Fri, February 12, 2016

Type in English and Give Space to Convert to Telugu

'వైజ్ఞానిక మైలురాయి''విశ్రమించిన వీరుడు''మేయర్‌ ఎన్నిక ఏకగ్రీవం''కారెక్కిన మరో తెదేపా ఎమ్మెల్యే''‘బేర్‌’మన్న స్టాక్‌ మార్కెట్లు''‘ఆధార్‌’ ఇక తప్పనిసరి కాదు''కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయం''ఎంపీల జీతభత్యాలు త్వరలో రెట్టింపు!''మార్చి మొదటి వారంలో ‘పుర’ ఎన్నికలు''మేడారం జాతరను జాతీయ పండుగగా ప్రకటించండి'
సన్యాసి కావాలనుకొని... ప్రధాని అవుతున్నారు!
‘‘ నా జీవితంలో సుఖం, సౌఖ్యం అనేది ఎన్నడూ లేదు. నాకున్నది ఓ చిన్న సంచి మాత్రమే! అందులోనే నా జీవితమంతా ఉండేది! అంతకుమించి ఏమీ ఉండేది కాదు. దాదాపు 30 సంవత్సరాలు నా జీవితం ఇంతే! తిన్న చోట తినకుండా... ఉన్న చోట ఉండకుండా తిరిగాను. ఎన్నడూ ఒకేరకం తిండి మళ్ళీ తినలేదు. ఎన్నడూ నాకిష్టమైన, నేనెంచుకున్న తిండి తినలేదు. ప్రతి రోజూ ఉదయం ఎవరో ఒకరింటికి వెళ్ళి ‘ఇవాళ మీ ఇంటికి వస్తాను. కాస్త భోజనం పెడతారా?’ అని అడగటమే! మరుసటి రోజు ఇంకో ఇల్లు! వాళ్ళు ప్రేమతో పెట్టే ఆ భోజనం నాకు పరమామృతం! ’’
‘‘నేను కారు తుడిచే పనిలో ఉంటే... ఎలా తుడిచే వాడినంటే... యజమాని నా పనితీరు చూసి భలే చేస్తున్నాడే... వీడికి డ్రైవింగ్‌ నేర్పండి. పనికొస్తాడు అని అనేలా! ఇలా ఏ పనిచేసినా, ఏ పని అప్పగించినా... ఆ పని చిన్నదైనా పెద్దదైనా నా పూర్తిస్థాయి సామర్థ్యాల్ని పెట్టి చేస్తా. అందులో పూర్తిగా మునిగితేలుతా! నా గతం గురించిగానీ, భవిష్యత్‌ గురించిగానీ ఆలోచించను’’
- మోడీ
చాలామంది నాయకుల వల్ల వారు పుట్టి పెరిగిన వూర్లకు పేరు ప్రఖ్యాతులొస్తాయి. నరేంద్ర మోడీ వూరు వాద్‌నగర్‌ కూడా అలాంటిదే అనుకుంటే పొరపాటు! ఎందుకంటే... చరిత్రలో ఇప్పటికే వాద్‌నగర్‌ పేరు లిఖితమై ఉంది! అహ్మదాబాద్‌కు సుమారు నూరు కిలోమీటర్ల దూరంలోని ఈ పట్టణం ఎప్పుడో ప్రపంచం చుట్టివచ్చింది. విశ్వవిఖ్యాత సంగీతకారుడు తాన్‌సేన్‌ను తమ సంగీతంతో బతికించిన సంగీత సోదరీమణులు తానా-రీరీల పుట్టిల్లు వాద్‌నగర్‌! అంతేగాకుండా... ఏడో శతాబ్ధిలోనే ప్రముఖ బౌధ్ధక్షేత్రంగా చరిత్రకెక్కిందిది.

సుమారు పదివేల మంది బౌద్ధసన్యాసులు వాద్‌నగర్‌లోని హాస్టల్లో ఉండేవారని ప్రఖ్యాత చైనా యాత్రికుడు హియాంగ్‌సాంగ్‌ ప్రత్యక్ష అనుభవాన్ని గ్రంధస్థం చేశారు.

