Sun, February 07, 2016

Type in English and Give Space to Convert to Telugu

'కడలి వేదికగా కదన విన్యాసం''కల్తీల నుంచి కాపాడాలి''ఎస్సై కొలువులకు సై''వాట్సన్‌ @ రూ. 9.5 కోట్లు''హామీలు నెరవేర్చే వరకు దీక్ష''అన్నయ్యే వారసుడు..''ప్రజల మనసులు చూరగొంటూ..''సాగర జలాల్లో స్నేహబంధం''కాగిత రహిత టికెట్ల దిశగా రైల్వే''అనుమతి లేకుండా ప్రాజెక్టులు'
రూ.80వేల కోట్ల జలగల యజ్ఞం
పారింది నీరు కాదు నిధులు
ఎం.ఎల్‌. నరసింహారెడ్డి
ఈనాడు హైదరాబాద్‌
పాదయాత్రలు చేసి...
ప్రతి పొలమూ తడుపుతామంటే...
ఔను కాబోలని గద్దెనెక్కించాం!
జలయజ్ఞమని మొదలెట్టి...
ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతుంటే....
కష్టాలు తీరతాయని ఆశపడ్డాం!
...కానీ
పదేళ్ళు గడిచిపోయాయ్‌!
80 వేల కోట్లు ఖర్చయ్యాయ్‌!
ఏమొచ్చిందని చూసుకుంటే...
నిండింది రిజర్వాయర్లు కాదు... నేతలు, గుత్తేదార్ల జేబులు!
తడిసింది పొలాలు కాదు... రైతుల కళ్ళు!
పారినవి నీళ్ళు కాదు... కన్నీళ్ళు!
అరకొర పనులు... మొలచిన మొక్కలు...
అభివృద్ధిపై చిత్తశుద్ధి లేని నాయకులుంటే;
అభివృద్ధి పేరుతో ఆబగా లాగించే నేతలొస్తే...
ఏమవుతుందనటానికి నిలువెత్తు నిదర్శనం మన రాష్ట్రంలోని జలయజ్ఞం!
ఎన్నికల వేళ... ఎలాంటి నేతలను ఎన్నుకోవాలో నిర్ణయించుకోవాల్సిన వేళ....
చూడండి.... ప్రజల సొమ్మును నిలువుదోపిడీ చేసిన వైనాన్ని...
కనండి... కుంభకోణాలకే కుంభస్థలంలాంటి జలయజ్ఞ ఫలాన్ని..
వినండి... రాష్ట్రాన్ని పీల్చిపిప్పి చేసిన ‘జలగ’లగలల్ని!
దేళ్ళ కిందట 2004లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి అధికారంలోకి రాగానే ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన పథకం జలయజ్ఞం! దీనికింద రాష్ట్రంలో 26 సాగునీటి ప్రాజెక్టులను రూ.46 వేల కోట్లతో పూర్తి చేసి 50 లక్షల ఎకరాలు సాగులోకి తెస్తామని... ఆంధ్రావనిని నిజమైన అన్నపూర్ణగా మార్చేస్తామనీ... ఘనంగా ప్రకటించారాయన! చెప్పినట్లే ఐదేళ్ళలో రూ.40 వేల కోట్లు ఖజానా నుంచి లాగేశారు! కానీ... హామీ ఇచ్చిన 26 ప్రాజెక్టుల్లో కనీసం రెండు ప్రాజెక్టుల కింద కూడా రైతులకు పూర్తి స్థాయిలో నీరందలేదు.

2009లో మళ్లీ ఎన్నికలొచ్చాయ్‌! మళ్ళీ అదే వై.ఎస్‌. సారథ్యం! ఈసారి హామీ... రూ.లక్షన్నర కోట్లతో 86 ప్రాజెక్టులను పూర్తి చేసి... కోటి 38 లక్షల ఎకరాల బీడు భూములను సస్యశ్యామలం చేస్తామని! అంతేకాదు... అన్ని ప్రాజెక్టులను నియమిత వ్యవధిలోగా పూర్తి చేస్తామని కాంగ్రస్‌ ఎన్నికల ప్రణాళికలో చేర్చారు! ఇప్పుడు మళ్ళీ ఎన్నికలొచ్చాయ్‌! చెప్పిందేమిటి... చేసిందేమిటని చూస్తే.... గత ఐదేళ్లలో జలయజ్ఞం ప్రాజెక్టులకు మరో రూ.40 వేల కోట్లు ఖర్చయ్యాయి. అంటే ఈ పదేళ్ళలో మొత్తం రూ.80 వేల కోట్లు ప్రభుత్వ ఖజానా నుంచి కేవలం జలయజ్ఞం పేరిట ఖాళీ అయ్యాయి. రైతు కళ్ళే తప్ప... పొలాలు మాత్రం తడవట్లేదు!


