Sun, February 14, 2016

Type in English and Give Space to Convert to Telugu

'భారత్‌లో తయారీకి బ్రహ్మరథం''ఐపీఎస్‌లను పెంచండి''పాకిస్థాన్‌కు అధునాతన ఎఫ్‌-16 యుద్ధవిమానాలు''ఖేడ్‌లో 81.72 శాతం పోలింగ్‌''దిండి మొదటి దశ పనులకు త్వరలో టెండర్లు''మెదక్‌ నిమ్జ్‌లో చైనా పెట్టుబడులు..''చెలకల్లో.. అవినీతి మొలకలు!''మార్చి 10 నుంచి శాసనసభ సమావేశాలు''మళ్లీ తెరపైకి ఓటుకు నోటు కేసు''కళతో సామాజిక సందేశం'
సింగపురం అవుదామా?
ఎన్నికలొస్తేచాలు... ఎన్ని వరాలో! ఈ నేలను భూతల స్వర్గంగా మారుస్తాననే వారొకరైతే... మీ ఇంటిని స్వర్గధామం చేస్తాననేవారు ఇంకొకరు! కానీ ఈసారి మన నాయకులు మాత్రం స్వర్గాల సంగతి పక్కనబెట్టి మనందరికీ ఓ హామీ ఇస్తున్నారు. స్వర్గం కాదు... సింగపూర్‌లా చేస్తామని! ఇంతకూ ఏముందని ఈ సింగపూర్‌లో? వారికున్నదేంటి? మనకు లేనిదేంటి? వారిలా మారితే మనకొచ్చే లాభమేంటి? వారి నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటి? ఆదర్శంగా తీసుకోవాల్సిందేంటి? ఇదీ అరచేతిలో వైకుంఠమా? లేక అందే స్వప్నమా?
ఎన్నికలొస్తేచాలు... మన నాయకులు తరచూ ఓ హామీ ఇస్తుంటారు. రాష్ట్రాన్ని సింగపూర్‌లా చేస్తామని చెబుతుంటారు. ఇంతకూ ఏముందని ఈ సింగపూర్‌లో? మన నేతలా దేశం గురించి ఎందుకంతగా తపిస్తున్నారు? ఎందుకంటే.. ఇప్పుడు సింగపూర్‌ అంటే అభివృద్ధికి గీటురాయి... ఎదిగేందుకు కొలబద్ధ... భవిష్యత్‌కు ప్రమాణం. అయితే ఈ పురోగతి అంత తేలిగ్గా సాధ్యం కాలేదు. దీని వెనుక నిబద్ధత గల నేతలున్నారు. నీతి కోసం తపించిన దార్శనికులున్నారు. సింగపూర్‌ చెప్పే ఆ కథేంటో చూద్దాం రండి!
అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చిచూసినా ఆరోగ్యంపై (అంటే ఆనారోగ్యానికి) అత్యంత తక్కువ ఖర్చు పెట్టే దేశాల్లో సింగపూర్‌ ఒకటి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నివేదిక ఆధారంగా ... ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన ఆరోగ్య రక్షణ వ్యవస్థ ఉన్న దేశాల్లో సింగపూర్‌ది ఆరోస్థానం.
హాయ్‌ తెలుగూస్‌!!!
అందరికీ నమస్కారం. మీ అందరికీ నేనూ నా పేరూ సుపరిచితమే. అయినా మర్యాద కోసం పరిచయంచేసుకుంటున్నాను. నా పేరు పులౌ యుజోంగ్‌. సుపరిచితం అంటున్నారు... ఈ పేరెన్నడూ వినలేదే అనుకుంటున్నారు గదూ! నిజమే! మా స్థానిక మలే భాషలో నా పేరిది. మీకూ, ఈ ప్రపంచానికి తెలిసిన పేరు సింగపూర్‌. అయినా సింగపూరంటే ఏంటో మీకు తెలుసా? సంస్కృతంలో సింహపురి అని అర్థం. అందుకే ఇంగ్లిష్‌లో ముద్దుగా లయన్‌ సిటీ అంటుంటారు. సంక్షిప్తంగా ఇది నా పరిచయం. మరి, విషయానికొస్తే... మీ వాళ్ళేమో మీ రాష్ట్రాన్ని నాలా మార్చేస్తామని అంటుంటే... నన్నీ స్థాయికి చేర్చిన మా నాయకులు, ప్రజల సంకల్ప శక్తిని వివరించాల్సిందే. అంతకంటే ముందు... మీ భారత్‌ యువదేశంగా ఎదిగిందని విన్నా. ఈసారి ఎన్నికల్లో యువతరమే కీలకమనీ విన్నా. బహుశా... చాలామందికి నా గురించి తెలిసుండకపోవచ్చు! అందుకే... జాగ్రత్తగా వినండి నా కథ. విని నాలా అవ్వాలో వద్దో... నాలా కావాలంటే ఎవరేం చేయాలో? అలా చేసేవారు మీదగ్గరెవరున్నారో తేల్చుకోండి. మీ ఓటును సరైన పార్టీకి, నేతకు వేయండి!
నాది 50 ఏళ్ల కథ!
పూర్తిగా కాకున్నా.... మాకూ మీకూ కొన్ని పోలికలున్నాయ్‌!
బ్రిటిష్‌ పాలన నుంచి విముక్తి... ఆనక మలేసియాతో విలీనం.. తర్వాత ఇమడలేక విభజన... ఫలితం... సింగపూర్‌గా ఆవిర్భావం!
ఇదంతా సుమారు 50 ఏళ్ళ కిందటి మాట. అంటే 1965 నాటిది.
అలా ఆవిర్భవించిన క్షణాన....
మాది ఒక జాతి కాదు... ఒక మతం కాదు... ఒక భాష కాదు... ఒక ప్రాంతం కాదు... అంతా కలగాపులగం... అంతా బతుకుదెరువు కోసం వచ్చిన జనాలమే.
తాగేందుకు మంచినీళ్ళు లేవు...కూడుగూడుగుడ్డకు కష్టమే.
మా ప్రధానికి సైతం రక్షణ కల్పించుకోలేని దుస్థితి.
ఎవరినీ నమ్మలేక నేపాలీ గుర్ఖాలతో పహారా కాయించుకోవాల్సిన స్థితి.
ఉన్నదేమో చిన్న ప్రాంతం... బోలెడంత జనాభా.
ఎటు చూసినా జాతి వైషమ్యాలు... చదవుల్లేని జనం. పోనీ తర్వాతైనా ఎదుగుదామనుకోవటానికి... సహజ వనరులనేవి కూడా అస్సలు లేని నష్టజాతకులం.
ఉన్నదంతా చుట్టూ సముద్రం... మధ్యలో కన్నీటి సంద్రంలా మేం.
నిజంగా మేం పూర్‌.... పరమ పూర్‌!
మాకే కాదు... చుట్టుపక్కలున్నచాలా దేశాలకూ మమ్మల్ని చూసి జాలేసింది.
ఎలా బతుకుతుందో? అసలెన్నాళ్ళు బతుకుతుందో అని ఆరంభంలోనే అప్పగింతలు చేసిన వారూ ఉన్నారు. అలాంటి స్థితి నుంచి....ఇప్పుడు...
ప్రపంచంలో నాలుగో అతిపెద్ద వాణిజ్య కేంద్రం
జీవన ప్రమాణాల సూచిలో ఆసియాలోనే అత్యుత్తమం.. ప్రపంచంలో పదకొండో స్థానం.
ప్రపంచంలోని అత్యంత ఐదు బిజీ నౌకాశ్రయాల్లో ఒకటి.
కొనుగోలు శక్తి పరంగాచూస్తే తలసరి ఆదాయంలో ప్రపంచంలో మూడోస్థానం.
విద్య, ఆరోగ్యం, పారదర్శక పాలన, ఆర్థిక పోటీతత్వంలో అగ్రస్థానం.
45 ఏళ్ళ కిందట తలసరి జీడీపీ వెయ్యి డాలర్లు. ఇప్పుడది 35 వేల డాలర్లపైనే. ఆదాయంలో ప్రపంచంలోనే నాలుగోస్థానంలో ఉందంటోంది ఐఎంఎఫ్‌ నివేదిక. ప్రపంచంలో వ్యాపారం చేసుకోవటానికి అత్యంత అనువైన దేశాల్లో నెంబర్‌ వన్‌.
అత్యంత తక్కువ అవినీతిగల దేశాల జాబితాలో మూడోస్థానం (న్యూజిలాండ్‌, డెన్మార్క్‌ల తర్వాత)
ప్రపంచంలోని టాప్‌ త్రీ చమురు శుద్ధి కేంద్రాల్లో ఒకటి.
చమురు రిగ్‌ ఉత్పత్తుల్లో ప్రపచంలోనే అగ్రస్థానం
నౌక మరమ్మత్తుల్లోనూ నెంబర్‌ వన్‌. మరి ఇదంతా ఎలా సాాధ్యమైంది?
వనరులేమీ లేని దేశం ఇంత త్వరగా ఎలా ఎదిగింది?
కారకులెవరు? కారణాలేంటి? చెబుతాను వినండి!
నా అభివృద్ధికి నాలుగుస్తంభాలున్నాయ్‌!
1 సమర్థ, నిస్వార్థ నాయకుడు 2 ‘సం’క్షేమం కాదు... జనాలందరి క్షేమం. 3 పనికొచ్చే చదువు 4 స్వచ్ఛమైన పాలన
మొట్ట మొదటి స్తంభం.. అత్యంత కీలకమైన స్తంభం- సమర్థ నిస్వార్థ నాయకుడు మా తొలి ప్రధానమంత్రి లీ కున్‌ యీ. మిగిలిన స్తంభాల గురించి వివరించి.. ఆయన సమర్థత, నిస్వార్థం గురించి చివర్లో చెబుతా!
నేను మీ సింహపురిని
సింగపూర్‌ క్రీస్తుశకం రెండో శతాబ్దంలో శ్రీవిజయ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. దీన్నో ఔట్‌ పోస్ట్‌ (సముద్ర పట్టణం)గా వాడేవారు. పదకొండో శతాబ్దిలో చోళ సామ్రాజ్యాధిపతి రాజేంద్ర చోళ-1 దాడి చేసి దీన్ని స్వాధీనం చేసుకున్నాడు. 16 నుంచి 19వ శతాబ్దుల మధ్య ఇది జొహర్‌ సుల్తానుల వశంలో ఉండేది. 1613లో పోర్చుగీసు బృందాలు దాడి చేసి దీవినంతా తగలబెట్టాయి. దీంతో దాదాపు రెండు శతాబ్దాల పాటు దాదాపు కనుమరుగైంది. 1819లో బ్రిటిష్‌ ఈస్ట్‌ ఇండియా కంపెపీ తరఫున థామస్‌ స్టామ్‌ఫోర్డ్‌ రఫల్స్‌ జొహార్‌ సుల్తాన్‌తో ఒప్పందం కుదుర్చుకొని ఇక్కడ బ్రిటిష్‌ వాణిజ్య కేంద్రాన్ని అభివృద్ధి చేయటానికి నడుంబిగించాడు. క్రమక్రమంగా రబ్బర్‌ చెట్ల పెంపకానికి మలేసియా, చైనా, భారత్‌ల నుంచి కార్మికులను రప్పించటంతో ఇదో వాణిజ్య కేంద్రంగా మారింది. రెండో ప్రపంచ యుద్ధంలో మొదట జపాన్‌ ఆక్రమించుకుంది. తర్వాత మళ్ళీ బ్రిటన్‌ తిరిగి గెల్చుకుంది. మొత్తానికి 1959లో విదేశీ, రక్షణ తప్పించి స్వయంప్రతిపత్తి పొందిన సింగపూర్‌ తర్వాత 1963లో స్వాతంత్య్రం ప్రకటించుకొని మలయాతో కలసి మలేసియా సమాఖ్యగా రూపొందింది. కానీ... రెండు దేశాల మధ్య జాతి విభేదాల కారణంగా 1965లో సింగపూర్‌ను మలేసియా వెలివేయటంతో సింగపూర్‌ పూర్తిస్థాయి స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది.
సంక్షేమం కాదు.. జనాలందరి క్షేమం
ఒక జాతి కాదు... ఒక మతం కాదు...
ఒక భాష కాదు... ఒక ప్రాంతం కాదు... అంతా కలగాపులగం... ఈ సంక్లిష్టత నుంచే ఒక సమర్ధ జాతిని నిర్మించటం మా తొలి ప్రధానిగా లీ ఎదుర్కొన్న మొదటి సవాలు
భిన్నజాతులు, వర్గాల సమ్మేళనమైన సింగపూర్‌కు ఒక ఉమ్మడి భాషంటూ లేదు. ఉమ్మడి చదువంటూ లేదు. ఉమ్మడి విద్యావ్యవస్థ లేదు. జనాభాలో 74 శాతం చైనీయులు, 13 శాతం మలేసియా; 9 శాతం భారతీయులు, ఇతరులు 3శాతం... 1963లో సింగపూర్‌ బ్రిటన్‌ నుంచి విడుదలైన దశలో అక్కడున్న జనాభాలో అధికశాతం నిరక్షరాస్య కార్మికులే. వారిలో చాలామంది చైనా, మలేసియా, భారత్‌ల నుంచి పనికోసం సంపాదన కోసం వచ్చినవారే. చాలా తక్కువమంది స్థానికులు- పెరనకాన్స్‌ (వీరూ 15, 16శతాబ్దుల్లో చైనా నుంచి వచ్చిన వారి సంతతే) ఉండేవారు. వీరికి మాత్రమే సింగపూరంటే తమదనే భావన ఉండేది. మిగిలిన అధికశాతం ప్రజలకు ఇదో ఉద్యోగ కేంద్రం మాత్రమే. ఇలా కలగాపులగపు కాపురంలాంటి వారందరినీ ఇది మా సింగపూర్‌ అనే స్థితికి చేర్చటం లీ ప్రభుత్వ తొలి లక్ష్యమైంది. అందుకే... మన జాతులు వేరైనా మొదట అంతా సింగపూర్‌ వాసులం అనే భావనను పెంచటానికి ప్రభుత్వం కంకణం కట్టుకుంది.
* చైనీస్‌, ఇంగ్లిష్‌, తమిళం, మలే అధికారిక భాషలుగా గుర్తించినా.... ప్రభుత్వ భాషగా ఇంగ్లిష్‌ను నిర్ణయించింది. ఇంగ్లిష్‌ మీడియంలోనే చదువు సాగుతుంది. అంతేగాకుండా... ప్రభుత్వమే ప్రజలందరికీ ఇళ్ళు కట్టించి ఇచ్చి... ప్రతి చోటా... అన్ని జాతుల వారు కలసి ఉండేలా చర్యలు తీసుకుంది. తద్వారా చైనీయుల కాలనీ, భారతీయుల కాలనీ అనే తేడాల్లేకుండా, విభజనలు రాకుండా జాతి ఏదైనా అంతా కలసి ఒకచోట ఉండేలా చేసింది. తద్వారా జాతి వైషమ్యాలు తగ్గిపోయాయి.
* దేశంలో, దేశ భవిష్యత్తులో ప్రతి పౌరుడికీ భాగాస్వామ్యం ఉండాలని లీ తపించారు. అందుకోసమే ప్రతి ఒక్కరికీ సొంతిల్లుండాలని కలలుగన్నారు. అలా ప్రతి ఒక్కరికీ ఇల్లుంటే దేశం స్థిరంగా ఉంటుందన్నది ఆలోచన. గృహనిర్మాణాభివృద్ధి బోర్డు (హెచ్‌డిబి) ఏర్పాటు చేసి దీని ద్వారా దాదాపు 10 లక్షల అపార్ట్‌మెంట్లను కట్టించారు.
* ఉద్యోగులందరి జీతాల్లోంచి కొంతమొత్తాన్ని తప్పనిసరిగా పొదుపు చేయించి.... తర్వాత ఆ మొత్తాల ద్వారానే ఈ ఆపార్ట్‌మెంట్లను తక్కువ ధరలకు కొనుగోలు చేయించారు. ఈ క్రమంలో అనేక రాయితీలు, స్కీంలు ప్రవేశపెట్టి... దాదాపు ప్రతి ఒక్కరూ సొంతింట్లో ఉండేలా ప్రభుత్వం ప్రోత్సహించింది.
* 1988 నాటికే దాదాపు 80శాతం ప్రజలు సొంతింటి వారయ్యారు. ఫలితంగా సామాజిక అసమానతలకు, భిన్న సంస్కృతుల సమాజంలో గొడవ లేవీ లేకుండా ఉండటానికి దోహదం చేసింది ప్రతి ఐదుగురిలో నలుగురు ప్రభుత్వం కట్టించి ఇచ్చిన పబ్లిక్‌ హౌసింగ్‌ అపార్లుమెంట్లలో ఉంటారు. ప్రజాకర్షక సంక్షేమ పథకాలకు సింగపూర్‌ ప్రభుత్వం వ్యతిరేకం. ఏదీ ఉచితంగా ఇవ్వటానికి ఇష్టపడదు. ప్రతి తరం కూడా ఎంతోకొంత సంపాదించి, మరికొంత దాచుకోవాలనేది సింగపూర్‌ ప్రభుత్వ సిద్ధాంతం. అలాగని ఆపన్నులను పూర్తిగా గాలికి వదిలేయరు. అవసరమైన చోట ఖర్చుపెడతారు. అయితే అందులో ప్రతి డాలరూ దుర్వినియోగం కాకుండా వ్యవస్థల్ని రూపొందించారు. నిరుడ్యోగులకు, వృద్ధాప్యంలోని వారికి, ఇలాంటి ఇతరత్రా అవసరం ఉన్న వర్గాలకు ఉచిత ప్రభుత్వ వైద్యం, నెలనెలా ఎంతోకొంతమొత్తం నగదు, పిల్లలకు ఉచిత విద్య, ప్రభుత్వ వసతి గృహాల్లో అద్దెరాయితీ, శిక్షణ గ్రాంట్లుఉ... ఇలాంటివి అందజేస్తారు. అలాగని ప్రజల్ని బద్దకస్తులుగా చేయటానికిగాని, డబ్బు దుర్వినియోగం అవటానికిగాని ప్రభుత్వం అంగీకరించదు.
అక్షరాస్యత కోసం కాదు.. అక్కరకొచ్చే విద్య
లాంటి వనరుల్లేని సింగపూర్‌ ఓ సమర్థ దేశంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందటానికి చదువే మూలాధారం!
అది అల్లాటప్పా చదువు కాదు... ఏదో చదవాలంటే చదివించే చదువు కాదు... కేవలం అక్షరాస్యులను పెంచేందుకో... అక్షరాస్యత అంకెలు పెంచుకునేందుకో చూపొందించిన చదువు కాదు. ముందుచూపున్న.... పనికొచ్చే చదువు! ఎందుకంటే... ఎలాంటి సహజ వనరుల్లేని పరిస్థితుల్లో.... లేనివాటి కోసం ఏడవకుండా... ఉన్న మానవవనరులనే ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. ఇందుకోసం... నైపుణ్యంతో కూడిన వనరుల్ని తయారు చేయాలన్నది సంకల్పించారు.

యావద్దేశం ఒకే పద్ధతి విద్యను అందించటం; అవసరాలు, ఆచరణలను బేరీజు వేస్తూ... వ్యవస్థను తీర్చిదిద్దటం; అంతేగాకుండా భవిష్యత్‌ దేశ, అంతర్జాతీయ మార్పులను ముందే గమనిస్తూ... ఆ అవసరాలకు తగ్గట్లుగా సిలబస్‌లను మార్చుకోవటం... ఫలితంగా ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా వ్యవస్థల్లో ఒకటిగా సింగపూర్‌ ఎదిగింది. ఇప్పుడు సింగపూర్‌లో చదువుకోని పిల్లలు లేరు. ప్రతి ఒక్కరూ పదేళ్ళపాటు ఏదో ఓ స్కూల్లో చదవాల్సిందే. ప్రాథమిక విద్య తప్పనిసరి! పిల్లల్ని బడికి పంపకుంటే తల్లిదండ్రులకు శిక్షే! సింగపూర్‌ పిల్లలు గణితంలో, సైన్స్‌లో ప్రపంచంలోనే అత్యుత్తమం అని ఇంటర్నేషనల్‌ మ్యాథ్స్‌ అండ్‌ సైన్స్‌ స్టడీ (టిమ్స్‌) కితాబిచ్చింది. ప్రస్తుత పోటీ ఆర్థిక వ్యవస్థకు అత్యంత అనువైన విద్యావ్యవస్థ సింగపూర్‌ది అని ఐఎండీ వరల్డ్‌ కాంపిటేటివ్‌నెస్‌ ఇయర్‌బుక్‌ ప్రశంసించింది.

