Thu, February 11, 2016

Type in English and Give Space to Convert to Telugu

'హైదరాబాద్‌కు యాపిల్‌''కారెక్కిన ఎర్రబెల్లి''మేయర్‌ బొంతు రామ్మోహన్‌!''హనుమంతప్ప పరిస్థితి మరింత విషమం''భాగ్యనగరం తరహాలో ఖేడ్‌ అభివృద్ధి''మహా జాతరకు శ్రీకారం''ఓటుకు నోటు కేసులో మరో తెదేపా ఎమ్మెల్యే అరెస్టు?''ప్రయాణికులపై మళ్లీ వడ్డింపు?''గవర్నర్లు రాష్ట్రాలకు ఉత్ప్రేరకాలు''మహానగర అభివృద్ధికి 100 రోజుల ప్రణాళిక!'
ఐదేళ్లైతే అంతే
ప్రత్యేక హోదా కనీసం 15 ఏళ్లు ఉండాల్సిందే
అప్పుడే మేలు జరుగుతుంది
పారిశ్రామిక వర్గాలు, నిపుణుల అభిప్రాయం
రాజకీయ ఆటుపోట్లుంటే కష్టాలు తప్పవు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పొసగకపోతే వివక్షకు అవకాశం
ఈనాడు - హైదరాబాద్‌
రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ సమయంలో సీమాంధ్రకు ఐదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇవ్వనున్నట్లు ప్రధాని మన్మోహన్‌ ప్రకటించడంతో అసలు దీనివల్ల ఒరిగేదేమిటన్న చర్చ ప్రస్తుతం ప్రజల్లో నలుగుతోంది. ప్రత్యేక హోదాతో పన్నుల్లో రాయితీలు ఇస్తామని, పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, బడ్జెట్‌ నిధుల కేటాయింపులు ఉంటాయని చెప్పారు. ఈ హోదాతో ఆంధ్రప్రదేశ్‌కు మేలు జరిగే అవకాశాలున్నప్పటికీ, ప్రకటించిన ఐదేళ్ల గడువు ఏమాత్రం సరిపోదని నిపుణులు చెబుతున్నారు. తక్కువ కాలంలో ఎక్కువ పరిశ్రమలను ఆకర్షించడం, రాష్ట్రం ఆర్థికంగా నిలబడటం కష్టమని నిపుణులు పేర్కొంటు న్నారు. ప్రత్యేక హోదా గడువు కనీసం 15 ఏళ్లు ఉంటే, ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు.

ప్రత్యేకహోదా సాధించినా కేంద్ర, రాష్ట్రాలకు రాజకీయ ఆటుపోట్లు ఉంటే కష్టాలు తప్పవు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పార్టీ, కేంద్రంలోని పార్టీ మధ్య సమన్వయం ఉంటే ఇబ్బందులు పెద్దగా ఉండవు. అదే వేర్వేరు పార్టీలు ప్రభుత్వాలు ఏర్పాటు చేసినపుడు, వాటి మధ్య ఘర్షణ వాతావరణం ఉంటే సమస్యలు వస్తాయి. కేంద్రం తమ 30 శాతం బడ్జెట్‌ నిధులను ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు పంచుతున్నాయి. ప్రాధాన్యం మేరకు ఆయా రాష్ట్రాలకు నిధులు సమానంగా వచ్చే అవకాశాలు ఉండవు. కేంద్రంతో సఖ్యత ఉన్న పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంటే ఎక్కువ నిధులు, లేకుంటే వివక్ష తప్పదని పీఈబీఎస్‌ పెన్నార్‌ ఎండీ పీవీ రావు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో నిధులు రాకుంటే ఐదేళ్ల పుణ్యకాలం గడిచిపోతుంది. ఆ తరువాత ఉత్తచేతులే మిగులుతాయి. అందుకే ప్రత్యేక హోదా కనీసం 15 ఏళ్లు ఉండాలని పరిశ్రమ వర్గాలు, నిపుణులు పేర్కొంటున్నారు. ఉత్తరాంచల్‌లో ప్రత్యేక హోదా తొలుత పదేళ్లు ప్రకటించారు. మిగతా ప్రత్యేక రాష్ట్రాల్లోనూ ప్రత్యేక హోదా ఇంకా కొనసాగుతోంది. కానీ ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన ఐదేళ్ల హోదాలో పరిశ్రమలను, పెట్టుబడులకు ఆహ్వానించడం, ఇక్కడ ఆయా సంస్థలు తమ కార్యకలాపాలు గడువులోగా ప్రారంభించడం ఇబ్బంది అవుతుంది. ప్రత్యేక హోదా కనీసం 10-15 ఏళ్లు ఉంటేనే పరిశ్రమలు పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉంటుంది. రాష్ట్రానికి ఆశించిన మేలు జరుగుతుంది. పైగా ఇప్పటికే హైదరాబాద్‌ నగరంలో ఐటీ, ఫార్మా తదితర సంస్థలు పూర్తిస్థాయి కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ఇవన్నీ ద్వితీయ, తృతీయశ్రేణి నగరాల్లో తమ కార్యకలాపాలు విస్తరించాలంటే, వెంటనే సాధ్యం కాదు.

