Fri, February 12, 2016

Type in English and Give Space to Convert to Telugu

'వైజ్ఞానిక మైలురాయి''విశ్రమించిన వీరుడు''మేయర్‌ ఎన్నిక ఏకగ్రీవం''కారెక్కిన మరో తెదేపా ఎమ్మెల్యే''‘బేర్‌’మన్న స్టాక్‌ మార్కెట్లు''‘ఆధార్‌’ ఇక తప్పనిసరి కాదు''కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయం''ఎంపీల జీతభత్యాలు త్వరలో రెట్టింపు!''మార్చి మొదటి వారంలో ‘పుర’ ఎన్నికలు''మేడారం జాతరను జాతీయ పండుగగా ప్రకటించండి'
బాలశౌర్యం!
కృష్ణపట్నంలో మాజీ ఎంపీ బాలశౌరి
థర్మల్‌ ప్లాంటుకు కారుచౌకగా భూములు
వై.ఎస్‌. హయాంలో కేటాయింపులు
ప్రతిఫలంగా జగన్‌ సంస్థకు రూ.10 కోట్లు
లబ్ధి కలిగించిన నెల రోజుల్లో పెట్టుబడి
ఈనాడు, హైదరాబాద్‌: వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం నుంచి అక్రమ లబ్ధి పొంది, జగన్‌ సంస్థల్లో పెట్టుబడి పెట్టిన మరో సంస్థ బాగోతం బయటకు వచ్చింది. వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉండగా మాజీ ఎంపీ బాలశౌరికి చెందిన ‘కినెటా పవర్‌’ సంస్థకు, మరో సంస్థకు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో 1848 ఎకరాల భూమిని ఎకరా రూ.2 లక్షల చొప్పున ధరకు కేటాయించారు. ఏడాది తర్వాత 2009 ఫిబ్రవరిలో ఒక్కసారిగా దాన్ని ఎకరాకు రూ.80 వేలుగా మార్చారు. దాంతో ఏపీఐఐసీకి 12 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని స్వయంగా కాగ్‌ తేల్చింది. తనకు కేటాయించిన కృష్ణపట్నం భూముల ధరను తగ్గించిన నెల రోజుల్లోనే ‘కినెటా’ జగన్‌కు చెందిన సాక్షి పత్రికలో రూ.10 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఇది అచ్చమైన నాకిది నీకది (క్విడ్‌ ప్రో కో) వ్యవహారం. వైఎస్‌ కేటాయింపుల తీగలన్నీ లాగి జగన్‌ అవినీతి డొంకంతా కదిలించిన సీబీఐ బాలశౌరి జోలికి కానీ, కినెటా పవర్‌ జోలికి కానీ పోలేదు.

జెట్‌ స్పీడ్‌ యువరాజా
2008లో భారత్‌ అభివృద్ధి అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. ప్రధాని ఇంధన భద్రత గురించి పదే పదే ప్రవచిస్తున్నారు. పారిశ్రామికవేత్తలంతా థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ పెట్టే అవకాశం కోసం పరుగులు తీస్తున్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్నది సొంత ప్రభుత్వమే కనుక ఓ థర్మల్‌ ప్లాంట్‌కు భూములు కేటాయింపజేసుకొని, అనుమతులన్నీ తెచ్చుకుంటే ఇంకేదో సంస్థ భాగస్వామిగా చేరి ప్రాజెక్టు పూర్తి చేస్తుంది. కామధేనువు లాంటి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లో ఉచితంగా వాటాలు, క్రమం తప్పకుండా కోట్లలో ఆదాయం దక్కుతాయి. ఈ ఉద్దేశంతోనే జగన్‌-బాలశౌరిలు కృష్ణపట్నంలో తమకు భూములు కావాలని వైఎస్‌ ప్రభుత్వాన్ని పరుగులెత్తించారు. నిరుపేదల నుంచి అసైన్డ్‌ భూములను సైతం లాక్కునేలా ఏపీఐఐసీ మీద అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి ఒత్తిడి తీసుకొచ్చారు. ఏపీఐఐసీ అన్ని నిబంధనలను తోసిరాజని యుద్ధ ప్రాతిపదికన తాత్కాలికంగా భూములను కేటాయించిన వైనం యువరాజా వారి స్పీడు అందుకోవడానికి కార్పొరేషన్‌ ఎన్ని తంటాలు పడిందో తెలియజేస్తోంది. ప్రతిపాదించిన నెలలోపే కంపెనీలు భూమి కోసం నగదు కూడా కట్టేశాయంటే సచివాలయంలో దస్త్రం ఎంత వేగంగా కదిలిందో అంచనా వేయొచ్చు.

కినెటా కిక్కే వేరు
కాగ్‌ నివేదిక ప్రకారం చూస్తే... నెల్లూరు జిల్లాలోని చిల్లకూరు మండలంలో కృష్ణపట్నం పవర్‌ కార్పొరేషన్‌, కినెటా పవర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కోసం 2370 ఎకరాల ప్రభుత్వ భూమిని అమ్మాలని జిల్లా రెవిన్యూ అధికారులను 2008 జనవరిలో ఏపీఐఐసీ కోరింది. ఫిబ్రవరి 22న నాటి సీఎం రాజశేఖరరెడ్డి స్వయంగా తన క్యాంపు కార్యాలయంలో దీనిపై సమీక్ష జరిపారు. మార్చి 15లోగా భూములను ఏపీఐఐసీకి అందజేయాలని రెవిన్యూ అధికారులను ఆదేశించారు. ఇందులో 1100 ఎకరాలను అసైన్డ్‌ భూమి. వాటికి ఎకరాకు రూ.1.30 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా లెక్కగట్టి మొత్తం రూ.14.30 కోట్లకు గూడూరు సబ్‌ కలెక్టర్‌ ఏపీఐఐసీకి డిమాండ్‌ నోటీసు పంపారు. దానికి వెంటనే స్పందించి ఏపీఐఐసీ ఆ మొత్తాన్ని డిపాజిట్‌ కూడా చేసింది. అమ్మకం ఆదేశాలను పెండింగ్‌లో పెడుతూ, ఈ రెండు సంస్థలకు ఎకరా రూ.2 లక్షలు చొప్పున 1847.98 ఎకరాలను తాత్కాలికంగా కేటాయించారు. కినెటా పవర్‌ మార్చి 31 లోగానే రూ.5 కోట్లను తన వంతుగా ఏపీఐఐసీకి చెల్లించింది. 2009 ఫిబ్రవరిలో 1847.98 ఎకరాలను కంపెనీలకు అమ్మే సమయంలో మరో తిరకాసు జరిగింది. తాత్కాలిక కేటాయింపు సమయంలో ఎకరా రూ.2 లక్షలు చొప్పున చెప్పిన ఏపీఐఐసీ తర్వాత రేటును సవరించి రూ.80 వేల చొప్పున రెండు కంపెనీలకు కేటాయించింది. 1100 ఎకరాలను ఎకరాకు రూ.1.30 లక్షలు చొప్పున పరిహారం ఇచ్చి తీసుకున్న ఏపీఐఐసీ, మిగిలిన ప్రభుత్వ భూమిని ఎకరాకు రూ.80 వేలు చొప్పున కొనుగోలు చేసింది. అన్ని ఛార్జీలూ కలిపి ఎకరాకు రూ.1.90 లక్షలు ఖర్చు పెట్టిన ఏపీఐఐసీ.. రెండు కంపెనీలకు రూ.80 వేలకు కట్టబెట్టడం ద్వారా రూ.12.10 కోట్ల నష్టపోయింది. 2008 జూన్‌లో మొదలైన ఈ కేటాయింపుల వ్యవహారం 2009 ఫిబ్రవరి తొమ్మిదిన కొలిక్కి వచ్చింది. కినెటాకు 814 ఎకరాలను, కృష్ణపట్నం పవర్‌ కార్పొరేషన్‌కు 1033 ఎకరాలను కేటాయించారు.