సింగపూర్‌ నేషనల్‌ యూనివర్సిటీ ప్రపంచంలోని అత్యుత్తమ యూనివర్సిటీల్లో 34వ స్థానం; ఆసియాలో నాలుగో స్థానం సంపాదించింది. విలువలు, వ్యక్తిత్వ నిర్మాణం, నిజాయితీ, నైపుణ్యం, కలసిమెలసి పనిచేయటం; క్రమశిక్షణ.... ఇలాంటి అనేకానేక విలువల్ని సింగపూర్‌ స్కూళ్ళలో నేర్చుకోవచ్చు. శాస్త్రీయ, సాంకేతికాంశాలకు ప్రాధాన్యమిస్తూ... రాబోయే అవసరాలకు అనుగుణంగా మార్చుకుంటూ విద్యావవ్యస్థను రూపొందించారు. విద్యపై సింగపూర్‌ చేసే ఖర్చు వారి జీడీపీలో 3.6 శాతం. అంటే... సింగపూర్‌ ప్రభుత్వ ్యయంలో సుమారు 20 శాతం దాకా (రక్షణ తర్వాత రెండోస్థానం) విద్యపై ఖర్చుచేస్తోంది.

అభివృద్ధి చెందిన దేశాల్లోనే అత్యంత తక్కువశాతం నిరుద్యోగమున్న దేశం సింగపూర్‌. గత పదేళ్ళలో సింగపూర్‌ నిరుద్యోగ శాతం ఎన్నడూ 4శాతానికి మించలేదు. 2009లో వచ్చిన ప్రపంచ ఆర్థిక సంక్షోభం సందర్భంగా 3శాతానికి చేరుకుంది. అదే అత్యధికం. ఆ తర్వాత 2011లో మళ్ళీ 1.9%నికి పడిపోయింది.. లీ పదవి చేపట్టేనాటికి నిరుద్యోగం 14శాతం పైగానే ఉంది.

అనేక దేశాల నుంచి విద్యార్థులు సింగపూర్‌లో చదువుకోవటానికి వస్తున్నారు. అంతేగాకుండా పరిశోధనలకు కూడా మంచి కేంద్రంగా మారింది. 2006లో 80వేలకు పైగా విదేశీ విద్యార్థులు సింగపూర్‌లో చదువుకు వచ్చారు. అంతేగాదు.. ప్రతిరోజూ 5వేల మంది మలేసియా విద్యార్థులు జోహోర్‌-సింగపూర్‌ కాజ్‌వే దాటి వచ్చి చదువుకుంటారిక్కడ. సింగపూర్‌ యూనివర్సిటీల్లో 20 శాతం విదేశీ విద్యార్థులే.

1959-1978 మధ్య నిరుద్యోగం తాండవిస్తున్న తరుణంలో విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించి... వారి అవసరాలకు అనుగుణంగా వనరుల్ని తయారు చేయటం అనివార్యమైంది. ఈ నేపథ్యంలో దేశమంతటా స్కూళ్ళను ఏర్పాటు చేయటంతో పాటు... అప్పటికే ఏర్పాటై ఉన్న మతానుబంధ పాఠశాలనూ కలుపుతూ అందరికీ ఒకే విద్యావిధానాన్ని రూపొందించారు.

