Thu, February 11, 2016

Type in English and Give Space to Convert to Telugu

'హైదరాబాద్‌కు యాపిల్‌''కారెక్కిన ఎర్రబెల్లి''మేయర్‌ బొంతు రామ్మోహన్‌!''హనుమంతప్ప పరిస్థితి మరింత విషమం''భాగ్యనగరం తరహాలో ఖేడ్‌ అభివృద్ధి''మహా జాతరకు శ్రీకారం''ఓటుకు నోటు కేసులో మరో తెదేపా ఎమ్మెల్యే అరెస్టు?''ప్రయాణికులపై మళ్లీ వడ్డింపు?''గవర్నర్లు రాష్ట్రాలకు ఉత్ప్రేరకాలు''మహానగర అభివృద్ధికి 100 రోజుల ప్రణాళిక!'
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర మద్దతే ఆధారం
9 నెలల్లో రాష్ట్ర పటిష్ఠ పునాదికి యత్నాలు
2014-15లో తలసరి ఆదాయం రూ.90,517
జీఎస్‌డీపీ రూ.5,20,030 కోట్లు
వెల్లడించిన ఏపీ ఆర్థిక సర్వే
ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర విభజన నేపథ్యంలో వచ్చిన సమస్యలకుతోడు ఆర్థిక లోటు మీద పడింది. ఇవి చాలవన్నట్లు హుద్‌హుద్‌ తుపాను మరో దెబ్బతీసింది. అయినప్పటికీ సమస్యలను అవకాశంగా మలచుకుని వెలుగులీనుతున్న (సన్‌రైజ్‌) ఆంధ్రప్రదేశ్‌ పటిష్ఠ పునాదికి గత 9 నెలల్లో ప్రయత్నించినట్లు 2014-15 ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సామాజిక ఆర్థిక సర్వే తెలిపింది. ‘‘రెవెన్యూ లోటును పూడుస్తాం. పారిశ్రామిక ప్రోత్సాహకాలిస్తాం. ఏడు వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ఇస్తాం. నూతన రాజధాని అభివృద్ధికి సహకారం అందిస్తాం. రాష్ట్రానికి రైల్వే జోన్‌, ప్రత్యేక హోదా ఇస్తామని విభజన చట్టంలో కేంద్రం హామీ ఇచ్చింది. కానీ కేంద్రం నుంచి మద్దతు కొరవడింది. హుద్‌హుద్‌ తుపానుకు ప్రధాన మంత్రి రూ.వెయ్యి కోట్లు ప్రకటిస్తే రూ.650 కోట్లే వచ్చాయి. 7 జిల్లాల అభివృద్ధికి తాత్కాలికంగా రూ.350 కోట్లు, రెవెన్యూ లోటుకు మరో రూ.500 కోట్లు మాత్రమే కేంద్రం ప్రకటించింది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు కూడా ప్రోత్సాహకరంగా లేవు. కేంద్ర బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులూ లేవు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఆర్థిక లోటులో నడుస్తోంది. ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మించ ప్రతిపాదించిన రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రం నుంచి పెద్ద ఎత్తున మద్దతు అందుతుందనే ఆశాభావంలో నిరీక్షిస్తోందని’’ ఆర్థిక సర్వే ఆశాభావం వ్యక్తం చేసింది. సర్వే వివరాలు.

* ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆహార ధాన్యాల దిగుబడులు తగ్గనున్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఖరీఫ్‌, రబీలో కలిపి ఆహార ధాన్యాల విస్తీర్ణం 39.80 లక్షల హెక్టార్లే. గత సంవత్సరం ఈ విస్తీర్ణం 42.81 లక్షల హెక్టార్లు కాగా దిగుబడులు 116.98 లక్షల టన్నులుగా నమోదయ్యాయి. ఈసారి అది 111.43 లక్షల టన్నులకు తగ్గనుందని అంచనా. అయితే పత్తి, వరి, ఉల్లి, మినుముల ఉత్పత్తిలో పెరుగుదల ఉంది.

* ఆంధ్రప్రదేశ్‌ నుంచే రూ.3 వేల కోట్ల విలువైన సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు జరిగాయి. దేశం మొత్తంలో ఇది సగం. చేపలు, రొయ్యల ఉత్పత్తి 2005-06లో 8.14 లక్షల టన్నులు ఉంటే 2013-14కు 17.69 లక్షల టన్నులకు పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గత నవంబరునాటికి వీటి ఉత్పత్తి 11.18 లక్షల టన్నులు. మత్స్య రంగంలో మంచి పెరుగుదల ఉందని ప్రభుత్వం గుర్తించింది.

* 2,694 టన్నుల ఎర్రచందనం అమ్మకం ద్వారా రూ.855.51 కోట్ల ఆదాయం వచ్చింది.

