Wed, February 10, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ఈ హనుమంతుడు మృత్యుంజయుడు!''విద్యా విలీనం''ఆ నాటి హామీలను నెరవేర్చండి''తెరాస గూటికి కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే''కాల్పుల్లో అనూహ్య మలుపు''ఉగ్ర మూలం ఐఎస్‌ఐ''వెనక్కు పంపాం.. బహిష్కరణ కాదు''సుశీల్‌ కొయిరాలా కన్నుమూత''వెళ్లిరా నేస్తమా...''రాజ్యాంగం పవిత్రతను కాపాడాలి'
ఈ గెలుపు ప్రజలది.. వారి రుణం తీర్చుకుంటా
ఇక ప్రజలే నా కుటుంబం... వారికే కష్టం రానివ్వను
వీలైనంత త్వరగా రాజధాని నిర్మించి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తాం
సామాజిక, ఆర్థిక, పాలనా కేంద్రంగా రాజధాని
ఐదేళ్లలో పోలవరం నిర్మాణం పూర్తిచేస్తాం
ఏడాదిలో అవినీతి నేతలంతా జైలుకు
2019లో తెలంగాణలోనూ అధికారంలోకి
‘ఈనాడు’కు చంద్రబాబు ప్రత్యేక ఇంటర్వ్యూ
ఈనాడు - హైదరాబాద్‌
కప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పుడు 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌కు తొలి ముఖ్యమంత్రి కాబోతున్నారు. పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉండి తీవ్ర పోరాటాలు చేసిన ఆయన... సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ గద్దెనెక్కనున్నారు. ఆర్థికంగా కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి ఆయన వద్ద ఉన్న ప్రణాళికలు ఏమిటి? రాజధాని నిర్మాణంపై ఉన్న ఆలోచనలేంటి? రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణ మాఫీ, యువతకు ఉద్యోగాలు, పరిశ్రమల ఏర్పాటు తదితర అంశాలపై ఆయనకున్న ఆలోచనలు, కార్యాచరణ ప్రణాళికలు ఏంటన్న దానిపై ‘ఈనాడు’కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. విశేషాలు....

పదేళ్ల తర్వాత ముఖ్యమంత్రి కాబోతున్నారు. మీ మనసుకు ఏమనిపిస్తోంది?
ఈ పదేళ్లలో వూహించనివన్నీ జరిగాయి. నాలుగైదు నెలల క్రితం కాంగ్రెస్‌ పార్టీ చేసిన పనులు, ఆ పార్టీతో కుమ్మక్కై తెదేపాను దెబ్బతీయాలని వైకాపా-తెరాస చేసిన కుట్రలన్నీ ప్రజలు చూశారు. కుట్ర చేసిన కాంగ్రెస్‌ గల్లంతైంది. కుట్రకు సహకరించి, సమైక్యాంధ్ర అని కపట నాటకం ఆడిన పార్టీ ఓటమి పాలైంది. తెదేపా ఆనాడు సమన్యాయం చేయాలంది. ఇరు ప్రాంతాల వారిని కూర్చోబెట్టి మాట్లాడాలంది. విభజన చేయాలంటే హేతుబద్ధంగా చేయాలని చెప్పింది. చాలామంది నన్ను ఏదో ఒక పక్క తేల్చుకోండి అన్నారు. అర్థం చేసుకోలేదు. విభజన విషయంలో ఎన్ని అవమానాలు పడాలో అన్నీ పడ్డాను. ప్రజలు అర్థం చేసుకున్నారు. సరైన తీర్పు ఇచ్చారు. ఎన్టీఆర్‌ పెట్టిన పార్టీ ఇది. ఈ గెలుపు ప్రజలది. వారి కోసమే పనిచేస్తా.

సీమాంధ్రలోనే ప్రమాణ స్వీకారం అన్నారు. ఎంతకాలంలో అక్కడికి పరిపాలనను తరలిస్తారు? రాజధాని నిర్మాణం ఎన్నేళ్లలో పూర్తి చేస్తారు?
ప్రమాణ స్వీకారం అక్కడే చేస్తాను. వీలైనంత తొందరలోనే సీమాంధ్రకు పరిపాలన తరలిస్తాను. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ పని చేస్తాను. అవసరమైతే టెంట్లు వేసుకుని, తాత్కాలిక ఏర్పాట్లు చేసుకునైనా పాలన అక్కడి నుంచే జరిగేలా చేస్తా. రాజధాని నిర్మాణం కూడా వీలైనంత తొందరలోనే పూర్తి చేస్తాం.

