Tue, February 09, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ఔషధనగరిలో ప్రపంచశ్రేణి విశ్వవిద్యాలయం''భూసేకరణ, పునరావాసాలకేరూ. 8,000 కోట్లు''నెట్‌ సమానత్వానికే ట్రాయ్‌ మొగ్గు!''ముద్రగడ దీక్ష విరమణ''తెలంగాణ ప్రణాళిక భేష్‌''విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయాలా?''డాక్టర్‌.. ధనాధన్‌..''రసాయన పరిశ్రమలో పేలుడు''నడి వీధిలో పైశాచికం''పాక్‌ నుంచే కుట్ర'

పోలవరం ముంపు ప్రాంతాలపై త్వరలో ఆర్డినెన్స్‌
కేంద్ర కేబినెట్‌ నిర్ణయం
కేంద్ర విద్యుత్తు పంపిణీ వాటాలో మార్పులు
రాష్ట్ర విభజన చట్టానికి రెండు సవరణలు
రాష్ట్రపతి ద్వారా ఆర్డినెన్స్‌ జారీకి సిద్ధం
ప్రత్యేక రాష్ట్ర హోదా అమలు బాధ్యత ప్రణాళికా సంఘానికి
ఈనాడు - న్యూఢిల్లీ
రాష్ట్ర విభజన బిల్లు చట్టరూపం దాల్చిన మరుసటి రోజే కేంద్ర ప్రభుత్వం దానికి రెండు సవరణలు ప్రతిపాదించింది. వాటితో పాటు ఫిబ్రవరి 20వ తేదీన రాజ్యసభలో తెలంగాణ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా సీమాంధ్రకు ప్రత్యేక కేటగిరీ హోదా కల్పిస్తూ ప్రధానమంత్రి ఇచ్చిన హామీ అమలును తక్షణం మొదలుపెట్టాలని మంత్రివర్గం ప్రణాళికా సంఘాన్ని నిర్దేశించింది. సమావేశానంతరం కేంద్రమంత్రి జైరాం రమేష్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై మూడు నిర్ణయాలు తీసుకున్నాం. అందులో..

సీమాంధ్ర ప్రాంతానికి అయిదేళ్లపాటు ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పిస్తూ ప్రధానమంత్రి రాజ్యసభలో చేసిన ప్రకటన అమలును మొదలుపెట్టాలని మంత్రివర్గం ప్రణాళికా సంఘాన్ని నిర్దేశించింది. అందుకు తగిన పరిపాలన వ్యవస్థ ప్రణాళికా సంఘమే కాబట్టి మంత్రివర్గం దానికి ