Sun, February 07, 2016

Type in English and Give Space to Convert to Telugu

'కడలి వేదికగా కదన విన్యాసం''కల్తీల నుంచి కాపాడాలి''ఎస్సై కొలువులకు సై''వాట్సన్‌ @ రూ. 9.5 కోట్లు''హామీలు నెరవేర్చే వరకు దీక్ష''అన్నయ్యే వారసుడు..''ప్రజల మనసులు చూరగొంటూ..''సాగర జలాల్లో స్నేహబంధం''కాగిత రహిత టికెట్ల దిశగా రైల్వే''అనుమతి లేకుండా ప్రాజెక్టులు'
కొత్త నిట్‌తో ఎంతో మేలు
ఆంధ్రప్రదేశ్‌లో నూతన ‘నిట్‌’కు
250 ఎకరాల స్థలసేకరణ జరగాలి
కనీసం రూ.250 కోట్లు అవసరం
పెరగనున్న రాష్ట్ర విద్యార్థుల ప్రవేశాలు
ఈనాడు - హైదరాబాద్‌, వరంగల్‌
న్నత సాంకేతిక విద్యలో ప్రపంచ దేశాలతో మనదేశం పోటీపడేలా ఐఐటీ, నిట్‌, ఐఐఎం లాంటి విద్యాసంస్థలు దోహదపడుతున్నాయి. అందులోనూ అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఇంజినీరింగ్‌ విద్యను అందించడంలో ఎన్‌ఐటీలదే కీలకపాత్ర. అందుకు అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాల్లో నిట్‌లను ఏర్పాటుచేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన నేపథ్యంలో.. వరంగల్‌లోని నిట్‌ తెలంగాణకు చెందనుంది. దీనికి సమానంగా ఆంధ్రప్రదేశ్‌లోనూ నిట్‌ ఏర్పాటుచేస్తామని కేంద్రం ప్రకటించింది. దీంతో నిట్‌ ఏర్పాటుపై చర్చ మొదలైంది. ఐఐటీల్లో చేరేందుకు విద్యార్థులు తొలుత ప్రాధాన్యం ఇస్తారు. ఆ తరువాత ఎన్‌ఐటీల్లో చేరేందుకు మొగ్గుచూపుతున్నారు. ఐఐటీల్లో ప్రవేశాలు జాతీయ స్థాయిలో జరుగగా నిట్‌లలో మాత్రం స్వరాష్ట్రానికి చెందిన విద్యార్థులకు 50% సీట్లను కేటాయిస్తారు. జేఈఈ మెయిన్స్‌లో సాధించిన ర్యాంకు అనుసరించి నిట్‌లలో సీట్లు లభిస్తాయి. నిట్‌ ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడబోతున్నందున రాష్ట్ర విద్యార్థులకు ప్రవేశాలపరంగా ప్రయోజనం చేకూరనుంది.

1959-60 నుంచి నిట్‌ల ప్రస్థానం దేశంలో మొదలైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 30 ఎన్‌ఐటీలు ఉన్నాయి. వీటిల్లో 15వేలకుపైగానే సీట్లు ఉన్నాయి. అగర్తల, అలహాబాద్‌, భోపాల్‌, కాలికట్‌, జైపూర్‌, తిరుచ్చి, జలంధర్‌, కురుక్షేత్ర, నాగ్‌పూర్‌, ఢిల్లీ, పాండిచ్చేరి వంటి ప్రాంతాల్లో ఎన్‌ఐటీలు కొలువుదీరి ఉన్నాయి. వీటి సరసన త్వరలో ఆంధ్రప్రదేశ్‌ ఎన్‌ఐటీ కూడా చేరబోతుంది. ఎన్‌ఐటీ ఏర్పాటుకు అవసరమైన స్థలసేకరణ జరిపి తగిన ప్రతిపాదనలు పంపాలని ఉన్నత విద్యా శాఖ జిల్లా కలెక్టర్లను కోరింది.

ఆర్‌ఈసీల నుంచి. నిట్‌లుగా..!
భారత ప్రథమ ప్రధాని నెహ్రూ దేశవ్యాప్తంగా 17 ప్రాంతీయ ఇంజినీరింగు కళాశాల (ఆర్‌ఈసీ)లను ఏర్పాటు చేస్తూ.. వరంగల్‌ ఆర్‌ఈసీకి 10.10.1959న శంకుస్థాపన చేశారు. ఆర్‌ఈసీలకు కేంద్రం నిధులు గరిష్ఠంగా ఇచ్చినా.. సంబంధిత రాష్ట్రం వాటా కూడా ఉండేది. ఆతరువాత 2007లో నిట్‌ చట్టం తయారైంది. అప్పటి నుంచి కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో పూర్తిస్థాయి నిధులను కేటాయిస్తూ.. రాష్ట్రాల అజమాయిషీని తప్పించారు. గవర్నింగ్‌ బాడీ ఛైర్మన్లుగా ప్రముఖ శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలను నియమించడం మొదలెట్టారు.ఆర్‌ఈసీలుగా ఉన్నప్పుడు విద్యపై దృష్టి సారిస్తే నిట్‌లుగా మారిన తరువాత విద్యతోపాటు పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వడం మొదలైంది. కొత్త నిట్‌ ఏర్పాటుచేయాలంటే కనీసం 250 ఎకరాల స్థలం కావాలి. ఈ స్థలాన్ని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం సేకరించి.. కేంద్ర మానవ వనరుల శాఖకు అప్పగించాలి. అందుబాటులో నీటి వసతి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొద్దికాలం కిందట నిట్‌లను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసినప్పుడు రూ.250 కోట్ల వంతున కేటాయించింది. ఇంతే మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించే అవకాశం ఉంది.

సొంతంగా ప్రాంగణాలు సమకూరే వరకు...!
2010-11లో దేశవ్యాప్తంగా సుమారు 10 కొత్త జాతీయ సాంకేతిక విద్యాలయాలను ప్రారంభిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అప్పట్లో వీటికి కావాల్సిన భూసేకరణ ప్రధాన సమస్యగా మారింది.దీంతో 2011-12లో మూడు కోర్సులతో (కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రికల్‌, ఈసీఈ) ఒక్కో దానిలో 30 మంది విద్యార్థులతో ఈ కొత్త నిట్‌లను ప్రారంభించారు. సొంతంగా ప్రాంగణాలు లేనందున ఇతర నిట్‌లలో కొనసాగించారు. ఢిల్లీ నిట్‌కు 50 ఎకరాల స్థలంకూడా దొరక్కపోవడంతో 2011-13 వరకు రెండేళ్ల పాటు వరంగల్‌ నిట్‌లోనే విద్యార్థులు చదువుకున్నారు. గతంలో కొన్ని పెద్ద విద్యాసంస్థలను నిట్‌లుగా మార్చిన సందర్భాలుకూడా ఉన్నాయి. పాట్నా, రాయ్‌పూర్‌ తదితర నిట్‌లు ఇలాగే ఏర్పడినవే.

50 శాతం సీట్లు సొంత రాష్ట్రానికి...
నిట్‌లను ఏర్పాటు చేస్తే.. సంబంధిత రాష్ట్రానికి 50 శాతం సీట్లు (హోంస్టేట్‌ కింద) కేటాయిస్తారు. మిగిలిన 50 శాతం సీట్లను ఇతర రాష్ట్రాలకు కేటాయిస్తారు. ఇవి కాకుండా..మరో కోటా కింద ఇతర దేశాలకు చెందిన వారికీ ప్రవేశం కల్పిస్తున్నారు. సుమారు 400 మందికి పైగా విదేశీ విద్యార్థులు ప్రస్తుతం వరంగల్‌ నిట్‌లో చదువుతున్నారు. ఈ విద్యాలయాలను నెలకొల్పేందుకు, మౌలిక వసతులను కల్పించేందుకు కావాల్సిన నిధులన్నింటినీ కేంద్ర మానవ వనరుల శాఖ సమకూరుస్తోంది. అలాగే ప్రతిఏటా సుమారు రూ. 200 కోట్ల వరకు బడ్జెట్‌ను కేటాయిస్తుంది. 12 మంది విద్యార్థులకు ఒక ఫ్యాకల్టీ (అధ్యాపకుడు) చొప్పున టీచింగ్‌ స్టాఫ్‌ను.. ఒక్కో ఫ్యాకల్టీకి 1:1 చొప్పున నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌నుకూడా నియమిస్తారు. వరంగల్‌ నిట్‌లో ప్రస్తుతం సుమారు 5 వేల మంది వరకు విద్యార్థులుండగా.. 250 వరకు టీచింగ్‌ స్టాఫ్‌, 350 మంది నాన్‌టీచింగ్‌ స్టాఫ్‌ ఉన్నారు. కోర్సులను స్థానిక అవసరాలకు అనుగుణంగా కూడా ప్రారంభించేందుకు వీలుంది. ప్రపంచస్థాయి విద్యాసంస్థలతో పోటీపడేలా నిట్స్‌ తయారవుతున్నాయని వరంగల్‌ నిట్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ శ్రీనివాసరావు ‘ఈనాడు’తో పేర్కొన్నారు.

కమిటీలో...
ఎన్‌ఐటీ బోర్డు ఆఫ్‌ గవర్నింగ్‌ కమిటీకి ఎన్‌ఐటీ డైరెక్టర్‌ సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. కేంద్ర మానవ వనరుల శాఖ ప్రతినిధి, కేంద్ర ప్రభుత్వం ఎంపికచేసిన ప్రఖ్యాత ఇంజినీర్‌ లేదా విద్యావేత్త, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఉన్నత, సాంకేతిక విద్యా శాఖ నుంచి ఒకరు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. యూజీసీ, ఏఐసీటీఈ, ఇతర రంగాలకు చెందిన వారికీ ఈ కమిటీలో సభ్యత్వాన్ని కల్పిస్తున్నారు.

వెలుగు వైపు నా అడుగులు...

బడిగంట కొట్టగానే పిల్లలందరూ బిలబిలమంటూ బయటకు పరుగుతీశారు. టీచర్లూ ఇంటిదారిపట్టారు. ఒకరిద్దరు తప్ప నిర్మానుష్యంగా మారిన ఆ బడిలో..

అనుక్షణం ఉత్కంఠగా... ‘క్షణం’

అనుక్షణం ఉత్కంఠభరితంగా సాగే కథనంతో తెరకెక్కిన చిత్రం ‘క్షణం’. పీవీపీ సినిమా బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రానికి రవికాంత్‌....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net