Sat, February 06, 2016

Type in English and Give Space to Convert to Telugu

'గులాబీ.. సునామీ''మాట నిలబెట్టుకుంటాం''నౌకా సంరంభం నేడే''కక్షతోనే పార్లమెంటులో రగడ!''వ్యూహాత్మక విజయం''ఆఖర్లో వచ్చారు.. అదరగొట్టారు!''సమర సేనాని''పర్యాటకులకు మణిహారం''ముద్రగడ ఆమరణ దీక్ష''హైదరాబాద్‌లో మరో రెండు పెద్దాసుపత్రులు'
సహస్రాబ్ది లక్ష్యాలు..
పేదరికం తగ్గుతోందిగానీ..!
కీలకమైన గడువుకు దగ్గరపడుతున్నాం! నూతన సహస్రాబ్ది ఘడియల్లో నిర్దేశించుకున్న బృహత్‌ లక్ష్యాల గురించి ఈ పదిహేనేళ్లుగా విస్తృతంగా చర్చించుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు వీటిని ఎంత వరకూ సాధించామన్నది సమీక్షించుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. తాజాగా ఐక్యరాజ్యసమితి భారత విభాగం ఆ పనే చేసింది. ఈ దశాబ్దన్నర పురోగతిని మదింపు చేసిచూస్తే- ఒక్క పేదరికం విషయంలో తప్పించి మిగతా లక్ష్యాలకు భారత్‌ ఆమడ దూరంలోనే ఉండిపోతోందని నివేదిక నిగ్గు తేల్చటం.. ఇబ్బందికరంగానే ఉన్నా.. ఇది చేదు నిజం!
ప్రపంచ అభివృద్ధి విషయంలో ఈ 2015 సంవత్సరం కీలకమైన మైలురాయి. ఎందుకంటే సరిగ్గా పదిహేనేళ్ల క్రితం.. 2000 సంవత్సరం సెప్టెంబరు నెలలో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం చరిత్రాత్మక ‘సహస్రాబ్ది ప్రకటన’ను ఆమోదించింది. 189 సభ్య దేశాలతో పాటు దీనిపై మనమూ సంతకం చేశాం. ఈ ప్రకటనలో ‘సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాల (ఎండీజీ)’ పేరుతో పేదరిక నిర్మూలన నుంచి మాతాశిశు మరణాల నివారణ వరకూ కీలకమైన 8 అంశాలపై కచ్చితమైన లక్ష్యాలను నిర్దేశించుకున్నాం. మరి ఈ దశాబ్దన్నర ప్రయాణంలో ఎంతవరకూ లక్ష్యాలకు చేరువయ్యామన్నది అంచనా వేస్తూ ఐరాస తాజాగా ‘‘భారత సహస్రాబ్ది లక్ష్యాలు - సమిష్టి సుస్థిర భవిష్యత్తు’’ పేరుతో ఒక నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం మనం పేదరికాన్ని ఎంతోకొంత తగ్గించగలిగాంగానీ.. ఆర్థిక అసమానతలు మాత్రం తీవ్రంగా పెరిగిపోయాయి. అభివృద్ధి, పురోగతి అనేది అన్ని వర్గాల్లో, అన్ని రాష్ట్రాల్లో సమానంగా ఉండటం లేదు. ప్రాథమిక విద్య విషయంలో సార్వత్రికంగా దేశవ్యాప్తంగా పిల్లలందరినీ చేర్పించాలన్న లక్ష్యానికి దూరంగానే ఉన్నాం. యువతలో సంపూర్ణ అక్షరాస్యత సాధించాలన్నదీ లక్ష్యానికి ఆమడ దూరంలోనే ఉంది. వేతన ఉపాధి రంగంలో మహిళల సంఖ్య పెంచాలన్న లక్ష్యమూ ఈ సంవత్సరాంతం లోపు నెరవేరే అవకాశాలు కానరావటం లేదు. ముఖ్యంగా పారిశుద్ధ్యం, బహిరంగ మలవిసర్జనను నివారించే విషయంలో బాగా వెనకబడి ఉన్నామని నివేదిక స్పష్టంగా నిగ్గు తేల్చింది.

