Sun, February 14, 2016

Type in English and Give Space to Convert to Telugu

'భారత్‌లో తయారీకి బ్రహ్మరథం''ఐపీఎస్‌లను పెంచండి''పాకిస్థాన్‌కు అధునాతన ఎఫ్‌-16 యుద్ధవిమానాలు''ఖేడ్‌లో 81.72 శాతం పోలింగ్‌''దిండి మొదటి దశ పనులకు త్వరలో టెండర్లు''మెదక్‌ నిమ్జ్‌లో చైనా పెట్టుబడులు..''చెలకల్లో.. అవినీతి మొలకలు!''మార్చి 10 నుంచి శాసనసభ సమావేశాలు''మళ్లీ తెరపైకి ఓటుకు నోటు కేసు''కళతో సామాజిక సందేశం'
కేసీఆర్‌ ఏకగ్రీవం
నేడు గవర్నర్‌కు తెలపనున్న ఎమ్మెల్యేల బృందం
జూన్‌ 2వ తేదీ తర్వాత సీఎంగా కేసీఆర్‌ ప్రమాణం
పార్లమెంటరీ పార్టీ నేత ఎన్నిక బాధ్యత కూడా గులాబీ దళపతికే
సుపరిపాలన అందిద్దాం.. లేకుంటే చరిత్ర క్షమించదు..
కొత్త ప్రజాప్రతినిధులకు తెరాస అధినేత హితబోధ
ఈనాడు - హైదరాబాద్‌
న్నికల్లో విజయదుందుభి మోగించిన తెరాస అధ్యక్షులు కేసీఆర్‌ ఆ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ మేరకు నూతనంగా ఎన్నికైన తెరాస ఎమ్మెల్యేలందరూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. పార్టీ పార్లమెంటరీ పక్ష నేతను ఎంపిక చేసే బాధ్యతను కూడా కేసీఆర్‌కే అప్పగించారు. పార్టీ ఎమ్మెల్యేల బృందం ఆదివారం గవర్నర్‌ను కలిసి తెరాస శాసనసభాపక్ష నేత ఎన్నిక విషయాన్ని తెలియజేయనుంది. శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో పార్టీ శాసనసభాపక్షం, పార్లమెంటరీ పార్టీల సంయుక్త సమావేశం జరిగింది. కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయితేనే తెలంగాణ పునర్నిర్మాణం సాధ్యమవుతుందని, ఆయన నేతృత్వంలోనే పరిపాలన కొనసాగాలని కోరుకుంటున్నట్లు పార్టీ ఎమ్మెల్యేలంతా ముక్తకంఠంతో తేల్చిచెప్పారు. ఈ సమావేశానికి పార్టీ అధ్యక్షులు కేసీఆర్‌తో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలుపొందిన వారందరూ హాజరయ్యారు. ఎజెండా ప్రకారం తొలుత పార్టీ శాసనసభాపక్ష నేత ఎన్నిక నిర్వహించారు. శాసనసభా పక్ష నేతగా కేసీఆర్‌ పేరును స్టేషన్‌ఘన్‌పూర్‌ నుంచి ఎన్నికైన డాక్టర్‌ తాటికొండ రాజయ్య తొలుత ప్రతిపాదించగా ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌, ఈటెల రాజేందర్‌, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, కోవలక్ష్మి బలపరిచారు. తెరాస పార్లమెంటరీ పార్టీ నేతగా ఎవరుండాలో నిర్ణయించే బాధ్యతను కేసీఆర్‌కు అప్పగిస్తూ... ఎంపీలుగా ఎన్నికైన వారు తీర్మానం చేశారు. ఈ విషయాలను తెరాస సీనియర్‌ నాయకులు కె.కేశవరావు, ఈటెల రాజేందర్‌, నాయిని నర్సింహారెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్‌రెడ్డిలు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే తేదీపైనా పార్టీలో చర్చ జరుగుతోంది. జూన్‌2న సుముహూర్తం ఉందా? ఆ రోజు కాకుంటే ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయాలనే అంశాన్నీ పరిశీలిస్తున్నారు.