ఇతర రాష్ట్రాల డిమాండ్లు: సీమాంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వడంతో తమకూ ఆ స్థాయి ఇవ్వాలంటూ ఇతర రాష్ట్రాలు డిమాండ్‌ చేస్తున్నాయి. కేంద్రం నుంచి రాయితీలు, నిధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉండటంతో హోదాను కోరుకుంటున్నాయి. బీహార్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, రాజస్థాన్‌లు పదేళ్ల నుంచి ఈ విజ్ఞప్తి చేస్తూ వస్తున్నాయి. ఇప్పటికే ఆర్‌బీఐ గవర్నర్‌ రఘురాం రాజన్‌ ఆధ్వర్యంలోని కమిటీ కేంద్రానికి ఒక నివేదిక ఇచ్చింది.

ప్రత్యేక హోదా ఎవరికిస్తారు?: తక్కువ జనసాంద్రత, కొండప్రాంతాలు, మైదాన ప్రాంతాలు లేని, భౌగోళికంగా ఇబ్బందులున్న, సరైన మౌలిక సదుపాయాలు లేని, ఆర్థికంగా నిలబడలేని రాష్ట్రాలకు ఈ హోదా ఇస్తారు. ప్రత్యేక హోదా కేటగిరీ ప్రవేశపెట్టాలని 1969లో ఐదో ఆర్థిక సంఘం ప్రతిపాదించింది. ఆర్థిక ఇబ్బందులు, రాష్ట్రాలుగా మనుగడకు అనుకూలంగా లేని రాష్ట్రాలకు కేంద్రం సహాయం చేస్తుంది. అదనపు నిధులు, గ్రాంట్లు, పన్నుల్లో మినహాయింపు ద్వారా వీటిని బలోపేతం చేస్తారు. ఇప్పటి వరకు దేశంలో 11 రాష్ట్రాలకు మాత్రమే ఈ హోదా ఉంది. అరుణాచల్‌ప్రదేశ్‌, అస్సాం, మేఘాలయ, మణిపూర్‌, మిజోరాం, నాగాలాండ్‌, త్రిపుర, సిక్కిం, ఉత్తరాఖండ్‌, జమ్మూ కాశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాలు ఈ హోదా అనుభవిస్తున్నాయి. తాజాగా సీమాంధ్రకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించడంతో ప్రత్యేక హోదా పొందనున్న రాష్ట్రాల సంఖ్య 12కు చేరనుంది.