ఆ ప్రభావమో లేక... మరేంటోగాని... నరేంద్ర మోడీలో కూడా చిన్నప్పటి నుంచీ ఆధ్యాత్మిక చింతన ఎక్కువ! దానికి తోడు... వివేకానందుడి ప్రభావం కూడా బాగా పడటంతో సంప్రదాయంలో ఆధునికతను వెతికే సృజనశీలిగా ఎదిగారు! 20 ఏళ్ళైనా నిండకుండానే... సన్యాసం స్వీకరించాలని విఫలయత్నం చేసిన మోడీ... చివరకు ప్రధాన మంత్రి పీఠాన్ని అధిరోహించబోతున్నారు! అనూహ్య మలుపులతో సాగిన మోడీ జీవన చిత్రాన్ని... చూస్తే....

ఈనాడు- హైదరాబాద్‌
ప్రతి విషయాన్నీ భిన్నమైన కోణంలో చూడటం; సంప్రదాయంగా కాకుండా... అందరుచేసినట్లుగా కాకుండా నవ్యత కోసం తపించటం; ఆధునికీకరించాలన్న ఆరాటం... చిన్నప్పటి నుంచీ ఇదే మోడీ పద్ధతి! స్కూల్లో మాస్టారు పాఠాలు చెబుతుంటే.... ‘ఇలా ఎందుకు చేయాలి? ఇలా చేస్తే సులభం కదా...’’ అంటూ ప్రత్యామ్నాయాలు చూపేవాడు! సంప్రదాయ మూస పద్ధతులను ప్రశ్నించేవాడు. తల్లి ఏదైనా పని చేస్తుంటే అమ్మా... ఇలా ఎందుకు... ఇలాచేయొచ్చు గదా అంటూ చూపించేవాడు. చివరకు బట్టలు ఉతకటంలో కూడా! కొత్త టెక్నిక్‌తో చేసి చూపించేవాడు. కుటుంబ సభ్యులందరి బట్టల్ని తీసుకెళ్ళి వూరి చెరువులో ఉతుక్కొని వచ్చేవాడు. తానెలా ఉతుకుతాడో చూట్టానికి చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చేవారు. మోడీలోని ఈ ప్రశ్నించే తత్వాన్ని, కొత్తదనాన్ని వెతికే గుణాన్ని చూసి సంతోషించినప్పటికీ... తల్లి హీరాబెన్‌లో ఓ సందేహం బెరుకుతునే ఉండేది... ‘వీడెన్నడో సమాధానాలు వెదుకుతూ ఇల్లూ, వూరూ... వదిలేసి పోతాడేమో’నని! అనుకున్నట్లే చేశాడు మోడీ!
 
డిగ్రీ పూర్తి చేసుంటే....
దమూడో ఏట వాద్‌నగర్‌ ప్రాథమిక పాఠశాల నుంచి మరో స్కూల్‌కు మారే దశలో సైనిక్‌ స్కూల్లో చేరాలని మోడీ తపించాడు. కాస్త దూరంలోని జామ్‌నగర్‌లో ఉందది. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో తండ్రి అందుకు అంగీకరించలేదు. దాంతో మోడీ వాద్‌నగర్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది.

