Mon, February 08, 2016

Type in English and Give Space to Convert to Telugu

'పట్టణాభిషేకం''వాస్తవాల ప్రతిబింబంగా బడ్జెట్‌''నీటిపై నిప్పుల వాన''సీఎం మొండి అయితే.. నేను జగమొండి''తీరప్రాంత దేశాల మధ్య సహకారం పెరగాలి''ఉత్తర కొరియా రాకెట్‌ ప్రయోగం''చిరుతకు చిక్కి .. ప్రాణాలతో బయటపడి''మౌఖికంలో మార్కులు ఖాయం''ఎయిమ్స్‌కు 220 ఎకరాలు కేటాయింపు''‘అంకుర’ భయాలొద్దు'
రైతుపై రాకాసి చట్టం!
మొండి బకాయిలకు రెవెన్యూ రికవరీ అస్త్రం
ప్రయోగించేందుకు అనుమతించాలంటున్న బ్యాంకులు
అలాచేస్తే మహిళా రైతునూ అరెస్టు చేయొచ్చు
వ్యవసాయ రుణ బకాయిలు 5.82 శాతమే
ఈనాడు - హైదరాబాద్‌
వ్యవసాయ రుణాల బకాయిలను చెల్లించని రైతులపై రెవెన్యూ రికవరీ (ఆర్‌ఆర్‌) చట్టం ప్రయోగానికి ఆమోదాన్ని తెలపవలసిందేనని రాష్ట్రంలోని బ్యాంకులు ప్రభుత్వంపై వత్తిడి తెస్తున్నాయి. సర్కారు కనుక అంగీకరిస్తే రైతు చర, స్థిరాస్తులను జప్తు చేసి విక్రయించటంతో పాటు అతన్ని అరెస్టు చేసే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇంతకీ రాష్ట్రంలో ప్రస్తుతం వ్యవసాయ రుణాల మొండి బకాయిలు కేవలం 5.82 శాతం మేర మాత్రమే ఉన్నాయి. భారీ ఎత్తున రుణాలను తీసుకొని ఎగ్గొట్టే పరిశ్రమల యాజమాన్యాలను ఏమి చేయలేని బ్యాంకులు.. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం చందంగా బక్క రైతుపై ఆర్‌ఆర్‌ చట్టం ప్రయోగం అవసరమని పట్టుపడుతుండటం విశేషం. రాష్ట్రంలో అన్ని బ్యాంకులు కలసి ఇచ్చిన వ్యవసాయ రుణాలు ప్రస్తుతం రైతుల వద్ద రూ.1.27 లక్షల కోట్ల మేర ఉన్నాయి. వీటిలో రూ.6,482 కోట్లు మొండి బకాయిలుగా మారాయి. వీటినే బ్యాంకులు ఇక వసూలు కానివిగా పరిగణిస్తూ నిరర్ధక ఆస్తులు (ఎన్‌పీఏ)గా పుస్తకాల్లో రాసుకొంటాయి. ఇవి మొత్తం రైతుల ఖాతాల్లో కేవలం 5.52 శాతం మాత్రమే. ఇవి కాక గడువులోగా వసూలుకాని వ్యవసాయ రుణాలు మరో రూ.21 వేల కోట్ల మేర ఉన్నాయి. ఇవి నిరర్ధక ఆస్తుల మాదిరి కావు. కొంత ఆలస్యమైనా రైతు వడ్డీతో సహా తన రుణాన్ని చెల్లించటానికి అవకాశం ఉంటుంది. వడ్డీ లేని రుణం వ్యవధిని ప్రభుత్వం ఒక ఏడాదిగా నిర్ధరించగా చాలా బ్యాంకులు ఏడాది కంటే ముందేగానే తమ సొంత వ్యవధులతో వసూళ్లకు పూనుకొని అలా రాని వాటిని వాయిదా మీరినట్టుగా రాసేసుకొంటున్నాయి. బ్యాంకర్లు ఇవన్నీ కూడా తమను ఆందోళన కలిగిస్తున్నాయంటూ మదన పడుతున్నాయి. రైతులపై ఆర్‌ఆర్‌ చట్టం ప్రయోగానికి అనుమతించాలంటూ గతంలోనూ బ్యాంకులు ప్రభుత్వాన్ని కోరాయి. రైతుపై ఇటువంటి చర్యలకు ఆమోదముద్ర వేస్తే తీవ్ర విమర్శలు వస్తాయి కనుక ప్రభుత్వం బ్యాంకులకు ఏమీ సమాధానం ఇవ్వలేదు. కొంతకాలం మౌనం వహించిన బ్యాంకర్లు మళ్లీ ఇప్పుడు తమ స్వరాన్ని పెంచారు. కొన్ని రాజకీయ పార్టీలు రుణాలను మాఫీ చేస్తామంటూ ఇస్తున్న వాగ్దానాల కారణంగా రుణాల వసూళ్లు నిలిచి పోతున్నాయని ఈ సారి కొత్తపల్లవి అందుకొన్నాయి. ఇలా చెబితే అటువంటి పార్టీల ప్రచారానికి అడ్డుకట్ట వేయటానికైనా సర్కారు నడుం బిగిస్తుందని బ్యాంకర్లు భావిస్తున్నారు. వ్యవసాయానికి మరిన్ని రుణాలను ఇవ్వాలంటే గడువు దాటిన, నిరర్ధక ఆస్తులుగా మారిన బకాయిలు బాగా తగ్గాల్సి ఉంటుందని, దీని కోసం ఆర్‌ఆర్‌ చట్టాన్ని అమలు చేయటం ఒక్కటే మార్గమని అంటున్నాయి. బ్యాంకుల నుంచి ఈ మేరకు అభ్యర్థనలు పెరుగుతున్నాయని, దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి(ఎస్‌ఎల్‌బీసీ) తాజాగా ప్రభుత్వాన్ని కోరింది. పైగా ఇంతకు ముందు కూడా ఇదే విషయాన్ని తెలియజేసినా స్పందన కొరవడిందంటూ వాపోయింది.

