Mon, February 08, 2016

Type in English and Give Space to Convert to Telugu

'కడలి వేదికగా కదన విన్యాసం''కల్తీల నుంచి కాపాడాలి''ఎస్సై కొలువులకు సై''వాట్సన్‌ @ రూ. 9.5 కోట్లు''హామీలు నెరవేర్చే వరకు దీక్ష''అన్నయ్యే వారసుడు..''ప్రజల మనసులు చూరగొంటూ..''సాగర జలాల్లో స్నేహబంధం''కాగిత రహిత టికెట్ల దిశగా రైల్వే''అనుమతి లేకుండా ప్రాజెక్టులు'
మన బిడ్డనెవరి చేతుల్లో పెడదాం?
ఈనాడు హైదరాబాద్‌
కష్టనష్టాలతో... కన్నీటితో...
అవమానాలతో... ఆవేదనతో..
అనూహ్యంగా ఆవిర్భవించిన బిడ్డ!
అమ్మలా ఆదరించాల్సిన కేంద్రం
అనాథలా వదిలేసిన బిడ్డ! పొత్తిళ్ళలోనే ఎన్నికల
ఒత్తిళ్ళతో... ఎన్నో కలలు కంటోంది మన గడ్డ!
మరి మన పాప బాధ్యతనెవరికి అప్పజెబుదాం?
మన ‘బంగారు’ భవిష్యత్‌నెవరి చేతుల్లో పెడదాం?
నేను నేనంటూ ముందుకొస్తున్న ఇద్దరిలో ఎవరిని ఎంచుకుందాం?
అనుభవజ్ఞుడినా? అరాచక నేతనా?
అభివృద్ధి వ్యక్తినా? అవినీతిశక్తినా?
సాధించే వీరుణ్ణా? వేధించే వారినా?

ఎవరితో వెళితే మన సీమాంధ్ర స్వర్ణాంధ్రవుతుంది? ఎవర్ని ఎన్నుకుంటే మన పిల్లలకు ఉద్యోగాలొస్తాయ్‌? ఎవరికి ఓటేస్తే శాంతిభద్రతలు భద్రంగా ఉంటాయ్‌? నిర్ణయించుకునే ముందు ఒక్కసారి ఇద్దరి చరిత్ర చూడండి! ప్రవృత్తి చూడండి! ఎవర్ని ఎంచుకుంటే ఏమౌతుందో చదవండి! ఎవరి చేతుల్లో మన పాపాయి హాయిగా ఎదుగుతుందో తేల్చుకోండి!


కుటుంబ నేపథ్యం
మధ్యతరగతి రైతు కుటుంబం.
చదువు
తిరుపతిలోని ఎస్‌.వి. విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ-ఎకనామిక్స్‌, ఎంఫిల్‌. పాఠశాల విద్య కోసం కిలో మీటర్ల కొద్దీ నడచి వెళ్ళేవారు.

ప్రవృత్తి
పూర్తి స్థాయి రాజకీయాల్లో ఉన్నా... ఎన్‌టీఆర్‌ ట్రస్ట్‌ ద్వారా వివిధ రూపాల్లో పేదలకు సాయం చేయటం. మూడు రక్తనిధి కేంద్రాల ద్వారా ఇప్పటికే 2.68 లక్షల మందికి సాయం. ప్రత్యేక శిబిరాల ద్వారా 10 లక్షల మందికి వైద్యం. 15వేల మంది నిరుద్యోగులకు ఉపాధి. ఎన్‌టీఆర్‌ మోడల్‌ స్కూల్‌ ద్వారా వెయ్యి మంది అనాధ, నిరుపేద పిల్లలకు ఉచిత విద్య, వసతి, భోజనం. ఇంజనీరింగ్‌, ఇతర చదువులకు 10,000 మందికి సాయం! నిరుడు ఉత్తరాఖండ్‌ బాధితుల్ని రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు రూ.1.5 కోట్లు వెచ్చించారు. 2009లో మహబూబ్‌నగర్‌, కర్నూలు జిల్లాల్లో 5 లక్షల మంది వరద బాధితులకు రూ.12.5 కోట్ల సాయం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే భారీ వ్యయంతో కూడిన ఈ సామాజిక సేవను మరింత ఉధృతంగా కొనసాగించారు. ఎన్‌టీఆర్‌ ట్రస్ట్‌కు విరాళాల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. వివిధ రంగాల్లో సేవలందించిన వారికి అవార్డులు అందిస్తుంటారు. బసవ తారకం క్యాన్సర్‌ ఆసుపత్రి నిర్వహణంలోనూ పరోక్షంగా సాయపడుతుంటారు. పలు స్వచ్ఛంద సేవా సంస్థలకు సాయం చేస్తుంటారు.