సేకరించినంత భూమి కూడా తడవలేదు
సాగు కోసం ప్రాజెక్టు కడుతున్నారంటే మరింత భూమి సాగులోకి రాబోతోందని అనుకుంటాం. ఆశిస్తాం! ఏ ప్రాజెక్టు లక్ష్యమైనా అదే! కానీ... ఈ జలయజ్ఞం గొప్పతనమేమంటే... ప్రాజెక్టుల నిర్మాణానికి రైతుల నుంచి సేకరించినంత భూమి కూడా కొత్తగా సాగులోకి రాలేదు. రూ.80 వేల కోట్లయితే ఖర్చయ్యాయి కానీ 8 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు కూడా తడవలేదు. ప్రాజెక్టుల కోసమని రైతుల నుంచి సేకరించింది 7 లక్షల ఎకరాలు! కొత్తగా తడిసిందీ ఇంచుమించు అంతే! అంటే కొత్తగా వచ్చిందేమీ లేదు. అవసరమైన నిధుల్లో యాభై శాతం ఖర్చైనా ఆయకట్టు లక్ష్యం మాత్రం పది శాతం కూడా నెరవేరలేదు. గత పదేళ్లలో లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందించామని ప్రభుత్వం చెప్తున్నా అది కాగితాల్లో మాత్రమే! నీరందించే పనులు పూర్తికాకుండానే... మౌలిక వసతులు కల్పించాం కాబట్టి ఆ ప్రాజెక్టు కింద ఆయకట్టుకు నీరిచ్చేసినట్లేనంటూ ప్రభుత్వం పద్దులు రాసేస్తోంది!

పూర్తికాకుండానే... ప్రారంభోత్సవాలు
పేరు రైతుల కోసం...! కానీ నిజానికి జలయజ్ఞం సాగుతున్నది గుత్తేదారులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వంలోని పెద్దల కోసమన్నట్లు తయారైంది. ఓ ప్రాజెక్టు పని సగమైనా జరగకుండానే ఇంకో ప్రాజెక్టు మొదలెడుతూ... ప్రాజెక్టుల సంఖ్య పెంచుకుంటూ పోయి తమ వాటాలు తీసేసు కోవడం తప్ప వాటిని పూర్తి చేయలేదు. ఎక్కడ చూసినా స్ట్రక్చర్లు నిర్మించకుండా తవ్వి వదిలేసిన కాలువలు, అసంపూర్ణమైన రిజర్వాయర్ల పనులు దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టుల్లో 17 పూర్తయ్యాయి. మరో 24 ప్రాజెక్టుల్లో పాక్షికంగా నీటిని విడుదల చేశారు. కానీ పులిచింతల పూర్తికాకుండానే నిరుడు ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం కానిచ్చేశారు. ఈ ఏడాది కూడా నీటిని నిల్వ చేసేలా పనులు పూర్తవుతాయన్న నమ్మకం లేదు. పాక్షికంగా నీటినిచ్చిన జాబితాలో కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ఇలా అనేక ప్రాజెక్టులను చేర్చారు. పనులు పూర్తికాకుండానే ప్రారంభోత్సవాలు చేసి నీళ్లిచ్చామంటూ ప్రభుత్వం నమ్మబలుకుతుంది.

పూర్తయినా నీళ్ళు రాలేదు...
ఉదాహరణకు పూర్తయిన ప్రాజెక్టుల్లో వెలిగల్లు ఉంది. 2008లోనే ఈ ప్రాజెక్టు పూర్తయ్యింది, కానీ ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టులోకి నీళ్లు రాలేదు. పాక్షికంగా పూర్తయిన ప్రాజెక్టుల కింద ఎక్కువ ఆయకట్టు చూపించినా అందులో అత్యధికం కాగితాల్లోనే! ప్రభుత్వ లెక్కల ప్రకారం కూడా పూర్తయిన 17 ప్రాజెక్టుల్లో సాగులోకి వచ్చిన ఆయకట్టు 2.36 లక్షలు కొత్తది కాగా 1.894 లక్షల ఎకరాలు స్థిరీకరణ.