సుపరిపాలన అందించకుంటే ప్రజలు క్షమించరు
తెరాస పార్టీ శాసనసభాపక్షం, పార్లమెంటరీ పార్టీ సమావేశం సుమారు రెండున్నర గంటలపాటు కొనసాగింది. సమావేశంలో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలను ఉద్దేశించి కేసీఆర్‌ సుదీర్ఘంగా మాట్లాడారు. వారికి కర్తవ్య బోధ చేశారు. తన ప్రభుత్వ, పార్టీ ప్రాధమ్యాలేమిటో వివరించి చెప్పినట్లు తెలిసింది. నిబద్ధతతో పనిచేసి ప్రజలకు సుపరిపాలన అందించాలని స్పష్టం చేశారు. ఉద్యమాల నేపథ్యం ఉన్న పార్టీ అని, అధికారంలోకి వచ్చామని విర్రవీగితే చరిత్ర క్షమించదని హెచ్చరించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యమివ్వాలని, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని తెలిపారు. సిద్ధిపేటలో నీటి సమస్యతోపాటు పలు అంశాలపై తన స్వీయ అనుభవాలను చెప్పారు. రాష్ట్ర ఏర్పాటు కోసం చేసిన ఉద్యమం కన్నా.. అభివృద్ధి, సంక్షేమం కోసం అధికారంలో ఉండి చేసే ఉద్యమమే ముఖ్యమైనదని వివరించారు. అవినీతి, ఆశ్రితపక్షపాతం ఉండరాదని, కడుపు, నోరు కట్టుకొని పనిచేద్దామని సూచించారు. చనిపోయిన తర్వాత ఆస్తులను వెంట తీసుకెళ్లలేమని, మంచి పేరు మాత్రమే మనతో వస్తుందని ఎమ్మెల్యే, ఎంపీలకు హితోపదేశం చేశారు. ప్రజలు ఆశల మేరకు సుపరిపాలనను అందించకపోతే చరిత్ర క్షమించదన్నారు. అధికారాన్ని దుర్వినియోగం చేయవద్దని, ప్రభుత్వానికి ఖర్చు తగ్గిద్దామని, వీలైతే వూరేగింపుల్లో డప్పులు, పూలదండలు కూడా వేసుకోవద్దని తన స్వీయానుభవం చెప్పారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌ ఈ అంశాలను అనుసరిద్దామంటూ తీర్మానం ప్రవేశపెట్టగా సభ్యులందరూ ఆమోదించారు.

అలాగైతే మరో 20 ఏళ్లు అధికారం మనదే
పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తే మరో 20 ఏళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో కొనసాగవచ్చని కేసీఆర్‌ తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ప్రజాప్రయోజన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పార్టీ ముందుండాలని సూచించారు. అలాగైతేనే ప్రజలు ఆదరిస్తారని చెప్పారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళలా శిక్షణ కార్యక్రమాలుండే ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా నాగార్జునసాగర్‌లో ఒక రోజు శిక్షణ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని కేసీఆర్‌ చెప్పినట్లు తెలిసింది. తెదేపాలో ఉన్నపుడు తానే పార్టీ కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాల విధానాన్ని రూపొందించి, పర్యవేక్షించానని చెప్పారు. దేశంలో అత్యంత పటిష్ఠమైన కార్యకర్తలున్న పార్టీగా తెరాసను రూపొందించుకుందామన్నారు. ప్రజల ఆశలకు తగ్గట్లుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. హుందాగా వ్యవహరించాలని, సమస్యలను లోతుగా విశ్లేషించి వాటి పరిష్కారానికి కృషి చేద్దామన్నారు.

నా పని తీరుపైనా సర్వే చేయించుకుంటా
అధికారంలోకి వచ్చాక తర్వాత ప్రజల అంచనాలకు అనుగుణంగా పనిచేస్తున్నామా.. లేదా అన్నది ముఖ్యమని, ఎవరికి వారు స్వీయసమీక్ష చేసుకోవాలని ఎమ్మెల్యేలకు కేసీఆర్‌ సూచించారు. తాను కూడా ప్రతినెలా పనితీరును సమీక్షించుకుంటానని, సర్వేలు చేయించుకుంటానని చెప్పారు. పనితీరులో లోపాలుంటే సర్వేల ఆధారంగా సవరించుకుంటానని స్పష్టం చేశారు.

మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లపై అధ్యయన బృందం
తమ ప్రభుత్వంలో సంక్షేమం, వ్యవసాయం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకే పెద్దపీట వేస్తామని కేసీఆర్‌ తెలిపారు. ముస్లిం మైనార్టీలకు విద్య, ఉపాధి అవకాశాల్లో 12శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి తెరాస కట్టుబడి ఉందని స్పష్టం చేసినట్లు తెల్సింది. తమిళనాడు తరహాలో తెలంగాణ రాష్ట్రంలో కూడా రిజర్వేషన్లు ఇవ్వడానికి ప్రయత్నిస్తామన్నారు. అక్కడ ఏవిధంగా రిజర్వేషన్లు అమలు చేశారో అధ్యయనం చేయడానికి విశ్రాంత ఐఏఎస్‌ అధికారుల బృందాన్ని పంపించాలని నిర్ణయించినట్లు కేసీఆర్‌ చెప్పారు. దళితుల సంక్షేమానికి అయిదేళ్లలో రూ.50వేల కోట్లు కేటాయిస్తామన్నారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేస్తామని, ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే దీనికి సంబంధించి కేబినెట్‌లో తీర్మానం చేద్దామని కేసీఆర్‌ చెప్పినట్లు సమాచారం. ఆదిలాబాద్‌లో అంటురోగాలు, పాలమూరు వలసలు, దుబాయి, బొంబాయి బతుకులు మారాలని, దీనికి అనుగుణంగా పనిచేద్దామని అన్నారు. అన్నివర్గాల ప్రజలనూ కలుపుకొని వెళ్లాలని చెప్పినట్లు తెలిసింది.