అవినీతికి అడ్డుకట్ట.. మా ప్రగతికి మొదటి మెట్టు!
రోడ్డుపై ఆపారంటే ట్రాఫిక్‌ పోలీసులకు అంతోఇంతో ముట్టచెబితేగాని కదలనివ్వడు; యాక్సిడెంటై ఆస్పత్రికి చేరితే చేతులు తడిపితేగాని డాక్టర్‌ చూడడు; అమ్యామ్యాలిస్తేగాని కస్టమ్స్‌ వాళ్ళు పచ్చజెండా వూపరు; పైస్థాయి అధికారుల నుంచి కింది దాకా అదే దారి! మంత్రులకు విదేశాల నుంచి ముడుపులు.... రోడ్లన్నీ గుండాల కబ్జా...ప్రభుత్వ స్థలాలు కబ్జా అంతా అవినీతి మయం! లంచాల రాజ్యం! లీ పదవి చేపట్టేనాటికి సింగపూర్‌ స్థితి ఇది!
వినీతిని కట్టడి చేస్తేగాని పాలన గాడిలో పడదనీ, దేశం ముందుకు సాగదనీ గుర్తించిన లీ అన్నింటికంటే ముందు అవినీతి ప్రక్షాళనకు నడుంబిగించాడు. 1959 జూన్‌లో ప్రమాణ స్వీకారం చేసే సమయం నుంచే స్వచ్ఛతకు సూచకంగా ... లీ ఆయన సహచరులంతా తెల్లటి బట్టలు ధరించారు. ఎప్పుడైతే మంత్రులు ప్రజల నమ్మకం, విశ్వాసం చూరగొంటారో, ఎప్పుడైతే సచ్ఛీలంగా ఉంటారో .... అధికారుల ముందు తలెత్తుకొని నిలబడతారో; అధికారయంత్రాంగాన్ని సైతం శాసించగలుగుతారని నమ్మిన 35 సంవత్సరాల లీ అందుకు తగ్గట్లే వ్యవహరించారు. మంత్రులంతా తన సహాధ్యాయులే! సన్నిహిత మిత్రులే. అయినా స్నేహాన్ని, బాధ్యతను వేరుగానే ఉంచారు. ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి డాలర్‌ యథావిధిగా చేరాల్సిన వారికి, చేరాల్సిన పనికి చేరాలనేది నియమంగా పెట్టుకున్నారు.

* అవినీతికి ఆస్కారం కల్పించే, అధికారులుగానీ, రాజకీయ నేతలగానీ... స్వప్రయోజనాలకోసం అధికారాన్ని దుర్వినియోగం చేసే దుర్బుద్ధిని పుట్టించే విచక్షణాధికారాలన్నింటినీ తొలగించారు. అవినీతి నిరోధక శాఖ (సీపీఐబి)ను పటిష్ఠం చేశారు. వనరుల పరంగానే కాదు చట్టపరంగా కూడా! చట్టాన్ని మార్చి విచారణ, దర్యాప్తు, జప్తులకు సంబంధించి అధికారాలను విస్తృతం చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు పట్టుబడితే వాటన్నింటినీ లంచం రూపంలో వచ్చినట్లుగా తేల్చేలా చట్టం చేశారు. అన్నింటికంటే అతిపెద్ద మార్పు ఏంటంటే... అప్పటిదాకా కేవలం చిరుద్యోగులకు గాలం వేస్తూ వచ్చిన సీపీఐబి పరిధిలోకి ఉన్నతాధికారులతో పాటు మంత్రులందరినీ చేర్చారు. సీపీఐబీ డైరెక్టర్‌ నేరుగా ప్రధాన మంత్రి కార్యాలయం ఆధ్వర్యంలో పనిచేసేలా చేశారు. అవినీతికి పాల్పడితే విధించే కనీస జరిమానాను పదివేల సింగపూర్‌ డాలర్ల నుంచి లక్ష సింగపూర్‌ డాలర్లకు పెంచారు. వ్యవస్థీకృతమైన అవినీతిని చట్టపరమైన మార్పులతో, నిబంధనల సరళీకరణలతో కట్టడి చేశారు. వ్యక్తిగత అవినీతిని అరికట్టడమే కష్టమైంది. కానీ లీ పట్టుదల, నిష్పాక్షిత ఆ దిశగా కూడా దేశాన్ని ముందుకు నడిపించాయి. వ్యక్తిగత అవినీతికీ ముకుతాడు వేసేలా చేశాయి.

* 1975లో లీ కేబినెట్‌లోని పర్యావరణ మంత్రి ఒకరు తన కుటుంబంతో సహా ఇండోనేషియాలో వారం రోజుల పాటు గడిపి వచ్చారు. దీనికైన ఖర్చులను ఓ గృహ నిర్మాణ సంస్థ గుత్తేదారు భరించారు. కారణం ఆ గుత్తేదారు పనులేవో చూడాలంటూ మంత్రిగారు అధికారులకు సిఫార్సు చేశారంతే. అంతేగాకుండా మంత్రి తన తండ్రి పేరిట ఎనిమిది లక్షల రూపాయల్ని ఓవర్‌డ్రాఫ్ట్‌ తీసుకున్నాడు. తర్వాత కొద్దిరోజులకు ఇది బయటపడటంతో విచారణ జరిగింది. దోషిగా తేలటంతో మంత్రికి నాలుగేళ్ళ జైలుశిక్ష పడింది.

* జాతీయ అభివృద్ధి మంత్రి ఒకరిది మరో విషాద గాథ! ప్రధాని లీకి అత్యంత సన్నిహితుల్లో ఆయనొకరు. ప్రభుత్వ స్వాధీనానికి గుర్తించిన భూమిలో కొంతభాగాన్ని గుత్తేదారే ఉంచుకునేలా చేసేందుకూ, మరోచోట ప్రభుత్వ భూమిని ప్రైవేటు పరం చేసేందుకు వీలుగా గుత్తేదారు లంచం ఇచ్చారు. ఇదంతా 1981లో జరిగింది. నాలుగైదేళ్ళ తర్వాత ఏదో విచారణలో భాగంగా మంత్రి మాజీ సన్నిహితుడొకరి ద్వారా ఈ విషయం సీపీఐబికి తెలిసింది. మంత్రిని అడిగితే...నాకేం తెలియదన్నాడు. అంతేగాకుండా తనపై కేసు నమోదు చేయకుండా ఉండేలా ఒత్తిడి తెచ్చాడు. ప్రధాని లీని కలిసేందుకు ప్రయత్నించాడు. కానీ విచారణ పూర్తయ్యాకే తాను కలుస్తానను లీ స్పష్టం చేశారు. విచారణ కొనసాగింది. దీంతో.... 1986లో ఓ రోజు సదరు మంత్రి ఆత్మహత్య చేసుకున్నారు. ‘‘నేను తప్పు చేశాను. రెండు వారాలుగా చాలా కష్టంగా ఉంది. మీకు మొహం చూపించే అర్హత లేదు. నా తప్పుకు బాధ్యత వహించి నాకునేనే శిక్ష వేసుకుంటున్నాను’’ అని ప్రధాని లీకి లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నారు.

