Sun, February 07, 2016

Type in English and Give Space to Convert to Telugu

'కడలి వేదికగా కదన విన్యాసం''కల్తీల నుంచి కాపాడాలి''ఎస్సై కొలువులకు సై''వాట్సన్‌ @ రూ. 9.5 కోట్లు''హామీలు నెరవేర్చే వరకు దీక్ష''అన్నయ్యే వారసుడు..''ప్రజల మనసులు చూరగొంటూ..''సాగర జలాల్లో స్నేహబంధం''కాగిత రహిత టికెట్ల దిశగా రైల్వే''అనుమతి లేకుండా ప్రాజెక్టులు'
అవిశ్రాంత పోరాటయోధుడు
అవినీతి, అరాచకం, రాజకీయ కుట్రలపై
పదేళ్లుగా అలుపెరగని పోరాటం
గెలిపించినా, ఓడించినా ప్రజలతోనే
ఆటుపోట్లు ఎదురైనా అడుగు ముందుకే
ఇదీ చంద్రబాబు ప్రస్థానం
ఈనాడు - హైదరాబాద్‌
పార్టీనే లేకుండా చేస్తామన్న కొందరి హెచ్చరింపులు...ఫినిష్‌ చేసేస్తామన్న మరి కొందరి బెదిరింపులు.. ఇక ఈ పార్టీ గెలవడం అసాధ్యం.. అంతా మా గాలే వీస్తోంది అన్న ప్రత్యర్థులు.. ప్రత్యర్థి పార్టీలన్నీ కలిసి చేసిన రాజకీయ కుట్రలు, మానసిక దాడులు... వీటన్నింటినీ తట్టుకుని తెలుగుదేశం నిలబడింది. కిందపడ్డా మళ్లీ పైకి లేచింది. పడిలేచిన సముద్ర కెరటంలా ఉవ్వెత్తున ఎగసింది. దేశంలోనే పదేళ్ల పాటు ఒక ప్రాంతీయ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న చరిత్ర లేదు. పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ పార్టీ క్రియాశీలంగా ఉన్న చరిత్రా లేదు. పదేళ్లలో తెలుగుదేశం ఎదుర్కొన్న ఆటు పోట్లు అన్నీ ఇన్నీ కావు. పలుసార్లు నిరాశ, నిర్వేదం, నిస్పృహ ఆ పార్టీలోను, నేతల్లోను నెలకొనేది. రాజశేఖర్‌రెడ్డి నుంచి రాష్ట్ర విభజన వరకూ ఏదైనా తమ పార్టీని దెబ్బ తీయడానికే చేశారని మథన పడేవారు. అయితే ఎన్ని ఒడిదుడుకులొచ్చినా పోరాట పంథానే కొనసాగించిన నాయకుడు చంద్రబాబు. 54 ఏళ్లప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన ఆయన 65 ఏళ్ల వయసులో కూడా రోజూ నేతలను నడిపిస్తూ... కార్యకర్తలకు భరోసా ఇస్తూ ప్రజా సమస్యలపై పోరాడారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలతో ఉండడమే ఏకైక మార్గమని నమ్మారు. పలువురు పార్టీ నేతలు ప్రత్యర్థి పార్టీల్లోకి వెళ్లిపోయినా... చలించలేదు. ఒక నాయకుడు పోతే పది మంది నేతల్ని తయారుచేస్తామంటూ శ్రేణులకు భరోసా ఇచ్చి ముందుకు నడిపించారు. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రల్ని ధైర్యంగా ఎదుర్కొన్నారు. నిరంతరం ఆయనది పోరాటమే. ఒకవైపు అవినీతి అక్రమాలపై పోరాటం... మరోవైపు ప్రజా సమస్యలపై మీ కోసం రథయాత్ర, రైతు గర్జన, రైతు పోరుబాట, తెలుగుజాతి ఆత్మగౌరవ యాత్ర... ఇలా నిత్యం ప్రజా బాటే. చివరకు 63 ఏళ్ల వయసులో పాదయాత్రకు తెగించారు. నిజంగా అది తెగింపే. ఒక వీధి నుంచి ఇంకో వీధికి నడిచి వెళ్లడమే కష్టమనుకుంటున్న ఈ రోజుల్లో వూరి నుంచి మరో వూరికి, మండలం నుంచి మరో మండలానికి, జిల్లా నుంచి మరో జిల్లాకు నడుస్తూ...రాష్ట్రాన్ని చుట్టేశారు. 2,817 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. బీదా, బిక్కీని పలకరించారు. అన్ని వర్గాల బాధల్ని విన్నారు. అందరికీ న్యాయం చేస్తానన్నారు. పదేళ్ల పాటు ప్రజల్లోనే ఉండి పోరాడిన ఆయనకు... ఆ ప్రజలే మద్దతుగా నిలిచారు. కార్యకర్తలతో నాయకుడు...ఆయన వెంట కార్యకర్తలు ఒకరికొకరు అన్నట్లుగా శ్రమించి విజయ తీరానికి చేరుకున్నారు.

