Thu, February 11, 2016

Type in English and Give Space to Convert to Telugu

'హైదరాబాద్‌కు యాపిల్‌''కారెక్కిన ఎర్రబెల్లి''మేయర్‌ బొంతు రామ్మోహన్‌!''హనుమంతప్ప పరిస్థితి మరింత విషమం''భాగ్యనగరం తరహాలో ఖేడ్‌ అభివృద్ధి''మహా జాతరకు శ్రీకారం''ఓటుకు నోటు కేసులో మరో తెదేపా ఎమ్మెల్యే అరెస్టు?''ప్రయాణికులపై మళ్లీ వడ్డింపు?''గవర్నర్లు రాష్ట్రాలకు ఉత్ప్రేరకాలు''మహానగర అభివృద్ధికి 100 రోజుల ప్రణాళిక!'

రౌడీ పాలన, రాబందుల రాజ్యం వద్దే వద్దు
జగన్‌ వస్తే పెట్టుబడులు రావు.. ఉద్యోగాలూ రావు
ఉప్పులూరి మురళీకృష్ణ
విశాఖపట్నం నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి
‘‘కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్‌ ముందు ఓ సవాలుంది... ఓ అవకాశమూ ఉంది. పునాది నుంచి నిర్మించాల్సి రావడం సవాలైతే... కొత్తగా అభివృద్ధి జరిగే చోట ఎన్నో అవకాశాలు వస్తాయి. ఆ అవకాశాలను ఉపయోగించుకుని సీమాంధ్రను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోవచ్చు. నరేంద్రమోడీదీ నాదీ ఒకటే ఆలోచన! ఇద్దరం కలిసి నాలుగేళ్లలోనే నవ్యాంధ్రను బ్రహ్మాండమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం’’ అని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు భరోసా ఇస్తున్నారు! ఉత్తరాంధ్ర ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన ఈనాడుకిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ...
చంద్రబాబుది, నాది అభివృద్ధి జట్టని భాజపా ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ అంటున్నారు. ఒక అభివృద్ధి ప్రణాళిక కూడా ఉందన్నారు. మీ ఇద్దరూ కలిసి ఇప్పటికే ఏమైనా చర్చించుకున్నారా?
మా ఇద్దరి ఆలోచనా ధోరణి ఒక్కటే. ఇప్పటికే పలుమార్లు అభివృద్ధి ప్రణాళికపై మాట్లాడుకున్నాం. గతంలో ఒక సదస్సులో కలిసినప్పుడు, తెలంగాణలో ప్రచారానికి వచ్చినప్పుడు, ఆంధ్రప్రదేశ్‌లో పర్యటనకు వచ్చినప్పుడు మాట్లాడుకున్నాం. విమానంలో, హెలికాప్టర్‌లో చర్చించుకున్నాం. ఆంధ్రా రాజధానిని హార్డ్‌వేర్‌ రాజధాని చేయాలనుకున్నాం. మదనపల్లిలో టమాటో ప్రాసెసింగ్‌, గుంటూరులో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలు, విజయవాడలో ఆటోమొబైల్‌ పరిశ్రమలు, ఉత్తరాంధ్రలో తీరప్రాంతాన్ని వెలుగులీనేలా చేయడం వంటివి చాలా ఉన్నాయ్‌. ప్రతి జిల్లాలో మేం కేవలం అభివృద్ధి చేయడం మాత్రమే కాదు. ఆ అభివృద్ధి కోసం వినూత్న ఆలోచనలు చేస్తాం. ఆయనో సాంకేతిక పరిజ్ఞాని! నేనూ అంతే! సుపరిపాలన, సమర్థ´పాలననిస్తాం. ఇద్దరం కలిసి ముందుకెళ్తాం. ఒక భావి భారత ప్రధానమంత్రి, ఒక అనుభవమున్న నాయకుడు కలిశాక ఇక అభివృద్ధికి తిరుగుండదనేది నా అభిప్రాయం.