కొండా సురేఖను ద్రోహి అనడాన్ని తప్పుపట్టా..
సమావేశంలో అభ్యర్థుల ప్రస్తావన వచ్చినపుడు వరంగల్‌ తూర్పు నుంచి ఎన్నికైన కొండా సురేఖను తెలంగాణ ఐకాస తెలంగాణ ద్రోహి అని ప్రకటించడాన్ని తాను తప్పుపట్టానని, ఐకాస నేతలకు కూడా ఆ విషయాన్ని చెప్పానని కేసీఆర్‌ అన్నట్లు తెలిసింది. సమావేశంలో మొత్తం 11 మంది నాయకులు మాట్లాడారు. పార్టీ అగ్రనాయకులు కేశవరావు, నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్సీలు స్వామిగౌడ్‌, పాతూరి సుధాకర్‌రెడ్డి, మెహమూద్‌ అలీ, ఈటెల రాజేందర్‌, హరీశ్‌రావు, కేటీఆర్‌లతోపాటు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ సమావేశానికి హాజరయ్యారు. వీరితోపాటు కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్‌, గ్రేటర్‌ హైదరాబాద్‌ ఐకాస ఛైర్మన్‌ శ్రీధర్‌ సమావేశంలో ఉన్నారు.

తీర్మానాలు..
* తెరాస శాసనసభా పక్షనేతగా కేసీఆర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ తీర్మానం. ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడంలో కీలకంగా వ్యవహరించి, వందకుపైగా సభల్లో పాల్గొన్న కేసీఆర్‌ను అభినందిస్తూ మరో తీర్మానం.
* పార్టీ కష్టకాలంలో ఉన్నపుడు శాసనసభాపక్ష నేతగా వ్యవహరించిన ఈటెల రాజేందర్‌ను అభినందిస్తూ తీర్మానం. ఏడుగురు పార్టీ ఎమ్మెల్యేలకు నాయకుడిగా ఉంటూ ఆ సంఖ్యను 23 వరకు పెంచుకోగలిగారని, తెలంగాణ కోసం అనేక అవమానాలు, హేళనలు ఎదుర్కొన్న ఆయన అభినందనీయుడని ప్రశంసించారు.
* తెరాస పార్లమెంటరీ పార్టీ నేత ఎన్నిక అంశాన్ని కేసీఆర్‌కే అప్పగిస్తూ పార్లమెంటు సభ్యులు తీర్మానం చేశారు.

కేసీఆర్‌ సీఎం కావాలని ఎన్నారైల తీర్మానం
దుగ్గొండి, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్‌ మొదటి ముఖ్యమంత్రి కావాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారై తెరాస విభాగం ఆధ్వర్యంలో తీర్మానం చేసినట్లు ఆ విభాగం ప్రధాన కార్యదర్శి శానబోయిన రాజ్‌కుమార్‌ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. లండన్‌లో 12 దేశాలకు చెందిన ప్రతినిధులతో ఎన్నారై విభాగం అధ్యక్షుడు అనిల్‌ కూర్మాచలం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించినట్లు చెప్పారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా స్పష్టమైన మెజార్టీని తెరాసకు అందించిన ప్రజలకు తమ సంఘం కృతజ్ఞతలు చెప్పినట్లు రాజ్‌కుమార్‌ పేర్కొన్నారు.

వలచి...గెలిచి..

ప్రేమికుల రోజూ.. అదే సూర్యుడు. అవే ఇరుసంధ్యలు. అదే గాలి. అవే దిక్కులు. ఎప్పట్లాగే ఇరవై నాలుగ్గంటలు!! మరేమిటీ ప్రత్యేకం? ఏముంది? ప్రేమే!!...

‘శ్రీరస్తు శుభమస్తు’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌

అల్లు శిరీష్‌, లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘శ్రీరస్తు శుభమస్తు’. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను చిత్ర....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net