లాభం ఏమిటి?: ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాల్లో మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు కేంద్రం అవసరమైన ఆర్థిక సహాయాన్ని గ్రాంట్ల రూపంలో ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో భారీగా లబ్ధి చేకూరుతుంది. కేంద్రం రాష్ట్రాలకు ఇస్తున్న నిధుల్లో 70 శాతం నిధులను ప్రణాళిక సంఘం అన్ని రాష్ట్రాలకు పంచుతుంది. మిగతా 30 శాతం నిధులను ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకే ఇస్తారు. ఈ లెక్కన సీమాంధ్రకు కేంద్ర నిధులు ప్రవాహం పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో 90 శాతం నిధులను గ్రాంట్లుగా, మిగతా 10% నిధులకు రాష్ట్రానికి రుణం కింద ఇస్తారు. అంటే రాష్ట్రప్రభుత్వం రూపాయి కూడా కేటాయించాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు జవహర్‌లాల్‌ నెహ్రూ జాతీయ పట్టణ నవీకరణ పథకం కింద పది లక్షల జనాభా దాటిన నగరాలుగా సీమాంధ్రలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఈ నగరాల్లో పథకాలకు కేంద్రం 50 శాతం నిధులు ఇచ్చేది. మిగతా 20 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం, 30% నిధులు పురపాలక సంఘం భరించేవి. ఇక ఇప్పుడు పురపాలక సంఘం రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. కేంద్రం 90% నిధులను ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సిన 10% నిధులు రుణం రూపంలో వస్తాయి. దీంతో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు భారీగా వస్తాయి. తాజాగా విశాఖపట్నంలో మెట్రోరైలు ప్రాజెక్టును పరిశీలిస్తామని కేంద్రం తెలిపింది. దీనిని కేంద్రం చేప డితే రాష్ట్రం నిధులు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు.

పన్నుల్లో మినహాయింపు: ప్రత్యేక హోదాతో పన్నుల్లో మినహాయింపు లభిస్తుంది. రాష్ట్రంలో ఎక్సైజ్‌ పన్ను 16 శాతంగా ఉంది. కేంద్రానికి ఏటా రూ.18వేల కోట్ల ఎక్సైజ్‌పన్ను ఇక్కడి నుంచి వెళ్తుంది. ఇప్పుడు ఈ పన్ను నుంచి సీమాంధ్రకు మినహాయింపు లభిస్తుంది. ప్రస్తుతం ఉత్తరాంచల్‌లో అమల్లో ఉన్న ప్రోత్సాహకాలు ఇలా ఉన్నాయి. 100 శాతం కేంద్ర ఎక్సైజ్‌పన్ను, 100% ఆదాయపన్ను మినహాయింపు, పెట్టుబడులపై 15% రాయితీ, స్టాంపుడ్యూటీ, భూమి వినియోగ మార్పిడి, అభివృద్ధి ఛార్జీల మినహాయింపు, 50% వ్యాట్‌ రాయితీ ఇస్తున్నారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అధికంగా ఉండటంతో అక్కడ బహుళజాతి కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. అందులో బ్రిటానియా, హిందుస్థాన్‌లీవర్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, డాబర్‌, కోకో-కోలా, వీడియోకాన్‌, పార్లె, నెస్లే, అశోక్‌లేలాండ్‌, మహీంద్రా తదితర కంపెనీలున్నాయి. ఈ లెక్కన ఆంధ్రప్రదేశ్‌కు కూడా కొంత మేలు జరిగే అవకాశముంది. పొడవైన తీరం ఉండటం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నం ఓడరేవులతో భారీ ఎగుమతులు చేసేందుకు వీలు కలుగుతుంది.

నీళ్ల సీసాలపై మీ పేర్లు!

‘మంచి వ్యాపారవేత్త కావాలంటే ఎంబీఏలే చదవాల్సిన అవసరంలేదు. సామాజిక చొరవ ఉంటే చాలు! చక్కటి ఆలోచనతో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా ఈ ఏడాదిన్నరలో రెండు...

వెండితెరపై కోట్ల ‘కాంతి’

సినిమా అనేది కచ్చితంగా వ్యాపారమే. ఏ కథానాయకుడికి ఎంత మార్కెట్‌ ఉంది? అనే లెక్కలు ఎప్పుడూ అవసరమే. పెట్టిన ప్రతీపైసాకీ గ్యారెంటీ ఉందన్న నమ్మకం కుదిరిన...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net