కుటుంబ నేపథ్యం
తాత, తండ్రి ఇద్దరూ ఫ్యాక్షనిస్టులే. తాత 
రౌడీషీటర్‌ కూడా.
చదువు
స్మానియా వర్సిటీ నుంచి బీకాం.

ప్రవృత్తి
పెద్దగా కలుపుగోలుగా ఉండకపోయినా అప్పుడప్పుడు బాగా దుందుడుకుగా వ్యవహరిస్తారు. స్నేహితులు తక్కువ. పార్టీ అధ్యక్షునిగా ఉన్నప్పటికీ మీడియాను ఎదుర్కోవటానికి ఇష్టపడరు. తెలుగు పత్రికలు, ఛానళ్లతో కన్నా ఎంపిక చేసుకున్న ఆంగ్ల భాష పత్రికలు, ఛానళ్లతోనే ఎక్కువగా మాట్లాడుతుంటారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సైతం విలేకరుల సమావేశాలు నిర్వహించరు. ఈ విషయంలో ఇద్దరి వ్యవహారశైలి దాదాపు ఒకే రకంగా ఉంటుంది. తండ్రి అధికారంలో ఉన్నప్పుడు వివిధ అక్రమ మార్గాల్లో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింపజేశారు. వైఎస్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చిన్నపాటి వ్యాపారంతో సరిపుచ్చుకున్న ఆయన 2004-09 మధ్యకాలంలో చెలరేగిపోయారు. ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్‌ తన వద్దకు వివిధ పనులపై వచ్చే వారిని జగన్‌ని కలవమని సూచించే వారు. ఆ పని స్థాయిని బట్టి ధర నిర్ణయించే వారు. అది జగన్‌ కంపెనీల్లో పెట్టుబడులు కావచ్చు. నేరుగా డబ్బు చేతులు మారటం కావచ్చు. ఈ రూపంలో అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. వీటిపై ఎన్ని విమర్శలు, ఆరోపణలు వచ్చినా నేరుగా జవాబిచ్చేందుకు ఆసక్తి చూపరు. విశ్వసనీయత గురించి పదే పదే చెప్పే ఆయన ఆచరణలో మాత్రం అలాంటివేవీ చూపరు.
వ్యక్తిగత భవిత
చంద్రబాబు....
లాంటి కేసులూ ఏమీ లేవు కాబట్టి... పరిపాలనపై దృష్టిపెట్టి, పక్కా ప్రణాళికలతో కేంద్రంతో సత్సంబంధాలతో వేగంగా అభివృద్ధిపై దృష్టిపెడతారు. నాలుగేళ్ళలో రాజధాని పూర్తిచేస్తానంటున్నారు కూడా!

జగన్‌...
ది సీబీఐ ఛార్జిషీట్లతో పాటు ఈడీ ఆరోపణల్ని కూడా ఎదుర్కొంటున్న జగన్‌ ఇప్పటికే బెయిల్‌పై ఉన్నారు. ఒకవేళ అధికారంలోకి వస్తే రాష్ట్రాభివృద్ధి గురించి కాకుండా ఈ కేసుల్నుంచి ఎలా బయటపడటానికి ప్రాధాన్యమిస్తారు. ఎందుకంటే... అధికారంలో ఉండగా తనకు వ్యతిరేకంగా ఏ తీర్పు వచ్చినా రాజీనామా చేయాల్సి ఉంటుంది కాబట్టి! రాష్ట్ర ప్రయోజనాల కంటే కూడా సొంత ప్రయోజనాలే ఎక్కువగా చూసుకుంటారు. 
రాజధాని అనుభవ నిర్ణేతే ఉజ్వల నిర్మాత
చంద్రబాబు: కొత్త రాష్ట్రం ముందున్న అసలైన సవాలూ, అత్యవసరంగా సమకూరాల్సింది కొత్త రాజధానే. 400 ఏళ్ళ చరిత్రున్న హైదరాబాద్‌కు సైతం కన్నుకుట్టేంతటి సైబరాబాద్‌ నగరాన్ని నాలుగేళ్ల వ్యవధిలో సృష్టించిన అనుభవం చంద్రబాబుది! అదిప్పుడు సీమాంధ్ర అభివృద్ధికి తోడ్పడుతుంది! పైగా అభివృద్ధి అంతా ఒకేచోట కేంద్రీకృతం కాకుండా ఉండేలా స్మార్ట్‌సిటీలు ఏర్పాటు చేస్తామంటున్న నరేంద్రమోడీ తోడూ ఉంటుంది! వెరసి నాలుగేళ్ళలోనే హైదరాబాద్‌ను కోల్పోయామనే బాధ సీమాంధ్రుల్లో లేకుండా పొయ్యే అవకాశాలున్నాయి. కేవలం రాజధానే కాదు... మరెన్నో నగరాలు వెలుగులీనే అవకాశాలు పుష్కలం!

