Fri, February 12, 2016

Type in English and Give Space to Convert to Telugu

'వైజ్ఞానిక మైలురాయి''విశ్రమించిన వీరుడు''మేయర్‌ ఎన్నిక ఏకగ్రీవం''కారెక్కిన మరో తెదేపా ఎమ్మెల్యే''‘బేర్‌’మన్న స్టాక్‌ మార్కెట్లు''‘ఆధార్‌’ ఇక తప్పనిసరి కాదు''కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయం''ఎంపీల జీతభత్యాలు త్వరలో రెట్టింపు!''మార్చి మొదటి వారంలో ‘పుర’ ఎన్నికలు''మేడారం జాతరను జాతీయ పండుగగా ప్రకటించండి'
ఆరునూరైనా రుణమాఫీ!
రైతు, డ్వాక్రా రుణాల మాఫీకి కనీసం రూ.70వేల కోట్లు అవసరం..
కట్టినవారికి, కట్టనివారికీ లబ్ధి చేకూరిస్తే బాగుంటుందా?
కేంద్రం సాయం అనుమానమే..
వెసులుబాటు ఇస్తుందేమో చూడాలి
9 గంటల వ్యవసాయ విద్యుత్తుకూ సిద్ధం
గ్రామీణ ప్రాంతాలకు 24 గంటల సరఫరా!
హామీల అమలుపై చంద్రబాబు కసరత్తు
అధికారులతో వరుస భేటీలు
కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధాని నిర్మాణం
రైతుల నుంచి భూసేకరణ జరిపి అభివృద్ది చేసిన భూమిలో వాటా ఇస్తాం
నాగార్జున విశ్వవిద్యాలయం యథాతథం
తెదేపా అధినేత మనోగతం
ఈనాడు - హైదరాబాద్‌
తెదేపా అధినేత, ఆంధ్రప్రదేశ్‌ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై దృష్టి సారించారు. అధికారం చేపట్టగానే అందుకు సంబంధించిన పనులు వేగంగా చేసేందుకు ముందుగానే కసరత్తు చేస్తున్నారు. రైతులకు వ్యవసాయ రుణాల మాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్తు, అత్యుత్తమ రాజధాని నిర్మాణంపై ఆయన విడిగానూ, అధికారులతోనూ సమాలోచనలు జరుపుతున్నారు.

రుణాల మాఫీపై...
ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీల్లో ప్రధానంగా ప్రజల్లోకి వెళ్లిన హామీల్లో రైతుల రుణ మాఫీ ఒకటి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ఏ రకంగా దానిని అమలు చేయాలన్న అంశంపై చంద్రబాబు దృష్టి సారించారు. పంట రుణాలతోపాటు డ్వాక్రా మహిళల రుణమాఫీకి దాదాపుగా రూ.70వేల కోట్లు కావాలని అంచనా ఉండగా... ఇప్పటికప్పుడు కొత్త రాష్ట్రానికి రెవెన్యూ లోటు రూ.10వేల కోట్లు, తక్షణ చెల్లింపులు మరో రూ.7వేల కోట్లకుపైగా ఉన్నాయి. సీపీఐ నేతలు నారాయణ, రామకృష్ణ తదితరులు సోమవారమిక్కడ చంద్రబాబును కలిసినప్పుడు పంట రుణాల మాఫీపై చర్చ జరిగిందని సమాచారం. రుణ మాఫీ కచ్చితంగా చేస్తానని, ఆర్థికలోటును అధిగమిస్తానని ఆయన చెప్పినట్లు తెలిసింది. కేంద్రం సాయం చేస్తుందా? అని సీపీఐ నేతలు అడగ్గా... కేంద్రం నేరుగా ఆర్థిక సాయం చేయకపోవచ్చని, కొన్ని వెసులుబాట్లు ఇచ్చే అవకాశం ఉండొచ్చని చంద్రబాబు పేర్కొన్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో రుణమాఫీకి సాయం చేస్తే... మిగతా రాష్ట్రాలూ ఒత్తిడి తెస్తాయని, అందువల్ల కేంద్రం నేరుగా సాయం చేయలేదని అన్నట్లు తెలిసింది. పంట రుణాలు ఇప్పటికే చెల్లించిన వారికీ ప్రోత్సాహకంగా కొంత లబ్ధి చేకూర్చాలన్న ప్రతిపాదనా ఉందని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. రుణం తిరిగి చెల్లించిన వారికి, అసలు కట్టనివారికి లాభం ఉండేలా మార్గదర్శకాలు రూపొందించబోతున్నట్లు వెల్లడించారని తెలిసింది.

