Tue, February 09, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ఔషధనగరిలో ప్రపంచశ్రేణి విశ్వవిద్యాలయం''భూసేకరణ, పునరావాసాలకేరూ. 8,000 కోట్లు''నెట్‌ సమానత్వానికే ట్రాయ్‌ మొగ్గు!''ముద్రగడ దీక్ష విరమణ''తెలంగాణ ప్రణాళిక భేష్‌''విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయాలా?''డాక్టర్‌.. ధనాధన్‌..''రసాయన పరిశ్రమలో పేలుడు''నడి వీధిలో పైశాచికం''పాక్‌ నుంచే కుట్ర'
కొత్త కొలువులు ఎలా?
ఏపీపీఎస్సీ విభజనతో మళ్లీ మొదటికొచ్చిన ఉద్యోగాల భర్తీ
తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ మాటేంటి?
భర్తీపై ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో!
ఈనాడు - హైదరాబాద్‌
ద్యోగాల భర్తీకి లక్షలాది నిరుద్యోగులు మరికొంత కాలం నిరీక్షించాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) విభజనపై అస్పష్టత, ఉద్యోగుల విభజనపై గందరగోళం, స్థానిక, స్థానికేతర జోన్లవారీగా నియామకాలపై నిబంధనలు మార్చాల్సి రావడం తదితర కారణాలు వారికి ప్రతిబంధకంగా మారాయి. కిందటేడాది సుమారు 25వేల ఉద్యోగాల భర్తీని చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినప్పటికీ వివిధ కారణాల వల్ల ఏపీపీఎస్సీ ప్రకటనలు జారీచేయలేకపోయింది. గతేడాది ఆగస్టు నుంచి ఉద్యోగాల భర్తీని చేపడతామని ప్రభుత్వం పదేపదే ప్రకటించినందున నిరుద్యోగులు ఆశతో నిరీక్షించారు. సమీప పట్టణాలు, నగరాలకు వెళ్లి పరీక్షలకు సిద్ధమయ్యారు. వారికి ఏపీపీఎస్సీ మొండిచేయే చూపింది. కొత్త ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగాల భర్తీ ప్రకటనలు వెలువడతాయని వారంతా నిరీక్షిస్తున్నారు. ప్రస్తుతం ఏపీపీఎస్సీ పరిస్థితుల్ని చూస్తే ఉద్యోగాల భర్తీ ప్రకటనలు వెంటనే వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.

నిరాశ, నిస్పృహలో ఉద్యోగార్థులు!: కిందటేడాది 25వేల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన సమాచారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏపీపీఎస్సీకి అందింది. రాష్ట్ర విభజన పరిస్థితులపై స్పష్టత కోసం ఏపీపీఎస్సీ ప్రభుత్వాన్ని పలుమార్లు సంప్రదించింది. రాజ్యాంగసంస్థకు తాము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని.. ఏపీపీఎస్సీనే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఏపీపీఎస్సీ నుంచి ఉద్యోగ ప్రకటనలు జారీ కాలేదు. కొద్దికాలం అనంతరం ఏపీపీఎస్సీ ఉద్యోగ ప్రకటనల జారీకి చర్యలు ప్రారంభించినా.. వయోపరిమితి సమస్య తెరపైకొచ్చింది. గతంలో ప్రభుత్వం ఇచ్చిన వయోపరిమితి సడలింపు ఉత్తర్వుల కాలపరిమితిని పొడిగించాలని ఏపీపీఎస్సీ కోరింది. దీనికనుగుణంగా ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ లేదు. దీంతో ఏపీపీఎస్సీ ఉద్యోగ ప్రకటనల జారీ అంశాన్ని పూర్తిగా పక్కనపెట్టేసింది.