పార్టీకి జీవన్మరణం...
చంద్రబాబు జీవితంలో అత్యంత సంక్లిష్ట సమయం ఈ పదేళ్ల కాలమే. ఒకరకంగా చెప్పాలంటే ఈ ఎన్నికలు పార్టీకి జీవన్మరణం... చంద్రబాబుకు సంక్లిష్ట పరీక్షలా మారాయి. రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలోను, ఆ తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా... ఎన్నడూ ఇంతటి సంక్షోభాన్ని ఎదుర్కొన్నది లేదు. 2004లో ఓడిపోయే నాటికి ఆయన ప్రజల కోసం పడిన కష్టమే తప్ప...పార్టీ కోసం కష్టపడాల్సిన అవసరం రాలేదు. ఆ తర్వాత ఆయన పైనా, పార్టీ పైనా వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చేసిన జులుం, నాయకుల హత్యలు, కార్యకర్తలపై హింస అసాధారణం. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని ఒక భయానక వాతావరణాన్ని సృష్టించారు. ఎవరైనా సరే మేం చేసిన దానికి సరే అనాల్సిందే... కాదంటే డబ్బు, అధికారంతో అణచి వేయడమే అన్న వైఖరి ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసింది. చంద్రబాబు పాలనలో జరిగిన వివిధ వ్యవహారాలపై 26 విచారణ కమిటీలను వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి వేశారు. ఈ పదేళ్ల కాలంలో ఆయనపై ఒక్క అవినీతి ఆరోపణా రుజువు కాలేదు. మరోవైపు తెలుగుదేశం నేతలు, కార్యకర్తల హత్యాకాండ అంతులేకుండా సాగింది. పరిటాల రవి హత్య నుంచి... వందల మంది కార్యకర్తల వరకూ హత్యకు గురయ్యారు.