జగన్‌: స్వయంగా పరిపాలన అనుభవం లేదు. అయితే.. తాను తెస్తానంటున్న రాజన్న పాలననే ప్రామాణికంగా చూస్తే... మాత్రం కష్టమే! ఎందుకంటే... భూసేకరణ, కబ్జాల్లాంటి దందాలతో మార్మోగిన వైఎస్‌ పాలనాకాలం కొనసాగితే కొత్త రాజధాని నిర్మాణం కుంభకోణాలమయం అవుతుంది. హైదరాబాద్‌లో రింగురోడ్డును బ్రేక్‌డాన్స్‌ చేయించారు. సామాన్యులు భూమిని కొనలేని, ఉన్న దాన్ని కాపాడుకోలేని భయానక స్థితి ఉత్పన్నం కావొచ్చు. కాంట్రాక్టుల్లో ఎలాంటి అవకతవకలకు అవకాశముంటుందో వైఎస్‌ హయాంలో వెలుగుచూసిన కుంభకోణాలే తెలియజేస్తాయి.
కేంద్రంతో సత్సంబంధం
చెలిమే నవ్యాంధ్రకు కలిమి
చంద్రబాబు: మనదెంత సమాఖ్య వ్యవస్థయినా... రాష్ట్రాల మనుగడకు కేంద్రం సాయం ఎంతో కీలకం! పైగా కొత్తగా పుట్టిన సీమాంధ్రకైతే ఇంకెంతో కీలకం! కేంద్రంలో ఏ ప్రభుత్వమున్నా సత్‌సంబంధాలు నెరపగల నేర్పరి చంద్రబాబు! భారీగా నిధులు రాబట్టగల పాలనా నైపుణ్యం తనకుంది! ఎంతమంది ఎంపీలున్నా... ఆ సంఖ్యాబలాన్ని ఆసరా చేసుకుని వివిధ పథకాల్ని సాధించారు. కీలక కార్యాలయాల్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయించారు. తాజాగా భాజపా ప్రధాని అభ్యర్థి మోడీతో ఎన్నికలకు ముందు నుంచే స్నేహం, భాజపాతో పొత్తు ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి దోహదం చేస్తాయి. అభివృద్ధిని వేగం చేస్తాయి.