వివేకానందుడి బోధనలతో ప్రభావితమైన మోడీ... ఆయనలాగే పాశ్చాత్యీకరణను అనుసరించకుండా ... మన సంప్రదాయాల్ని పాటిస్తూనే ఆధునికీకరణ గురించి ఆలోచించాలనుకునేవాడు. భారతదేశం తన అస్తిత్వాన్ని కాపాడుకుంటూనే... ఆధునిక దేశంగా ఎదగగలిగే సత్తా సంస్కృతి, సంప్రదాయాల్లో ఉందనేది మోడీ నమ్మకం! ఆరెస్సెస్‌లో ప్రవేశం.... వివేకానందుడి ప్రభావం... వీటన్నింకి తోడు సహజంగానే తనలో ఉన్న అంతర్గత అన్వేషణ, సృజనాత్మక ఆలోచన విధానం అన్నీ కలసి... టీనేజీలోనే ఆయనలో పరిణతి తెచ్చాయి. అనేకానేక ఆధ్మాత్మిక భావనలతో మనసంతా అల్లకల్లోలమవుతుంటే... తనకెదురవుతున్న బోలెడన్ని ప్రశ్నలకు సమాధానం వెదికే క్రమంలో డిగ్రీ పూర్తి చేయకుండానే ఇల్లు విడిచిపెట్టాడు. తల్లీదండ్రుల ఆశీర్వాదం తీసుకోవటం మాత్రం మరవలేదు. బాధతోనే అయినా... నుదిటిన తిలకం దిద్ది పంపించింది తల్లి! ఎటో తెలియదు! ఎటని అడిగితే... హిమాలయాలకని సమాధానమిచ్చాడు!

తండ్రి ఛాయ్‌ కొట్టులో పనిచేసి సంపాదించిన కొద్దిమొత్తంతో పాటు, వాద్‌నగర్‌లోని వ్యాపారుల దుకాణాల వద్ద వంటనూనె డబ్బాలు మోసి సంపాదించిన కొద్దిపాటి సొమ్ము.... ఓ రెండు జతల దుస్తులతో ఇంట్లోంచి బయటపడ్డాడు.

మొదట కోల్‌కత చేరుకున్నాడు. బేలూర్‌లోని రామకృష్ణమఠ్‌లో చేరాలనుకున్నాడు. కానీ డిగ్రీ పూర్తిచేసినవారికే ప్రవేశం అనటంతో నిరాశతో వెనుదిరిగాడు. గౌహతికి చేరుకుని... అక్కడ ఓ యోగితో నెలరోజుల పాటు ఆధ్యాత్మిక సంభాషణల్లో గడిపి... హిమాలయ సమీపంలోని అల్మోరాలో వివేకానందుడు నెలకొల్పిన ఆశ్రమానికి చేరుకున్నాడు. సన్యాసం స్వీకరించాలనుకున్నాడు. కానీ... ఇక్కడా కోల్‌కతా బేలూర్‌మఠ్‌లో ఎదురైన సమాధానమే వచ్చింది. డిగ్రీ పూర్తిచేసి రావాలని! దాంతో... నిరాశతో గుజరాత్‌ తిరిగి వచ్చిన మోడీ... రాజ్‌కోట్‌లోని రామకృష్ణ మిషన్‌లో మరోసారి ప్రయత్నించాడు. స్వామి ఆత్మాస్థానందజీని కలిసి తన మనసులో మాట చెప్పాడు. ఆయనతో చర్చించాడు. 19 ఏళ్ళు కూడా నిండని యువ మోడీలోని ఉత్సాహాన్నీ ఆలోచనల్నీ, ఆవేశాన్నీ, సందేహాల్నీ విన్న స్వామీజీ... సన్యాసం స్వీకరించాలన్న ఆలోచన మానేయాలని సూచించారు. నీ ప్రశ్నలకు సమాధానాలిక్కడ దొరకవనీ... నీ లక్ష్యం మరోటుందనీ... అక్కడే వెతుక్కోవాలనీ చెప్పి పంపించేశారు. దాంతో ఆలోచనల నుంచి ఆచరణ దిశగా మళ్ళింది మోడీ మనసు! ఇది జరిగింది 1969లో! మళ్ళీ 2013లో మోడీ కోల్‌కతా వెళ్ళినప్పుడు స్వామీజీ అక్కడున్నారు. ఆయన్ను కలసి నాటి సలహాకు కృతజ్ఞతలు తెలిపారు మోడీ! రెండేళ్ల పాటు మాయమైన మోడీ ఉన్నట్టుండి ఓరోజు వాద్‌నగర్‌లో ఇంటికొచ్చారు. కానీ 24 గంటలైనా గడవకముందే వెళ్ళిపోయారు. మళ్ళీ ఇరవై ఏళ్ళ దాకా రాలేదు! అహ్మదాబాద్‌లో ఆరెస్సెస్‌లో ఉంటూ... ఆర్టీసీ క్యాంటీన్‌ ఛాయ్‌ అమ్ముతూ జీవనం మొదలెట్టాడు.