కుట్ర రాజకీయాలు...కొత్త పార్టీలు
ఒకవైపు అవినీతి, అహంలతో నిండిన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఠాతో చంద్రబాబు పోరాడుతూ ఉండగానే.. 2009 ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో గెలుస్తామన్న ధీమా తెదేపాలో వ్యక్తమవుతున్న సమయంలో రాష్ట్ర రాజకీయ రంగంపైకి కొత్త శక్తులు వచ్చాయి. ప్రజారాజ్యం, లోక్‌సత్తా, నతేపా లాంటి పార్టీలు తెర మీదకు వచ్చాయి. తెర వెనుక ఏం జరిగిందనే దానిపై ప్రజల్లో చాలా వాదనలు ఉన్నాయి. ఐదేళ్లపాటు శ్రమించి, కూడగట్టిన ప్రభుత్వ వ్యతిరేకతను కొత్త పార్టీలు తమ శక్తిమేర చీల్చేశాయి. దీంతో మళ్లీ చంద్రబాబు అధికారానికి ఆమడ దూరంలో ఉండిపోయారు. రెండోసారి వరుసగా ఓడిపోయే సరికి పార్టీలో నైరాశ్యం కమ్మేసింది. ఇక ఈ పార్టీ ఉంటుందా? మరో ఐదేళ్ల పాటు మనుగడ సాగిస్తుందా? అని అనేక మంది అనుమానాలు వ్యక్తం చేసిన సమయమది. ఆ తర్వాత వైఎస్‌ చనిపోయాక తెలుగుదేశాన్ని దెబ్బ తీసేందుకు కాంగ్రెస్‌ అధినాయకత్వం సరికొత్త వ్యూహం రచించింది. తెరాస, వైకాపాలు కూడా తెదేపాపైనే దాడి చేయడం సాగించాయి. ఈ రాజకీయ వ్యూహంలో తెదేపా ఆత్మరక్షణలో పడింది. మూడు పార్టీలూ తెలుగుదేశానికి అధికారం కల అనే స్థాయికి తెచ్చాయి.

పట్టు వదలని పాద యాత్రికుడు
ఏ పనైనా పట్టుకుంటే దాన్ని సాధించే వరకు వదిలిపెట్టని తత్త్వం చంద్రబాబుది. ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా, తాను చేస్తున్న పోరాటాలను పాలకులు గడ్డిపోచల్లా తీసి పారేస్తున్నా, హేళన చేస్తున్నా, ప్రజల్లో ఇంకా అభిమానం ప్రోది చేసుకోకున్నా.... పోరాటం ఆపలేదు. పోరాడుతూనే ఉన్నాడు. రైతాంగ సమస్యలపై ఏడు రోజుల పాటు ఆమరణ నిరాహారదీక్ష చేశారు. రైతు పోరుబాట యాత్ర చేపట్టారు. తుఫానులు వచ్చినా, వరదలొచ్చినా, కరవొచ్చినా పాలకపక్షం కంటే ముందు ప్రజల్లో వాలిపోయేవారు. వారికి తోచినంత మేర అండగా నిలబడ్డారు. కర్నూలులో వరదలొస్తే ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ద్వారా ఆగమేఘాలపై సేవలందించారు. బట్టలు, ఆహార పదార్థాలను ప్రత్యేక వాహనాల్లో తరలించారు. ‘‘వరదల్లో చిక్కుకున్న వారు మన వాహనాల దగ్గరకు రాలేరు. మీరే వెళ్లి ఇంటింటికీ బట్టలు, ఆహార