పదేళ్ళయినా...
2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లలో 8, ఐదేళ్లలో 18 ప్రాజెక్టులను పూర్తి చేస్తామని వైఎస్‌ ప్రకటించారు. రెండేళ్లలో పూర్తి చేస్తామన్న ప్రాజెక్టుల కింద 13 లక్షల ఎకరాలకు నీటిని పారిస్తామన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఈ ఎనిమిదింటిలో పూర్తయ్యింది మూడు మాత్రమే. వంశధార మొదటి దశ రెండవస్టేజి, గుత్ప, అలీసాగర్‌ ఎత్తిపోతలు! రూ.500 కోట్లు ఖర్చయిన ఈ అలీసాగర్‌, గుత్ప ఎత్తిపోతలు నిజానికి నిజాం సాగర్‌ ఆయకట్టు స్థిరీకరణకు ఉద్దేశించినవే! మిగిలిన ఐదు ప్రాజెక్టులు ఇంకా పూర్తి కావలసి ఉంది. మొత్తం ఎనిమిది ప్రాజెక్టుల కింద కలిపి 9.35 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించామని ప్రభుత్వం చెప్తున్నా ఇది కాగితాల్లోనే! సోమశిల పరిస్థితి కూడా ఇంతే. రెండేళ్లలో పూర్తి చేస్తామని ప్రకటించిన ప్రాజెక్టు పదేళ్లయినా ఇంకా పెండింగే. ఈ ప్రాజెక్టు కింద పాక్షికంగానే ఆయకట్టు వచ్చింది. 1.39 లక్షల ఎకరాలకు గాను 60వేల ఎకరాలకు కల్పించామని చెప్తున్నా ఇందులో ఎక్కువ భాగం కాగితాల్లోనే ఉంది. 2015 నాటికి పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ లక్ష్యంగా పెట్టుకొంది. తెలుగు గంగ కింద కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఆయకట్టు సాగులోకి రాలేదు.

దేవాదుల దైవాధీనం...
దేవాదుల మొదటి దశ పనులు కొనసాగుతుండగానే రెండో దశ ప్రారంభమైంది. ఈ రెండు దశలు పూర్తి కాకముందే మూడో దశ చేపట్టారు. ఇప్పటి వరకు దేవాదుల ప్రాజెక్టు కింద రూ.7100 కోట్లు ఖర్చు పెట్టారు. కానీ మొదటి దశ కింద ఇస్తామన్న 65వేల ఎకరాల్లో ఇప్పటి వరకు 20 వేల ఎకరాలకు మించి అందలేదు. కానీ 68894 ఎకరాల ఆయకట్టుకు నీళ్లిచ్చామని ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. అదేమంటే మౌలిక వసతుల కల్పన పూర్తయ్యిందనే సమాధానం. ఇక్కడ రైతుకు ఇంకా నీళ్లు అందలేదు కానీ మొదటి దశలోనే ఒప్పందానికి భిన్నంగా రూ.145 కోట్లు మాత్రం అదనంగా వై.ఎస్‌. ప్రభుత్వం చెల్లించింది. కొన్ని చెరువులను నింపారు. ఇంకా డిస్ట్రిబ్యూటరీ నిర్మాణ పనులు సాగుతున్నాయి. రెండో దశ కూడా ఇంతే! ఎత్తిపోతల పనుల గుత్తేదారులకు నిర్మాణ వ్యయమే కాకుండా నిర్వహణ వ్యయం కూడా రెండేళ్ళుగా చెల్లిస్తున్నారు. కానీ పొలాల్లోకి మాత్రం నీరు రాలేదు. ఇక మూడో దశ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాస్తవానికి ఈ ప్రాజెక్టు నాలుగేళ్ల క్రితమే పూర్తయ్యింది. నిర్వహణ, విద్యుత్తు ఛార్జీలకోసం నిర్మాణ వ్యయం కంటే ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. కానీ పిల్లకాల్వల పనులు పూర్తికాకపోవడంతో రైతులకు నీళ్లందడం లేదు.