రైతు రుణమాఫీ సాధ్యం కాదని వైకాపా అధినేత జగన్‌మోహన్‌రెడ్డి అంటున్నారు. మీరెలా సాధ్యం చేస్తారు?
వాళ్ల నాయన కూడా 2008లో ఇలాగే మాట్లాడారు. రైతు రుణమాఫీ వద్దన్నారు. రైతు రుణమాఫీతో రైతుల్లో బద్దకం వస్తుందన్నారు. తర్వాత మా పోరాటంతో కేంద్రం రుణమాఫీ చేస్తే... అది తమ గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి కూడా రుణమాఫీ వద్దు, సాధ్యం కాదంటున్నారు. వాళ్లదెప్పుడూ అదే తీరు. రైతు రుణమాఫీ సాధ్యమా? అసాధ్యమా? అన్నది నాకు తెలుసు. ఎప్పుడూ పాలనలో లేని అతనికేం తెలుసు. తప్పుడు లెక్కలు చేసి డబ్బు వసూలు చేయడం తప్ప జగన్‌కు తెలిసిందేమీ లేదు. ఉన్న పరిస్థితుల్ని నేను అధిగమిస్తా. రుణమాఫీ చేస్తా! చేసి తీరతా! నేను అధికారంలో ఉండగా ఒకసారి భారీ తుపానులతో ధాన్యం మొత్తం కల్లాల్లోనే తడిసి ముద్దైనా... ఎఫ్‌సీఐపై ఒత్తిడి తెచ్చి ఆ తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయించాం. ఆ తర్వాత ఎన్నడూ అది జరగలేదు. కేంద్ర ప్రభుత్వం కూడా మన మద్దతుతోనే ఉండడం వల్ల, మనకున్న పట్టుదల వల్ల అది సాధ్యమైంది!

గిట్టుబాటు ధర పెంచకుండా వ్యవసాయాన్ని లాభసాటి చేయడం సాధ్యమేనా?
గిట్టుబాటు ధరలు తప్పకుండా పెంచాల్సిందే. అందుకే నరేంద్ర మోడీ కూడా పెట్టుబడిపై 150 శాతం లాభం ఉండేలా మద్దతు ధరలు పెంచి గిట్టుబాటు కల్పిస్తామన్నారు. దాంతో పాటే వ్యవసాయ ఖర్చులూ తగ్గిస్తాం. దీని కోసమే ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనువర్తింప చేస్తామని ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చాం. వ్యవసాయంలో సాంకేతికతను జోడిస్తాం. ముడి పంటకు మరింత విలువను అద్దే పరిశ్రమలను ఇక్కడే స్థాపిస్తాం.

శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకున్న తీరప్రాంతాన్ని బంగారు తునకలా మారుస్తామంటున్నారు. దీనిపై ఏమైనా అధ్యయనం చేశారా?
దీనిపై మాకు చాలా స్పష్టత ఉంది. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు మొత్తం 12-13 నౌకాశ్రయాలుంటాయి. తీరప్రాంతంలోని 9 జిల్లాలకూ నౌకాశ్రయాలుంటాయి. ఈ జిల్లాలను భవిష్యత్తులో కళ్లు వెలుగులీనే స్థాయిలో అభివృద్ధి చేస్తాం. నౌకాశ్రయాలపై ఆధారపడే అద్భుతమైన ఆర్థిక వ్యవస్థను రూపొందిస్తాం! ప్రతి నౌకాశ్రయం దగ్గర మెగా ఫుడ్‌ పార్కులు, ఆగ్రో ప్రాసెసింగ్‌ జోన్‌లు పెడతాం. అక్కడి నుంచే ఎగుమతులు జరుగుతాయి. దిగుమతులూ వస్తాయి. ఒక ఉదాహరణ చెప్తాను. ఒక్కోసారి నౌకాశ్రయాల ద్వారా కొన్ని ముడి పదార్థాలను దిగుమతి చేసుకుంటూ ఉంటాం. ఆ ముడిపదార్థాలతో అంతిమ వస్తువులు తయారు చేసే పరిశ్రమలను ఆ నౌకాశ్రయ పరిసరాల్లోనే ఏర్పాటు చేస్తాం. వస్తువులు ఉత్పత్తై మళ్లీ అదే నౌకాశ్రయం నుంచి ఎగుమతి అవుతాయి! ఇవన్నీ చేయగలిగే సత్తా, అనుభవం, ప్రణాళికలు నా దగ్గరున్నాయి. ఒక్కటే మాట చెప్తున్నా... గుజరాత్‌ అరేబియా సముద్రం ఒడ్డున పశ్చిమ తీరంలో ఉంది. పశ్చిమ తీరంలో ఎగుమతులు, దిగుమతులు, పరిశ్రమలు, ఉద్యోగాలు, ఉపాధి, మత్స్య పరిశ్రమకు గుజరాత్‌ రాజులా మారింది. మన రాష్ట్రం తూర్పు తీరాన బంగాళాఖాతం ఒడ్డున ఉంది. తూర్పు తీరంలో మనకున్నంత తీరప్రాంతం మరే రాష్ట్రానికీ లేదు. ఆగ్నేయాసియా దేశాలైన సింగపూర్‌, మలేసియా తదితర దేశాలకు ఇక్కడి నుంచే ఎగుమతులు, దిగుమతులు జరగాలి! తూర్పుతీర ప్రాంతానికి రేపు ఆంధ్రప్రదేశ్‌ను రారాజులా తయారు చేసుకుందాం!

