధతులతోపాటే స్నాతకం, కాశీయాత్ర, మంగళ స్నానం, పెళ్లికొడుకును చేయడం, ఎదుర్కోలు.. లాంటి తెలుగు సంప్రదాయాల్నీ రోజుకొకటి చొప్పున చేస్తున్నారు. ఒక్కో వేడుకకీ ఒక్కో వేదికను సిద్ధం చేసుకొంటున్నవారూ ఉన్నారు. స్టార్‌ హోటళ్లు, ఖరీదైన కల్యాణ మంటపాలు, ఫామ్‌ హౌస్‌ల్లో వీటిని చేస్తున్నారు.

పిండి కొద్దీ రొట్టె
ప్రస్తుతం ఈ ఐదు, మూడు రోజుల పెళ్లిళ్లు ఉన్నతాదాయ వర్గాల్లోనే ఎక్కువగా కనిపిస్తున్నా.... వారిబాటలోనే ఎగువ మధ్యతరగతి వర్గాలూ నడుస్తున్నాయి. తమకున్న ఆర్థిక పరిమితులకు అనుగుణంగానే ఈ సరదాలను డిజైన్‌ చేయించుకొంటున్నారు. డబ్బున్న వాళ్ళ మాదిరిగా రోజుకోటి చొప్పున కాకుండా... ఉదయం మెహందీ, రాత్రి వేళలో సంగీత్‌ కూడా నిర్వహించుకొంటున్నారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ సంగీత్‌ వేడుకలు చేసుకొంటున్నారు. అయితే ఖరీదైన హోటళ్లలో కాకుండా తమ ఇళ్లకే పరిమితమవుతున్నారు. యువతీ యువకులే అందులో భాగస్వాములవుతున్నారు. కుటుంబ పెద్దలు సైతం పాల్గొని నృత్యాలు చేసే విధానం అక్కడ రాలేదు. ఇక యువకులు సైతం బ్యాచిలర్‌ పార్టీని తమ ఆర్థిక స్థాయికి తగిన విధంగా ఇస్తున్నారు.

ఉన్నత వర్గాలు వెడ్డింగ్‌ ప్లానర్స్‌, ప్రముఖ కళాదర్శకులతో వేడుకలను తీర్చిదిద్దుకొంటుంటే మిగిలినవారు స్థానికంగా ఉండే వివాహ నిర్వాహకులతో ఏర్పాట్లు చేయిస్తున్నారు. వెడ్డింగ్‌ ప్లానర్స్‌ సైతం ఆ వర్గాలకు చేరువయ్యేందుకు తగిన ప్యాకేజీలనీ రూపొందిస్తున్నారు. ముంబయి, ఢిల్లీకి చెందిన కంపెనీలు ఇటీవల హైదరాబాద్‌లోనూ తమ శాఖల్ని ప్రారంభించాయి. వీరు పలు రకాల ప్యాకేజ్‌లను వధువరుల కుటుంబాలకు చూపిస్తున్నారు. తక్కువ వ్యయంతో అయ్యే ప్యాకేజ్‌కి రూ.10 లక్షల వరకూ వసూలు చేస్తున్నారు. ఇక ఆపైన పిండి కొద్దీ రొట్టె అనే రీతిలోనే రుసుములు ఉంటాయి. వధూవరులు, కుటుంబ పెద్దల అభిరుచులకు అనుగుణంగా పెళ్లి కార్డులు ముద్రించడం, మంటపాలు తీర్చిదిద్దడం, క్యాటరింగ్‌, వీడియోగ్రాఫర్లు, ఫొటోగ్రాఫర్లు, పురోహితులు, బ్యాండ్‌ బృందం, అతిధులకు స్వాగతం పలికే యువతులను నియమించడంతోపాటు సంగీత్‌, మెహందీ ఏర్పాట్లు లాంటి సమస్త ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని సంస్థలైతే సంగీత్‌లో పాల్గొనేందుకు సినీ తారల్ని కూడా తీసుకొస్తాయి. వారికిచ్చే పారితోషికాలను అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. హైదరాబాద్‌కి చెందిన వెడ్డింగ్‌ ప్లానర్‌ ఫరా ‘ఈనాడు’తో మాట్లాడుతూ ‘‘ముందుగా పెళ్లి పెద్దలు, వధూవరుల అభిరుచులు, ఆలోచనలు తెలుసుకొనేందుకు ఓ ప్రశ్నావళి ఇస్తాం. వారిచ్చిన సమాధానాలను విశ్లేషించుకొని ఏ థీమ్‌లో ఏర్పాట్లు చేయవచ్చో అంచనాకు వచ్చి వాటిని చూపిస్తాం. వాళ్లు చెప్పిన మార్పుచేర్పులకు అనుగుణంగా వేడుకను డిజైన్‌ చేస్తాం. సంగీత్‌కి అవసరమైన కొరియోగ్రాఫర్లనీ, డీజేలనీ కూడా తీసుకొస్తుంటాం.’’ అని చెప్పారు.

-ఈనాడు ప్రత్యేక విభాగం

మాధవన్‌ పళ్లురాలగొట్టాను..!

సినిమా కోసం ఉత్తుత్తినే కాదు.. నిజంగానే అంతపని చేసిందట రితిక. గత వారం విడుదలై సంచలన విజయం సాధించిన ‘సాలా ఖడూస్‌’ చిత్రం కథానాయిక. అప్పుడెప్పుడో పరుగుల రాణీ...

ఉప్పల్‌లో పరుగుల పండగ

మ్యాచ్‌ అంటే ఇదీ.. ఆడేది సినిమావాళ్లే అయినా, అంతర్జాతీయ మ్యాచ్‌కి ఏమాత్రం తీసిపోదు. టీ ట్వంటీలో ఉండే అసలైన మజా... మరోసారి తెలిసొచ్చింది....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net