వెనక బెంచిలో కూర్చొని....
క్రమశిక్షణతో కూడిన పనితీరే మోడీకి ఆరెస్సెస్‌లో అంచెలంచెలుగా ఎదిగేలా పాలనాదక్షుడిగా చేశాయి. ఎమర్జెన్సీ సమయంలో అత్యంత కీలకబాధ్యత పోషించి... అందరికీ తలలో నాలుకలా మెసలుకున్న మోడీని ఆరెస్సెస్‌ ‘ఢిల్లీ’కి ప్రమోట్‌ చేసింది. ఆ తర్వాత భాజపాలో అరంగేట్రానికి దారి తీసింది. 1987లో గుజరాత్‌ భాజపా నిర్వాహక కార్యదర్శిని చేసింది.

అంతర్గత సమావేశాల్లో ఎప్పుడూ వెనకబెంచిలో కూర్చునేవాడు. అంతా మాట్లాడేది వినేవాడు. ఇక సమావేశం పూర్తయి... నిర్ణయం తీసుకునే దశలో... నోరు విప్పేవాడు. ఓసారి.... గుజరాత్‌లోని ఓ ప్రాంతంలో తీవ్రమైన క్షామం వచ్చింది. ఈ దశలో ఆరెస్సెస్‌ రంగంలోకి దిగి పేదలకు సాయం చేయాలనుకుంది. ఇందుకోసం అంతర్జాతీయంగా కూడా నిధులు సేకరించాలని చర్చించారు. ఆ దిశగా నిర్ణయం దాదాపు పూర్తయిన దశలో మోడీ... మాట్లాడటం మొదలెట్టాడు. ‘‘మీరు మాట్లాడొద్దంటే మాట్లాడను. కానీ నాదో విన్నపముంది’’ అన్నాడు మోడీ! దాంతో వాళ్ళు... సరే అదేంటో చెప్పమన్నారు! ‘‘మన దగ్గర క్షామానికి విదేశాల ముందు చేతులు చాచటం ఎందుకు? మనకు బోలెడంత మానవవనరులున్నాయి. లక్షల కుటుంబాలున్నాయి. వీళ్ళంతా కుటుంబానికి రోజుకు కొంత సుక్రి (అదో రకమైన పౌష్ఠికాహార పదార్థం) ఇస్తే చాలు. దాన్ని క్షామ ప్రాంతాల్లో పంచిపెడదాం! అదే విధంగా పశువులను క్షామ ప్రాంతాల నుంచి పచ్చటి ప్రాంతాలకు తరలిద్దాం. ప్రభుత్వం ఎలాగూ ఉచితంగా రైళ్ళు కూడా అందజేస్తానంటోంది....’’ అంటూ తన ప్రత్యామ్నాయ పథకం చెప్పాడు మోడీ! దానికి ఓకే అన్నారంతా! కోటి రూపాయలు విదేశాల నుంచి సేకరించాలనుకున్న చోట... 30 కోట్ల రూపాయల పనిచేశారట!

