Sun, February 14, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ప్యాకేజీ ఇవ్వండి''విలీనమా.. అనర్హతా?''అదనపు పనులన్నీ పాత గుత్తేదారులకే''భారతమాతను కించపరిస్తే సహించం''‘తెలంగాణ బ్రాండ్‌’ పేరుతో అమ్మకాలు''శాశ్వత ఉత్సవంగా మేడారం జాతర''కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయం''విలీన లేఖపై ఏమి చేయాలి?''వీరసేనానికి కన్నీటి వీడ్కోలు''అమ్మతనానికి అండ'
జడలు విప్పిన ఎర్ర మాఫియా
అన్ని రాష్ట్రాల్లోనూ ఉనికి!
ప్రధాన నగరాల్లో స్మగ్లింగ్‌ కేంద్రాలు
ఎర్రమాఫియా డాన్‌లు హమీద్‌, లక్ష్మణన్‌
విదేశీయులతో వైకాపా నేతలు గంగిరెడ్డి, విజయానందరెడ్డి
‘ఈనాడు’ పరిశోధనలో వాస్తవాలు
‌్రరచందనం దుంగల రవాణా వెనుక దేశవ్యాప్తంగా భారీ మాఫియా సామ్రాజ్యం నడుస్తోంది. ఈ మాఫియాను నడుపుతున్న వారి వెనుక బడానేతలు, సహకరించే వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారుల పాత్ర ఉన్నట్లు స్పష్టమవుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలను వేదికగా చేసుకుని స్మగ్లర్లు రూ.కోట్ల దందా నిర్వహిస్తున్నారు. విదేశాల్లో కిలో చందనం రూ.లక్షకు పైగానే పలుకుతోంది. ఈ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని స్మగ్లర్లు ఎంతటి సాహసానికైనా వెనుదిరగడం లేదు. రెండు రాష్ట్రాల్లోని జిల్లా కేంద్రాలను, సరిహద్దులను ఆసరాగా చేసుకుని ఇతర సామగ్రి రవాణా పేరుతో చందనాన్ని రహస్యంగా దాటిస్తున్నారు. సరిహద్దు భద్రతా దళం, ఓడరేవుల్లోని అధికారుల ఉదాసీనతతో ఎర్రచందనం విదేశాలకు వెళ్లిపోతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఆరు జిల్లాల్లో ఐదున్నర లక్షల ఎకరాల్లో విలువైన అటవీసంపద ఉంది. చిత్తూరు, తిరుపతి, కడప ప్రాంతాలలోని శేషాచలం అడవుల్లో ప్రపంచంలోనే విలువైన ఏ గ్రేడ్‌ ఎర్రచందనం చెట్లు ఉన్నాయి. వీటిపై కన్నేసిన అక్రమార్కులు పదేళ్లుగా రవాణా చేస్తున్నారు. ఉత్తరభారతంలో కొన్ని ఉగ్రవాద ముఠాలతో స్మగ్లర్లకు సంబంధాలు ఉండొచ్చనే అనుమానాలు ఉన్నాయి. ఎర్రచందనం రవాణా తీరును ‘ఈనాడు’ పరిశోధించింది.
- ఈనాడు, చిత్తూరు
విదేశాలతో అక్రమ వ్యాపారంలో చేయి తిరిగిన స్మగ్లర్లంతా మయన్మార్‌(బర్మా) దేశానికి చెందిన వారే కావడం ఆందోళన కలిగిస్తున్న అంశం. మణిపూర్‌, మిజోరాం, అస్సాం, ఢిల్లీ, బీహార్‌ రాష్ట్రాల ప్రధాన నగరాల్లో మకాం వేసి ఉన్న స్మగ్లర్ల నేపథ్యమంతా బర్మాకు చెందినదే. విక్రం, లక్షణన్‌, శర్వణన్‌, శర్వణన్‌-2లు బర్మా నుంచి శరణార్ధులుగా మన దేశానికి వచ్చారు. వారి పేర్లు దక్షిణ భారతానికి చెందినట్లు ఉన్నా వారి పూర్వీకులు బర్మాలో స్థిరపడిన వారేనని తేలింది. వారు మన దేశంలోకి చొరబడి క్రమంగా స్థానికంగా ఉండే అక్రమవ్యాపారాల్లో తలదూర్చారు. అనంతరం వారి కన్ను దక్షిణ భారతదేశంపై పడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన చోటామోటా స్మగ్లర్లు ఎర్రచందనం విక్రయాల సమయంలో అవస్థ పడుతుండటం కలిసి వచ్చింది. దాన్ని అదనుగా చేసుకుని ఏకంగా కొనుగోళ్లకు తెరలేపారు. నిల్వ చేసి కాలం కలసి వచ్చినప్పుడు బర్మా, బంగ్లాదేశ్‌కు తరలిస్తున్నారు. అక్కడి నుంచి సరిహద్దులు దాటించి చైనా చేరవేస్తున్నారు.
‘ఏ’ గ్రేడు బడా స్మగ్లర్‌ హమీద్‌
కర్ణాటకలోని కటికనహళ్లీ పట్టణంలో ఉండే హమీద్‌ బడా స్మగ్లర్‌గా తయారయ్యాడు. ఆంధ్రప్రదేశ్‌లోని చోటామోటా స్మగ్లర్లతో సంబంధాలు పెట్టుకుని కుబేరుడయ్యాడు. ఇప్పుడు ఏకంగా వేల టన్నుల ఎర్రచందనం దుంగలను విదేశాలకు తరలిస్తున్నాడు. నిత్యం యాభైమంది అనుచరులను వెంటపెట్టుకుని తిరిగే హమీద్‌ స్థిరాస్తి వ్యాపారంలోనూ ఉన్నాడు. ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్‌, చెన్నై, కోల్‌కతాలలో ఇతడి ముఠాలు పనిచేస్తున్నాయి. తన వ్యాపారాలకు అడ్డొచ్చిన వారిని రూ.కోట్లు ఇచ్చి మచ్చిక చేసుకుంటాడు. లేదంటే బెదిరించడం, అపహరించడం వెన్నతోపెట్టిన విద్య. ప్రధానంగా రోడ్డుమార్గంలో స్మగ్లింగ్‌ చేయడంలో దిట్ట. ఆయన అనుచరులు విదేశాల్లో ఏజెంట్లుగా పనిచేస్తున్నారు.
భయంకర స్మగ్లర్‌ లక్ష్మణన్‌
దేశంలో ఉన్న స్మగ్లర్లలో లక్ష్మణన్‌ భయంకరమైన వాడిగా చీకటిసామ్రాజ్యంలో పేరుంది. కొందరు సినీతారలను వలలో వేసుకోవడం, అమ్మాయిలను డబ్బుపెట్టి కొనడం, ఆయుధాలతో సంచరించడం, బడా వ్యాపారులు, నాయకులతో సంబంధాలు నెరపడంలో అతడికి అతడే సాటి. ఢిల్లీ కేంద్రంగా ఎర్రచందనం వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు. చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లోని కలపను స్థానిక స్మగ్లర్ల వద్ద కొనుగోలు చేస్తాడు. దాన్ని తెలివిగా రాష్ట్రాల సరిహద్దులు దాటించి ఢిల్లీలో నిల్వ చేస్తాడు. ఆగ్రా, లక్నో, పాట్నా, మణిపూర్‌, అస్సాం, బర్మా, బంగ్లాదేశ్‌లలోనూ సొంత గోదాంలు, మనుషులు ఉన్నారు. హాంకాంగ్‌, చైనాలతో రహస్య వ్యాపారాలు నిర్వహిస్తున్నాడు. ఒక్క ఎర్రచందనం లోడు నుంచి దాదాపు రూ.ఐదారు కోట్లు సంపాదించే లక్ష్మణన్‌ రోజు ఖర్చు రూ.50 లక్షల నుంచి కోటి వరకు ఉంటుందనేది అంచనా. మనుషులను పోషించడం, వాహనాలు, విలాసవంతమైన సూట్‌లలో నివాసం, అనుకూలంగా ఉండే అధికారులు, సిబ్బందికి విడిది ఏర్పాటుచేయడం లాంటివాటికి విరివిగా ఖర్చుచేస్తాడు.