అసలే నిధుల కొరత... రాజధాని నిర్మాణానికి మరిన్ని నిధులు అవసరం కాదా? కేంద్రం నుంచి ఎలాంటి సాయం తేగలుగుతారు?
నరేంద్ర మోడీ కూడా ఢిల్లీ అసూయ పడేలా ఆంధ్ర రాజధాని నిర్మిస్తామని చెప్పారు. ఆందోళనతో ఉన్న ప్రజలకు నేనున్నానని భరోసా ఇచ్చారు. నేను ఒక పని పట్టుకుంటే వదిలి పెట్టేవాడిని కాదు. ఖచ్చితంగా సాధించి తీరతాను. బ్రహ్మాండమైన రాజధాని నిర్మిస్తాను.

గతంలో హైదరాబాద్‌ను మాత్రమే అభివృద్ధి చేయడం వల్లే సమస్యలొచ్చాయంటున్నారు. మరిప్పుడు కొత్త రాజధాని విషయంలో ఎలాంటి విధానం అవలంభిస్తారు?
అది పొరపాటు. ఒక్కో చోట కొన్ని అనుకూలతలు ఉంటాయి. అన్నిచోట్లా క్రమంగా అభివృద్ధి చేయాలని అనుకున్నాం. రోడ్లు ఒక్క హైదరాబాద్‌లోనే కాదు. రాష్ట్రమంతా వేశాం. అప్పట్లో విదేశాల నుంచి హైదరాబాద్‌కు రావాలంటే నేరుగా విమానం ఉండేది కాదు. నేను హైదరాబాద్‌ను ప్రమోట్‌ చేస్తున్న సమయంలో... అక్కడికి ఎలా రావాలి అని అడిగే పరిస్థితి. బిల్‌ క్లింటన్‌ హైదరాబాద్‌ వస్తానంటే.. అప్పట్లో కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న ఎస్‌.ఎం.కృష్ణ మధ్యలో మంత్రాంగం నడిపారు. హైదరాబాద్‌కు విమానం కూడా నేరుగా వెళ్లదు. బెంగళూరు రావాలన్నారు. కానీ పట్టుదలతో బిల్‌ క్లింటన్‌ను తీసుకొచ్చా. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలను తీసుకొచ్చా. అదే సమయంలో విశాఖపట్నం, తిరుపతి నగరాల్లోనూ ఐటీ కంపెనీలు తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. కొన్ని ప్రారంభించేందుకు కసరత్తు చేశాం. అయితే అదే సమయంలో అధికారం పోయింది. గత పదేళ్ల నుంచీ ఏం జరిగిందో ప్రజలందరికీ తెలుసు.

పాదయాత్ర సమయంలోను, ఎన్నికల సమయంలోను రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నారు. డ్వాక్రా రుణమాఫీ అన్నారు. వీటన్నింటికీ నిధులెలా సమకూరుస్తారు?
పాదయాత్ర చేస్తున్న సమయంలో ప్రజల బాధలు, ఆవేదనలు చూసి రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ హామీలిచ్చా. అప్పటికి రాష్ట్రం సమైక్యంగా ఉంది. తర్వాత రాష్ట్ర విభజన జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ఎక్కడుందో, ఎంత బడ్జెట్‌ ఉందో నాకే కాదు ఎవరికీ తెలియని పరిస్థితి. అయినా నా హామీలకు కట్టుబడి ఉన్నా. రైతు రుణ మాఫీ, డ్వాక్రా రుణమాఫీ చేస్తా.

రుణ మాఫీ కోసం కేంద్ర సాయం కూడా అడుగుతారా? మాఫీపై మీ దగ్గరున్న కార్యాచరణ ప్రణాళిక ఏంటి?
మనసుంటే మార్గముంటుంది. అనేక రకాల ఆలోచనలు చేస్తున్నా. నేను రెండవ తేదీ తరువాత ప్రమాణ స్వీకారం చేసే నాటికి అసలు రాష్ట్ర పరిస్థితి ఏంటో కూడా తెలియదు. అయినా మరో ఆలోచన లేదు. కేంద్రం నుంచి కొంత సాయం అడుగుతాం. మరోవైపు రైతు రుణాలను రీషెడ్యూల్‌ చేసి, ఐదారేళ్లు మారటోరియం విధించి... రైతులకు కొత్త రుణాలు ఇచ్చేలా చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నా. బ్యాంకులు ఐదేళ్ల తర్వాత ప్రభుత్వాన్నే రుణ చెల్లింపుల కోసం అడిగేలా చేస్తే ఎలా ఉంటుందని దానిపై దృష్టి పెట్టా. ఇదొక్కటే కాదు. రకరకాల ఆలోచనలు చేస్తున్నాను. ఏదైనా రైతుకు ఉపశమనం కల్పించాలి. దీనిపై చర్చ చేస్తాం.

పరిశ్రమలను, పెట్టుబడులను ఆహ్వానించి ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ఏమైనా కసరత్తు ప్రారంభించారా?
నేను అధికారంలో ఉన్నప్పుడు పెట్టుబడులు పెట్టేందుకు ఎవరైనా వస్తే... వారికి వీఐపీ గౌరవం ఇచ్చేవాళ్లం. విమానాశ్రయం వద్దకే ఒక అధికారిని పంపించి తీసుకొచ్చే వాళ్లం. వాళ్లు పెట్టుబడులు పెట్టేవరకూ మాట్లాడేవాళ్లం. అందుకే సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు వచ్చాయి. ఉద్యోగాల కల్పన జరిగింది. కానీ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వచ్చాక ఏమైంది? ఎవరైనా పెట్టుబడి పెట్టేందుకు వస్తే.... నీకెంత? నాకెంత? అనేవాళ్లు. టైటానియం కుంభకోణంలో జరిగింది అదే. ఆ బాధ తట్టుకోలేక పలు కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌ వైపే చూడలేదు. ఇప్పుడు అందరినీ సమీకరిస్తా. సీమాంధ్రలో అద్భుతమైన మేధావులున్నారు. విదేశాలకు వెళ్లి స్థిరపడిన వారున్నారు. గొప్ప గొప్ప వైద్యులున్నారు. ఇంజనీర్లున్నారు. విదేశాల్లో విజయవంతంగా వ్యాపారాలు చేసి పైకెదిగిన వారున్నారు. అందరినీ అభివృద్ధిలో భాగస్వాములను చేస్తా. పెట్టుబడులు తీసుకొస్తాం. పరిశ్రమల స్థాపన జరిగేలా చేస్తాం.

తెలంగాణ ముఖ్యమంత్రితో ఎలా వ్యవహరిస్తారు?
విభజన నేపథ్యంలో కొన్ని అంశాలు పరిష్కారం కావాల్సి ఉంటుంది. దీనికి కేంద్రం చొరవ తీసుకోవాలి. అవసరమైన మేరకు తెలంగాణలో, సీమాంధ్రలోనూ తెలుగుదేశం పార్టీ తన పాత్ర పోషిస్తుంది. ఇక్కడి ప్రభుత్వంతోనూ అవసరమైన సందర్భాల్లో మాట్లాడతాం. సమన్యాయం జరిగేలాచేయడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యం.