జూన్‌ రెండో తేదీ నుంచి రాష్ట్ర విభజన అమల్లోకి రానున్నందున దీనికి తగినట్లు మళ్లీ ఉద్యోగాల భర్తీ ఆమోద ఉత్తర్వులు అధికారంలో ఉన్న ప్రభుత్వాల నుంచి సర్వీస్‌ కమిషన్లు పొందాల్సి ఉంది. ప్రభుత్వాల అభిమతంపైనే ఖాళీల భర్తీ అంశం ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపినందున ప్రభుత్వాలు సానుకూలంగా వ్యవహరించే అవకాశం ఉందని భావిస్తున్నా అధికారిక ఉత్తర్వులు వెలువడేందుకు మరికొంత సమయం అనివార్యమవుతుంది. మరోవైపు రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా 371 డి ఆర్టికల్‌ ప్రకారం జోనల్‌ వ్యవస్థ అమల్లో ఉంది. కోస్తాలో మూడు, రాయలసీమలో ఒకటి, తెలంగాణలో రెండు జోన్లు ఉన్నాయి. వీటి ప్రకారమే నియామకాలు జరుగుతున్నాయి. రాష్ట్రపతి ప్రత్యేక ఉత్తర్వులతో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ విధానాన్ని కొత్త ప్రభుత్వాలు అలాగే కొనసాగిస్తాయా? అన్నది ప్రశ్నార్థకం. స్థానిక, స్థానికేతర నియామకాల విషయంలోనూ అధికారిక నిర్ణయాలు వెలువడాల్సి ఉంది. కీలకమైన ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు విధానపరంగా తీసుకునే నిర్ణయాలు ప్రధానపాత్ర పోషిస్తాయి. ఉద్యోగాల భర్తీకి అవసరమైన నియమ నిబంధనలపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు ఒక్కొక్కచోట ఒక్కోలా ఉంటాయి. కొత్త రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ ఖాళీల భర్తీపై ఉత్తర్వులు జారీచేసేందుకు ఎంత సమయం తీసుకుంటాయన్నది చెప్పడం కష్టమని సీనియర్‌ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
సభ్యుల విభజన కుదరదు!
ప్రస్తుతం ఉన్న ఏపీపీఎస్సీ కార్యకలాపాలు యథావిధిగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కొనసాగించేందుకు ఇబ్బందుల్లేవు. ప్రస్తుతం ఛైర్‌పర్సన్‌ కాకుండా కమిషన్‌లో ఆరుగురు సభ్యులున్నారు. వీరిని విభజించడం రాజ్యాంగం ప్రకారం కుదరదు. సర్వీస్‌ కమిషన్‌లో సభ్యులుగా వ్యవహరించే వారు యూపీఎస్సీలో మినహా ఇతర కమిషన్లలో సభ్యులుగా కొనసాగించేందుకు నిబంధనలు అంగీకరించవని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కొద్దికాలం కిందటివరకు ఏపీపీఎస్సీలో తొమ్మిది మంది సభ్యులుండేవారు. ఈ సంఖ్య ప్రస్తుతం ఆరింటికి పరిమితమైంది. మరో ఇద్దరు జూన్‌లో పదవీ విరమణ చేయనున్నారు. ఒకే సర్వీస్‌ కమిషన్‌ రెండు రాష్ట్రాలకు సేవలు అందించొచ్చు. దీనికి సంబంధిత ప్రభుత్వాలు ఆమోదం తెలిపాలి. ఈ విధానం ఎంతవరకు ఇక్కడ అమల్లోకి వస్తుందన్నది సందేహమే.

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌.. గందరగోళం
తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏర్పాటుపైనే గందరగోళం నెలకొంది. పునర్విభజన బిల్లు-2014లో తెలంగాణలోని ఉద్యోగ నియామకాల భర్తీని రాష్ట్రపతి ఆమోదంతో యూపీఎస్సీ చేపడుతుందని మాత్రమే పేర్కొన్నారు. ప్రస్తుత ఏపీపీఎస్సీలోని ఉద్యోగుల విభజన గురించి స్పష్టంగా పేర్కొనలేదు. యూపీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీ కష్టంతో కూడుకున్న పనిగా అధికారికవర్గాలు పేర్కొంటున్నాయి. యూపీఎస్సీకి రాష్ట్రాల్లో మానవ వనరుల యంత్రాంగం లేదు. స్థానిక నియమ నిబంధనలను పరిగణనలోకి తీసుకుని యూపీఎస్సీ ద్వారా తెలంగాణలో నియామకాలు జరపడం కత్తిమీద సామే. తెలంగాణలో పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏర్పడాలంటే తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో ఆమోదించి దానిని కేంద్రానికి, రాష్ట్రపతికి పంపాలి. అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారిస్తే కనీసం ఆరునెలలకైనా ఇది ఏర్పాటయ్యే అవకాశం ఉంటుంది. అప్పటివరకు ఉద్యోగ నియామకాల ప్రకటనలు తెలంగాణలో జారీ అయ్యే అవకాశమే కనిపించడం లేదు.