కటికనహళ్లిలో రియాజ్‌.. ఫయాజ్‌
బడా స్మగ్లర్‌ హమీద్‌కు కుడి, ఎడమగా వ్యవహరిస్తున్న రియాజ్‌, ఫయాజ్‌లది కర్ణాటక రాష్ట్రంలోని కటికనహళ్లి. ఇక్కడే మరో పాతికమంది బడా స్మగ్లర్లు, పదిహేనుమంది చోటామోటా స్మగ్లర్లు పనిచేస్తున్నారు. రియాజ్‌, ఫయాజ్‌లే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని స్మగ్లర్లతో చురుకుగా వ్యాపారం చేస్తున్నారు. రియాజ్‌ కడప, చిత్తూరు జిల్లాల్లోని రెడ్డి నారాయణ, మహేష్‌నాయుడు, గజ్జెల శ్రీనివాస్‌తో వ్యాపారం చేస్తున్నాడు. ఫయాజ్‌ కడప జిల్లాలోని లక్ష్మణ్‌నాయక్‌, నాగరాజ్‌ నాయక్‌, శ్రీశైలం ఆంజనేయులు అలియాస్‌ అంజిలలకు చెందిన అనుచరుల వద్ద ఎర్రదుంగలు కొనుగోలు చేస్తున్నాడు. రియాజ్‌, ఫయాజ్‌లు ఇద్దరు హమీద్‌కు ఏ గ్రేడు సరకు విక్రయిస్తున్నారు.