ఉచిత విద్యుత్తుపై...
అధికారంలోకి రాగానే వ్యవసాయానికి రోజుకు 9 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తామన్న హామీ అమలుపైనా చంద్రబాబు దృష్టి పెట్టారు. దీనిపై ఇప్పటికే విద్యుత్తు అధికారులతో చర్చలు జరిపారు. ప్రణాళిక తయారు చేయాలని వారిని కోరారు. ప్రస్తుతం వ్యవసాయానికి రోజుకు 7 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తున్న విషయం తెలిసిందే. దీని ప్రకారం అదనంగా మరో రెండు గంటలు ఎక్కువసేపు విద్యుత్తు ఇవ్వాల్సి ఉంటుంది. ఇదే విషయాన్ని చంద్రబాబు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్‌లో మిగులు విద్యుత్తు ఉంటుందని, రోజుకు 9 గంటల వ్యవసాయ విద్యుత్తు ఇవ్వడం ఇబ్బంది కాదనే అభిప్రాయం తొలుత వ్యక్తమైంది. కానీ వినియోగం ఆధారంగా రెండు రాష్ట్రాలకు విద్యుత్తు పంపకాలు జరగడంతో కొరత నుంచి ఆంధ్రప్రదేశ్‌ బయటపడే పరిస్థితి లేదు. ఇదే విషయాన్ని అధికారులు చంద్రబాబుకు తెలియజేసి డిమాండుకు, సరఫరాకు మధ్య అగాథం ఉందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆచరణలో ఇబ్బందులు వచ్చే అవకాశముందని అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే 9 గంటల వ్యవసాయ విద్యుత్తు... తమ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ కాబట్టి ఆ మేరకు ఇచ్చి తీరాల్సిందేనని ఆయన స్పష్టం చేశారని సమాచారం.

ఇక గ్రామీణ ప్రాంతాలకు 24 గంటల విద్యుత్తు సరఫరాపైనా చంద్రబాబు విద్యుత్తు అధికారులతో చర్చలు జరుపుతున్నారు. గృహావసరాలకు, పరిశ్రమలకు నిరంతరాయంగా 24 గంటల విద్యుత్తు ఇస్తామని తెలుగుదేశం ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చింది. ఇదే విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించగా గ్రామీణ విద్యుత్తు ఫీడర్లు, వ్యవసాయ విద్యుత్‌ ఫీడర్లను వేరు చేసేవరకూ గ్రామీణ ప్రాంతాలకు 24 గంటల విద్యుత్తు ఇవ్వడం సాధ్యం కాదని అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది. దీనిపై బాబు స్పందిస్తూ... ఒక ప్రణాళికను తయారు చేయాలని సూచించినట్లు సమాచారం.

