Sun, February 14, 2016

Type in English and Give Space to Convert to Telugu

'భారత్‌లో తయారీకి బ్రహ్మరథం''ఐపీఎస్‌లను పెంచండి''పాకిస్థాన్‌కు అధునాతన ఎఫ్‌-16 యుద్ధవిమానాలు''ఖేడ్‌లో 81.72 శాతం పోలింగ్‌''దిండి మొదటి దశ పనులకు త్వరలో టెండర్లు''మెదక్‌ నిమ్జ్‌లో చైనా పెట్టుబడులు..''చెలకల్లో.. అవినీతి మొలకలు!''మార్చి 10 నుంచి శాసనసభ సమావేశాలు''మళ్లీ తెరపైకి ఓటుకు నోటు కేసు''కళతో సామాజిక సందేశం'

సంపద లేదు... సంతోషం లేదు
జనాభా ఎక్కువ... ఆదాయం తక్కువ
కొరతల మధ్య నవ్యాంధ్ర బడ్జెట్‌ ఆవిష్కరణ
ఈనాడు - హైదరాబాద్‌
ఆంధ్రప్రదేశ్‌ వనరుల పరిమితులు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చేతులు కట్టేశాయి. ఆదాయం పెద్దగా లేకపోవడం వల్ల ఏ పద్దుకూ ధారాళంగా నిధులు కేటాయించ లేకపోయారు. గత ఏడాది బడ్జెట్‌తో పోలిస్తే ఈ బడ్జెట్‌ పెరుగుదల కేవలం 1.1 శాతానికే పరిమితం కావడం వాస్తవ ఆర్థిక పరిస్థితులకు అద్దం పడుతోంది. నవ్యాంధ్రలో కొత్త ఆర్థిక వనరులు సమకూరడానికి తక్షణం అవకాశాలు లేకపోవడంతో ఏ రంగానికీ భారీ మొత్తంలో బడ్జెట్‌ కేటాయించలేక పోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్న ఏడు మిషన్లు, అయిదు గ్రిడ్లు, స్మార్ట్‌ ఆంధ్రప్రదేశ్‌ పథకాలకు ప్రత్యేకంగా నిధులేమీ కేటాయించకుండా సంబంధిత శాఖల కేటాయింపుల్లోనే సర్దుబాటు చేశారు. బడ్జెట్‌ ద్వారా మా కష్టాలు, సమస్యలు చెప్పగలిగామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు విలేకర్ల సమావేశంలో ప్రకటించడాన్ని బట్టి కేటాయింపుల పట్ల ఆయన కూడా సంతృప్తికరంగా లేరన్న వాస్తవాన్ని చాటింది.

జనాభాతో సరిపోలని ఆదాయం
సమైక్య రాష్ట్రంలో 2013-14లో రూ.87,836 కోట్లున్న రాష్ట్ర సొంత ఆదాయ వనరులు తాజా బడ్జెట్‌ అంచనాల ప్రకారం రూ.49,764 కోట్లకు పరిమితమయ్యాయి. సమైక్య రాష్ట్రం చివరి సంవత్సరంలో కనిపించిన ఆదాయాన్ని 58% జనాభా, దానికితోడు పన్నుల వృద్ధిలో కనీసం కనిపించే 14 శాతం పెరుగుదలను పరిగణనలోకి తీసుకొని లెక్కిస్తే ఈ ఏడాది సుమారు రూ.58,076 కోట్ల ఆదాయం సమకూరాలి. 14వ ఆర్థిక సంఘం కూడా ఇదే విధంగా అంచనావేసి ఏపీకి 2015-16 సంవత్సరానికి రూ.58,624 కోట్ల ఆదాయం దక్కుతుందని అంచనా వేసింది. కానీ రాష్ట్రానికి అంతకంటే రూ.8,860 కోట్ల ఆదాయం తగ్గింది. కొత్త రాష్ట్రంలో ఇంకా ఆర్థిక, మౌలిక, సామాజిక అభివృద్ధి కార్యక్రమాలు వేగం పుంజుకోక పోవడం వల్ల ఇప్పుడిప్పుడే ఆదాయం పెరిగే పరిస్థితులు కూడా కనిపించడం లేదు. దీంతో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఉన్న వనరులనే అందరికీ సర్దుబాటు చేసుకుంటూ వెళ్లారు.