పదార్థాలు ఇవ్వాలి’’ అని చెప్పిన వ్యక్తి ఆయన. ఉత్తరాఖండ్‌లో వరదల్లో చిక్కుకున్న తెలుగు వారి కష్టాలపై ప్రభుత్వం స్పందించకుంటే తానే స్వయంగా వెళ్లారు. వయసు సహకరిస్తుందా లేదా అనే సంశయాన్ని పక్కన నెట్టి 63 ఏళ్ల వయసులో ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. 117 రోజుల పాటు పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. ఇన్ని రోజులు చేస్తామని ప్రకటించేశారు? మధ్యలోనే ఆగిపోతే? మధ్యలోనే పడిపోతే?..ఇలా పలు ప్రశ్నలు. అయితే ఆయన పోరాట పటిమ ముందు వయసు ఓడిపోయింది. 208 రోజుల పాటు 2,817 కిలోమీటర్ల మేర ప్రజలతో కలిసి నడిచారు. పాద యాత్రికుడు ప్రజా యాత్రికుడిగా మారారు. కార్యకర్తలు అండగా నిలిచారు. ఆ తర్వాత జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సైకిల్‌ దూసుకెళ్లింది. కాంగ్రెస్‌ అధిష్ఠానం తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నట్లు ప్రకటించి.. చంద్రబాబుపై పరోక్షంగా ఒత్తిడి పెంచింది. వైకాపా లాంటి పార్టీలు ఈ తరుణంలో తారుమారు తక్కెడమార్‌ అన్నట్లుగా తమ వైఖరిని మార్చేశాయి. చంద్రబాబు అటు, ఇటు రెండు ప్రాంతాల నేతల్ని సమన్వయం చేసుకుంటూ, ప్రజలకు అర్థమయ్యేలా చెప్తూ.. తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు. తెలంగాణకు వ్యతిరేకం కాదు...కానీ ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేయడం లేదంటూ ఢిల్లీలో ఉన్న ప్రతీ పార్టీ కార్యాలయానికీ తిరిగారు. గోడు వినే నాథుడే లేకుండా పోయారు. విభజన జరిగింది. ఆ తర్వాత సీమాంధ్రలో విభజనకు కారణం చంద్రబాబేనంటూ విమర్శలు, తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రానికి అడ్డు పడ్డారంటూ దాడి. రెండు ప్రాంతాలకు సమన్యాయం చేయాలంటూ ఢిల్లీలో తెలుగువాడి ఆత్మ గౌరవ దీక్ష పేరుతో ఏడు రోజుల పాటు నిరవధిక దీక్ష చేశారు. అనంతరం తెలుగుజాతి ఆత్మగౌరవ యాత్ర పేరుతో సీమాంధ్రలో పర్యటించారు. ప్రజలు వేడిగా ఉన్నారు.. వద్దని పలువురు వారించినా, ఆ ప్రజలకే వాస్తవాలు చెప్దాం, జరిగిన కుట్ర వెల్లడిద్దాం అంటూ యాత్ర చేశారు. అడ్డుకున్న వారికి ఓపిగ్గా సమాధానం చెప్పారు. తెర వెనక పరిణామాలను అర్థమయ్యేలా చేశారు.