కేంద్రం హామీ ఇచ్చిన ఐఐటీ, కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఎయిమ్స్‌ తదితర ప్రతిష్ఠాత్మక సంస్థలకు తొలి ఏడాదిలోనే నిధులు కేటాయించుకుంటే తప్ప ఐదేళ్లలో పూర్తికావు. కేంద్రంపై ఎలాంటి ఒత్తిడి పెడతారు?
నరేంద్ర మోడీ బాసటగా ఉంటారు. ఆయనకు అన్ని విషయాలు ఇప్పటికే చెప్పాం. సాధ్యమైనంత త్వరగా వీటికి నిధుల కేటాయింపు కోసం కృషి చేస్తాం. తొలి ఏడాది బడ్జెట్‌లోనే వీటికి నిధులు కేటాయింప చేసేందుకు ప్రయత్నం చేస్తాం. ఐదేళ్లలో వీటిని పూర్తి చేయడానికి రోజూ కష్టపడతా. ఎన్డీయే ప్రభుత్వంలో మేం కూడా భాగస్వాములవుతాం. ఎన్నికల ముందే మేం ఎన్డీయేలో చేరాం.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను పదేళ్లకు పెంచుతామని మోడీ అన్నారు. దీనిపై ఎప్పటిలోగా ప్రకటన చేయిస్తారు?
మేం 15 ఏళ్లకు ప్రత్యేక హోదా ప్రతిపత్తిని పెంచాలని అడుగుతున్నాం. దీనిపై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతాం. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, ఒడిదుడుకులూ వారికీ తెలుసు. రాష్ట్రాన్ని హార్డ్‌వేర్‌ రాజధానిగా చేస్తానని మోడీ కూడా అన్నారు. ఆ దిశగా అన్నీ సాధించేందుకు కృషిచేస్తా.
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మూడో స్థానానికి వెళ్లింది. ఎలా బలోపేతం చేయనున్నారు?
తెలంగాణలోనూ తెలుగుదేశం పార్టీకి బలమైన యంత్రాంగం ఉంది. అది ఈ ఎన్నికల్లోనూ రుజువైంది. తెలంగాణ నిర్మాణంలో తెలుగుదేశం కూడా పాత్ర పోషిస్తుంది. ఇక్కడ సామాజిక తెలంగాణ, బంగారు తెలంగాణ సాధించాలి. పార్టీ కార్యకర్తలు, యంత్రాంగం ఎక్కడా చెక్కు చెదరలేదు. కాంగ్రెస్‌ కంటే మెరుగైన స్థితిలో తెలుగుదేశం పార్టీని నిలబెట్టారు. ఇక్కడ మళ్లీ 2019లో కానీ, అంత కంటే ముందుకానీ అధికారంలోకి వస్తాం. ఆ దిశగా పార్టీని బలోపేతం చేస్తాం.

పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. దీనికి త్వరితగతిన నిధులు తెచ్చి నిర్దిష్ట కాలంలో పూర్తి చేయగలరా?
పోలవరం ప్రాజెక్టుకు ఖచ్చితంగా నిధులు సాధిస్తాం. దీనిపై ప్రత్యేక దృష్టి పెడతాం. ఎప్పటికప్పుడు నరేంద్ర మోడీతో మాట్లాడి నిధులు సాధిస్తాం. ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కృషి చేస్తాం. సాగునీటి జలాల విషయంలో కేంద్రం బోర్డుల ద్వారా పెత్తనం చేయాలనుకుంటోంది. దీనిపైనా ఆలోచన చేస్తాం. గత ప్రభుత్వ హయాంలో సాగునీటి ప్రాజెక్టులపై రూ.80 వేల కోట్లు ఖర్చు చేసినా రైతు పొలంలోకి మాత్రం నీరు పారలేదు. అవినీతికే ప్రభుత్వ సొమ్ము సరిపోయింది.

రాష్ట్రంలో జరిగిన అవినీతి కుంభకోణాలు, క్విడ్‌ప్రోకో వ్యవహారాలపై ఏం చర్యలు తీసుకుంటారు?
రాష్ట్రంలో జరిగిన వ్యవహారాలే కాదు. అవినీతి రహిత భారత్‌ ఏర్పడాలని నరేంద్ర మోడీ చెప్పారు. నేనూ చెప్పాను. అదే సకల సమస్యలకు పరిష్కారం. ప్రత్యేక కోర్టులు ఏర్పాటుచేసి అవినీతి పరులందరి పైనా విచారణ జరిపిస్తానని, చర్యలు తీసుకుంటామని కూడా మోడీ చెప్పారు. అవినీతి పరులైన ఎంపీలకు శిక్ష వేసి అనర్హులుగా ప్రకటిస్తామన్నారు. ఇది వ్యక్తులను దృష్టిలో పెట్టుకుని చేసేది కాదు. వ్యవస్థల బాగు కోసం, ప్రజల భవిష్యత్‌ కోసం, మళ్లీ ఎప్పుడు అవినీతి కుంభకోణాలు జరగకుండా ఉండడం కోసం చేయాల్సిన పని.