వెళ్ళగొడితే... తిరిగొచ్చారు...
గుజరాత్‌ భాజపాలో బాధ్యతలు చేపట్టిన యువ మోడీ తన నిర్వహణ శైలితో... వ్యూహాలతో పార్టీని పటిష్ఠం చేశారు. అద్వానీ, జోషీలాంటివారి యాత్రలకూ ప్రణాళికలు రచించి భేష్‌ అనిపించుకున్నారు! జాతీయ నేతలు వాజ్‌పేయి, అద్వానీల కంట్లో పడ్డారు. ఇతర రాష్ట్రాల బాధ్యతలూ అప్పజెప్పటం మొదలైంది. దాంతో గుజరాత్‌లోని స్థానిక సీనియర్‌ నేతలకు కన్నుకుట్టింది. మోడీని అణచివేయసాగారు! చివరకు ప్రతి కమలనాథుడూ గర్వంగా భావించే అయోధ్య సంఘటనలోనూ మోడీని దూరంగా ఉంచారు! తననెంత ఇబ్బంది పెట్టినా, అవమానాలకు గురిచేసినా... మోడీ ఎన్నడూ తన క్రమశిక్షణ వీడలేదు. నోరు జారలేదు. ఆరెస్సెస్‌లో తన ఆది గురువు వకీల్‌ సాహెబ్‌ సంస్మరణార్థం అహ్మదాబాద్‌లో ఏర్పాటు చేసిన సంస్కారధామ్‌ పాఠశాలే మోడీకి రెండో ఇల్లయింది. అవమానాల కాలంలో ఆయన్ను ప్రేమగా అక్కున చేర్చుకుంది. ఇప్పటికీ మోడీకి ఆ స్కూలంటే ఎంతో ఇష్టం. దాని బాగోగులను తానే స్వయం చూసుకుంటుంటారు. భాజపా అధ్యక్షుడైన అద్వానీ... 1994లో మోడీని పార్టీ ప్రధాన కార్యదర్శిగా మళ్ళీ గుజరాత్‌కు పంపించారు. లక్షా 50వేల మంది కార్యకర్తలకు శిక్షణనిచ్చే బాధ్యత అప్పజెప్పారు. అది అద్భుత ఫలితాలనిచ్చి... శాసనసభ ఎన్నికల్లో భాజపాకు అధికారాన్ని అందించింది. శంకర్‌సింహ్‌వాఘేలా (అప్పుడు భాజపాలో ఉండేవారు) తిరుగుబాటు జెండా ఎగరవేసి... కాంగ్రెస్‌తో కలసి ప్రభుత్వాన్ని పడగొడతానని బెదిరించి మోడీని గుజరాత్‌ నుంచి పంపించేశారు. అదీ కష్టించి పనిచేసే మోడీకి కలిసే వచ్చింది. 1995లో అద్వానీ ఏకంగా మోడీని జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ప్రధాన కార్యదర్శిగా దేశమంతా తిరిగి... 1999లో పార్టీ అధికార ప్రతినిధిగా విదేశాల్లో పర్యటించి... ఎంతో అనుభవం గడించారు.
వద్దంటే వచ్చింది సీఎం పదవి...
2001లో భుజ్‌ భూకంపం... అవినీతి ఆరోపణలు... అస్తవ్యస్త పరిస్థితులతో గుజరాత్‌లో కేశూభాయ్‌ పటేల్‌ సారథ్యంలో భాజపా ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరవుతున్న దశ! ఆ దశలో ప్రధాని వాజ్‌పేయి నుంచి ఫోన్‌ వచ్చింది... ‘‘నిన్ను గుజరాత్‌ ముఖ్యమంత్రిని చేస్తున్నాం. తక్షణమే వెళ్ళాలి’’ అని! అప్పటిదాకా ఎన్నడూ ఏ ఎన్నికలోనూ నిలబడని వాడు, ప్రభుత్వంలో పనిచేసిన అనుభవం లేనివాడైన మోడీ తక్షణమే వాజ్‌పేయికి నే వెళ్ళలేనని చెప్పేశాడు! కావాలంటే కొద్దిరోజులు గుజరాత్‌లో ఉండి పరిస్థితులు చక్కబెట్టివస్తానన్నాడు. చివరకు అద్వానీ చెబితే అయిష్టంగానే సీఎం పదవిచేపట్టారు.
తానెవరి మనిషి?
2002 ఫిబ్రవరిలో ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రమాణస్వీకారం చేసిన రెండోరోజే గోద్రా... తదనంతర సంఘటనలతో గుజరాత్‌ అల్లకల్లోలమైంది! సైన్యం సాయం అందక.. పక్కనున్న కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలూ పోలీసు సాయం చేయక... ఉన్న సిబ్బందితోనే ఎలాగోలా రేయింబవళ్ళు కష్టపడి పరిస్థితిని నియంత్రణలోకి తీసుకొచ్చిన మోడీ మనసు వికలమైంది. ఏదైతే అదవుతుందని... గడువుకంటే ముందే శాసనసభను రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. కానీ లింగ్డో సారథ్యంలోని ఎన్నికల కమిషన్‌ ఎంతకూ ఎన్నికల నిర్వహణకు ముందుకు రాకపోవటంతో సుప్రీంకోర్టులో పోరాడి ఎన్నికలను సాధించుకున్నారు. అస్తవ్యస్త పరిస్థితుల మధ్య మోడీ ఓడిపోతారనే అనుకున్నారంతా! కానీ...