హైదరాబాద్‌లాంటి ఉద్యోగ, ఉపాధి కల్పన నగరాన్ని పోగొట్టుకున్నామనే భావన యువతలో ఉంది. మరి... మళ్లీ ఉపాధి, ఉద్యోగాల కల్పనకూ, యువత అభివృద్ధికీ మీరేం చేస్తారు?
నా దృష్టిలో యువతకు ఉపాధి ప్రధానమైన అంశం. కుటుంబంలో ఒక చదువుకున్న వ్యక్తి ఉంటే లక్షలు సంపాదిస్తారు. అదే కుటుంబంలోని చదువుకోని వ్యక్తి కనీస వేతనం మాత్రమే సంపాదిస్తున్నాడు! ఈ పరిస్థితిని 15 ఏళ్ల క్రితమే వూహించాను! అందుకే పెద్ద సంఖ్యలో ఇంజనీరింగ్‌, వైద్య, ఎంబీఏ, ఎంసీఏ కళాశాలలు నెలకొల్పేలా చేశాను. విజ్ఞాన ఆధారిత సమాజాన్ని రూపొందించే ప్రయత్నం చేశాను. సాఫ్ట్‌వేర్‌ రంగాన్ని రాష్ట్రానికి తీసుకొచ్చి లక్షలమంది రైతు బిడ్డల్ని ఐటీ నిపుణులుగా చేశాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కూ అదే చేస్తాను. ఇక్కడ మరిన్ని అవకాశాలు సృష్టిస్తాను. ఐటీ, హార్డ్‌వేర్‌ రంగాలతో పాటు నౌకాశ్రయాల్లో ఉద్యోగాలు కల్పిస్తాం. ప్రపంచమంతా ఒకటే సూత్రం. ఎవరో ఒకరు, ఎక్కడో ఒక చోట ఉత్పత్తి చేయాలి. మరొకరు దాన్ని వినియోగించాలి. ఇదో సైకిల్‌. ఈ సైకిల్‌ను అభివృద్ధి చేస్తాం. ఏటా రెండు లక్షల మంది యువత ఉద్యోగ మార్కెట్‌లోకి వస్తున్నారు. అందరికీ నాణ్యమైన ఉద్యోగాలు, ఉపాధి కల్పించే శక్తి తెలుగుదేశం పార్టీకే ఉంది. తెదేపా హయాంలో 667 ఎకరాలు ఐటీ కంపెనీలకు కేటాయించి...1,13,000 ఉద్యోగాలు కల్పించాం. విద్య, ఆరోగ్య, పోలీసు శాఖల్లో 3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాం. మిగిలిన విభాగాల్లోనూ, ప్రైవేటు రంగంలోనూ లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేశాం. 1.64 లక్షల ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేశాం.

హైదరాబాద్‌ను కేంద్రంగా అభివృద్ధి చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాజధాని విషయంలో ఎలాంటి పద్ధతి అనుసరిస్తారు?
హైదరాబాద్‌ అప్పటికే ఉన్న నగరం. ఒక రాష్ట్రానికి రాజధానిగా దానికి పేరు ఉండేది. కృషి, పట్టుదల కూడా తోడవడంతో అక్కడ అభివృద్ధి జరిగింది. అయితే ఒక్కోసారి ఒక్కో నమూనా! ఇప్పుడు కొత్త నమూనా తీసుకుంటాం. నూతన రాజధానిని ఢిల్లీ అసూయపడేలా నిర్మిస్తామని మోడీ కూడా అన్నారు. అన్ని రంగాల్లోనూ దేశంలోని ఇతర రాజధానులను తలదన్నేలా మన రాజధానిని అభివృద్ధి చేస్తాం. దీంతో పాటు ప్రతి జిల్లాలోనూ హైదరాబాద్‌లాంటి విజ్ఞాన, ఉపాధి నగరాన్ని ఒకదాన్ని అభివృద్ధి చేస్తాం. అది అప్పటికే ఉన్నదాన్ని అభివృద్ధి చేయడం కావొచ్చు. కొత్తది నిర్మించడమూ కావొచ్చు. ప్రతి జిల్లాలో ఒక హైటెక్‌ సిటీని నిర్మిస్తాం.