ఉద్యోగుల విషయంలో గతంలో మాదిరిగా కాకుండా ఈసారి పంథా మారుస్తానని పలుసార్లు చెప్పారు? ఎలా వ్యవహరిస్తారు?
గతంలో ఎక్కువ పని చేయాలి, ఎక్కువ ఫలితం సాధించాలి అనే ఉద్దేశంతో చేయడంతో కొంత ఇబ్బంది జరిగింది. అయితే ఈసారి అలా ఉండదు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసం వారిని భాగస్వాములుగా చేసుకుని వెళ్తా. వారి న్యాయమైన కోరికలు నెరవేరుస్తాం. అభివృద్ధి కోసం వారూ భాగస్వాములయ్యేలా చేస్తాం.

దేశంలోనే అత్యంత ఎక్కువ ఎన్నికల ఖర్చు రాష్ట్రంలోనే జరిగింది. ఒక్కో ఎమ్మెల్యే రూ.30 కోట్ల వరకూ ఖర్చు చేశారు. దీన్ని మార్చాల్సిన బాధ్యత మీపైనా ఉందా? లేదా?
ఇది వాస్తవం. విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టడమే కాదు. గతంలో ఎక్కడైనా మద్యం కొని పంచేవాళ్లు. కానీ ఇప్పుడు ఏకంగా కల్తీ మద్యం కంపెనీలే పెట్టి సరఫరా చేసేశారు. ఇలాంటిది చరిత్రలో ఎన్నడూ లేదు. ఈ పద్ధతి పోవాలి. ఒక సీనియర్‌ రాజకీయ నాయకుడిగా దీనిపై చేయాల్సింది చేస్తా. ఎన్నికల సంస్కరణలు కూడా రావాలి. రాజకీయ పార్టీలకు అయ్యే ఎన్నికల వ్యయాన్ని ప్రభుత్వమే భరించాలి. ఎన్నికల సంఘం ఇచ్చిన పరిమితిని మించి ఖర్చు చేయకుండా చూడాలి. దీనిపైనా అందరితో మాట్లాడి చేయాల్సింది చేస్తాం.

గత పదేళ్లుగా అధికార పార్టీపై పోరాడుతూ తెదేపా కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. వారికిప్పుడు ఎలాంటి ప్రాధాన్యం ఇస్తారు?
పదేళ్ల పాటు కార్యకర్తలు నానా కష్టాలు పడ్డారు. ఆస్తులమ్ముకున్నారు. ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇప్పుడు కార్యకర్తలే నా కుటుంబం. వారితో పాటు తెలుగు ప్రజలంతా నా కుటుంబం. ప్రతి మనిషి నా కుటుంబ సభ్యుడే. కొందరు నాకు ఓటువేసి ఉండొచ్చు. కొందరు వేయకుండా ఉండొచ్చు. కానీ ప్రజలంతా నా కుటుంబ సభ్యులే. ఇప్పుడిక నా పని కుటుంబ సభ్యుల్లో ఎవరికీ బాధలు లేకుండా చేయడం. వారి కళ్లల్లో ఆనందం చూడడం. ఎవరికి ఏ కష్టమొచ్చినా తీరుస్తా. అందరినీ ఆదుకుంటా. అండగా ఉంటా. తోడుగా నడుస్తా. ప్రతి ఒక్కరి భద్రతకు నాదీ పూచీకత్తు. ఇది నా బాధ్యతగా భావిస్తాను. ప్రతి క్షణం రాష్ట్ర అభివృద్ధికి కృషిచేస్తా.

మమ్మల్నీ ఉద్యోగులే అనుకున్నారు!

బయోటెక్నాలజీ రంగాన్ని చాలా ఇష్టంగా ఎంచుకున్నారా ఇద్దరు..!కానీ ఆ చదువుకు తగ్గ ఉద్యోగాల్లేవు.. ఈ పరిస్థితుల్లో ఎవరయినా ఉన్నచోటే వేరే ఉద్యోగాలు చూసుకోవడమో...

హాలీవుడ్‌లో మెరుస్తున్న బాలీవుడ్‌

హాలీవుడ్‌లో బాలీవుడ్‌ జెండా ఎగరేస్తే ఎంత బాగుంటుందో... చాలాకాలంగా బాలీవుడ్‌ను వూరిస్తూ వచ్చిన ఈ లక్ష్యాన్ని మన తారలు ఒక్కొరొక్కరిగా సాధిస్తూ వస్తున్నారు....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net