* ఆయన మరణంపై విచారణ జరిపించ వద్దని కుటుంబం ప్రధానిని కోరింది. కానీ విపక్షం పార్లమెంటులో ఈ విషయం లేవనెత్తటంతో ప్రధాని లీ విచారణకు ఆదేశించారు. దీంతో మంత్రి కుటుంబం ఆ బాధ తట్టుకోలేక దేశం విడిచి వెళ్ళిపోయింది. అలా... తనవారు, పరాయివారు అనే తేడాలేకుండా... విపక్షం సైతం చర్యలకు డిమాండ్‌ చేసేలా, ఒత్తిడి తెచ్చేలా, ఏమాత్రం జాలి చూపించకుండా వ్యవస్థను రూపొందించారు.

* మంత్రులతో పాటు ప్రభుత్వ అధికారులందరికీ ప్రైవేటులో వారి సమానస్థాయికి తగ్గట్లుగా జీతభత్యాలు పెంచేలా చర్యలు. తద్వారా తాము తక్కువ సంపాదిస్తున్నామనే భావన రానీకుండాజాగ్రత్తపడటం. ఇలాంటి భావన వస్తే అవినీతికి, అడ్డదారులు తొక్కటానికి ఆలోచిస్తారనే ఉద్దేశంతో లీ ఈ ప్రతిపాదన చేశారు.

* ప్రధాని పదవి నుంచి వైదొలగాక లీపైనా ఆరోపణలొచ్చాయి. ఆయన, ఆయన భార్య ఓ స్థలం కొనుగోలు చేశారు. ఆ స్థలం గుత్తేదారు వీరికీ స్థలాన్ని 7 శాతం రాయితీకి అమ్మాడు. దీనిపై దుమారం రేగింది. విచారణకు ఆదేశించాలని, తాము సహకరించేందుకు సిద్ధమని లీ ప్రభుత్వాన్ని కోరారు. ప్రాజెక్టు ఆరంభించే మొదట్లో వినియోగదారులను ఆకర్షించటంలో భాగంగా లీకే కాకుండా చాలామందికి ఇలా రాయితీ ఇచ్చారని తేలింది. అయినా లీ..దంపతులు గుత్తేదారు తమకిచ్చిన రాయితీని ప్రభుత్వానికి జమచేశారు. కానీ విచారణలో తప్పులేదని తేలటంతో ప్రభుత్వం ఆ సొమ్మును వాపస్‌ చేసింది. కానీ ఇచ్చిన సొమ్మును తీసుకోబోమంటూ... వారిద్దరూ ఆ మొత్తాన్ని సేవ కోసం వినియోగించాలని నిర్ణయించారు. ‘‘నేను పెట్టిన వ్యవస్థ నాపైనే విచారణ జరపటం నాకెంతో ఆనందంగా ఉంది. వ్యవస్థ సక్రమంగా పనిచేస్తోందనటానికి ఇది నిదర్శనం’’ అని ఆనందపడ్డారు లీ!

మురికి కాలవల నుంచి మంచి నీరు...
బిజినెస్‌ కాన్ఫరెన్స్‌ల కోసం సింగపూర్‌కు వచ్చేవారు మొదట్లో కాసింత ఇబ్బంది పడేవారు. ఓ కథ చెబుతాను వినండి. సర్‌! బాటిల్‌ అంటూ నీళ్ళ సీసా అందించాడు వెయిటర్‌. అంతకుముందే ఇక్కడి నీళ్ళ గురించి విని ఉండటంతో కాసింత ఇబ్బంది పడ్డాడా భారతీయుడు! కారణం... సింగపూర్‌ మురికి కాలవలో ప్రవహించే నీరూ... ఈ బాటిల్‌లో నీరూ ఒకటే అనే సత్యం జీర్ణం అవటం లేదు. కారంతో నోరంతా చువ్వు మంటూ మండుతుంటే చేసేదేమీ లేక కళ్ళుమూసుకొని బాటిల్‌లో నీళ్ళు నోట్లో పోసుకున్నాడు...ఖర్మ అనుకుంటూ...! ¹కానీ తీరా నోట్లో పడగానే తియ్యగా తగిలాయి. మా వూర్లో కూడా ఇంత తియ్యటి నీళ్ళు తాగలేదెన్నడనుకున్నాడు!

అదే మా గొప్పదనం. నీటి చుక్కను కూడా వృథా చేయం! ప్రతి నీటి బొట్టు విలువను ఉగ్గుపాలతోనే నేర్పుతారిక్కడ. నీటివనరులు తక్కువగా ఉన్న సింగపూర్‌కు నీటి బొట్టు విలువేంటో తెలుసు.

