Sat, February 06, 2016

Type in English and Give Space to Convert to Telugu

'గులాబీ.. సునామీ''మాట నిలబెట్టుకుంటాం''నౌకా సంరంభం నేడే''కక్షతోనే పార్లమెంటులో రగడ!''వ్యూహాత్మక విజయం''ఆఖర్లో వచ్చారు.. అదరగొట్టారు!''సమర సేనాని''పర్యాటకులకు మణిహారం''ముద్రగడ ఆమరణ దీక్ష''హైదరాబాద్‌లో మరో రెండు పెద్దాసుపత్రులు'
ఆతిథ్యానికి ఆమ్యామ్యాలు
అమాత్యుల పేర్లతో అధికారుల వసూళ్లు
మంత్రుల పర్యటనల్లో లెక్కలేనితనం
ప్రోటోకాల్‌ సిబ్బందికీ తలనొప్పులు
విజయవాడ, విశాఖ, తిరుపతి పర్యటనలు అధికం
ఈనాడు - హైదరాబాద్‌
ఓ మంత్రి పర్యటన ఖర్చులకే లంచం తీసుకున్నానంటూ సంక్షేమ శాఖకు చెందిన ఓ అధికారిణి ఇటీవల విజయవాడలో అవినీతి నిరోధక శాఖ బృందానికి చెప్పారు.
- మంత్రి పర్యటన కోసం లంచం తీసుకోవడమేంటి?
సామాన్యుడి మదిలో మెదిలే ప్రశ్న ఇది.
జిల్లాల పర్యటనలకు వెళ్లే అమాత్యులు ‘అతి’థి మర్యాదలు ఆశిస్తుండటంతో వారి శాఖల అధికారులు వసూళ్లకు దిగుతున్నారు. ఇందులో కొంత రాజు సేవలకు వెళ్తే.. మరికొంత సొంత జేబుల్లోకి చేరుతోంది. సాధారణంగా మంత్రులు ఎక్కడికెళ్లినా అక్కడి ప్రభుత్వ అతిథిగృహంలో బసచేయాలి. అక్కడ ఖాళీ లేకపోతేనే ప్రైవేటు హోటల్‌లో దిగాలి. ఈ నిబంధనలను చాలామంది పాటించడం లేదు. కొందరు అధికార పర్యటనలకు కూడా మందీమార్బలాన్ని వెంటేసుకు వెళుతున్నారు. వారందరి అతిథి మర్యాదలకు కిందిస్థాయి సిబ్బంది పక్కదారి చూడాల్సి వస్తోంది.రాష్ట్రం విడిపోయాక విశాఖపట్నం, విజయవాడ

తిరుపతిలకు మంత్రుల తాకిడి విపరీతంగా పెరిగింది. అక్కడికొచ్చే అమాత్యులు చాలామంది అతిథిగృహాలు కాకుండా అయిదు నక్షత్రాల హోటళ్లలో బస కోరుతున్నారు. అమాత్యుడితోపాటు అనుచరులకు కూడా మంత్రితో సమానంగా మర్యాద చేయాల్సి వస్తోంది. విజయవాడలో ఒక రోజుకు హోటల్‌సూట్‌ ధర రూ.12వేల వరకు ఉంటోంది. దాంతోపాటు కలిపి తీసుకునే గదులకు రూ.20 వేల ఖర్చవుతోంది. మంత్రికి, అనుచరగణానికి అతిథి మర్యాదలన్నీ చేయడానికి రూ.30వేల పైగా ఖర్చవుతున్నట్లు ఏర్పాట్లు చూస్తున్న అధికారులు చెబుతున్నారు. మంత్రుల వెంట వచ్చే కొందరు ఓఎస్‌డీలు, పీఏలు, పీఎస్‌లకు పైకంతో కూడిన కవర్లు కూడా అందించాల్సి వస్తోందని వాపోతున్నారు. గన్‌మెన్లూ ఇందుకు అతీతులేం కాదని చెబుతున్నారు. మరోవైపు మంత్రులను మచ్చిక చేసుకొని పరపతి పెంచుకోడానికి కొందరు అధికారులు ఖరీదైన బహుమతులు కూడా సమర్పించుకుంటున్నట్లు విమర్శలున్నాయి. ఒక మంత్రి రెండు రోజులు విజయవాడలో ఉంటే రూ.లక్ష వరకు ఖర్చవుతుందని అంచనా. ఇందులో ప్రభుత్వం భరించేది కొంతయితే.. అమాత్యుల పేర్లతో వసూళ్లు చేస్తున్న మొత్తమే ఎక్కువన్న ఆరోపణలున్నాయి. హైదరాబాద్‌ నుంచి ఉన్నతాధికారులు వచ్చినా ఇలాగే ఏర్పాట్లు చేయాల్సి వస్తోందని చెబుతున్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో తొలిసారి చేరిన ఓ మంత్రి విజయవాడకు వెళ్లిన ప్రతిసారీ స్టార్‌హోటల్‌లోనే దిగుతున్నారు. బిల్లును ఒక్కోసారి ఆయన మంత్రిత్వశాఖలోని ఒక్కో విభాగం చెల్లించాల్సి వస్తోంది. తాను వచ్చిన ప్రతిసారీ పత్రికల్లో ప్రకటనలు కూడా ఇవ్వాలని హుకుం జారీ చేస్తున్నట్లు కింది స్థాయి ఉద్యోగులు వాపోతున్నారు. మంత్రే కాకుండా ఆయన అనుచరులు వచ్చినప్పుడు కూడా ఏర్పాట్లు చేయాలన్న ఆదేశాలు వస్తున్నాయని చెబుతున్నారు.

* తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం మంత్రుల వ్యక్తిగతమైనా ఏదో ఒక అధికారిక కార్యక్రమం పేరుతో వెళ్తున్నారన్న విమర్శలున్నాయి. ఏ శాఖకు చెందిన మంత్రికయినా రేణిగుంట విమానాశ్రయంలో ఘనస్వాగతం పలకాల్సి వస్తోంది. ఒక్కో మంత్రి వెంట సిబ్బంది, స్నేహితులు సుమారు పది మంది వరకు ఉండటంతో అదనంగా మూడు వాహనాలు సమకూర్చాల్సి వస్తోంది. దీనికితోడు కొందరికి భద్రతాపరమైన వాహనశ్రేణీ తప్పనిసరవుతోంది. వీటన్నింటికీ కనీసం రోజుకు రూ.20వేల ఖర్చవుతోంది. శ్రీవారి దర్శనానికి మంత్రి, ఆయన కుటుంబసభ్యులకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఇతర సిబ్బంది, సహచరులకు ఒక్కో టికెట్‌ రూ.500 చొప్పున జిల్లా స్థాయి అధికారులే కొనుగోలు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు.

* విశాఖకు అతిథుల తాకిడి ఉంటోంది. ఇద్దరు ముగ్గురు మంత్రులు మాత్రం ప్రభుత్వ ఆధీనంలోని సర్క్యూట్‌ గెస్ట్‌హౌస్‌లో దిగుతుండగా చాలామంది స్టార్‌హోటల్‌ తప్పనిసరి కావాలంటున్నారు. ఫలితంగా వీరి అతిథి మర్యాదలకు ప్రభుత్వ బడ్జెట్‌ ఏమూలకూ సరిపోవడం లేదని ప్రొటోకాల్‌ సిబ్బంది వాపోతున్నారు. ఈ జిల్లాకు ప్రొటోకాల్‌ ఖర్చుల కింద ప్రభుత్వం ఏటా రూ.35-40 లక్షలు కేటాయిస్తే ఖర్చులు మాత్రం కోటిన్నరకుపైనే ఉన్నట్లు ఉదహరిస్తున్నారు.

ఏపీ భవన్‌ ఆదర్శం
సాధారణంగా మంత్రులకు ప్రభుత్వమే భత్యాలు చెల్లిస్తున్నందున దాన్నుంచే వాహనాలు, గది అద్దె, భోజన ఖర్చులను సొంతంగా చెల్లించుకుంటే కిందిస్థాయి అధికారులపై ఒత్తిళ్లు ఉండవు. మంత్రుల పర్యటనల పేరిట అవినీతికి పాల్పడే అవకాశమూ ఉండదు. దిల్లీ ఏపీభవన్‌కు మంత్రులు వెళ్లినప్పుడు అక్కడి ప్రొటోకాల్‌ సిబ్బంది విమానాశ్రయానికి వెళ్లి ప్రభుత్వ వాహనంలో అమాత్యులను తోడ్కొని వస్తారు. ఏపీ భవన్‌లోని క్యాంటీన్‌ నుంచే భోజనాన్ని సరఫరా చేస్తారు. ఈ మొత్తాన్ని మంత్రినుంచే అక్కడికక్కడ వసూలు చేస్తారు. దీనివల్ల అక్కడి సిబ్బందిపై పెద్ద భారమేమీ ఉండదు. జిల్లాల్లో ఇలాంటి కేంద్రీకృత వ్యవస్థ లేకపోవడంవల్ల పరిస్థితులు చేయిదాటి ప్రభుత్వం పరువు బజారున పడే దుస్థితి తలెత్తుతోంది.

నిబంధనలివీ..
* జిల్లాల పర్యటనలకు వెళ్లే మంత్రులకు ప్రయాణ ఖర్చు ఎంతయితే అంత ప్రభుత్వమే చెల్లిస్తుంది.

* స్వరాష్ట్రంలో అయితే మంత్రితోపాటు ఆయన భార్య కూడా విమానంలో ఉచితంగా ప్రయాణించడానికి అవకాశం ఉంది.

* సొంత వాహనంలో వెళ్లినా, అద్దెది వాడుకున్నా కిలోమీటరుకు రూ.20 చొప్పున చెల్లిస్తుంది.

* భత్యం కింద రాష్ట్రంలో అయితే రోజుకు రూ.వెయ్యి, రాష్ట్రం బయటకు వెళ్తే రూ.1,500 ఇస్తుంది.

* అధికారికంగా ఎక్కడికెళ్లినా ప్రభుత్వ అతిథిగృహాలు ఉన్నందున ప్రత్యేకంగా ఆ భత్యం ఏమీ ఉండదు.

* రక్షణభత్యం కింద ప్రతినెలా ప్రతి మంత్రికి ప్రభుత్వం రూ.25వేలు ఇస్తుంది. వెంటవచ్చే భద్రతా సిబ్బంది కోసం ఈ డబ్బులు వినియోగించవచ్చు.

జీన్స్‌ ప్రభ!

కొన్నిరోజులు వాడగానే జీన్స్‌ బిగుతైపోతాయి. అలాగని వాటిని పారేయలేం. ఎందుకంటే చూడ్డానికేమో కొత్తగా ఉంటాయి. అలాంటి జీన్స్‌నే రీసైకిల్‌ చేసి కొత్త ఉత్పత్తులుగా మార్కెట్‌లోకి...

బుల్డోజర్స్‌పై విజయం మాదే: అఖిల్‌

సినీతారల క్రికెట్‌ మ్యాచ్‌లకు అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోందని తెలుగు వారియర్స్‌ జట్టుకు సారథ్యం వహిస్తున్న యువ కథానాయకుడు అఖిల్‌....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net