కొనసాగింపు.. కొత్త లక్ష్యాలు!
గతంలో విధించుకున్న గడువు తీరిపోతున్న నేపథ్యంలో పాత లక్ష్యాలను పునస్సమీక్షించి, అదే స్ఫూర్తితో.. ఈ 2015 తర్వాత సాధించాల్సిన కొత్త లక్ష్యాలను సిద్ధం చేసే కసరత్తులు జరుగుతున్నాయి. సహస్రాబ్ది లక్ష్యాలకు కొనసాగింపుగా.. కొత్తగా నిర్దేశించబోతున్న వాటిని ‘సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌-ఎస్‌డీజీ)’ అంటున్నారు. ఏ ఒక్కరూ అభివృద్ధికి దూరంగా లేకుండా అందరినీ వృద్ధిలో భాగం చెయ్యటం వీటి లక్ష్యం. ఈ నూతన లక్ష్యాలకూ, మన దేశంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వ లక్ష్యాలకూ మధ్య చక్కటి సమన్వయం ఉందని ఐరాస నివేదిక అభిప్రాయపడింది. ‘సబ్‌ కా సాథ్‌, సబ్‌ కా వికాస్‌’ పేరుతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం బలంగా ముందుకు తెస్తున్న సమ్మిళిత వృద్ధి మంత్రం సహస్రాబ్ది లక్ష్యాలను ముందుకు తీసుకుపోయేదిగానే ఉందని నివేదిక అభిప్రాయపడింది.

సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాలు ఎండీజీ) ..8

పేదరికం, ఆకలిని నిర్మూలించటం
120 కోట్ల దేశ జనాభాలో దారిద్య్ర రేఖకు దిగువన ఉండేవారిని 23.9% కంటే తక్కువకు తీసుకురావాలన్నది భారత లక్ష్యం. ఇప్పుడీ సంఖ్య 21.9 శాతానికి వచ్చిందని, ఇది చెప్పుకోదగ్గ పురోగతేనని నివేదిక వ్యాఖ్యానించింది. ఒకవైపు ఆర్థిక వృద్ధి, మరోవైపు సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం ఇవ్వటం వల్లనే ఈ పురోగతి సాధ్యమైంది. అయితే... పేదరికమన్నది కొన్ని బీద రాష్ట్రాల్లో కేంద్రీకృతమవుతోంది. ఇప్పటికీ ప్రపంచంలోని పేదల్లో నాలుగోవంతు మంది భారత్‌లోనే ఉంటున్నారు. ముఖ్యంగా 2.7 కోట్ల మంది ‘తీవ్ర పేదరికం’లో మగ్గుతున్నారు. వీరిని 2030 నాటికైనా పూర్తిగా బయటకు తేవటం సాధ్యమేనా? అని నివేదిక సందేహం వ్యక్తం చేసింది.
సార్వత్రిక విద్యను సాధించటం
ప్రస్తుత పురోగతిని బట్టి చూస్తే- సార్వత్రిక విద్య విషయంలో భారత్‌ సహస్రాబ్ది లక్ష్యాన్ని చేరుకోవటం చాలా కష్టమని నివేదిక అభిప్రాయపడింది. 2015 సంవత్సరాంతానికి దేశంలోని పిల్లలందరినీ బడి బాట పట్టించటం అంత తేలికైన వ్యవహారమేం కాదు. ‘‘ఇప్పటికీ ఎంతోమంది పిల్లలు పాఠశాల చదువులకు నోచుకోవటం లేదు. కనీసం ప్రాథమిక విద్యను కూడా పూర్తి చెయ్యటం లేదు. అలాగే స్కూలుకు వెళుతున్న పిల్లల విషయంలో కూడా చదువుల్లో నాణ్యత ఉండటం లేదని’’ నివేదిక కుండబద్దలు కొట్టింది. ముఖ్యంగా చదవటంలోనూ, గణితంలోనూ వెనకబాటుతనం చాలా ఎక్కువగా ఉందని నివేదిక గుర్తించింది.
లింగపర సమానత్వం, మహిళా సాధికారతలను సాధించటం
వేతన ఉద్యోగాల్లో ఈ సంవత్సరాంతానికి మహిళల భాగస్వామ్యం 50% సాధించాలన్నది సహస్రాబ్ది లక్ష్యం. కానీ దీన్ని 23% మాత్రమే సాధించగలిగాం. అలాగే పార్లమెంట్‌లో మహిళల సంఖ్య 50 శాతానికి తీసుకువెళ్లాలన్నది లక్ష్యం. ప్రస్తుతం ఇది 11.46% మాత్రమే ఉంది.

ఈ దశాబ్దంలో ప్రాథమిక విద్యారంగంలో లింగ వివక్ష బాగా తగ్గిందని నివేదిక గుర్తించటం విశేషం. ఇక దీన్ని మాధ్యమిక, ఉన్నత విద్యారంగాల్లో కూడా సాధించాలని నివేదిక సూచించింది. రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో మహిళా సాధికారత సాధించాలన్న లక్ష్యానికి ఇప్పటికీ దూరంగానే ఉన్నామని నివేదిక గుర్తించింది. ‘‘వ్యవసాయ రంగంలో తప్పించి మిగతా రంగాల్లో ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది’’ అని నివేదిక గుర్తించింది.