* 6,71,484 మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ)లో 71,31,910 సభ్యులున్నారు. గత జనవరి నాటికి మహిళల పొదుపు రూ.3,290 కోట్లు కాగా కార్పస్‌ ఫండ్‌ రూ.4,340 కోట్లు. 2014 డిసెంబరు నాటికి ఎస్‌హెచ్‌జీలకు ఇచ్చిన బ్యాంకు రుణాలు రూ.46 వేల కోట్లు.

* ఉపాధి కోసం గత ఏడాది అక్టోబరునాటికి నమోదు చేసుకున్న వారి సంఖ్య 8.80 లక్షలు.

* ప్రస్తుత ధరల ప్రకారం 2014-15లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) రూ.5,20,030 కోట్లు. ఇందులో వ్యవసాయ రంగ భాగస్వామ్య విలువ రూ.1,43,498 కోట్లు కాగా పారిశ్రామికరంగ వాటా రూ.1,07,224 కోట్లు. మిగిలిన రూ.2,69,307 కోట్లు సేవా రంగ భాగస్వామ్యం.

* 2013-14 ధరల ప్రకారం జిల్లా స్థూల ఉత్పత్తిలో విశాఖపట్నం అగ్ర భాగాన (రూ.65,458 కోట్లు) ఉండగా, తరువాత కృష్ణా (రూ.55,472 కోట్లు), తూర్పుగోదావరి (రూ.46,643 కోట్లు) నిలిచాయి. అన్నికంటే దిగువన విజయనగరం (రూ.16,386 కోట్లు), శ్రీకాకుళం (రూ.17,846 కోట్లు), కడప (రూ.23,643 కోట్లు) ఉన్నాయి.

* తలసరి ఆదాయం 2014-15లో రూ.90,517. అంతకు ముందు సంవత్సరం ఇది రూ.81,397.

* ప్రతి 1,725 మందికి ఒక చౌకధరల దుకాణముంది. ప్రతి దుకాణానికి సరాసరిన 450 రేషన్‌కార్డులున్నాయి. గత ఏడాది నవంబరునాటికి 28,953 చౌకధరల దుకాణాలున్నాయి. 1.13 తెల్లకార్డుదారులకు 4 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తున్నారు. కూపన్లతో కూడా కలిపితే తెల్లకార్డుల సంఖ్య 1.20 కోట్లు అవుతుంది.

* 4.95 కోట్ల జనాభాకుగాను 4.72 కోట్లకు ఆధార్‌కార్డులు జారీ అయ్యాయి. ఆధార్‌, రేషన్‌కార్డుల అనుసంధానం 98.4 శాతం పూర్తి అయింది.

* రూ.286 కోట్లతో చంద్రన్న సంక్రాంతి కానుకను పంపిణీ చేశారు.

* పురుగుమందుల వినియోగం తగ్గింది. 2013-14లో 4,253 మెట్రిక్‌ టన్నులు వినియోగం అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబరునాటికి 3,895 మెట్రిక్‌ టన్నులే వినియోగమైంది.

* వ్యవసాయ యాంత్రీకరణ వేగం తగ్గింది. రాయితీ రూ.90 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా డిసెంబరునాటికి రూ.32.41 కోట్లే వెచ్చించారు.

* 3,39,214 మంది కౌలు రైతులకు రుణ అర్హత కార్డుల పంపిణీ జరిగింది. కొత్తగా ఇచ్చిన వారు, రెన్యువల్‌ చేసిన రైతులున్నారు. 33,979 మంది కౌలు రైతులకు రూ.58.57 కోట్ల రుణం అందింది.

* ఆవులు, గేదెల సంఖ్య తగ్గింది. కోళ్లు, గొర్రెల సంఖ్య మాత్రం పెరిగింది. పోషక ఆహార అందజేత నేపథ్యంలో పాల ఉత్పత్తి మాత్రం పెరిగింది.

* బలహీనవర్గాల గృహ నిర్మాణ పథకం కింద ఈ ఏడాది జనవరినాటికి 58,09,155 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. ఇందులో 51,88,608 ఇళ్లు గ్రామీణ ప్రాంతంలో కాగా మిగిలినవి పట్టణ ప్రాంతంలోనివి.

నీళ్ల సీసాలపై మీ పేర్లు!

‘మంచి వ్యాపారవేత్త కావాలంటే ఎంబీఏలే చదవాల్సిన అవసరంలేదు. సామాజిక చొరవ ఉంటే చాలు! చక్కటి ఆలోచనతో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా ఈ ఏడాదిన్నరలో రెండు...

వెండితెరపై కోట్ల ‘కాంతి’

సినిమా అనేది కచ్చితంగా వ్యాపారమే. ఏ కథానాయకుడికి ఎంత మార్కెట్‌ ఉంది? అనే లెక్కలు ఎప్పుడూ అవసరమే. పెట్టిన ప్రతీపైసాకీ గ్యారెంటీ ఉందన్న నమ్మకం కుదిరిన...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net