జగన్‌: అధికారంలోకి రాకుండానే ఎవ్వరితోనూ కలవలేని పరిస్థితి. అవినీతి చరిత్ర నేపథ్యంలో స్థానికంగా కూడా ఎవ్వరూ పొత్తులు పెట్టుకోలేని దుస్థితి! తన తండ్రివల్లే కేంద్రంలో రెండుసార్లు యూపీఏ అధికారంలోకి వచ్చిందని ఘనంగా చెప్పుకుంటుంటారు. మరి ఆ అధికారాన్ని ఉపయోగించి రాష్ట్రానికేం ఉపయోగపడ్డారంటే మాత్రం సమాధానం లేదు. రాజశేఖరరెడ్డి హయాంలో కేంద్రంపై ఒత్తిడి కాదు కదా... పరిచయాలు ఉపయోగించి తగినన్ని ప్రాజెక్టులు, సంస్థలు రాష్ట్రంలో ఏర్పాటు చేయించలేని పాలనా నైపుణ్యం. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉన్నా... కేంద్ర ప్రభుత్వ మనుగడకి రాష్ట్ర ఎంపీలే కీలకమైనా కనీసం కొత్త రైల్వే ప్రాజెక్టు కూడా మంజూరు చేయించుకోలేని దైన్యం. వైఎస్‌, జగన్‌ కేంద్ర మంత్రుల్ని కలిసినప్పుడు రాష్ట్ర ప్రయోజ నాలకన్నా సొంత వ్యాపార పనులే అధికంగా ఉంటాయన్నది పాలక వర్గాల్లో తరచూ వినిపించిన మాట. కేంద్రంలో ఎవరికి మద్దతివ్వాలో ఇప్పటికీ తేల్చుకోలేని అయోమయం!
సుపరిపాలన పౌర శ్రేయస్సే గీటురాయి
చంద్రబాబు: కొత్త రాష్ట్రం గాడిలో పడాలన్నా, గాడి తప్పకుండా ఉండాలన్నా పరిపాలన చాలాచాలా కీలకం! ప్రత్యర్థులు సైతం మెచ్చుకునే పాలనా సామర్థ్యం బాబు సొంతం! మారుతున్న కాలానికి, పరిస్థితులకు అనుగుణంగా సంస్కరణలు అమలు చేసిన పాలకుడు. పౌరులకు నిత్యం అవసరమయ్యే వివిధ పనులు సులువుగా పూర్తయ్యేలా ఈ సేవా కేంద్రాల నుంచి... హైదరాబాద్‌కు గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు దాకా... జాతీయ విధానాన్నే సమూలంగా మార్పించిన నేత. సిటిజన్‌ ఛార్టర్‌ అమలుకు ఆద్యుడు! కొత్త రాష్ట్రంలో పరిపాలన మరింత మెరుగ్గా ఉండే అవకాశం!

జగన్‌: పాలనా సంస్కరణల మాట దేవుడెరుగు.... ఉన్న వ్యవస్థల విధ్వంసం. నియమ నిబంధనలకు వక్రభాష్యం చెప్పే అవకాశం! మనకు ఉపయోగపడే వారైతే చాలు ఎన్ని కుంభకోణాలకు పాల్పడినా ఓకే అనే ఫ్యూడల్‌ మనస్తత్వం... ఫ్యాక్షనిస్టు వ్యవహారశైలితో నిర్ణయాలు. ఎందుకంటే... తాను తెస్తానంటున్న రాజన్న రాజ్యంలో (వైఎస్‌ హయాంలో) జరిగిందదే కాబట్టి! విధానాల్లో ఏ మార్పు తీసుకొచ్చినా ప్రజల కోసం కాకుండా సొంత ప్రయోజనాల కోసమేనన్న విమర్శలు. ఐఏఎస్‌ అధికారుల్లాంటివారే జైలు పాలైన నేపథ్యంలో అధికార యంత్రాంగం స్వేచ్ఛగా, నిర్భయంగా పనిచేసే వాతావరణం ఉంటుందా అనేది పెద్ద సందేహం!
పారిశ్రామికాభివృద్ధి సచ్ఛీలతతోనే సాధ్యం
చంద్రబాబు: కొత్త రాష్ట్రానికి ప్రాణవాయువులాంటిది పారిశ్రామిక రంగం! ఎందుకంటే సహజవనరుల పరంగా అత్యంత సమృద్ధిగల రాష్ట్రం మన సీమాంధ్ర! పెట్టుబడుల పరంగా కూడా పారిశ్రామికవేత్తలకు కొదువ లేదు. కావల్సిందల్లా పాలనలో చొరవే! అది చంద్రబాబులో పుష్కలంగా ఉందన్న విషయం ప్రతి ఒక్క పారిశ్రామికవేత్తా చెబుతారు. పైగా అవినీతి లేకపోవటం; నీకిది-నాకది పద్ధతిలో లోపాయకారీ వ్యవహారాలు లేకపోవటం; పరిశ్రమలకు అవసరమైన అనుమతుల్లో వేగం... ఇవన్నీ బాబుకున్న ప్లస్‌ పాయింట్లు! దేశ, విదేశీ పారిశ్రామికవేత్తలు కూడా ఇలాంటి వాతావరణాన్నే కోరుకుంటారు.