ఆదాయం అంతా వాటికే సరి
రాష్ట్ర సొంత ఆదాయ వనరులు, కేంద్రం నుంచి పన్నుల వాటా రూపంలో వచ్చే మొత్తం అంతా జీతాలు, అప్పుల చెల్లింపులు, సబ్సిడీలకే సరిపోతోంది. ఈ బడ్జెట్‌లో రాష్ట్ర సొంత ఆదాయ వనరులు, కేంద్ర పన్నుల్లో వాటా, రెవిన్యూ లోటు భర్తీ రూపంలో కేంద్రం నుంచి వచ్చే మొత్తం కలిపి రాష్ట్రానికి రూ.79,010 కోట్లు సమకూరనుంది. ఇదే సమయంలో జీతాలు, పింఛన్లు, రుణాలు, వడ్డీల చెల్లింపులు, ఆహార, విద్యుత్తు సబ్సిడీ, రైతు రుణ మాఫీ లాంటివాటికోసం రూ.77,427 కోట్లు ఖర్చవుతోంది. మిగతా అన్ని ఖర్చులకు కలిపి కేవలం రూ.35,622 కోట్లు మాత్రమే మిగులుతోంది. ఇందులోనే ప్రణాళిక, మూలధన వ్యయాలకు నిధులు సర్దుబాటు చేయాల్సిన విధిలేని పరిస్థితి నెలకొనడంతో కొన్ని కేటాయింపుల్లో పిసినారితనాన్ని ప్రదర్శించాల్సి వచ్చినట్లు కనిపిస్తోంది.

రుణమాఫీకి నిధుల కోత
రైతు, డ్వాక్రా రుణమాఫీకి ప్రభుత్వం అంతంత మాత్రంగానే నిధులు కేటాయించింది. రైతు రుణమాఫీ కోసం గత ఏడాది రూ.5000 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈసారి దాన్ని రూ.4,300 కోట్లకు తగ్గించింది. డ్వాక్రా మహిళల రుణమాఫీ కోసం రూ.వెయ్యి కోట్లు మాత్రమే పెట్టింది. ప్రభుత్వ అంచనాల ప్రకారం రైతు రుణ మాఫీకి సుమారు రూ.20 వేల కోట్లు అవుతుందని అంచనా. ఇప్పటికే ఒక విడతన రూ.4668 కోట్లు చెల్లించినందున నాలుగేళ్లలో రూ.15,332 కోట్లు చెల్లించాల్సి ఉంది. అంటే వచ్చే నాలుగేళ్ల పాటు ఏటా రూ.3,833 కోట్లు ఖర్చు చేస్తే సరిపోతుంది. అయితే ప్రస్తుతం రెండోదశ కిందికి వచ్చే రైతులతో పాటు, స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ వర్తింపజేసిన తర్వాత రూ.50వేల లోపు రుణ పరిధిలోకి వచ్చే రైతులకు ఏకమొత్తంలో ఒకేసారి రూ.50 వేలు చెల్లించాల్సి ఉంది.

దీనంతటికీ సుమారు 5 వేల కోట్ల రూపాయలకు పైనే కావాల్సి ఉన్నప్పటికీ ఈ బడ్జెట్‌లో కేటాయింపులు తగ్గించారు. 76 లక్షల మంది డ్వాక్రా మహిళలకు రూ.10 వేల చొప్పున చెల్లించడానికి రూ.7600 కోట్లు కావాల్సి ఉన్నప్పటికీ ఈ బడ్జెట్‌లో కేవలం వెయ్యి కోట్లే కేటాయించారు.

రాజధాని, పట్టిసీమలకు అంతంత మాత్రం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చెబుతున్న రాజధాని నగరం, స్మార్ట్‌సిటీలు, పట్టిసీమ ఎత్తిపోతల నిర్మాణాలకు చేసిన కేటాయింపులు నిరుత్సాహ పరిచే విధంగా ఉన్నాయి. రాజధాని నిర్మాణం కోసం సుమారు రూ.20 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసిన ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో భూసమీకరణ పేరున రూ.94 కోట్లు మాత్రమే కేటాయించింది. ఇతరత్రా మౌలిక వసతుల కల్పన కోసం ఏమీ ఇవ్వలేదు.

రాష్ట్రంలో 13 స్మార్ట్‌ సిటీలను నిర్మిస్తామని చంద్రబాబు చెబుతున్నప్పటికీ ఈ బడ్జెట్‌లో అందుకోసం కేవలం రూ.500 కోట్లే కేటాయించడంతో ఆ పథకం ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని రూ.1300 కోట్లతో ఏడాదిలోపు పూర్తి చేస్తామని ప్రభుత్వం చెప్పినా బడ్జెట్‌లో మాత్రం కేవలం రూ.257 కోట్లే కేటాయించడంతో ప్రభుత్వ ఉద్దేశం అర్థం కాని పరిస్థితి నెలకొంది.

ఎన్టీఆర్‌ భరోసాకి ఇది సరిపోతుందా?
రాష్ట్రంలో సుమారు 41 లక్షల మందికి పింఛన్లు చెల్లిస్తున్నట్లు బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థికమంత్రి యనమల ప్రకటించారు. దీని ప్రకారం ప్రతి లబ్ధిదారుకి రూ.వెయ్యి చొప్పున చెల్లిస్తే రూ.4,100 కోట్లు అవసరం అవుతుంది. కానీ బడ్జెట్‌లో మాత్రం రూ.3,741 కోట్లే కేటాయించారు. దీన్నిబట్టి పింఛను దారుల సంఖ్యను కుదిస్తారా? లేదంటే అవసరాలకు తగ్గట్టు బడ్జెట్‌ పద్దుతో సంబంధం లేకుండా పెంచుకుంటూ పోతారా? అన్న ప్రశ్న ఉదయిస్తోంది.

మౌలిక వసతులకు అత్తెసరే
రాష్ట్రంలో 14 చిన్న ఓడరేవులు, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకొంది. వీటన్నింటినీ ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేయాలనుకున్నప్పటికీ భూసేకరణ, ఇతర మౌలిక వసతుల కల్పనకు అవసరమైన ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. కానీ మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖకు కేవలం రూ.195 కోట్లే కేటాయించారు. పర్యాటక, సాంస్కృతిక శాఖలకు రూ.330 కోట్లు ఇచ్చారు.