* నీటికింత ప్రాధాన్యమివ్వటానికి కారణం... మంచినీటి సదుపాయం లేకపోవటమే. స్వాతంత్య్రం వచ్చిన్నాటి నుంచి నీటిని పైపుల ద్వారా పక్కనున్న మలేసియా నుంచి కొనుక్కుంటారు. ఇప్పుడు 15 నీటి రిజర్వాయర్లను ఏర్పచుకొని అత్యంత శుద్ధ రక్షిత నీటిని తాగగలుగుతోంది
* చిన్నపిల్లలకు స్కూళ్ళలోనే నీటి విలువ గురించి నూరిపోస్తారు.
* తక్కువ మోతాదులో నీటిని వాడే ఇళ్ళకు ఛార్జీల్లో రాయితీలిచ్చి ప్రోత్సహిస్తుంది ప్రభుత్వం. అయితే మలేసియా నీటి ఛార్జీలను పెంచేయటంతో ఆ దేశంతో ఒప్పందం ముగిసేలోపు స్వయం సమృద్ధి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగమే... న్యూవాటర్‌ ప్రాజెక్టు. మురికి నీటిని నదుల్లోకో, సముద్రాల్లోకో వదిలేయరు. హైటెక్‌ పద్ధతుల్లో శుద్ధి చేసి మంచినీటిగా మారుస్తారు. ఇప్పుడిప్పుడే ఈ నీటిని అందరికీ అలవాటు చేస్తున్నారు. మునుముందు సముద్ర జలాల్ని నిర్లవణీకరించి మంచినీటిని తయారు చేయాలనుకుంటున్నారు.
* కేవలం ఇలా మురుగునీటిని కూడా వృథాకానివ్వకుండా చేయటమేకాదు... ఘన పదార్థాల వ్యర్థాలనూ వృథా చేయరిక్కడ. చెత్తనంతటినీ రీసైకిల్‌ చేసి... భూభాగాన్ని పెంచటంలో బిల్డింగ్‌ మెటీరియల్‌గా వాడతారు. మొదట్లో 500చదరపు కిలోమీటర్లున్న సింగపూర్‌ విస్తీర్ణం ఇప్పుడు సముద్రాన్ని ఈ రిసైకిల్డ్‌ వ్యర్థాలతో పూడుస్తూ... మరో వంద కిలో మీటర్ల మేర విస్తరించింది.
* చాలా దేశాల్లాగా సహజవనరులు ఏమీ లేవు. గనుల్లేవు. గాడిదగుడ్డూ లేదు. యావద్దేశంలో వ్యవసాయ యోగ్యమైన భూమి 250 ఎకరాలు మాత్రమే!
* 50లక్షల జనాభాగల సింగపూర్‌ మాంస ఉత్పత్తులను నూటికి నూరుశాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సింది. చివరకు కోడిగుడ్లు కూడా 90 శాతం విదేశాల నుంచి రావాల్సింది.
* ఎలక్టాన్రిక్స్‌, ఫార్మసూటికల్స్‌, సేవలరంగం, బ్యాంకింగ్‌, న్యా, మెడికల్‌, ఆతిథ్యరంగం... ఇలా వివిధరంగాల్లో అగ్రస్థానంలో దూసుకుపోతోంది. వీటి నుంచే దేశానికి ఆదాయం.
* విదేశాల నుంచి మాదగ్గరికి రండంటూ కంపెనీలను బతిమిలాడటం కంటే.... ఆసియాలో తమ ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేసుకునేలా ఆయా కంపెనీలకు వసతులు కల్పించారు. వ్యాపారానికి అనువైన పాలన, తక్కువ పన్నులు, బ్యూరోక్రసీ బాధల్లేని వ్యవస్థ అనేక విదేశీ కంపెనీలను సింగపూర్‌కు వచ్చేలా చేశాయి.
* ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల పనితీరు నక్కకూ నాగలోకానికి తేడాలా ఉంటుందంటారు. కానీ సింగపూర్‌ ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు పనినతీరును ఆది నుంచీ అలవర్చుకున్నాయి. ఫలితంగా ప్రపంచాన్ని మారుస్తున్న ఫార్చ్యూన్‌ 500 కంపెనీలతో పోటీపడుతున్నాయి.
* ప్రపంచంలోని మూడు అత్యుత్తమ ఓడరేవుల్లో సింగపూర్‌ రేవొకటి. మలాకా జలసంధి ప్రయోజనాన్ని నూటికినూరుపాళ్ళు వినియోగించుకున్న సింగపూర్‌ ఆసియా సూయజ్‌కెనాల్‌గా పేరుగాంచింది. అందుకే... ఆసియా దేశాలకెళ్ళే అమెరికా, యూరప్‌ ఓడలన్నీ ఇక్కడే ఇంధనం నింపించుకుంటాయి.
* కొత్తగా ఓ వ్యాపారం ఆరంభించాలంటే ప్రపంచంలో సగటున 34 రోజులు పడుతుందని అంచనా. అదే సింగపూర్‌లో అయితే మూడంటే మూడురోజుల్లోనే అన్ని అనుమతులు వచ్చేస్తాయ్‌. వ్యాపారం ఆరంభించేయొచ్చు.
* 1960ల్లో 581చదరపు కిలోమీటర్లున్న సింగపూర్‌ విస్తీర్ణం ఇప్పుడు 716 కిలోమీటర్లకు చేరింది. 2030 కల్లా మరో వంద కిలోమీటర్ల మేర పెరుగుతుందనుకుంటున్నారు. ఇదంతా వ్యర్థాలతో దీవులను కలుపుతూ సముద్రాన్ని పూడ్చటం ద్వారా సాధిస్తున్నదే.
* ప్రాంతీయ భౌగోళికతే కాకుండా.... అవినీతి రహిత పాలన, నిపుణులైన మానవ వనరులు, తక్కువ పన్నులు, ఆధునిక మౌలిక సదుపాయాల కారణంగా భారీస్థాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను సింగపూర్‌ ఆకర్షించగలుగుతోంది.
* అమెరికా, జపాన్‌, యూరప్‌లకు చెందిన 7వేలకుపైగా బహుళజాతి కంపనీలు సింగపూర్‌లో వెలిశాయి. చైనా, భారత్‌ల నుంచి చెరి 1500 కంపెనీలున్నాయి. సింగపూర్‌లో పని చేసేవారిలో దాదాపు 44శాతం మం‘ సింగపూరేతరులే.
* వైద్య రంగంలోనూ విదేశాల నుంచి సింగపూర్‌కున్న డిమాండ్‌ చాలా. ప్రతి ఏటా వైద్యం కోసం విదేశాల నుంచి సుమారు పదిలక్షల మంది సింగపూర్‌ వస్తుంటారు. మెడికల్‌ టూరిజం ద్వారా 2012లో సింగపూర్‌కు 300 కోట్ల డాలర్ల ఆదాయం లభించింది.
* ప్రస్తుత సింగపూర్‌ జనాభా దాదాపు 50 లక్షల 30 వేలు. వీరిలో 30 లక్షల మంది సింగపూర్‌ పౌరులు. మిగిలినవారు (38%) శాశ్వత నివాసులు లేదా విదేశీ పనివారు/ విద్యార్థులు.
డ్రీమ్‌... డిజైన్‌... డెలివర్‌..! కలలు కనటం... నిర్మించటం; సాధించటం... ఇదీ ఏ పథకాల అమలులోనైనా సింగపూర్‌ అనుసరించే పద్ధతి. కేవలం సింగపూర్‌ను అభివృద్ధి చెందిన దేశంగా చేయటమే కాదు... మారుతున్న పరిస్థితులకు, ప్రపంచ పరిణామాలకు అనుగుణంగా స్పందించటం ఇక్కడ పాలకుల ప్రత్యేకత.

