Wed, February 10, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ఔషధనగరిలో ప్రపంచశ్రేణి విశ్వవిద్యాలయం''భూసేకరణ, పునరావాసాలకేరూ. 8,000 కోట్లు''నెట్‌ సమానత్వానికే ట్రాయ్‌ మొగ్గు!''ముద్రగడ దీక్ష విరమణ''తెలంగాణ ప్రణాళిక భేష్‌''విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయాలా?''డాక్టర్‌.. ధనాధన్‌..''రసాయన పరిశ్రమలో పేలుడు''నడి వీధిలో పైశాచికం''పాక్‌ నుంచే కుట్ర'
ప్రజల్లో అభివృద్ధి కసి ఉంది
ఈనాడు-ఈటీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావు
దాన్ని సానుకూలం చేసుకుంటాం
ఓడరేవులు, వస్తు ఉత్పత్తి కేంద్రాల్ని అభివృద్ధి చేస్తాం
అనంతపురం జిల్లా ఐటీ కేంద్రానికి అనుకూలం
ఈనాడు-ఈటీవీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావు ప్రత్యేక ఇంటర్వ్యూ
ఈనాడు-హైదరాబాద్‌
‘విభజన జరిగిన తీరుతో ఆదాయం అధికంగా ఉన్న ప్రాంతం ఒక వైపు ఉండిపోయింది. కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో అవసరాలకు అనుగుణంగా ఆదాయ వనరులు లేవు. ఇదే పెద్ద సవాలు. ఆర్థిక లోటు భర్తీ చేసుకుని, ఆదాయాన్ని పెంచుకోవడం అసాధ్యమేమీ కాదు. కొంత సమయం పడుతుంది. అవకాశాలకు కొదవలేదు. సుదీర్ఘమైన సముద్ర తీరముంది. ఓడరేవులు అభివృద్ధి చేసుకోవచ్చు. వస్తూత్పత్తి కేంద్రాల్ని ఏర్పాటు చేసుకుంటే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. అనంతపురం జిల్లా బెంగళూరుకు అతి సమీపంలో ఉంది. అక్కడ సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ పార్కులు ఏర్పాటు చేసుకోవచ్చు. ‘వద్దన్నా విడదీశారు... అభివృద్ధి చెందుదాం’ అనే బలమైన భావన ప్రజల్లో, ఉద్యోగుల్లో ఉంది. దీన్ని సానుకూలంగా మార్చుకోవాలి’’ అని విభజనానంతర ఆంధ్రప్రదేశ్‌కి తొలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్‌. కృష్ణారావు చెప్పారు. మంగళవారం ఆయన కొత్త రాష్ట్రం సవాళ్లపై ‘ఈనాడు-ఈటీవీ’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు...

ఆంధ్రప్రదేశ్‌ తొలి ప్రధాన కార్యదర్శిగా మీ ప్రాధాన్యతలేంటి?
ప్రథమ ప్రాధాన్యం అభివృద్ధే. ఆదాయ వనరులు సమీకరించుకోవటం అతి పెద్ద సవాలు. హైదరాబాద్‌ అభివృద్ధి చెందడానికి 50, 60 ఏళ్లు పట్టింది. ప్రభుత్వాలు అనుసరించిన విధానాలతో ఆదాయ వనరులన్నీ అక్కడే కేంద్రీకృతమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌కు తక్షణం ఆదాయమొచ్చేలా పునాది ఏర్పాటు చేసుకోవాలి. దాని ఫలాలు అందడానికి సమయం పడుతుంది. ఆర్థిక లోటు భర్తీకి కేంద్రం నుంచి సాయం రాబట్టవచ్చు. పెట్టుబడుల్ని ఆకర్షించడం ద్వారానూ ఆర్థిక లోటు భర్తీ చేసుకోవచ్చు. ప్రజల సహాయ సహకారాలతో, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళతాం. అభివృద్ధిని వికేంద్రీకరిస్తాం.

జనాభా ప్రాతిపదికన కాకుండా వినియోగం మేరకు చేసిన విద్యుత్తు పంపిణీతో రాష్ట్రానికి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి?
విద్యుత్తు పంపిణీ చట్టానికి భిన్నంగా జరిగి ఉంటే, రావాల్సిన కేటాయింపుల కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఘర్షణలకు తావు లేకుండా రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడుకునేందుకు న్యాయపరమైన మార్గాల్లో ముందుకు వెళతాం.

ఆదాయం పెంచుకునే అవకాశాలు ఎలాగున్నాయి?
వీలైనన్ని ఎక్కువ ఓడరేవుల్ని అభివృద్ధి చేసుకోవచ్చు. అనుబంధంగా వస్తూత్పత్తి కేంద్రాల్ని ఏర్పాటు చేసుకుంటే చైనా తరహాలో అభివృద్ధి చెందవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో వస్తూత్పత్తికి మంచి అవకాశాలున్నాయి. అనంతపురం జిల్లా బెంగళూరుకు 40-50 కి.మీ. దూరంలోనే ఉంది. అక్కడ సాఫ్ట్‌వేర్‌ పార్కుల ఏర్పాటుకు అవసరమైన రహదారులు, విద్యుత్తు వంటి మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలి. పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల వాతావరణాన్ని కల్పించాలి.