విజయానందరెడ్డి పాత్ర
వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి అనుచరుడు, ఆ పార్టీ చిత్తూరు జిల్లా స్టీరింగ్‌ కమిటీ సభ్యుడైన విజయానంద్‌రెడ్డి నేరుగా విదేశాలకు ఏ గ్రేడు చందనాన్ని సరఫరా చేస్తున్నాడు. ఇప్పటికే ఆయనకు చెందిన నిల్వలు చిత్తూరు, కడప, కర్నూలు, బెంగళూరు, చెన్నై, ముంబయి నగరాల్లో కొన్నిచోట్ల ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఒకప్పుడు రియాజ్‌, ఫయాజ్‌లకు విక్రయించే విజయానంద్‌రెడ్డి ఐదేళ్లుగా ఏకంగా విదేశాలకు ఎగుమతి చేస్తున్నాడు. బడా స్మగ్లర్లు హమీద్‌, లక్ష్మణన్‌లతో నేరుగా సంబంధాలు నెరుపుతున్నాడు. ముంబయి, చెన్నై, కృష్ణపట్నం ఓడరేవుల ద్వారా విజయానంద్‌రెడ్డి కొన్ని కంటెయినర్లు దుబాయికి పంపినట్లు విశ్వసనీయ సమాచారం. చిత్తూరు, కడప జిల్లాలోని కింది స్థాయి ఎర్ర వ్యాపారులను బెదిరించడం, అపహరించి వారి దుంగలను ఎత్తుకెళ్లడం ఆయనకు వెన్నతోపెట్టిన విద్య. చెక్‌పోస్టులు, తనిఖీల్లో అధికారులను రూ.కోట్లతో మచ్చిక చేసుకున్నట్లు సమాచారం.

అధికారులకు రూ.కోట్లు చల్లిన గంగిరెడ్డి
ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబుపై అలిపిరి దాటి ఘటనలో నిందితుడుగంగిరెడ్డికి కూడా విదేశీ వ్యాపారులతో నేరుగా సంబంధాలు ఉన్నాయి. హమీద్‌, లక్ష్మణన్‌లకు కూడా ఆయన ఎర్రచందనం దుంగలు విక్రయించాడనే సమాచారం పోలీసుల వద్ద ఉంది. కొందరు అధికారులకు తిరుపతిలోని ఓ విలువైన ప్రాంతంలో రూ.కోట్ల విలువ చేసే స్థలం, భవనాలు నిర్మించి ఇచ్చాడన్న సమాచారం ఉంది. దీనిపై నిఘా వర్గాలు ఇప్పటికే విచారణ ప్రారంభించాయి.

ఓడరేవుల్లో ‘కస్టమ్స్‌’కు మస్కా
ఆంధ్రప్రదేశ్‌ నుంచి విదేశాలకు దుంగలు ప్రధానంగా ఓడల్లోనే తరలుతున్నాయి. కంటెయినర్లలో తరలించే గూడ్సు మధ్య దుంగలను ఉంచి దుబాయ్‌, బంగ్లాదేశ్‌లకు తరలిస్తున్నారు. చెన్నై ఓడరేవులో ఏడాది వ్యవధిలో 180 సార్లు ఎర్రదుంగలు బయటపడ్డాయి. వైజాగ్‌లోనూ కంటెయినర్‌లో పంపేందుకు విఫలయత్నం చేశారు. ప్రస్తుతం ముంబయి,. కాండ్ల రేవుల ద్వారా పంపేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. కంటెయినర్‌లో దుంగలు పంపాలంటే ఎంతో నైపుణ్యం అవసరం. రేవులకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో మూతపడిన పరిశ్రమల అనుమతులు స్మగ్లర్లు సంపాదిస్తున్నారు. అక్కడ కంటెయినర్‌లో సామగ్రి నింపే సమయంలో కొందరు కస్టమ్స్‌ అధికారుల నేతృత్వంలో పని పూర్తిచేసి ఓడరేవు చేర్చాల్సి ఉంటుంది.

సరిహద్దుల్లోనూ ఇదే తంతు
స్సాం, మిజోరాం సరిహద్దులు, నేపాల్‌, బంగ్లాదేశ్‌, బర్మాల సరిహద్దుల్లో ఎర్రచందనం దాటించడంలో స్మగ్లర్లు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇటీవలే పోలీసులకు చిక్కిన అంతర్జాతీయ స్మగ్లర్‌ ఒకరు తెలిపిన వివరాలు నివ్వెరపరుస్తున్నాయి. సరిహద్దు భద్రతా దళంలోని కొందరు అధికారులను మచ్చిక చేసుకుని తెలివిగా గూడ్సు వాహనాలను సరిహద్దు ఆవలికి పంపిస్తున్నారు. లేదంటే కొన్ని ప్రాంతాల్లో సరిహద్దు కంచెకు రెండు వైపులా వాహనాలు ఉంచి దుంగలను మార్పిడి చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

నియంత్రణకు ప్రత్యేకాధికారాలున్న విభాగం
విదేశాలతో సంబంధం ఉన్న ఎర్రచందనం రవాణాను పూర్తి స్థాయిలో నియంత్రించాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరింత అప్రమత్తం కావాల్సి ఉంది. కేవలం రాష్ట్రాల మధ్యనే ఉన్న అక్రమం కాదనేది ఇటీవలే వెలుగుచూస్తున్న సంఘటనలు చెబుతున్నాయి. రవాణా నిరోధానికి నిజాయితీ, నిబద్ధత ఉన్న ఐపీఎస్‌ అధికారులను, అటవీ, రెవెన్యూశాఖల ఉద్యోగులను ఎంపిక చేసి బృందంగా ఏర్పాటుచేయాల్సి ఉంది. విదేశాలలో పరిశీలించాల్సి ఉన్నందున రెడ్‌కార్నర్‌ నోటీసు జారీచేసే శక్తితోపాటు సంబంధిత అధికారాలను ఈ బృందానికి ఇవ్వాల్సి ఉంది. అన్ని రాష్ట్రాల్లోని నిఘా, పోలీసు, భద్రత దళాలను సమన్వయం చేయాల్సి ఉంది. ప్రమేయం ఉన్న నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గకుండా దర్యాప్తు చేసేందుకు బృందానికి స్వతంత్ర అధికారాలు కల్పించాల్సి ఉంది.

మా వూరికి మంచి నీళ్లు...

బాగా ఆస్తిపాస్తులున్న వాళ్లని శ్రీమంతులంటారు.మహేశ్‌బాబు నటించిన ‘శ్రీమంతుడు’ చూశాక ఆ అర్థం మారిపోయిందనే చెప్పవచ్చు. ఎక్కడ పెరిగినా, స్థిరపడినా సొంతూరి...

ఎన్టీఆర్‌ ‘దండయాత్ర’కు ఏడాది..!

‘ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం.. అదే ఒక్కడు మీదడిపోతే.. దండయాత్ర.. ఇది దయా గాడి దండయాత్ర’. పవర్‌ఫుల్‌ డైలాగులతో ఎన్టీఆర్‌ తెలుగు సినీ సెల్యులాయిడ్‌పై చేసిన దండయాత్రకు ఫిబ్రవరి 13తో ఏడాది పూర్తైంది. ‘వన్‌ ....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net