ఉద్యోగస్తుల పదవీ విరమణ వయసు 60 ఏళ్లకు పెంచుతామన్నారు. వారి పట్ల మీ వైఖరి ఎలా ఉంటుంది? అభివృద్ధిలో వారినెలా భాగస్వాములను చేస్తారు?
పరిపాలన, ప్రణాళికల్లో నాకు శక్తి ఉంది... నాకో విజన్‌ ఉంది. ప్రపంచ దేశాలెలా ముందుకుసాగుతున్నాయి.... వాటి నుంచి మనం నేర్చుకోవాల్సిందేముందో చూసి ముందుకు వెళ్తాం. మన పరిస్థితులకు అనుగుణమైన వాటినే పరిగణనలోకి తీసుకుంటాం! ఉద్యోగుల విషయంలో అప్పట్లో కూడా కాలం కంటే కొంత ముందెళ్లామే తప్ప మరోటి కాదు. వాళ్లకు మంచి పీఆర్‌సీ ఇస్తా! ఉద్యోగులు సమైక్యాంధ్ర కోసం, సీమాంధ్ర అభివృద్ధి కోసం పోరాడారు. ఇప్పుడు పునాదుల నుంచీ నిర్మించాలి. వారి సేవలను అభివృద్ధిలో ఉపయోగించుకుంటాం. వారితో కలిసి అభివృద్ధి చేస్తాం.

ఏ ప్రభుత్వానికైనా అభివృద్ధి-సంక్షేమం రెండు కళ్లు. మీ దృష్టిలో ప్రధానమైన సంక్షేమం కార్యక్రమాలేంటి?
సమాజంలో రెండు రకాల అవసరాలు! ఒకటి త్వరితంగా సాయం అందడం. రెండోది ఆ సాయాన్ని ఎప్పటికీ అందేలా చేయడం. ఈ రెంటికీ ఒకటే మార్గం. తొలుత సంపద సృష్టించాలి. అధికారంలో ఉన్నప్పుడు నేనెందుకు సంపద సృష్టించాను? ఐదుశాతం ప్రజల కోసం కాదు కదా? 95 శాతం ప్రజల కోసం! ఆ సంపద, ఆ లబ్ధిని సామాన్యుడికి అందజేయాలి! ఇప్పటికీ ఎస్సీ, ఎస్టీలకు సంక్షేమ ఫలాలు అందలేదు. అందుకే ప్రతి ఒక్కరికీ ఇళ్లు కట్టిస్తాం. ఫించన్లు పెంచుతాం. బీసీలకు రూ.10 వేల కోట్లతో ఉపప్రణాళిక పెడతాం. అభివృద్ధిలో అందరినీ భాగస్వాములను చేస్తాం. సంపద సృష్టిస్తాం. దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. సంక్షేమం చేస్తాం. దానివల్ల ప్రజల ఆదాయాలు మెరుగవుతాయి. మళ్లీ సంపద సృష్టి... అభివృద్ధి ...సంక్షేమం... ఇలా చక్రం సాగుతుంది.

రాయలసీమ జిల్లాల సాగునీటి ప్రాజెక్టుల్లో ఎక్కువ మిగులు జలాల మీదే ఆధారపడ్డాయి. రాష్ట్ర విభజనతో ఆ ప్రాంతానికి నీటికొరత వస్తుందనే ఆందోళన ఉంది. ఎలా ఎదుర్కొంటారు?
దీనికి ఒకటే మార్గం. గంగా కావేరి అనుసంధానం. ఆ రోజు ప్రధానిగా వాజ్‌పేయి ఉన్నప్పుడు నదుల అనుసంధానం గురించి చెప్పా. రోడ్లు అనుసంధానం చేసినట్లుగానే నదులు అనుసంధానం చేయాలన్నాను. అప్పుడే మహారాష్ట్రకు చెందిన సురేష్‌ ప్రభు ఆధ్వర్యలో టాస్క్‌ఫోర్స్‌ వేశాం. నేపాల్‌ నుంచి వస్తున్న బ్రహ్మపుత్ర నదితో కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ఆ తర్వాత పదేళ్లు కాంగ్రెస్‌ దాన్ని పట్టించుకోలేదు. నదుల అనుసంధానమే అన్నింటికీ మార్గం. దానివల్ల రాయలసీమకు పుష్కలంగా నీళ్లు వస్తాయి. పోలవరం పూర్తి చేస్తాం. మేజర్‌ ఇరిగేషన్‌, మైనర్‌ ఇరిగేషన్‌లను సమీకృతం చేస్తాం. ప్రతి చుక్క సద్వినియోగం చేస్తాం. కరవు సీమకు అండగా ఉంటాం. తిరుపతి, అనంతపురం, హిందూపురం, కర్నూలు, కడపలను పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలున్నాయి.