ఉద్యోగుల పరిస్థితి దారుణం!
ఏపీపీఎస్సీలో ఉన్న 400 మంది ఉద్యోగుల్లో తెలంగాణకు చెందినవారు 175 మంది ఉన్నారు. వారిలో 40మంది వరకు అటెండర్లు. అటెండర్లలో ఒక్కరు ఆంధ్రప్రదేశ్‌ వారు. మిగిలిన ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగులు యథావిధిగా ఏపీపీఎస్సీలోనే కొనసాగుతారు. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ అంశం గురించి పునర్విభజన బిల్లులో స్పష్టత లేనందున ఆ రాష్ట్ర ఉద్యోగుల పరిస్థితి ఆగమ్యంగా తయారైంది. పునర్విభజన బిల్లులో తెలంగాణ ఉద్యోగుల సేవల కొనసాగింపు గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. ఒకవేళ యూపీఎస్సీకి నియామకాల బాధ్యత అప్పగించినా వీరి సమస్య పరిష్కారం కాదు. తెలంగాణ సర్వీస్‌ కమిషన్‌ ఏర్పాటయ్యేంత వరకు ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల సేవలు ఎవరు పొందాలి? ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లోనే కొనసాగించే పక్షంలో వేతనాల చెల్లింపు ఎలా? అన్న అంశాలపై స్పష్టత లేకపోవడంపై తెలంగాణ గెజిటెడ్‌ అధికార్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి, తెలంగాణ ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జి.వెంకటేశ్వర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఇతరశాఖల్లో ఉద్యోగులను ప్రాంతాల వారీగా విభజిస్తూ తమ గురించి పట్టించుకోకపోవడం దారుణమన్నారు. జూన్‌ రెండో తేదీ నుంచి ఆవిర్భావదినం అమల్లోకి రానున్నప్పటికీ వీరి సేవల కొనసాగింపుపై స్పష్టత లేకపోవడంపై ఉన్నతస్థాయి వర్గాలు కూడా విచారాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ఉద్యోగుల్లో త్వరలో ఉద్యోగ విరమణ చేయనున్న వారి పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. తాను త్వరలో పదవీ విరమణ చేయబోతున్నానని, వీటిపై స్పష్టత లేకపోవడంతో రావాల్సిన ప్రయోజనాలు మరింత ఆలస్యమవుతాయోమోనని ఓ అధికారి ఆందోళన వ్యక్తం చేశారు.

పదుగురి కోసం ఆరుగురం!

కాలేజీ స్నేహితులకో వాట్స్‌యాప్‌ గ్రూప్‌ చిన్నప్పటి మిత్రులకో ఫేస్‌బుక్‌ గ్రూప్‌ బంధువులందరినీ కలిపేందుకు గూగుల్‌ ప్లస్‌.. ఇలా నేటి సామాజిక మాధ్యమాలని మస్తుగా వాడుకుంటోంది...

పచ్చబొట్టేసి...జోలీకి నచ్చేసి!

ఏంజెలీనా జోలీకి రెండంటే మహా ఇష్టం. ఒకటి పిల్లలు, రెండు టాటూలు. ముగ్గురు కన్నబిడ్డలతో పాటు మరో ముగ్గురు అనాథలను దత్తత తీసుకుని పెంచుకుంటోంది జోలీ...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net