కాపులు, బ్రాహ్మణులకు కొంత చేయూత
కాపులు, బ్రాహ్మణ సామాజిక వర్గాలకు ఈ బడ్జెట్‌లో బడ్జెట్‌ కేటాయింపులు పెంచడం ఆ వర్గాలకు కొంత చేయూతనిచ్చే అంశం. కాపులకు గత బడ్జెట్‌లో రూ.50 కోట్లు కేటాయించగా ఈసారి దాన్ని రూ.100 కోట్ల పెంచడం, బ్రాహ్మణుల కేటాయింపును రూ.25 కోట్ల నుంచి రూ.35 కోట్లకు పెంచడం ఆ వర్గాలకు సంతోషం కల్పించే అంశం. నిరుద్యోగ భృతి కింద రూ.100 కోట్లు కేటాయించడం వూరట కలిగించే విషయం. ఈ మొత్తం పెద్దగా సరిపోకపోయినా ఒకసారి బడ్జెట్‌లో పొందుపరిచినందున మున్ముందు పెరిగే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం ఉంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలకు వరుసగా రూ.6600 కోట్లు, 5877 కోట్లు, 1908 కోట్లు కేటాయించారు. తద్వారా ఎన్నికల హామీని నిలబెట్టుకున్నారు. స్వచ్ఛభారత్‌కు రూ.151 కోట్లు ఇచ్చారు. గోదావరి పుష్కరాలకు ప్రత్యేకంగా రూ.200 కోట్లు కేటాయించడం ద్వారా వాటి నిర్వహణ పట్ల ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధను చాటింది. ఇవి కాకుండా పుష్కరాల నిర్వహణ కోసం రోడ్లు భవనాల శాఖ రూ.749 కోట్లు, మున్సిపల్‌ శాఖ రూ.343 కోట్లు, పంచాయతీరాజ్‌ శాఖ రూ.141 కోట్లు, నీటిపారుదలశాఖ రూ.92 కోట్లు ఖర్చు చేయనున్నాయి.
పన్నుల బాదుడా... లేదంటే సహజ పెరుగుదలా?
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2015-16 బడ్జెట్‌లో సొంత పన్ను ఆదాయం కింద రూ.44,423 కోట్లు చూపింది. గత ఏడాది బడ్జెట్‌ అంచనాలతో పోలిస్తే ఇది రూ.7,026 కోట్లు అధికం. అంటే ప్రభుత్వం పన్నుల్లో 18 శాతం వృద్ధిని అంచనా వేస్తోంది. ఆ మేరకు ప్రజలపై కొత్త పన్నులు బాదుతారా? లేదంటే సహజంగా కనిపించే వృద్ధిని ఆధారంగా చేసుకొని ఈ అంచనాలు తయారు చేశారా? అన్న సంశయం కలుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది ఆగస్టు 20న బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత పెట్రో ఉత్పుత్తులపై లీటర్‌కు రూ.4 పన్ను వేసింది. అలాగే ఈ మధ్య పన్ను ఎగవేతను అరికట్టే పేరుతో బయటి రాష్ట్రాల్లో అమ్మే చక్కెరపై 2 శాతం పన్ను విధించింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ధరలనూ 1 శాతం పెంచింది. వీటన్నింటినీ బడ్జెట్‌తో సంబంధం లేకుండానే పెంచింది. అందువల్ల ఈ సారి కూడా బడ్జెట్‌తో సంబంధం లేకుండా పన్నులు పెంచుతారా? అన్న అనుమానం కలుగుతోంది. అయితే ఆర్థిక శాఖ మాత్రం అలాంటిదేమీ ఉండబోదని చెబుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పడిపోవడంతో పెట్రో ఉత్పత్తుల పన్ను ఆదాయంలో భారీ తరుగుదలను నివారించడానికే లీటర్‌కు రూ.4కు పెంచాల్సి వచ్చిందని వివరించింది. ఈ సారి మాత్రం సహజ వృద్ధిని దృష్టిలో ఉంచుకొనే పన్ను ఆదాయాన్ని అంచనా వేసినట్లు తెలిపారు. వాణిజ్య పన్నులన్నీ వినియోగం ప్రాతిపదికనే ఉంటాయి కాబట్టి ఇవి ద్రవ్యోల్బణం+ రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఆధారంగా సహజంగానే పెరుగుతాయని చెప్పారు. ఏటా నిత్యావసర ధరలు పెరగడంతో పాటు, రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుతుంది కాబట్టి వాణిజ్య పన్నులు వాటికవే పెరుగుతాయని విశ్లేషించారు. రాజధాని నిర్మాణంతో పాటు, కొత్తగా పారిశ్రామిక, మౌలిక వసతుల రంగం రాష్ట్రంలో విస్తృతం అవుతుంది కాబట్టి ఆ మేరకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయంలో కనీసం 25 శాతం సహజ వృద్ధి ఉంటుందని, తమిళనాడు తరహా ఎక్సైజ్‌ విధానం తీసుకురాబోతుండటం వల్ల మద్యంపై వాణిజ్య పన్ను ఆదాయంలో 33 శాతం వృద్ధి ఉంటుందని అంచనా వేశారు. దీనివల్ల పన్నులు పెంచకుండానే ఈ మేరకు ఆదాయ వృద్ధి సాధించడానికి వీలవుతుందని అధికారులు విశ్లేషించారు.
లోటు భర్తీ ఎలా?
ఈనాడు, హైదరాబాద్‌: విద్యుత్‌ పంపిణీ సంస్థల ఆర్థిక లోటుకూ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బడ్జెట్‌లో చూపిన కేటాయింపులకు పొంతన లేదు! రూ.7,716 కోట్ల లోటును పూడ్చుకునేందుకు రూ.1,261 కోట్ల మేర ఛార్జీల పెంపును ప్రతిపాదించిన విద్యుత్‌ పంపిణీ సంస్థలు... ప్రభుత్వం నుంచి సబ్సిడీల రూపంలో రూ.6,455 కోట్లు వస్తాయని ఆశించాయి. కానీ, 2015-16 బడ్జెట్‌లో ప్రభుత్వం ఈ రంగానికి మొత్తం రూ.4,360.51 కోట్ల (ప్రణాళికా వ్యయం రూ.96.12 కోట్లు, ప్రణాళికేతర వ్యయం రూ.4,264.39 కోట్లు)ను కేటాయించింది. దీంతో రూ.2,094.49 కోట్ల లోటు ఏర్పడనుంది. దీనిని పూడ్చాలంటే.. విద్యుత్‌ ఛార్జీలను ఇంకా పెంచడమో, విద్యుత్‌ పంపిణీ సంస్థల ‘వార్షిక ఆదాయ అవసరాలు, వ్యయాన్ని (ఏఆర్‌ఆర్‌)’ తగ్గించడమో చేయాలి. 2015-16లో తమకు రూ.30,308 కోట్లు అవసమని విద్యుత్‌ పంపిణీ సంస్థలు ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)కి విన్నవించాయి. వీటికి ఇంత మొత్తంలో నిధులు అవసరమా? లేదా అనే విషయమై ఈఆర్‌సీ అధ్యయనం చేస్తోంది. ఈ మొత్తంలో సుమారు 2,100 కోట్లను ఈఆర్‌సీ తన మదింపులో తగ్గిస్తే, వినియోగదారులపై మరింత ఛార్జీల భారం పడదు. కేవలం రూ.1,261 కోట్ల పెంపుదలకే పరిమితం అవుతారు. ఇక సబ్సిడీ కేటాయింపుల్లో వ్యవసాయ రంగానికి గత బడ్జెట్‌లో రూ.2,429 కోట్లు ఇవ్వగా, ఈసారి రూ.3 వేల కోట్లను ప్రతిపాదించారు.

వలచి...గెలిచి..

ప్రేమికుల రోజూ.. అదే సూర్యుడు. అవే ఇరుసంధ్యలు. అదే గాలి. అవే దిక్కులు. ఎప్పట్లాగే ఇరవై నాలుగ్గంటలు!! మరేమిటీ ప్రత్యేకం? ఏముంది? ప్రేమే!!...

‘శ్రీరస్తు శుభమస్తు’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌

అల్లు శిరీష్‌, లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘శ్రీరస్తు శుభమస్తు’. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను చిత్ర....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net