అధికారంలోకి వస్తే ప్రధానంగా ఏ అంశంపై దృష్టిపెడతారు?
ఈ రోజు మైనస్‌ నుంచి ప్రయాణం ప్రారంభించాం. అగ్రస్థానానికి ఎలా వెళ్లాలన్నదానికి దూరదృష్టి కావాలి. వనరులు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ సమకూర్చుకోవాలి. అన్నింటినీ ఒక ప్రక్రియలో పెట్టాలి. నేనే విజన్‌ 2020 రూపొందించా. నాలుగేళ్లలో అద్భుతమైన రాజధాని నిర్మాణం, ఎక్కడికక్కడ పరిశ్రమలు, ఉద్యోగాల కల్పన ఒక వైపు కాగా... మరోవైపు బీసీ, ఎస్సీ, మైనార్టీ, పేదల సంక్షేమం, రైతు రుణమాఫీ ఇవన్నీ ఉంటాయి.

కేసీఆర్‌, జగన్‌లు ఇద్దరూ కుమ్మక్కయ్యారని, కేసీఆర్‌ను జగన్‌ పల్లెత్తు మాట అనకపోవడానికి అదే కారణమంటున్నారు?
విభజన ప్రకటన ప్రారంభించినప్పుడే చెప్పానీమాట! సోనియాకు వీళ్లు దాసోహమయ్యారనీ... ఇద్దరితో కలిసి ఆమె నాటకాలాడుతున్నారని! కాదని బుకాయించారు. మళ్లీ ఇప్పుడు... రాహుల్‌ను ప్రధాని చేసేందుకు కేసీఆర్‌ మద్దతిస్తామంటున్నారు. జగన్‌ కూడా ఎన్నికల తర్వాత అదే చేస్తారు. వారంతా కలిసి ఆడిన నాటకమే జరిగిన సంఘటనలన్నీ!

కొత్త రాష్ట్రంలోనే ప్రమాణ స్వీకారం చేస్తామంటున్నారు? అధికారంలోకి రాగానే పాలన ఇక్కడి నుంచేనా?
ఇక్కడే (సీమాంధ్రలోనే) ప్రమాణ స్వీకారం చేస్తాను. అప్పటి నుంచి ఇక్కడే పనిచేస్తా. దానర్థం వీలైనంత తొందరగా ఇక్కడి నుంచే పాలన ఉంటందని! దీనికి రెండు కారణాలున్నాయి. ఒకటి కేసీఆర్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఉండే తెలుగువారికి మోడీ, నేనూ రక్షణగా ఉంటాం. బెంగళూరు, ఢిల్లీ, చెన్నై ఎక్కడ చూసినా తెలుగువారున్నారు. అలాగే హైదరాబాద్‌లో అత్యంత సురక్షితంగా ఉంటారు. అసలు పదేళ్లు ఉమ్మడి రాజధాని అనడమూ దుర్బుద్దే. అదీ రాజ్యాంగానికి విరుద్దంగా చేశారు. దీనిపైనా ఢిల్లీ స్థాయిలో చర్చ జరగాలి. ఇక రెండోది ఆంధ్రప్రదేశ్‌ తొందరగా అభివృద్ధి చెందాలంటే ఇక్కడి నుంచే పాలన ఉండాలి. రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంటే ఆంధ్రుల ప్రతిష్ఠ పెరుగుతుంది. అందరికీ ఒక గర్వ కారణంలా రాజధాని ఉండాలంటే ఇక్కడి నుంచే పాలన మొదలవ్వాలి. అవసరమైతే ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్‌ సామాగ్రితో ముందు తాత్కాలిక భవనాలు కట్టి పాలన మొదలెడతాం. నాలుగేళ్లలో అద్భుతమైన రాజధాని నిర్మిస్తాం. ఎక్కడ ప్రమాణం అనేది ఎన్నికలయ్యాక చెప్తా.