ఐదేళ్ళ వాటి సంగతి దేవుడెరుగు!
రెండేళ్లలో పూర్తి చేస్తామన్న ప్రాజెక్టులే ఇలా ఉంటే ఐదేళ్లలో పూర్తి చేస్తామని వాగ్దానం చేసిన వాటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తోటపల్లి, గాలేరు-నగరి, హంద్రీనీవా, భీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు, వెలిగొండ, పులిచింతల, శ్రీరామసాగర్‌ వరద కాలువ, గుండ్లకమ్మ తదితర ప్రాజెక్టులు ఐదేళ్ళ వాయిదాలోనివి! వీటిలో ప్రధాన ప్రాజెక్టులన్నీ పెండింగ్‌లో ఉన్నాయి. ఓవైపు ఈ ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం పెరుగుతుంటే... ఇంకోవైపు పనులు పూర్తి కావడం లేదు. ఈ ప్రాజెక్టుల్లో ఒక్కోదానిది ఒక్కో కథ.

తోటపల్లి ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసి లక్షా 20వేల ఎకరాల కొత్త ఆయకట్టుతో పాటు 64వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలన్నది లక్ష్యం. ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం ఇప్పటికి రూ.851 కోట్లకు చేరింది. రిజర్వాయర్‌ నిర్మాణం పూర్తయ్యింది. కానీ కాల్వల పనులు జరగలేదు. ప్రతి సంవత్సరం ఖరీఫ్‌, రబీ అంటూ వాయిదా వేస్తున్న ప్రభుత్వం తాజాగా 2014-15 రబీ నాటికి పూర్తి చేస్తామని లక్ష్యంగా పెట్టుకొంది. పనులు జరుగుతున్న తీరు చూస్తే ఈ లక్ష్యం కూడా నెరవేరేలా లేదు.

హామీల మీద హామీలు...
రూ.5150 కోట్లతో రెండు దశల్లో చేపట్టిన వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటికే రూ.3400 కోట్లు ఖర్చు చేశారు. మొదటి దశ కూడా పూర్తికాలేదు. మరో మూడు నాలుగేళ్లకు కూడా పూర్తయ్యే అవకాశం లేదు. 2004లో రూ.681 కోట్లతో చేపట్టిన పులిచింతల నిర్మాణ వ్యయం ఇప్పటికి రూ.రెండు వేల కోట్లు కానుంది. కానీ ప్రాజెక్టు మాత్రం పూర్తి కాలేదు. పూర్తి కాకుండానే ప్రారంభోత్సవం చేశారు కూడా. 2008 నుంచి ఖరీఫ్‌, రబీలో నీటిని నిల్వ చేస్తామంటూ ప్రభుత్వం హామీల మీద హామీలు గుప్పించడం తప్ప పనులు పూర్తి చేయలేదు. వచ్చే ఖరీఫ్‌ నాటికి కూడా పూర్తయ్యే అవకాశం లేదు.

సొంత జిల్లాలో కూడా...
జలయజ్ఞం ప్రారంభించిన వై.ఎస్‌.సొంత జిల్లాలో కూడా పరిస్థితి ఇంతకంటే భిన్నంగా లేదు. గాలేరు-నగరి ప్రాజెక్టును రెండు దశల్లో చేపట్టారు. 2.6 లక్షల ఎకరాలకు గాను మొదటి దశలో 35వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటి వరకు రూ.4400 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో ఎక్కువ వ్యయం మొదటి దశలోనే! రెండవ దశ ప్రారంభమే కాలేదు. అయినా మొదటి దశకు కూడా నీళ్లందలేదు. గాలేరు-నగరిలో భాగంగా నిర్మించిన గండికోట రిజర్వాయర్‌ నుంచి నీటిని ఎత్తిపోతల ద్వారా మళ్లించేందుకు మరో రూ.మూడు వేల కోట్లతో గండికోట-చిత్రావతి ఎత్తిపోతల, గండికోట ఎత్తిపోతల పథకాలను చేపట్టారు. ఈ పథకాల నిర్మాణానికి రూ.2200 కోట్లు ఖర్చు చేశారు. ఈ పథకాల పనులన్నీ అసంపూర్తిగానే మిగిలిపోయాయి. వేల కోట్ల రూపాయలు ఖర్చు కావడం తప్ప రైతన్నకు మాత్రం ఇంత వరకు ఒరిగిందేమీ లేదు.