జగన్‌: రాజకీయ నాయకుడిగా రంగ ప్రవేశం చేయకముందే జగన్‌కు పారిశ్రామికరంగంలోపేరుంది. కానీ అది అందరూ అనుసరించేది కాకుండా... ఇలా ఉండకూడదు అని చెప్పే పేరు! తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకొని జగన్‌ చేసిన వ్యవహారాలు దేశంలోనే కాదు అంతర్జాతీయంగా కూడా మారుమోగిపోయాయి. ఆంధ్రావనిలో పెట్టుబడి పెట్టాలంటే జగన్‌ సంస్థలో మూటల్ని వాటాల రూపంలో పెట్టాలనేది అందరికీ తెలిసిపోయింది. అందుకే చాలా సంస్థలు మన రాష్ట్రానికి రాకుండానే పారిపోయాయి. విదేశీ పెట్టుబడిదారులు స్థానిక నేత చరిత్ర, వ్యక్తిత్వం, పాలనతీరును జాగ్రత్తగా బేరీజువేసుకొనిగాని ముందుకురారు. అవినీతి చరిత్ర ఉంటే చాలా కంపెనీలు వెనక్కి వెళ్ళిపోతాయి. ఎందుకంటే... ఇక్కడ ఏమీ కాకున్నా... తమ దేశంలో ఎప్పుడో దర్యాప్తు జరిగి పట్టుబడితే తమ మెడకు చుట్టుకుంటుంది! అందుకు నాటి బోఫోర్స్‌ నుంచి తాజా టైటానియం కుంభకోణం దాకా దృష్టాంతాలెన్నో! ఈ నేపథ్యంలో జగన్‌ వస్తే పారిశ్రామికాభివృద్ధి ఏమౌతుందోనని వచ్చేవారే కాదు... ఇక్కడున్న పారిశ్రామికవర్గాలే ఆందోళన చెందుతున్నాయి!
విద్య, ఉద్యోగావకాశాలు
అనుభవమే సువర్ణావకాశం
చంద్రబాబు: ఇన్నాళ్ళూ ప్రతిదానికీ ధైర్యంగా హైదరాబాద్‌ వైపు చూసినట్లుగా ఇప్పుడు చూడలేదు సీమాంధ్ర యువతరం! ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల్ని కల్పించటం తక్షణావసరం! అవకాశాలు బోలెడున్నాయి. వాటిని అందిపుచ్చుకోవటంలో చంద్రబాబు అనుభవం ఉపయోగపడొచ్చు! గతంలో హైదరాబాద్‌కు ఐఐఐటీ, ఐఎస్‌బీ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్ని తీసుకొచ్చిన బాబు... సీమాంధ్ర కోసం కూడా కేంద్రంతో సత్సంబంధాలతో అనేక సంస్థల్ని తీసుకురావాలనుకుంటున్నారు. అంతేగాకుండా వికేంద్రీకృతం చేసి అన్ని చోట్లా ఉన్నతవిద్య సంస్థలు అందుబాటులో ఉండేలా ప్రణాళికలున్నాయంటున్నారు. వీటికి తోడు క్రమంగా తప్పకుండా డీఎస్‌సీ నిర్వహణ ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, పరిశ్రమల ఆధారిత విద్యాకేంద్రాలతో ఉపాధి అవకాశాల పెంపుదలకు ప్రణాళికలు!

జగన్‌: అన్నీ చేస్తామని ఎప్పటిలాగే అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నా... నమ్మలేని పరిస్థితి! ఎందుకంటే తాను తెస్తానంటున్న రాజన్న పాలనలో మూడు ప్రాంతాల్లో త్రిబుల్‌ ఐటీలు ఏర్పాటుచేసినా... ఇప్పటికీ సౌకర్యాల్లేవు. సరైన ప్రమాణాల్లేవు. విశ్వవిద్యాలయాలదీ అదే పరిస్థితి. కనీసం భవనాలు కూడా సమకూరని స్థితి. బోధనా సిబ్బంది కొరత దారుణం. వైఎస్‌ అనుయాయుడు సూరీడు రాజీవ్‌ విద్యామిషన్‌లో సరసాదేవితో కలిసి అక్రమాలకు పాల్పడినా చర్యలు తీసుకోలేదు. మేనత్త కొడుకు క్రిస్టోఫర్‌కి అర్హతలేకున్నా ఉన్నత విద్యామండలి కార్యదర్శి పదవి కట్టబెట్టారు! ఏడాదికో డీఎస్సీ అంటూ పదవిలోకి వచ్చి... పదేళ్ళలో కేవలం మూడంటే మూడే డీఎస్సీలు పెట్టారు. అందుకే యువతరంలో అపనమ్మకం!
సేద్యం-సాగునీరు
బాబు వరాల విందు
చంద్రబాబు: రైతు కుటుంబం నుంచి వచ్చిన చంద్రబాబుకు వ్యవసాయ సమస్యలు తెలుసు. వ్యవసాయ ఆధారమైన మన రాష్ట్రంలో అప్పులతో, పెరిగిన ఖర్చులతో, గిట్టుబాటు ధరల్లేక రైతాంగమంతా కుదేలై ఉంది. ఆదుకునే వారి కోసం వేచి చూస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో... ఎన్నికలతో సంబంధం లేకుండా ఏడాది కిందే వారికి రుణమాఫీ ప్రకటించారు చంద్రబాబు! దీనికి తోడుగా... నాణ్యమైన విద్యుత్‌ను నిర్ణీత సమయంలో ఇస్తామంటున్నారు. పొగాకు వంటి పంటలకు గిట్టుబాటు ధర లభించనప్పుడు రైతు సంఘాలకే వందల కోట్లు నిధులిచ్చి కొనుగోలు చేయించే విధానం... శీతల గిడ్డంగుల్లో నిల్వ ఉంచిన పంట ఉత్పత్తులకు రుణ సౌకర్యం... ఇవన్నీ రైతుల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి.

