Fri, February 12, 2016

Type in English and Give Space to Convert to Telugu

'వైజ్ఞానిక మైలురాయి''విశ్రమించిన వీరుడు''మేయర్‌ ఎన్నిక ఏకగ్రీవం''కారెక్కిన మరో తెదేపా ఎమ్మెల్యే''‘బేర్‌’మన్న స్టాక్‌ మార్కెట్లు''‘ఆధార్‌’ ఇక తప్పనిసరి కాదు''కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయం''ఎంపీల జీతభత్యాలు త్వరలో రెట్టింపు!''మార్చి మొదటి వారంలో ‘పుర’ ఎన్నికలు''మేడారం జాతరను జాతీయ పండుగగా ప్రకటించండి'
అన్వేషణకు అన్నీ ఆటంకాలే
ఎడతెగని వరద.. నిండా బురద
చల్లటి నీటితో ప్రతికూలత
బియాస్‌ నదిలో ముమ్మర గాలింపు.. అయినా ప్రయోజనం శూన్యం
మరో విద్యార్థి మృతదేహం లభ్యం
మండీ కలెక్టర్‌ ఉన్నతస్థాయి సమీక్ష
పాల్గొన్న తెలుగు మంత్రులు
నేటి నుంచి నిరంతర చర్యలు
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వాడాలని నిర్ణయం
మండీ నుంచి ఈనాడు ప్రతినిధి
ప్రవాహ ఉద్ధృతి.. అంతా బురద.. చల్లటి నీళ్లు.. వెరసి హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్‌ నదిలో గల్లంతైన తెలుగు విద్యార్థుల అన్వేషణకు సాగుతున్న ముమ్మర ప్రయత్నాలకు అన్నీ ఆటంకాలే ఎదురవుతున్నాయి. 16 కిలోమీటర్ల పరిధిలో ఉద్ధృతంగా జరుగుతున్న గాలింపు చర్యలు ఏమాత్రం ఫలితాన్నివ్వడంలేదు. మంగళవారం గజ ఈతగాళ్లను రంగంలోకి దింపినప్పటికీ బురద ఎక్కువగా ఉండటంతో ప్రయోజనం కనిపించలేదు. నీరు బాగా చల్లగా ఉండంతో మృతదేహాలు పైకి తేలే అవకాశం లేకుండా పోయింది. మంగళవారం ఉదయం ఒక మృతదేహం మాత్రం లభించింది. ఇంకా 19 మంది విద్యార్థుల ఆచూకీ లభించలేదు.

రెండు రోజులుగా జరుగుతున్న గాలింపు చర్యలపై మండి జిల్లా కలెక్టర్‌ దేవేష్‌ కుమార్‌ మంగళవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. సిమ్లాలో సీఎం వీరభద్రసింగ్‌ కూడా సమీక్ష చేపట్టారు. బుధవారం నుంచి గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించాలని నిర్ణయించారు. మరోవైపు గల్లంతైన తమ పిల్లల మృతదేహాలు కూడా లభించకపోవడంతో వారి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.1.50 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది.

ఆగని ప్రవాహం
విద్యార్థులు గల్లంతైన ప్రాంతానికి దిగువన దాదాపు 16 కిలోమీటర్ల దూరంలో మరో బ్యారేజి ఉంది. దానికి లాకులు ఉండటంతో అక్కడ నుంచి మృతదేహాలు కిందికి వెళ్లే అవకాశం లేదు. దాంతో గల్లంతైన ప్రాంతం నుంచి ఈ బ్యారేజికి మధ్యలోనే గాలింపులు జరుపుతున్నారు. నీటి మట్టం తగ్గిస్తే మృతదేహాలు పైకి తేలుతాయని భావించారు. అయితే, పైనుంచి వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో అది సాధ్యం కావడంలేదు. హిమాలయపర్వతాల్లో ఆదివారం నుంచి ఉష్ణోగ్రతలు బాగా పెరగడంతో పెద్దమొత్తంలో మంచు కరిగి కిందికి ప్రవహిస్తోంది. ఈ ప్రవాహాన్ని ఆపితే ఎగువన ఉన్న గ్రామాలు మునిగిపోవడంతోపాటు బ్యారేజీలు దెబ్బతింటాయని అధికారులు చెబుతున్నారు. అందుకే వచ్చిన నీటిని వచ్చినట్లు కిందకు వదులుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం లార్జీ బ్యారేజికి చెందిన రెండు గేట్లు ఎత్తి దాదాపు వంద ఘటనపుటడుగుల నీటిని కిందకు వదిలారు. దాంతో గాలింపు చర్యలు జరుగుతున్న ప్రాంతంలో నీటిమట్టం మరోమారు పెరిగింది. పైనుంచి వచ్చే ప్రవాహాన్ని ఆపడం సాధ్యంకావడంలేదు కాబట్టి దిగువన ఉన్న బాక్రా బ్యాస్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు బ్యారేజికి చెందిన లాకులు ఎత్తి గాలింపు జరుగుతున్న ప్రాంతంలో నీటిమట్టం తగ్గించాలని పలువురు సూచించారు. కాని దీనివల్ల మృతదేహాలు కిందికి కొట్టుకుపోయే అవకాశం ఉందని, అప్పుడు పరిస్థితి మరింత కష్టమవుతుందని అధికారులు తేల్చి చెప్పడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారు.