అవినీతిపై ఎలుగెత్తి సమరం
లెక్కలేనంత అవినీతి, దాన్ని ఎదిరించిన వారిని చిదిమేసేందుకు వెనకాడని దారుణమైన పరిస్థితి ఉన్న రోజులవి. వూహకందని డబ్బు వచ్చి పడడంతో తాము తలచిన దానికి వ్యతిరేకంగా ఉండేవారి వూపిరి కూడా తీసేందుకు వెనకాడని రోజులవి. గనుల గజనీ గాలి జనార్దన్‌రెడ్డి.... తెలుగుదేశం పార్టీని లేకుండా చేస్తానని, అసలు చంద్రబాబు మనిషేనా? అని పత్రికాముఖంగా విషం వెళ్లగక్కిన కాలమంది. మా పార్టీలోకి రా! ఎంత కావాలో తీసుకో! అని వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి తెదేపా నేతలను ఆకర్షించిన రోజులవి. తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును ఫినిష్‌ చేస్తానంటూ శాసనసభలోనే వైఎస్‌ హెచ్చరించిన కాలమది. అసలు తమకు వ్యతిరేకంగా గాలి వీచినా... దాని అంతు చూద్దామనేంత అహం ఉన్న ప్రభుత్వాలు, వారి తాబేదారుల రాజ్యం సాగిన రోజులవి. అంతటి సంక్షిష్ల కాలంలో చంద్రబాబు అలుపెరగని పోరాటాన్ని కొనసాగించారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకూ... రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రపతి వరకు అన్ని స్థాయిల్లో పోరాటం సాగించారు. చెప్పులరిగేలా ఢిల్లీ చుట్టూ తిరిగారు. ప్రధాని, రాష్ట్రపతి, సీబీఐ, ఈడీ అందరికీ ఫిర్యాదులు చేశారు. సూట్‌కేసుల్లో వాటా అందుకున్న వారెవరూ స్పందించలేదు. సాగునీటి ప్రాజెక్టులన్నీ ఒకేసారి కాకుండా ఒకదాని తర్వాత ఒకటి, కొన్ని ప్రాజెక్టులు తర్వాత కొన్ని చేపట్టాలంటే... జలయజ్ఞాన్ని అడ్డుకుంటున్న రాక్షసుడు చంద్రబాబు అంటూ ఎదురు దాడి చేశారు. చివరకు అన్ని ప్రాజెక్టుల మీదా రూ.80 వేల కోట్లు చల్లినా...రైతుల పొలాల్లోకి సాగునీరు పారలేదు. రైతాంగ సమస్యలపై ఏడు రోజుల పాటు నిరవధిక నిరాహారదీక్ష చేశారు.
అభివృద్ధి నినాదం.. పరిపాలనా అనుభవం
సీమాంధ్ర ప్రజల్లో ఎన్నికలకు కొద్దినెలల ముందు నుంచీ మార్పు వచ్చింది. విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని మళ్లీ దరిచేర్చగలిగింది చంద్రబాబేనని విశ్వసించారు. ఆయన పదేళ్ల పాటు చేసిన పోరాటాలు, ప్రజా సమస్యలపై చేసిన ఉద్యమాలు ఫలించాయి. భాజపాతో పొత్తు వూతం పనికొచ్చింది. స్వచ్ఛందంగా ముందుకొచ్చిన పవన్‌కళ్యాణ్‌ మద్దతు తోడైంది. లక్ష కోట్లు తినేశారంటే... ఎవరు తినలేదు... కాస్త అటూ, ఇటూ అంతేనన్న వారిని ప్రజలు ఛీకొట్టారు. చీదరించారు. ప్రతిపక్షంలోనూ ప్రజల వెంటే ఉన్న చంద్రబాబులోని నాయకత్వ లక్షణాలకు మద్దతిచ్చారు. అలుపెరగని ఆయన పోరాటాలను ఆశీర్వదించారు. గద్దెనెక్కించారు.
ఆరు పదులు దాటినా.. ఆమరణ దీక్షలు
ప్రజా సమస్యల పరిష్కారం కోసం తన ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా చంద్రబాబు పలుసార్లు నిరవధిక నిరాహారదీక్షలకు దిగారు. ప్రతిపక్ష పార్టీ ప్రజల తరఫున పోరాడుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోని సందర్భంలో చివరి అస్త్రంగా నిరాహార దీక్షలకు దిగేవారు. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు, ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు దీక్షలు ఉపయోగపడతాయనే అనేవారు. చాలాసార్లు ఆయన ఆరోగ్యం ప్రమాద స్థాయికి చేరింది. రైతు సమస్యలపై రైతు దీక్ష, రాష్ట్ర విభజన అనంతరం ఇరు ప్రాంతాలకూ న్యాయం చేయాలంటూ ఢిల్లీలో తెలుగువారి ఆత్మగౌరవ దీక్ష... ఇలా పలుసార్లు ఆయన నిరాహారదీక్షలు చేపట్టారు. ఆ వయసులోనూ ఆరు రోజులు, ఏడు రోజుల పాటు చిత్తశుద్ధితో నిరాహార దీక్షలు చేశారు.

వెలుగు వైపు నా అడుగులు...

బడిగంట కొట్టగానే పిల్లలందరూ బిలబిలమంటూ బయటకు పరుగుతీశారు. టీచర్లూ ఇంటిదారిపట్టారు. ఒకరిద్దరు తప్ప నిర్మానుష్యంగా మారిన ఆ బడిలో..

పరిశ్రమ వదిలి వెళ్లిపోదామనుకున్నా!

మానవీయ కోణాల్ని స్పృశిస్తూ సినిమాలు తీయడంలో దర్శకుడు మదన్‌ది ప్రత్యేక శైలి. మనిషి, మనసు, అనుబంధాల మధ్య సంఘర్షణల్ని ఆయన తెరపైకి తీసుకొచ్చే విధానం బాగుంటుంది.

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net