వెయ్యికోట్లిస్తే పూర్తయ్యేదే....కానీ..!
మహబూబ్‌నగర్‌ జిల్లాలోని భీమా, కల్వకుర్తి, నెట్టేంపాడు ఇప్పటికీ అసంపూర్తిగానే ఉన్నాయి. వాస్తవానికి రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేస్తే ఈ మూడు ప్రాజెక్టులు పూర్తె ఏడు లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది. కానీ ఆ పని చేయకుండా... రెండు దశాబ్దాలకుగానీ పూర్తయ్యే అవకాశం లేని ప్రాణహిత-చేవేళ్లలో ప్రభుత్వం రూ.6 వేల కోట్లకు పైగా ఖర్చు చేసింది. ప్రాజెక్టులు పూర్తి చేసి రైతులకు నీళ్లిద్దామనే దానికంటే గుత్తేదారులు, నేతలకు వాటాలు ముఖ్యం కావడంతో ఈ పరిస్థితి తలెత్తింది.

పదేళ్ళుగా ఆ గుత్తేదారు కదలడు మెదలడు
ఐదేళ్లలో హంద్రీనీవా మొదటి దశను పూర్తి చేస్తామని 2004లో హామీ ఇచ్చిన ప్రభుత్వం ఏడాది తిరగక ముందే రెండవ దశ పనులకు టెండర్లు ఖరారు చేసింది. రూ.6800 కోట్లతో ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టి ఇప్పటికే రూ.6500 కోట్లను ఖర్చు చేశారు. కానీ ఇప్పటి వరకు మొదటి దశ ఆయకట్టుకు కూడా నీరివ్వలేదు. ఎత్తిపోతల పనులు పూర్తికావడంతో నీటిని తోడినా ఆయకట్టుకు నీరందించే పనులను ఓ గుత్తేదారు దశాబ్ద కాలంగా పూర్తి చేయలేదు. రాజకీయ అండదండలున్న, అందునా జలయజ్ఞ ప్రముఖుని సహాయ సహకారాలున్న ఈ గుత్తేదారు పని చేయకపోయినా చర్యలు తీసుకోవడానికి నీటిపారుదల శాఖ మీనమేషాలు లెక్కించడంతో వేల కోట్లు ఖర్చయ్యాయి కానీ రైతు పొలం మాత్రం తడవలేదు.

స్వదేశీల విదేశీ వేషం...
టెండర్లు ఖరారు చేయడం, మొబిలైజేషన్‌ అడ్వాన్సులు చెల్లించడం, వాటాలు పంచుకొనే కార్యక్రమంగా జలయజ్ఞాన్ని మార్చారు. జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టులకు ఈపీసీ పద్ధతిలో టెండర్లు ఖరారు చేసి నిర్ధిష్ట వ్యవధిలోగా పూర్తి చేస్తామంటూ ఆరంభం నుంచే ప్రభుత్వం మోసం చేసింది. అంచనాల తయారీ, అనుమతులు, భూసేకరణ, డిజైన్ల ఖరారు, గుత్తేదారుల సామర్థ్యం ఇలా ఏమీ పట్టించుకోకుండా టెండర్లు పిలిచి గుత్తేదారులకు అప్పగించింది. గుత్తేదారులు, ప్రభుత్వం కుమ్మక్కై వారి శక్తికి మించి పనులు తీసుకొని ఉప గుత్తేదారులను వెతుక్కోవడానికే సమయం సరిపోయింది. ఈపీసీ పద్దతిలో పనులు చేపట్టినందున అనుభవం కలిగిన వారు వస్తారని, ప్రపంచవ్యాప్తంగా గుత్తేదారులు పోటీపడతారని ప్రభుత్వం ప్రకటిస్తే, స్థానిక గుత్తేదారులే విదేశీ వేషం వేసుకొన్నారు.