ఆమోదిస్తే రైతుపై తీవ్ర చర్యలు
ఎప్పుడో 150 ఏళ్లనాటి ఆర్‌ఆర్‌ చట్టాన్ని కనుక ప్రయోగిస్తే అసలే కష్టాల్లో ఉన్న రైతు మరింత కుదేలయ్యే ప్రమాదం ఉంది. ఆర్‌ఆర్‌ చట్టం కింద రెవెన్యూ అధికారులు తొలుత ఆయా రైతుల చరాస్తులను స్వాధీనం చేసుకొని విక్రయించి ఆ సొమ్ము సరిపోకపోతే భూములను కూడా విక్రయిస్తారు. బకాయిలను వడ్డీలతో సహా మినహాయించుకొంటారు. ఇలా భూములు కూడా సరిపోకపోతే అరెస్టు చేస్తారు. కోర్టులో గరిష్ఠంగా రెండేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. బకాయి రూ.50 వరకు ఉంటే మూడు నెలలు, రూ.500 వరకు ఉంటే ఆరునెలల వరకు జైలుశిక్ష వేయవచ్చని ఆర్‌ఆర్‌ చట్టం నిర్ధేశిస్తోంది. ఇంటిలోకి బలవంతంగా ప్రవేశించి పోలీసుల సమక్షంలో మహిళా రైతును సైతం బయటకు తీసుకొచ్చి అరెస్టు చేసే అధికారాన్ని ఈ చట్టం కల్పిస్తోంది. భూమి అమ్మకానికి ముందుగానే రుణగ్రస్తుడు మృతిచెందినా రెవెన్యూ అధికారులు విడిచిపెట్టరు. అతని వారసులను బాధ్యులను చేస్తారు.

మాధవన్‌ పళ్లురాలగొట్టాను..!

సినిమా కోసం ఉత్తుత్తినే కాదు.. నిజంగానే అంతపని చేసిందట రితిక. గత వారం విడుదలై సంచలన విజయం సాధించిన ‘సాలా ఖడూస్‌’ చిత్రం కథానాయిక. అప్పుడెప్పుడో పరుగుల రాణీ...

ఉప్పల్‌లో పరుగుల పండగ

మ్యాచ్‌ అంటే ఇదీ.. ఆడేది సినిమావాళ్లే అయినా, అంతర్జాతీయ మ్యాచ్‌కి ఏమాత్రం తీసిపోదు. టీ ట్వంటీలో ఉండే అసలైన మజా... మరోసారి తెలిసొచ్చింది....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net