బీసీలకు పెద్ద పీట వేస్తామన్నారు. కానీ రెండు రాష్ట్రాల్లో కలిపి 100 స్థానాలు ఇవ్వలేదు కదా?
బీసీలకు అత్యధిక స్థానాలు తెలుగుదేశం పార్టీయే ఇచ్చింది. రాష్ట్ర విభజన, పొత్తుల వల్ల కొన్ని ఇబ్బందులొచ్చాయి. అయినా సాధ్యమైన మేర ఇచ్చాం. తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించాం. జాతీయ స్థాయిలో బీసీ ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ కాబోతున్నారు. బీసీలకు మేమే అగ్రతాంబూలం ఇచ్చాం. తెరాస, వైకాపాలు ఆ పని చేయలేదు. ఇప్పుడే కాదు... ఆది నుంచీ బీసీలకు అత్యంత ప్రాధాన్యాన్నిచ్చింది తెదేపానే. కేంద్రంలో ఒకే ఒక కేబినెట్‌ పదవి తీసుకుంటే అది బీసీ నాయకుడు ఎర్రన్నాయుడికి ఇచ్చాం. బీసీ నాయకత్వాన్ని తొలి నుంచీ ప్రోత్సహించింది తెదేపానే! తెలుగుదేశం అంటేనే బీసీల పార్టీ.

పార్టీ కోసం ఎన్నాళ్లగానో పని చేసిన వాళ్లకు కాకుండా...కాంగ్రెస్‌ నుంచి వచ్చిన వాళ్లకు టికెట్లిచ్చారనే విమర్శలపై...?
ఇదో చారిత్రక అవసరం. కాంగ్రెస్‌లో ఉండి విభజనకు వ్యతిరేకంగా పోరాడిన కొంతమందిని తీసుకున్నాం. అవసరాన్ని బట్టి కొన్ని చోట్ల సీట్లిచ్చాం! ఇక పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్లు నా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ! టికెట్‌రాని అలాంటి వారందరికీ అధికారంలోకి వచ్చాక అవకాశాలిస్తాం. అభివృద్ధిలో వారినీ భాగస్వాముల్ని చేస్తాం.

కానీ మీరు చెబుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేయడానికి నిధులెక్కడినుంచి వస్తాయి?
ఈ సంక్షోభాలు నాకు కొత్త కాదు. 1995లో నేను అధికారంలోకి వచ్చేనాటికి ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఉండేది. ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి! కానీ తొమ్మిదేళ్లలో ఆర్థిక వ్యవస్థకు జవజీవాలు తీసుకొచ్చాను. అప్పుడు చేసిన కష్టం అంతటితో ఆగదని బడ్జెట్‌ లక్ష కోట్లకు దాటుతుందని నాడే చెప్పా! ఎవరూ నమ్మలేదు. కానీ ఇప్పుడది దానికి మించి పోయింది. మళ్లీ సంపద సృష్టిస్తాం. ఈ సవాల్‌ను మా సామర్థ్యంతో అధిగమిస్తాం.

అధికారంలోకి వస్తే రాజన్న రాజ్యం తెస్తానని వైకాపా చెప్తోంది?
వాళ్లు అధికారంలోకి వస్తే వచ్చేది రాబందుల రాజ్యమే. వైఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు రౌడీలు, గూండాలు ఎంతగా చెలరేగిపోయారో పత్రికలు, టీవీ ఛానళ్లలో.. మీరే చెప్పారుగా! అంతే కాదు... నేను సృష్టించిన సంపద పేదోడికి చేరకుండా చేసింది ఆ పాలనే! బడ్జెట్‌ పెంచి ఆదాయం పెంచి అప్పజెబితే దాన్ని మొత్తం లూటీ చేశారు. పైగా తెదేపా హయాంలో కేవలం రూ.58,770 కోట్లు ఉన్న అప్పులను ఇప్పుడు రూ.1.75 లక్షల కోట్లకు తీసుకెళ్లారు. నేను సృష్టించిన సంపదా తినేశారు. ప్రజలపై అప్పుల భారమూ మిగిల్చారు. మళ్లీ వస్తే మిగిలేది అరాచకమే. నడిచేది రౌడీల పాలనే.