అందరిఅంచనాలను తల్లకిందులు చేస్తూ... ఘనవిజయంతో ప్రజాతీర్పు పొందాడు. రెండోసారి అధికారంలోకి రాగానే... ప్రక్షాళనకు నడుంబిగించాడు. పార్టీకీ... ప్రభుత్వానికి మధ్య లక్ష్మణ రేఖ గీశాడు. తానెవరి మనిషి కాదనీ... ముఖ్యమంత్రిగా ప్రజల మనిషిననీ... పార్టీకి కూడా స్పష్టంచేశాడు. వందలాది మందిరాలను, మసీదులను తొలగించి రోడ్ల వెడల్పు చేపట్టారు. చివరకు సొంతపార్టీవారే... మోడీని ‘ఘజ్నీ’తో పోల్చటం మొదలెట్టారంటే ఎంతగా పార్టీతో విడిపోయి అభివృద్ధి మంత్రం పఠించారో అర్థంచేసుకోవచ్చు. పార్టీకంటే కూడా ఎక్కువగా ఆలోచించిన మోడీ... తన ఆలోచనలను ఆచరణలో పెట్టడానికి, తన కలల్ని నెరవేర్చుకోవటానికి గుజరాత్‌ను ప్రయోగశాలగా చేశారు. అందరికీ సమానావకాశాలు కల్పించేలా చేశారు. 2002లో వేళ్ళమీద లెక్కించేంత మంది మైనార్టీలు మోడీకి ఓటు వేస్తే... 2012లో మోడీకి 31శాతం మైనార్టీలు ఓటు వేశారంటేనే పరిస్థితిని అర్థంచేసుకోవచ్చు. 2002 తర్వాత మళ్ళీ గుజరాత్‌లో మతకల్లోలాలు చోటు చేసుకోలేదు.
మీరే ముఖ్యమంత్రైతే...
మొదట పార్టీని ఎక్కడుంచాలో అక్కడుంచిన మోడీ... తర్వాత అధికార యంత్రాంగంపై దృష్టి పెట్టారు. అధికారులతో తొలి సమావేశంలోనే.... ‘‘ముఖ్యమంత్రిగా మీకు పూర్తి అధికారాలిస్తున్నాను. ఐదేళ్ళలో ఏం చేస్తారో చెయ్యండి! మీకున్న వనరులేంటి? మీ లక్ష్యాలేంటి? మీ ఉద్దేశాలేంటి? వాటినెలా సాధించబోతున్నారు? రోడ్‌మ్యాప్‌ చెప్పండి! చేసి చూపండి! ఏవైనా సమస్యలు ఎదురైతే నేను బాధ్యత తీసుకుంటాను. అలాగని అవినీతికి పాల్పడితే సహించేది లేదు. అవినీతి తీసుకోను... ఎవరినీ తీసుకోనివ్వను అనేది నినాదంగా పనిచేయాలి’’ అని స్పష్టంచేశారు. అన్నట్లుగానే ఎవరైనా అవినీతికి పాల్పడ్డట్లు తేలితే నాన్చుడు లేకుండా తక్షణ తీసేయ్యటమే! దీంతో... శాఖలన్నీ పోటీపడి పనిచేశాయి. చాలా రాష్ట్రాల్లో ఐఏఎస్‌లు, అధికారుల బదిలీలు పదేపదే జరుగుతుంటాయి. కానీ గుజరాత్‌లో చాలా మంది అధికారులు పదేళ్ళుగా ఒకే చోట పనిచేస్తున్నారు. ఆనందంగా! గుజరాత్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అసీఫాఖాన్‌ ఓసారి... ‘‘మోడీలోని తప్పుల్ని, ప్రభుత్వ లోపాల్ని ఎత్తి చూపించటం నా బాధ్యత. కానీ ఎంత వెదికినా ఒక్క తప్పు కూడా పట్టలేకపోయాను. సరికదా... మా పార్టీలోనే తప్పులు కనిపిస్తున్నాయి’’ అని వ్యాఖ్యానించారు.
విభిన్నం.. వైవిధ్యం
* 2001 అక్టోబరులో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టేనాటికి నరేంద్రమోడీ ఎన్నడూ ఏ ఎన్నికా నెగ్గలేదు. చివరకు కార్పొరేటర్‌గా కూడా అనుభవం లేదు. నేరుగా ముఖ్యమంత్రి పదవి ఆయన్ను వరించింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాకే... ఉప ఎన్నికలో నిలబడి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