రాత్రిపూట వరద తగ్గినా.. గాలింపు చర్యలు అసాధ్యమవుతున్నాయి. తెల్లవారగానే ఉష్ణోగ్రత పెరగడంతో మళ్లీ మంచు కరిగి వరద పెరుగుతుండటంతో ముమ్మర గాలింపు చేపట్టినా ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదు. వర్షాకాలం ప్రవేశిస్తుండటంతో గట్టి వర్షం ఒకటి పడ్డా పరిస్థితి మరింత వికటిస్తుందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది ఇదే సమయంలో ఒక బస్సు బియాస్‌ నదిలో పడ్డప్పుడు అన్ని మృతదేహాలు వెలికి తీయడానికి నెల రోజులు పట్టిందని స్థానికులు చెప్పారు.

మరో మృతదేహం లభ్యం: మంగళవారం ఉదయం ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఒక మృతదేహాన్ని వెలికితీశాయి. హైదరాబాద్‌ బాగ్‌ అంబర్‌పేటకు చెందిన దేవాశిష్‌దిగా దాన్ని గుర్తించారు. పోస్టుమార్టం పూర్తిచేసి మృతదేహాన్ని సాయంత్రం హైదరాబాద్‌ పంపారు. దాంతో ఇప్పటి వరకూ 5 మృతదేహాలు వెలికితీసినట్లయింది.

బురదనీటితో ఆటంకాలు: వరద ఉద్ధృతంగా వస్తుండటంతో ఎగువన మేటవేసిన పూడిక అంతా కొట్టుకొని వస్తోంది. దీంతో నీరంతా బురదగా మారింది. గాలింపు చర్యల కోసం అధికారులు దాదాపు వందమంది గజ ఈతగాళ్లను వినియోగిస్తున్నారు. కాని బురద నీటి కారణంగా తమకు అడుగు దూరంలో ఉన్నవారు కూడా కనిపించడంలేదని వారు వాపోతున్నారు. అసలు ఈ బురద నీటివల్ల అడుగుభాగంలోకి వెళ్లడం కూడా సాధ్యం కావడంలేదంటున్నారు.

చల్లటి నీటి తిప్పలు: మంచు కరగడంతో నదిలో ప్రవహిస్తున్న నీరు చాలా చల్లగా ఉంటోంది. ఆ నీటిలో మునిగి గాలింపులు చేపట్టడం కష్టంగాఉంది. మామూలుగా నీటిలో మునిగిన మృతదేహాలు కొద్దిగా కుళ్లిపోగానే పైకి తేలుతాయి, కాని ఇక్కడ నీరు చల్లగా ఉండటం వల్ల మృతదేహాలు కుళ్లడం ఆలస్యమవుతోంది. దాంతో అవి పైకి తేలడంలేదు.