జగన్‌: వ్యవసాయం గురించి ఏమాత్రం తెలియదు. రైతు రుణమాఫీకి గతంలో వైఎస్‌, ఇప్పుడు జగన్‌ పూర్తి వ్యతిరేకం. అప్పట్లో రుణ మాఫీ బదులుగా ఏటా కొంత మొత్తం చొప్పున డబ్బులివ్వాలని వైఎస్‌ అంటే... ఇప్పుడు జగన్‌ మాఫీ అసాధ్యమని అంటున్నారు. కేంద్రమే అప్పట్లో రుణమాఫీ చేస్తే దాని ఖ్యాతి తన తండ్రి ఖాతాలో వేసుకోవాలని జగన్‌ యత్నించారు. ఉచిత విద్యుత్తు పేరుతో అసలు సమయానికి విద్యుత్తే సరఫరాకాని స్థితి రాజన్న రాజ్యం ఫలితం! ఏడు కాదుకదా... మూడు నాలుగు గంటలు కూడా సరఫరా లేని స్థితి. పుష్కలంగా విద్యుత్తు ఉన్నా గ్రామీణ ప్రాంతాలకు, వ్యవసాయానికి సరఫరా చేయని దుస్థితి. ఉత్పత్తి ఉందని సరఫరా చేస్తే... లేనప్పుడు ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందన్న ఉద్దేశంతోనే ఈ రకమైన విధానం అనుసరిస్తున్నారు. వ్యవసాయ విద్యుత్తు సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారవటానికి జగన్‌ చెబుతున్న రాజన్న రాజ్యమే కారణం! వేళాపాళా లేని కరెంటుతో వేలమంది రైతులు ప్రాణాలు కోల్పోవటానికీ కారణం వైఎస్‌ విధానాలే!
బలహీన వర్గాల సంక్షేమం
తెదేపా పాలనలోనే పదవీ ‘ఆదరణ’
చంద్రబాబు: తెలుగుదేశం వచ్చేదాకా కొన్ని వర్గాలకే పరిమితమైన రాజకీయం ఆ తర్వాత కొత్త పుంతలు తొక్కింది. తెదేపా పాలనతోనే బడుగు బలహీన వర్గాల్లో రాజకీయ చైతన్యం... చట్టసభల్లో సభ్యత్వాలు, కీలక రాజకీయ పదవులు లభించాయి. లోక్‌సభ, శాసనసభ స్పీకర్‌ పదవులు ఎస్సీలకు, కేంద్రంలో లభించిన ఏకైక కేబినెట్‌ మంత్రి పదవిని బీసీలకు తెదేపా అప్పగించింది. రాష్ట్రంలో హోం, రెవెన్యూ వంటి కీలకమైన మంత్రిత్వ శాఖలు ఈ వర్గాలకు అప్పగించారు. స్థానిక సంస్థల్లో మూడో వంతు రిజర్వేషన్లు కల్పించారు. ఆదరణ పథకంతో వృత్తి పనివాళ్ళకు పనిముట్లు ఇచ్చారు.