రుణ మాఫీ అంచనా మొత్తం ఎంత? దీనిని ఎలా అమలుచేస్తారు?
అసాధ్యమన్నది లేదు. రాజకీయ నిబద్ధత ఉంటే ఏ హామీ అయినా అమలుచేయవచ్చు.

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు?
దేన్నైనా సామరస్యంగా పరిష్కరించుకోవచ్చు. దీనికి కేంద్రం ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీని ద్వారా మన న్యాయమైన ప్రయోజనాల్ని పరిరక్షించేందుకు ప్రయత్నం చేస్తా.

అభివృద్ధి వికేంద్రీకరణ ఉంటుందా?
ఉంటుంది. రాయలసీమలో తుంపర, బిందు సేద్యంతో పండ్లు, కూరగాయలు పండించేలా రైతాంగాన్ని ప్రోత్సహిస్తాం. ఖనిజ సంపద ఆధారంగా వస్తూత్పత్తి కేంద్రాల్ని ఏర్పాటు చేయొచ్చు.

ప్రజల తోడ్పాటును ఎంతమేరకు పొందగలరు?
‘మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం’ అన్న బలమైన సెంటిమెంట్‌ ప్రజల్లో, ఉద్యోగుల్లో ఉంది. దీన్ని సానుకూలంగా మలుచుకుని మంచి ఫలితాలు సాధిస్తాం. రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న కోణంలో ఉద్యోగులు ఆలోచిస్తే మేలు.

మొదటి ఏడాది ప్రాధాన్య అంశాలు?
వస్తూత్పత్తి రంగంపై దృష్టి సారిస్తున్నాం. కొన్ని ప్రధాన కంపెనీలను తీసుకొచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తాం. ఓడరేవుల నిర్మాణం పూర్తయి కార్యకలాపాలు ప్రారంభించాక స్పష్టమైన మార్పు కన్పిస్తుంది. వస్తూత్పత్తి కేంద్రాల ఏర్పాటు, రాయలసీమలో ఖనిజ ఆధార పరిశ్రమలు, బెంగళూరు అనుసంధానంగా అనంతపురం ఐటీ హబ్‌ రూపుదిద్దుకుంటే అభివృద్ధి పథంలో ముందుకు పోవచ్చు.

రాజధాని భూసేకరణ సమస్యను ఎలా అధిగమిస్తారు?
వీలైనంత వరకు ప్రభుత్వ భూముల్ని తీసుకుంటాం. ప్రైవేటు భూములను ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) పద్ధతిలో కూడా తీసుకునేందుకు ప్రయత్నిస్తాం.

రుణమాఫీ భారం తోడైతే ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం కొత్త రుణాలు తీసుకోలేని పరిస్థితి ఉంటుంది కదా?
అసాధారణ పరిస్థితుల్లో వెసులుబాటు లభిస్తుంది. 2008-09లో నాటి రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎం చట్టంలో వెసులుబాటు కావాలని అడిగితే కేంద్రం అంగీకరించింది. విభజన నేపథ్యంలో ఇప్పుడు అసాధారణ పరిస్థితే ఉంది కనుక వెసులుబాట్లు లభిస్తాయి.

నేతల కుంభకోణాలతో ఐఏఎస్‌లు జైలుకు వెళ్లారు. అధికార వ్యవస్థలో నిర్ణయాలు తీసుకొనే చొరవను ఎలా పునరుద్ధరిస్తారు?
అధికారుల్లో విశ్వాసం కల్గించాల్సిన అవసరముంది. నిబంధనల అమలులో రాష్ట్ర, ప్రజల ప్రయోజనాల కోణంలో తీసుకున్న ఏ నిర్ణయానికైనా నా(ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి) నుంచి, ప్రభుత్వం నుంచి అధికారులకు పూర్తి మద్దతు ఉంటుంది. నిర్ణయాల్లో దుర్భుద్ధి ఉండరాదు.

పెట్టుబడులకు అనుకూల వ్యవస్థను ఎలా తీసుకువస్తారు?
ప్రతి పనికి సరైన వ్యక్తిని ఎంపిక చేయడం. తగిన స్వేచ్ఛ ఇవ్వడం. చేసే పనికి జవాబుదారీతనం కల్పించడం... ఈ రూపంలో సాధిస్తాం.

పదుగురి కోసం ఆరుగురం!

కాలేజీ స్నేహితులకో వాట్స్‌యాప్‌ గ్రూప్‌ చిన్నప్పటి మిత్రులకో ఫేస్‌బుక్‌ గ్రూప్‌ బంధువులందరినీ కలిపేందుకు గూగుల్‌ ప్లస్‌.. ఇలా నేటి సామాజిక మాధ్యమాలని మస్తుగా వాడుకుంటోంది...

అనుష్కలా పేరు తెచ్చుకుంటా!

ోడలింగ్‌లో రాణిస్తూ... వ్యాపార ప్రకటనల్లో మెరుస్తూ సినిమా పరిశ్రమ దృష్టినీ ఆకర్షిస్తుంటారు కొందరు భామలు. అలా కథానాయికలుగా అవకాశాల్ని అందుకొన్నవాళ్లు చాలా...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net