20 ఏళ్ళలో కానిది... 4ఏళ్ళలో చేస్తామని!
కాంగ్రెస్‌ ప్రభుత్వ మోసానికి పరాకాష్ఠ ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టు! ఈ ఎత్తిపోతల పథకాన్ని నాలుగేళ్లలో పూర్తి చేసి తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్‌. ప్రకటించారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్టు పరిధిలోని అన్ని జిల్లాల్లోనూ శంకుస్థాపనలు చేశారు. ప్రస్తుత టిపిసిసి అధ్యక్షుడు, అప్పటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యతోపాటు ఆయా జిల్లాల్లోని మంత్రులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టు ప్రచారానికే కోట్ల రూపాయలు వ్యయం చేశారు. రూ.38,500 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులకు హడావుడిగా టెండర్లు పిలిచి రూ.36 వేల కోట్లకు గుత్తేదారులతో నాలుగేళ్లలో పూర్తి చేసేలా ఒప్పందం చేసుకొన్నారు. ఒప్పందాలు చేసుకోగానే మొబిలైజేషన్‌ అడ్వాన్సులు, ఎన్నికలకు ముందుగా ఇన్వెస్టిగేషన్‌, సర్వే పేరుతో వందల కోట్లు గుత్తేదారులకు చెల్లించారు. వై.ఎస్‌. చెప్పినట్లుగా ఈ ప్రాజెక్టు పనులు నాలుగేళ్లలో పూర్తి కావాలంటే ఏడాదికి రూ.పదివేల కోట్లు ఖర్చు చేయాలి. కానీ మొత్తం సాగునీటి రంగానికి సరాసరి చేసిన ఖర్చే ఇంత! ప్రాణహిత-చేవేళ్ల గుత్తేదారులతో చేసుకొన్న ఒప్పందాల గడువు ముగిసి కూడా రెండేళ్లయ్యింది. ఆరేళ్లలో చేసిన ఖర్చు రూ. ఆరువేల కోట్లు. ఈ ఆరేళ్ల్లలో పెరిగిన నిర్మాణ వ్యయంతో ఈ ప్రాజెక్టు ఖర్చు మరో రూ. పదివేల కోట్లకు పైగా పెరిగింది. ఈ ప్రాజెక్టు పూర్తికి దశాబ్దాలు పట్టే అవకాశం ఉంది. కానీ నాలుగేళ్లలో మీ భూములను సస్యశ్యామలం చేస్తామంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టింది.

ఎన్నికల కోసమని హడావుడిగా...
ఈ ప్రాజెక్టులు సమయానికి పూర్తికావని తెలిసినా, రాష్ట్ర ఖజానా, గుత్తేదార్ల సామర్థ్యం చూసుకున్నా అసాధ్యమని తెలిసినా గత ఎన్నికలకు ముందు అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్‌. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.! 2009 అసెంబ్లీ ఎన్నికల నాటికి ప్రభుత్వం పరిపాలనా అనుమతి ఇచ్చిన ప్రాజెక్టుల సంఖ్య 86కు పెరిగింది. ఈ ప్రాజెక్టుల పూర్తికి రూ.లక్షా 85వేల కోట్లతో పరిపాలనా అనుమతి ఇచ్చింది. ఇందులో 2008-09లోనే రూ.93,389.17 కోట్ల విలువైన పనులను చేపట్టింది. 2009 ఎన్నికల ముందు ప్రాణహిత-చేవేళ్ల, దుమ్ముగూడెం-టేల్‌పాండ్‌తో సహా భారీగా టెండర్లు ఖరారు చేసింది. గుత్తేదారులకు మొబిలైజేషన్‌ అడ్వాన్సు, ఇన్వెస్టిగేషన్‌ పేరుతో వందల కోట్లు ఇచ్చింది. గుత్తేదారుల నుంచి వసూలు చేసుకొని ఎన్నికల్లో వెదజల్లింది. రైతుల పేరు చెప్పి ప్రభుత్వ పెద్దలు చేసిన నిర్వాకమిది. 2004లో ఇచ్చిన హమీ మేరకు ఏ ప్రాజెక్టూ పూర్తి చేయకుండానే కొత్త ప్రాజెక్టులు చేపట్టి మళ్లీ అధికారంలోకి వస్తే అసంపూర్తిగా ఉన్న పనులన్నీ పూర్తి చేస్తామంటూ 2009 ఎన్నికల్లో ప్రకటించింది. మళ్లీ ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వచ్చి పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీలు గుప్పిస్తున్నారు.
వెలుగు వైపు నా అడుగులు...

బడిగంట కొట్టగానే పిల్లలందరూ బిలబిలమంటూ బయటకు పరుగుతీశారు. టీచర్లూ ఇంటిదారిపట్టారు. ఒకరిద్దరు తప్ప నిర్మానుష్యంగా మారిన ఆ బడిలో..

పరిశ్రమ వదిలి వెళ్లిపోదామనుకున్నా!

మానవీయ కోణాల్ని స్పృశిస్తూ సినిమాలు తీయడంలో దర్శకుడు మదన్‌ది ప్రత్యేక శైలి. మనిషి, మనసు, అనుబంధాల మధ్య సంఘర్షణల్ని ఆయన తెరపైకి తీసుకొచ్చే విధానం బాగుంటుంది.

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net