* నరేంద్రమోడీ బాల్య స్నేహితుల్లో చాలామంది ముస్లింలే! ఆప్తమిత్రుడు జాసూద్‌ ఖాన్‌ పఠాన్‌!

* స్కూల్లో చదివేప్పుడు టీచర్‌ ఓసారి ఇంటిపని (హోంవర్క్‌)ను దిద్దమని క్లాస్‌ మానిటర్‌కు ఇచ్చిందట! అందుకు మోడీ అంగీకరించలేదు. కేవలం మీరు (టీచర్‌) మాత్రమే నా హోంవర్క్‌ దిద్దాలి అంటూ పట్టుబట్టి మరీ సాధించుకున్నారు.

* 14 ఏళ్ళ వయసప్పుడు మోడీని చూసి... ఓ జ్యోతిష్యుడు ఇతను సన్యాసి అవుతాడు... లేదంటే గొప్ప రాజకీయ నాయకుడవుతాడు... మొత్తానికి ప్రపంచమంతా గుర్తిస్తుంది అని చెప్పాడు.

* వాద్‌నగర్‌ మీదుగా రోజూ ఎనిమిది ప్రయాణికుల రైళ్ళు వెళ్ళేవి. అవి వచ్చే సమయానికి మోడీ స్కూల్‌ నుంచి పరుగెత్తుకొని వచ్చి తండ్రికి చాయ్‌ అమ్మటంలో సహకరించేవాడు. చైనాతో యుద్ధ సమయంలో రైల్వే స్టేషన్‌కు వచ్చిన సైనికులకు ఛాయ్‌ ఇస్తూ వారిలా తానూ సైనికుడు కావాలని కలలు కనేవాడు. సైనికులకు అదనంగా ఛాయ్‌ పోసేవాడు. అహ్మదాబాద్‌కు మారాక అక్కడ కూడా ఆర్టీసీ క్యాంటీన్‌లో టీ అమ్మేవాడు.

* మోడీ తల్లి పనిమనిషిగా చేసి సంపాదించేవారు. పేడతో అలికే మూడుగదుల ఇంట్లో... మురికివాడలో ఉండేవారు. ఎంత చలికాలమైనా రోజూ చన్నీళ్ళ స్నానం మోడీ అలవాటు.

* కుటుంబ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తన వస్తువులను, దుస్తులను మోడీ జాగ్రత్తగా కాపాడుకునేవాడు. ఇస్త్రీ చేయించుకోవటానికి డబ్బులు లేకపోవటంతో రాత్రి వాటిని మడతపెట్టి తలగడకింద పెట్టుకొని పడుకునేవాడు.

* మోడీ ముఖ్యమంత్రి కాగానే తల్లి చెప్పిన మాట.... ‘‘కొడుకా... ఎన్నడూ లంచం తీసుకోకు’’ అని! మోడీ ముఖ్యమంత్రి అయ్యాక కూడా కుటుంబ సభ్యులెవ్వరూ సీఎం ఇంటికి పని చేసి పెట్టమంటూ అడుగుపెట్టలేదు.