జగన్‌: ఈ వర్గాలకు ప్రత్యేకించి చేసిందేమీ లేదు. ఈ వర్గాల నాయకులను, వ్యక్తులను వాడుకోవటమే తప్ప ఎదగనివ్వరని అంటారు. మొదటినుంచీ తన కుటుంబాన్ని నమ్ముకొని ఉన్న కొండా సురేఖ వంటివారినే దూరం పెట్టారు. వైఎస్‌కు అత్యంత సన్నిహితుడైన మూలింటి మారెప్ప ఏకంగా భాజపాలో చేరారు. మంచి వక్తగా పేరున్న జూపూడి ప్రభాకరరావు... లాంటి వారెందరినో క్రమంగా అణచివేశారు. ఓట్ల కోసమే మత ప్రస్తావన తప్ప దళితులకు కూడా చేసిందేమీ లేదని ఆయా సంఘాలు ధ్వజమెత్తుతున్నాయి.
శాంతి భద్రతలు
మతకలహాల ఛాయలు నాడు లేనేలేవు
చంద్రబాబు: తెలుగుదేశం పాలనలో ఎవ్వరైనా కితాబిచ్చే అంశం శాంతి భద్రతల పరిరక్షణ! మతకలహాలన్న జాడే లేదు. హైదరాబాద్‌ పాతబస్తీలాంటి చోట మతకల్లోలాలకు, కర్ఫ్యూలకు తావులేకుండా చేశారు. అన్నిరకాల ఉగ్రవాద చర్యల నిరోధంపై పోలీసు యంత్రాంగానికి పూర్తి స్వేచ్చనిచ్చారు´! జిల్లాల్లో ఇబ్బంది కల్గిస్తే సొంత పార్టీ నాయకుల్ని అదుపులోకి తీసుకున్నా, అరెస్టు చేసినా పోలీసులకు సహకరించటం... బదిలీల్లో పైరవీలకు అవకాశమివ్వకపోవటం... సమర్థులైన అధికారులకు కీలక పోస్టింగ్‌లివ్వటం అందరినీ ఆకట్టుకుంది.

జగన్‌: జగన్‌ శాంతిభద్రతల విషయంలో ఎలా వ్యవహరిస్తారనేది ఆసక్తికరం! ఆయన సన్నిహితుల్లో చాలామందిపై కేసులున్నాయి. పరిటాల హత్య కేసు నుంచి జగన్‌ను బయటపడేయటానికి చాలా తీవ్రంగా శ్రమించానని మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శాసనసభలోనే చెప్పారు. జగన్‌ తెస్తానంటున్న రాజన్న రాజ్యంలో పైరవీలతోనే పోస్టింగ్‌లు... ఉగ్రవాద దాడులకు అవకాశమిచ్చేలా పాలన.... ఒత్తిళ్లకు లొంగటం... సమర్థులకు ప్రాధాన్యం లేని పోస్టింగ్‌లు... ఇవన్నీ నడిచాయి. పరిటాల హత్య కేసులో నిందితులు ఆశ్చర్యకర స్థితిలో మరణించటం అనేక అనుమానాలు రేకెత్తించింది. ఓ నిందితుడు జైలులోనే హతమవడం ఆ తర్వాత కొనసాగింపుగా మరొకరు బయట హత్యకు గురికావడం కీలక వ్యక్తుల వైపు వేలెత్తి చూపించాయి. హైదరాబాద్‌లో మతకలహాలు వైఎస్‌ సృష్టేనంటూ గతంలో కాంగ్రెస్‌ నేతలే ఆరోపించారు! వై.ఎస్‌. ఖైదీలకు ప్రసాదించిన క్షమాభిక్షలో ఓ ఉగ్రవాది కూడా ఉండటం గమనార్హం.

మాధవన్‌ పళ్లురాలగొట్టాను..!

సినిమా కోసం ఉత్తుత్తినే కాదు.. నిజంగానే అంతపని చేసిందట రితిక. గత వారం విడుదలై సంచలన విజయం సాధించిన ‘సాలా ఖడూస్‌’ చిత్రం కథానాయిక. అప్పుడెప్పుడో పరుగుల రాణీ...

ఉప్పల్‌లో పరుగుల పండగ

మ్యాచ్‌ అంటే ఇదీ.. ఆడేది సినిమావాళ్లే అయినా, అంతర్జాతీయ మ్యాచ్‌కి ఏమాత్రం తీసిపోదు. టీ ట్వంటీలో ఉండే అసలైన మజా... మరోసారి తెలిసొచ్చింది....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net