జగన్‌ తనకు విశ్వసనీయత ఉందని పదే పదే చెప్తున్నారు?
సకుటుంబ, సపరివార బంధుమిత్ర సమేతంగా దోపిడీ చేయడమేనా ఆయన విశ్వసనీయత? అంతర్జాతీయ మాఫియా శక్తులతో కలవడమేనా విశ్వసనీయతా? పరిశ్రమలు వస్తేరానీ... పోతే పోనీ! కానీ నా వాటా నాకు రావాల్సిందే అనడమేనా విశ్వసనీయత?... విశ్వసనీయత అంటే ప్రతి పైసాకు లెక్కచూపడం. ప్రజల డబ్బుకు ధర్మకర్తలా ఉండడం. అంతేకానీ అధర్మకర్తలా, అవినీతి కర్తలా ఉండడం కాదు. మహాభారత కాలం నుంచి అధర్మంగా వ్యవహరించిన వాళ్లెవ్వరూ చరిత్రలో నిలవలేదు. ఇప్పుడూ అవినీతి డబ్బును తట్టుకుని, అబద్దాల విశ్వసనీయతను ఛేదించి తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగరేయబోతోంది.

భాజపాతో పొత్తు వల్ల మైనార్టీలు ఓట్లు వేయరనే భావన ఉందిగా?
ఇది కేవలం ప్రచారమే. మైనార్టీలకు పూర్తి రక్షణ ఉన్నది తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడే. సీమాంధ్రలో ఒక ముస్లింను ఎంపీగా నిలబెట్టి గెలిపించిన తొలి పార్టీ తెలుగుదేశమే. గుంటూరునుంచి లాల్‌జాన్‌ బాషాను గెలిపించాం. సీమాంధ్రలో ఇద్దరు ముస్లింలకు రాజ్యసభ అవకాశం ఇచ్చింది కూడా తెదేపానే. సైఫుద్దీన్‌, లాల్‌జాన్‌ బాషాలకు రాజ్యసభ అవకాశం కల్పించాం. ఒక రకంగా చెప్పాలంటే ఎన్డీయేతో తెదేపా కలిసుండడం వల్ల ముస్లింలకు మరింత భద్రత ఉంటుంది. లౌకికవాదాన్ని కాపాడే బాధ్యతను తెదేపా ఎప్పుడూ తీసుకుంటుంది. ఇటీవలే వీహెచ్‌పీ నేత ప్రవీణ్‌ తొగాడియా ఏవో వ్యాఖ్యలు చేస్తే నరేంద్రమోడీ వాటిని తీవ్రంగా ఖండించారు. మేం గతంలో హైదరాబాద్‌లో ఎలాంటి అల్లర్లు లేకుండా చేశాం. మైనార్టీల సంక్షేమం, రక్షణకు మేం అండగా ఉంటాం.
డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అని
మీతో పాటు వైకాపా కూడా హామీ ఇచ్చింది కదా?
సలు డ్వాక్రా సంఘాల సృష్టికర్తనే నేను. మహిళా సాధికారితకు నాంది పలికింది నేను. ఇంట్లో ఉండే మహిళలు ఆఫీసుకు, బ్యాంకులకు వెళ్లేలా చేశా. మా ఇంట్లో నా తల్లి పొగ పొయ్యి దగ్గర పడుతున్న ఇబ్బందులు చూసినవాణ్ని. అందుకే అధికారంలో ఉండగా మహిళలకు 32 లక్షల గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చాం. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఆ కనెక్షన్లు ఇచ్చాం. అసలు తెలుగుదేశం పార్టీ అంటేనే తెలుగింటి ఆడపడుచులు! గతంలో ఎన్టీఆర్‌ అధికారంలోకి రాగానే మహిళలకు ఆస్తిహక్కు కల్పించారు. తర్వాత స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లిచ్చాం. ఆర్టీసీ కండక్టర్లు, ఇతర ఉద్యోగాల్లో మహిళలకు రిజర్వేషన్లిచ్చాం. మరోవైపు పాదయాత్ర చేస్తుండగానే మహిళల కష్టాలు, వడ్డీలపై వడ్డీలతో వారు రుణబంధంలో ఇరుక్కోవడం చూసి డ్వాక్రా రుణమాఫీ ప్రకటించాను. నేనన్న తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో వైకాపా కూడా దీన్నే ప్రకటించింది. నన్ను అనుసరించడం తప్ప వారికి చిత్తశుద్ధి లేదు. ఇంకోవైపు మహిళల రక్షణకు ఒక వ్యవస్థ ఏర్పాటు చేయబోతున్నాం. వారికి ఒక సెల్‌ఫోన్‌ ఇచ్చి, ఒక నంబర్‌ పెడతాం. ఇబ్బందుల్లో ఉన్న మహిళ నిశ్శబ్దంగా ఆ నంబర్‌కు డయల్‌ చేస్తే ఐదు నిమిషాల్లో పోలీసులు అక్కడికి చేరుకుంటారు. జీపీఆర్‌ఎస్‌ సిస్టం ద్వారా ఈ వ్యవస్థ పనిచేసేలా ప్రణాళిక రూపొందించాం.
ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విచ్చలవిడిగా
డబ్బు ఖర్చు పెడుతున్నాయి? ఈ పరిస్థితి అరికట్టేదేలా?
వినీతితో లక్ష కోట్లు సంపాదించిన జగన్‌మోహన్‌రెడ్డి... ఆ సంపాదన కాపాడుకునేందుకు విపరీతంగా ఖర్చు చేస్తున్నారు. అవసరమైతే ఓటుకు రూ.5 వేలు ఇచ్చేందుకు కూడా వెనకాడడం లేదు. అవినీతి సొమ్ము కుప్పలు తెప్పలుగా మూలుగుతుండడంతో కళ్లు మూసుకుని వెదజల్లుతున్నారు. అయితే ఆ సొమ్ము ఎక్కడిది? ఏంటని ప్రజలకు తెలుసు. వాళ్లు తెలివైన వాళ్లు. డబ్బుకు లొంగరు. ఓటేసే సమయంలో తమ భవిష్యత్తు-రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ఓటేస్తారు.
ఒకవేళ వైకాపా చెప్తున్నట్లు జగన్‌ అధికారంలోకి వస్తే
పరిస్థితి ఎలా ఉంటుందంటారు?
ది కల. ఆ పార్టీ కూడా డీలా పడిపోయింది. తెదేపా విజయం ఖాయం. అయితే మరింత ఎక్కువ లోక్‌సభ స్థానాలు, శాసనసభ స్థానాలు వస్తే మరింత వేగంగా అభివృద్ధి చేసేందుకు వీలవుతుంది. అందుకే ఏకపక్ష ఎన్నికలు జరగాలని పిలుపునిస్తున్నా. వైకాపా అధికారంలోకి వస్తే వికృత పాలనే. ఈ విషయం ప్రజలకు తెలుసు. అరాచకాలు, అవినీతి తప్ప అభివృద్ధి ఉండదనీ తెలుసు. అందుకే ప్రజలు ఆ అవకాశం ఇవ్వకూడదనే స్పష్టతకు ఎప్పుడో వచ్చేశారు. తెలుగుదేశం పార్టీ సైకిల్‌ దూసుకెళ్లనుంది.