మరి మాకేంటి?
భూ కేటాయింపులు జరిగిన నెల రోజుల్లోపే జగతి పబ్లికేషన్స్‌కు కినెటా నుంచి నిధులు వచ్చేశాయి. సాక్షి, సాక్షి టీవీ నిర్వహిస్తున్న జగతి పబ్లికేషన్స్‌లో వల్లభనేని బాలశౌరికి చెందిన కినెటా గ్రూప్‌ నుంచి రూ.10 కోట్లు వచ్చాయి. ఇందుకోసం గుంటూరు కేంద్రంగా నిర్వహిస్తున్న ఓ హోటల్‌ కంపెనీ సాయం తీసుకున్నారు. గుంటూరుకు చెందిన బేతంచర్ల పురుషోత్తం, ఆయన భార్య రాజ్యలక్ష్మిలు హైదరాబాద్‌ చిరునామాతో నెలకొల్పిన స్వగృహ ఇంపెక్స్‌ లిమిటెడ్‌ ద్వారా జగతి పబ్లికేషన్స్‌లోకి నిధులను తరలించారు. 2003లో ప్రారంభమైన స్వగృహ ఇంపెక్స్‌కు 2007 వరకు ఎలాంటి పనీపాటా లేదు. 2008లో బ్యాంకు రుణంతో హోటల్‌ నిర్వహణ మొదలు పెట్టేముందు కంపెనీ పేరును స్వగృహ హోటల్స్‌గా మార్చారు. 2009లో బాలశౌరి కంపెనీల నుంచి స్వగృహకు నిధులు వచ్చాయి. హోటల్‌ బిజినెస్‌కు పరిమితమైన ఈ కంపెనీ పబ్లికేషన్స్‌లో ఉన్న జగతిలోకి రూ.10 కోట్లను పెట్టుబడిగా పెట్టింది. బాలశౌరికి చెందిన కినెట్‌ గ్లోబల్‌ (కినెటా మినరల్స్‌ అండ్‌ మెటల్స్‌ పాత పేరు) నుంచి 2009 మార్చి 31 కల్లా రూ.10 కోట్లు రాగా, పూర్తి మొత్తాన్ని జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడి పెట్టారు. స్వగృహ హోటల్స్‌కు 2,77,777 షేర్లను రూ.350 ప్రీమియంతో కేటాయిస్తున్నట్లు 2010 ఫిబ్రవరి 18వ తేదీన జరిగిన జగతి పబ్లికేషన్స్‌ బోర్డు సమావేశంలో తీర్మానించినట్లు జగతి ఖాతాల్లో పేర్కొన్నారు. అంటే, జగతి ఖాతాలోకి సొమ్ము చేరిన ఏడాదికి షేర్లు కేటాయించారన్నమాట. అప్పటి దాకా షేర్‌ అప్లికేషన్‌ మనీ కింద ఉంచారన్న మాట. స్వగృహ హోటల్స్‌ ఖాతాలో రూ.10 కోట్లు తొలుత కినెటా గ్లోబల్‌ నుంచి వచ్చినట్లు చూపినా... తరువాతి ఏడాదిలో మాత్రం రూ.5 కోట్లు మాత్రమే కినెటా గ్లోబల్‌ ఖాతాలో చూపి, మిగిలిన రూ.5 కోట్లు కినెటా పవర్‌ ఖాతాలో చూపారు. తరవాత స్వగృహ హోటల్స్‌ కంపెనీ హోటల్‌ బిజినెస్‌ మానేసింది. అంటే కేవలం జగతి పబ్లికేషన్స్‌లో నిధులు తరలించేందుకు మాత్రమే ఈ కంపెనీని ఉపయోగించు కున్నారన్నమాట. ఇవి కాకుండా అబీర్‌ కన్‌స్ట్రక్షన్స్‌కు రూ.10 కోట్లు బాలశౌరి తరలించారు. 2009 ఎన్నికల ప్రమాణపత్రంలో ఈ లెక్కలు చూపిన బాలశౌరి 2014 ఎన్నికల ప్రమాణపత్రంలో ఈ రెండు ఖాతాలు చూపలేదు. మరి స్వగృహ హోటల్స్‌ పేరుతో జగతి పబ్లికేషన్స్‌ ఉన్న రూ.10 కోట్లు ఎవరివి? బాలశౌరివేనా లేదా ఇతరుల పేరున మార్చారా? తేలాల్సి ఉంది. జగన్‌ సంస్థల్లో పెట్టుబడి పెట్టిన పలువురు పారిశ్రామిక వేత్తల అవినీతి డొంకలు కదిలించిన సీబీఐ బాలశౌరి జోలికి పోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

సమంత@100 కేజీలు

మొదటి సినిమాలో సన్నగా సన్నజాజి తీగలా కనిపించి..రెండో చిత్రానికి వచ్చేసరికి బొద్దుగుమ్మగా దర్శనమిచ్చారు ఎంతో మంది కథానాయికలు....

జైగంగాజల్‌ ట్రైలర్‌ విడుదల

ప్రకాశ్‌ ఝా దర్శకత్వంలో ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న జైగంగాజల్‌ చిత్ర ట్రైలర్‌ను విడుదల....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net