రాజధాని నిర్మాణంపై...
ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణానికి ప్రభుత్వ భూములతోపాటు రైతుల నుంచీ కొంత భూసేకరణ జరపాల్సి వస్తుందేమోనని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే ఈ భూసేకరణవల్ల రైతులు నష్టపోకుండా ఉండేలా ఒక విధానాన్ని తీసుకురావాలని ఆలోచిస్తున్నారు. రైతుల నుంచి తీసుకున్న భూమిని అభివృద్ధి చేసి... దానిలో కొంత భాగాన్ని మళ్లీ రైతులకు ప్లాట్ల రూపంలో ఇచ్చేలా చూడాలనేది చంద్రబాబు యోచనగా ఉంది. దీనివల్ల భూముల విలువ పెరిగి రైతులకూ లబ్ధి చేకూరుతుందని అంచనా. ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధాని నిర్మించాలనే తన ఆలోచనలకు అనుగుణంగా చంద్రబాబు ఈ యోచన చేస్తున్నట్లు సమాచారం. దీని ప్రకారం రాజధానికి అవసరమైన భూమి కంటే ఎక్కువ భూమిని రైతుల నుంచి సేకరిస్తారు. అందులో రాజధానికి అవసరమైన భూమిని వినియోగించుకుని, మిగిలిన భూమిని ప్లాట్లుగా అభివృద్ధి చేసి రైతులకు ఇస్తారు. వారి నుంచి తీసుకున్న భూమిలో దాదాపు 30-40శాతంకు అటూఇటూగా తిరిగి వారికి ప్లాట్ల రూపంలో ఇచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. దీనికి రైతుల సహకారం తీసుకోవడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అనుకుంటున్నారు. సీపీఐ నేతలు కలిసిన సందర్భంగా రాజధాని విషయమూ ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోనే రాజధాని ఉంటుందని, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అత్యుత్తమ నగరాన్ని నిర్మిస్తానని చంద్రబాబు వారితో అన్నట్లు సమాచారం. ఒక కొత్త నగరాన్ని రాజధానిగా నిర్మిస్తామని పేర్కొన్నట్లు తెలిసింది. కొత్త రాజధాని చుట్టూ ఇన్నర్‌, ఔటర్‌ రింగ్‌రోడ్డులనూ అభివృద్ది చేయాలని ఆయన యోచిస్తున్నట్లు సమాచారం. మరోవైపు నాగార్జున విశ్వవిద్యాలయాన్ని యథాతథంగా అక్కడే ఉంచుతారని విశ్వసనీయంగా తెలిసింది. దాన్ని మరోచోటకు మార్చే ప్రతిపాదన ప్రస్తుతానికి ఏమీ లేదని అంటున్నారు. అక్కడున్న భూమి తక్కువని, అది రాజధాని నిర్మాణానికి సరిపోదని అంచనా వేస్తున్నారు. అందుకోసమే రైతుల నుంచి భూమిని సేకరించి, రాజధాని నిర్మాణాన్ని చేపట్టాలన్న ఉద్దేశంతో ఉన్నట్లు సమాచారం. అన్ని ప్రాంతాలనూ సమానంగా అభివృద్ధి చేసే విధానాన్ని అనుసరించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలిసింది. కొత్త రాజధాని చుట్టుపక్కల జిల్లాలతోపాటు రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలనూ అభివృద్ధి చేసే దిశగా ముందుకెళ్తామని ఆయన నేతలతో పేర్కొన్నట్లు సమాచారం. అభివృద్ధి అంతా ఒకటేచోట కేంద్రీకృతమైతే మళ్లీ ఇబ్బందులు వస్తాయేమోనని సీపీఐ నేతలు పేర్కొనగా... రాయలసీమనూ అభివృద్ధి చేస్తామని చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది. అనంతపురం జిల్లాలో లేపాక్షి నాలెడ్జ్‌ కేంద్రం దగ్గర ఒక శాటిలైట్‌ టౌన్‌షిప్‌ నిర్మిస్తామని, తిరుపతి, కర్నూలు లాంటి నగరాల్లోనూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పినట్లు సమాచారం. రాయలసీమలో వర్షాలు, సాగునీరు లేని అనంతపురం లాంటి జిల్లాలో బిందు, తుంపర సేద్యాల ద్వారా ప్రతి ఎకరానికీ నీళ్లిచ్చే ఏర్పాటు చేస్తామని పేర్కొన్నట్లు తెలిసింది.

సమంత@100 కేజీలు

మొదటి సినిమాలో సన్నగా సన్నజాజి తీగలా కనిపించి..రెండో చిత్రానికి వచ్చేసరికి బొద్దుగుమ్మగా దర్శనమిచ్చారు ఎంతో మంది కథానాయికలు....

జైగంగాజల్‌ ట్రైలర్‌ విడుదల

ప్రకాశ్‌ ఝా దర్శకత్వంలో ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న జైగంగాజల్‌ చిత్ర ట్రైలర్‌ను విడుదల....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net