ఏ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రానికైనా విదేశీ పెట్టుబడులు అవసరం! సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌... ఏ రంగమైన విదేశీ పెట్టుబడులు కావాల్సిందే. జపాన్‌, థాయిలాండ్‌, సింగపూర్‌, అమెరికా...తదితర దేశాల నుంచి పెట్టుబడులు వస్తుంటాయి. చాలా దేశాల్లోని పారిశ్రామికవేత్తలు... పెట్టుబడులు పెట్టేముందు అక్కడి నేతను, చరిత్రను చూస్తారు. సరిగ్గా లేకుంటే పెట్టుబడులు రావు. కంపెనీలు రావు... ఉద్యోగాలు రావు! ఇప్పటికే జగన్‌ మనీలాండరింగ్‌ కేసుల్లో ఉన్నాడు. ఇవన్నీ వాళ్ళు గమనిస్తారు!

నీళ్ల సీసాలపై మీ పేర్లు!

‘మంచి వ్యాపారవేత్త కావాలంటే ఎంబీఏలే చదవాల్సిన అవసరంలేదు. సామాజిక చొరవ ఉంటే చాలు! చక్కటి ఆలోచనతో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా ఈ ఏడాదిన్నరలో రెండు...

వెండితెరపై కోట్ల ‘కాంతి’

సినిమా అనేది కచ్చితంగా వ్యాపారమే. ఏ కథానాయకుడికి ఎంత మార్కెట్‌ ఉంది? అనే లెక్కలు ఎప్పుడూ అవసరమే. పెట్టిన ప్రతీపైసాకీ గ్యారెంటీ ఉందన్న నమ్మకం కుదిరిన...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net