* మోడీకి మొట్టమొదటి రాజకీయ పరిచయం కాంగ్రెస్‌ నేత వల్లే! తండ్రి ఛాయ్‌ కొట్టు దగ్గర్లోనే రసిక్‌భాయ్‌ దవే అనే కాంగ్రెస్‌ నేత కార్యాలయం ఉండేది. మోడీకి ఆరేళ్ళ వయసప్పుడు ప్రత్యేక గుజరాత్‌ రాష్ట్ర ఉద్యమం సాగుతుండేది. ఆ కరపత్రాలు రసిక్‌భాయ్‌ ఆఫీసులో తీసుకొని వాటన్నింటినీ కుర్రాళ్ళకుపంచేవాడు మోడీ. విషయమేంటో అర్థంగాకున్నా... రసిక్‌భాయ్‌ చెప్పినట్లు నినాదాలు చేసేవాడు.

* చిన్నప్పుడు మోడీ ఖో-ఖో; ఆ తర్వాత క్రికెట్‌, వాలీబాల్‌ బాగా ఆడేవాడు. వ్యక్తిగత ఆటలకంటే జట్టుగా ఆడేవంటే ఇష్టం.

* మోడీ ప్రతి ఏటా దసరా ముందు. చైత్ర మాసంలో కఠిన ఉపవాసం ఉంటారు. ఎంత కఠోర నిష్ఠ అంటే మంచినీళ్ళు తప్పిస్తే ఏమీ తీసుకోరు. నా అంతఃశుద్ధి కోసం చేస్తానిది అంటారు మోడీ!

* ఓసారి తల్లితోపాటు వెళుతుంటే మోడీకి రోడ్డుపై రూపాయి బిళ్ళ దొరికింది. ఏమైనా కొనుక్కో అని తల్లి అంటే... మోడీ మాత్రం ఆ రూపాయిని పుస్తకాలు, పెన్సిళ్ళు కొనుక్కోలేని ఓ పేద రైతు కూతురుకిచ్చాడు.

* ఎమర్జెన్సీ సమయంలో గాంధేయవాదులతో, సోషలిస్టులతో, ముస్లిం సంస్థలతో, కమ్యూనిస్టులతో... స్వతంత్ర భావాలున్నవారితో... ఇలా అన్ని రకాల నేతలతో మోడీ కలసి పనిచేశారు. ఆ సమయంలోనే ప్రజాస్వామ్యం, హక్కులు, రాజ్యాంగం...లాంటి వాటి విలువ తెలుసుకున్నాననీ... అందుకే ఈ కాలం తనను మార్చేసిందంటుంటారు! ఎమర్జెన్సీ తనకో విశ్వవిద్యాలయంలా పనిచేసిందంటుంటారు.

* ఆరెస్సెస్‌ కార్యాలయంలో బట్టలుతుకుతూ... గిన్నెలు కడుగుతూ, బిల్డింగ్‌ వూడుస్తూనే ఢిల్లీ యూనివర్సిటీ నుంచి రాజనీతి శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు.

* అత్యంత క్రమశిక్షణగల భాజపా కార్యకర్త నరేంద్ర మోడీ పేరు వివాదాస్పద అయోధ్య బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో ఎక్కడా కానరాదు. ఎందుకంటే ఆ సమయంలో ఆయన కొన్నాళ్ళపాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తనకెంతో ఇష్టమైన సంస్కారధామ్‌ పాఠశాలలో పిల్లలతో గడిపారు.

సమంత@100 కేజీలు

మొదటి సినిమాలో సన్నగా సన్నజాజి తీగలా కనిపించి..రెండో చిత్రానికి వచ్చేసరికి బొద్దుగుమ్మగా దర్శనమిచ్చారు ఎంతో మంది కథానాయికలు....

సావిత్రి... టీజర్‌ విడుదల

నారా రోహిత్‌, నందిత జంటగా పవన్‌ సాదినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సావిత్రి చిత్ర టీజర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ప్రేమికుల రోజు శుభాకాంక్షలతో చిత్ర బృందం ఈ టీజర్‌ను విడుదల చేసింది. విజన్‌ ....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net