గాలింపు ముమ్మరం: ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నా అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేస్తున్నారు. దాదాపు 500 మంది ఈ గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌తోపాటు మంగళవారం నుంచి సైన్యం కూడా రంగంలోకి దిగింది. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నదికి ఇరువైపులా 16 కిలోమీటర్ల మేరా గాలింపులు జరిపారు. ప్రమాదాలు జరిగినప్పుడు మృతదేహాలు ఎక్కడ చిక్కుకుంటాయో అవగాహన ఉన్న స్థానికులనూ ఇందులో భాగస్వాములను చేస్తున్నారు. నదిలో పెద్దపెద్ద బండలు ఉండటంతో వాటి మధ్యలో చిక్కుకొని పోయి ఉండవచ్చనే అనుమానంతో పెద్దపెద్ద కర్రలను ఉపయోగించి వాటితో గుచ్చి చూస్తున్నారు. 16 కిలోమీటర్ల పొడవునా ఎన్‌డిఆర్‌ఎఫ్‌ బృందాలు పడవలు వేసుకొని నిరంతరం గాలింపులు నిర్వహిస్తూనే ఉన్నాయి.

కలెక్టర్‌ ఉన్నతస్థాయి సమావేశం
మండి జిల్లా కలెక్టర్‌ దేవేష్‌కుమార్‌ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఇందులో తెలంగాణ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారాయణ, తెలుదేశం నాయకులు కంభంపాటి రామ్మోహనరావు, హోంశాఖ ముఖ్యకార్యదర్శి బి.ఆర్‌.మీనా, గ్రేహౌండ్స్‌ కమాండెంట్‌ కార్తీకేయ, బాలానగర్‌ డీసీపీ ఎ.ఆర్‌.శ్రీనివాస్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు పలు సూచనలు చేశారు. డిస్కవరీ ఛానల్‌లో మాదిరిగా నీటి అడుగున కూడా చూడగలిగే కెమెరాలు ఉపయోగించాలని వారు చేసిన సూచన మేరకు కలెక్టర్‌ బుధవారం నుంచే దీన్ని ఆమలు చేస్తామని మాట ఇచ్చారు. దాంతోపాటు గాలింపులు నిరంతరం కొనసాగించాలని కూడా సూచనలు చేయగా.. బుధవారం నుంచి ఇంకా ఎక్కువ మంది సిబ్బందిని రంగంలోకి దింపి ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ గాలింపులు కొనసాగించాలని నిర్ణయించారు. బాలానగర్‌ డీసీపీ శ్రీనివాస్‌ జాతీయ రిమోట్‌ సెన్సింగ్‌ అధికారులతో మాట్లాడారు. ఉపగ్రహాల ద్వారా నదిలో గాలింపు జరుపుతున్న ప్రాంతాన్ని ఫొటోలు తీయించి వాటిలో మృతదేహాలు గుర్తించేందుకు ప్రయత్నించడంలో సాధ్యాసాధ్యాలను చర్చించారు. నావికాదళంలో ఇంకా ఏమైనా పరికరాలు ఉన్నాయేమోనన్న దానిపైనా దృష్టి సారించారు.

ముమ్మాటికీ అధికారుల నిర్లక్ష్యమే: హైకోర్టు
ఇందులో విద్యుత్‌ ప్రాజెక్టు అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని హిమాచల్‌ప్రదేశ్‌ హైకోర్టు పేర్కొంది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన న్యాయమూర్తి జస్టిస్‌ టీఎస్‌ చౌహాన్‌.. ఈనెల 16కల్లా పూర్తివివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. మరోవైపు మృతదేహాలను స్వస్థలాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని సీఎం వీరభద్రసింగ్‌ పేర్కొన్నారు. మరోసారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపడతామన్నారు. అన్ని డ్యాంల వద్ద రెండు, మూడు కిలోమీటర్లు కంచె ఏర్పాటుచేయాలని, హెచ్చరిక బోర్డులు పెట్టాలని ఆదేశించారు.

సమంత@100 కేజీలు

మొదటి సినిమాలో సన్నగా సన్నజాజి తీగలా కనిపించి..రెండో చిత్రానికి వచ్చేసరికి బొద్దుగుమ్మగా దర్శనమిచ్చారు ఎంతో మంది కథానాయికలు....

సావిత్రి... టీజర్‌ విడుదల

నారా రోహిత్‌, నందిత జంటగా పవన్‌ సాదినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సావిత్రి చిత్ర టీజర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ప్రేమికుల రోజు శుభాకాంక్షలతో చిత్ర బృందం ఈ టీజర్‌ను విడుదల చేసింది. విజన్‌ ....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net