మాయమైన నిరుద్యోగం
అభివృద్ధి చెందిన దేశాల్లోనే అత్యంత తక్కువశాతం నిరుద్యోగమున్న దేశం సింగపూర్‌. గత పదేళ్ళలో సింగపూర్‌ నిరుద్యోగ శాతం ఎన్నడూ 4శాతానికి మించలేదు. 2009లో వచ్చిన ప్రపంచ ఆర్థిక సంక్షోభం సందర్భంగా 3శాతానికి చేరుకుంది. అదే అత్యధికం. ఆ తర్వాత 2011లో మళ్ళీ 1.9%నికి పడిపోయింది.. లీ పదవి చేపట్టేనాటికి నిరుద్యోగం 14శాతం పైగానే ఉంది.
ప్రజలూ భేషే..!
సింగపూర్‌ అభివృద్ధిలో కేవలం ప్రభుత్వమే కాదు... ప్రజలు కూడా అంతే స్థితప్రజ్ఞతతో వ్యవహరించారు. ప్రజల అవసరాలను తీర్చటంలో, దేశాన్ని తీర్చిదిద్దటంలో పార్టీ, ప్రభుత్వం ముందుంటే... తమకు మేలు చేస్తున్న పార్టీని ఎన్నుకోవటంలో ప్రజలూ అంతే విజ్ఞతతో వ్యవహరించారు. ప్రలోభాలకు లొంగకుండా, ప్రకటనలకు పడిపోకుండా... 1965 నుంచి ఇప్పటిదాకా పీపుల్స్‌ యాక్షన్‌ పార్టీ (పీఏపీ)నే గెలిపిస్తూ వచ్చారు. తద్వారా సుస్థిరతకు స్థానమిస్తున్నారు. తాజా ఎన్నికల్లోనూ ఆ పార్టీకే పట్టంగట్టారు. ప్రస్తుత ప్రధాని మరెవరో కాదు... ప్రథమ ప్రధాని లీ కుమారుడే.
కారు కొనాలంటే వాచి పోతుంది
బాగా డబ్బున్న దేశమనీ.... బోలెడంత మంది మిలీనిర్లున్నారనీ అంతా ఖరీదైన కార్లలో తిరుగుతారనుకుంటే పొరపాటు. ఎక్కువ జనసాంధ్రత కారణంగా రోడ్లపై ప్రైవేటు కార్ల సంఖ్యను నియంత్రిస్తారు. తద్వారా కాలుష్యాన్ని తగ్గిస్తారు. కారు కొనుక్కోవాలంటే దాని రేటుకు ఒకటిన్నర రెట్లు పన్ను రూపంలో కట్టడంతో పాటు పదేళ్ళపాటు రోడ్డుపై నడపటానికి అనుమతించే సర్టిఫికెట్‌ పొందటానికి వేలం పాట పాడాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికెట్‌కు అయ్యే ఖర్చుతో అమెరికాలో ఓ పొర్సె కారు కొనుక్కోవచ్చంటారు. అందుకే సంపన్న దేశమైనా ప్రతి పది మందిలో ఒకరికి మాత్రమే కారుంటుంది. కాలినడకనగానీ, సైకిళ్ళపైగానీ, బసులు, టాక్సీలు, రైళ్ళ ద్వారాగానీ ప్రయాణం ఎక్కువగా చేస్తారు. ప్రజారవాణా ధర చాలాచాలా తక్కువ.
మా అభివృద్ధికి అపర భగీరథుడు.. మా లీ!
లీ లేకుండుంటే....?
ఇంత చదివాక మా మూలస్తభం... మా తొలి ప్రధాని.. లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ప్రగతంతా ఆయన చలవే! ఆయన నాటిన వృక్షమే! పాలనలో, రాజకీయాల్లో, వారసత్వంలో... ప్రజల్లో అన్నింటా ఆయన నాటిన స్వచ్ఛమైన, సమర్థ విత్తనాలు శాఖోపశాఖలుగా విస్తరించాయి. మా అదృష్టమేమంటే... వృధ్ధాప్యపు ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతున్నా... ఆయనింకా మా మధ్యే ఉన్నారు. మా గమనాన్ని శాసిస్తున్నారు.
ఈ సింగపూర్‌ ఇప్పుడో భూతల స్వర్గం. కానీ ఇది ప్రకృతిసిద్ధమైంది కాదు... మానవ ప్రయత్న ఫలితం. సామాన్యుల విజయం.
ఇప్పుడు చెప్పండి. మేం అరచేతిలో వైకుంఠంలా కనిపిస్తున్నామా? అందే అందమైన స్వప్నంలా అనిపిస్తున్నామా?
మీకూ మాలా ఎదగాలని ఉందా? మరో సింగపూర్‌లో మారాలని ఉందా?
అయితే... చూపండి మాలా స్థిత ప్రజ్ఞత! ఎంచుకోండి....
దూరదృష్టి, సచ్చీలత ఉన్న సమర్థుడైన నేతను...!
యువభారత్‌కు శుభం కలుగుగాక!
‘‘నీతులు చెప్పటం వేరు. చట్టాలు బలంగా తయారు చేయటం వేరు. కానీ... వాటిని అమలు చేసేటప్పుడు ఎంతో కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది. గుండె బండ చేసుకోవాల్సి ఉంటుంది. ఉన్నతమైన లక్ష్యాల సాధనకోసం ఎంతో పట్టుదలతో ఉంటే తప్ప అది సాధ్యం కాదు. విచారణాధికారులకు కూడా మద్దతుగా నిలవాలి. అప్పుడే అవినీతిని కట్టడి చేయగలుగుతాం’’
-లీ

వలచి...గెలిచి..

ప్రేమికుల రోజూ.. అదే సూర్యుడు. అవే ఇరుసంధ్యలు. అదే గాలి. అవే దిక్కులు. ఎప్పట్లాగే ఇరవై నాలుగ్గంటలు!! మరేమిటీ ప్రత్యేకం? ఏముంది? ప్రేమే!!...

ఫైనల్‌లో వారియర్స్‌

రెండోసారి సీసీఎల్‌ ట్రోఫీ గెలవాలన్న తెలుగు వారియర్స్‌ నెరవేరడానికి ఇంకా ఒక్క అడుగు దూరంలో ఉంది. శనివారం హైదరాబాద్‌లో ఉత్కంఠభరితంగా జరిగిన రెండో సెమీఫైనల్‌లో...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net