శిశు మరణాలను తగ్గించటం
2015 చివరికి భారత్‌లో శిశుమరణాలను ప్రతి వెయ్యి జననాలకు 42 కంటే తక్కువకు తీసుకురావాలన్నది సహస్రాబ్ది లక్ష్యం. కానీ ప్రస్తుత పరిస్థితులను బట్టి దీన్ని 49 కంటే తగ్గించటం కష్టమని, లక్ష్యాన్ని చేరటం సాధ్యం కూడా కాదని నివేదిక అభిప్రాయపడింది.
తల్లుల ఆరోగ్యాన్ని మెరుగుపరచటం
మాతా మరణాలను నివారించటంలో, తల్లుల ఆరోగ్యాన్ని పరిరక్షించటంలో భారత్‌ వెనకబడే ఉంది. ఈ ఏడాది చివరికి ప్రతి 1,00,000 జననాలకు మాతా మరణాలను 109కు తగ్గించాలన్నది సహస్రాబ్ది లక్ష్యం. కానీ దీన్ని 140 కంటే తక్కువకు తీసుకువచ్చే పరిస్థితులు కనబడటం లేదని నివేదిక అభిప్రాయపడింది.
హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌, మలేరియా తదితర వ్యాధులను ఎదుర్కొనటం
హెచ్‌ఐవీ, క్షయ, పోలియో, మలేరియా వ్యాధులను నియంత్రించటంలో భారత్‌ గొప్ప విజయాన్ని సాధించింది. 2005లో గర్భిణుల్లో హెచ్‌ఐవీ కేసులు 0.89% వరకూ ఉండగా 2010 నాటికి దాన్ని 0.39% వరకూ తగ్గించగలిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 1990లలో క్షయ కారణంగా లక్షకు 38 మంది చనిపోతుండగా 2011 నాటికి దాన్ని 24కు తగ్గించగలిగారు.
నీరు, పారిశుద్ధ¿్యం, ఇంధనం వంటి రంగాల్లో పర్యావరణ సుస్థిరత సాధించటం
తాగునీటి సదుపాయం లేని గృహాల సంఖ్యను సగానికి సగం తగ్గించాలన్నది లక్ష్యం. దీన్ని చాలా వరకూ చేరుకోగలిగాం. 1990లో 34% ఇళ్లకు ఈ సదుపాయం ఉండేది కాదు, ఈ 2015 నాటికి దీన్ని 17 శాతానికి తగ్గించగలిగారు. కానీ పారిశుద్ధ్యం విషయంలో ఇప్పటికీ వెనకబడే ఉన్నాం. బహిరంగ మల విసర్జన అన్నది అతిపెద్ద సవాల్‌గా తయారైంది. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో 59.4% గృహాలకు, పట్టణాల్లో 8.8% గృహాలకూ మరుగుదొడ్ల సౌకర్యం లేదు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్‌ తరహా పథకాలను విస్తృతంగా అమలు పరచటం ద్వారా దీన్ని ఎదుర్కోవచ్చని నివేదిక అభిప్రాయపడింది.
అభివృద్ధి కోసం అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని వృద్ధిపరచటం
అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని పెంచుకునే విషయంలో భారత్‌ వెనకబడే ఉంది. దక్షిణాసియాలో సీమాంతర సహకారాన్నీ, పొరుగు దేశాల భాగస్వామ్యాన్నీ భారత్‌ గణనీయంగా పెంచుకోవాల్సిన అవసరం ఉందని తేల్చింది.

జీన్స్‌ ప్రభ!

కొన్నిరోజులు వాడగానే జీన్స్‌ బిగుతైపోతాయి. అలాగని వాటిని పారేయలేం. ఎందుకంటే చూడ్డానికేమో కొత్తగా ఉంటాయి. అలాంటి జీన్స్‌నే రీసైకిల్‌ చేసి కొత్త ఉత్పత్తులుగా మార్కెట్‌లోకి...

మనసంతా పొరుగు కథలపైనే!

మహేష్‌బాబు లాంటి ఒకరిద్దరు కథానాయకులు తప్ప దాదాపుగా మిగిలిన తెలుగు హీరోలందరూ రీమేక్‌ చిత్రాలపై మోజు ప్రదర్శించేవాళ్లే. పొరుగు భాషలో ఒక మంచి సినిమా...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net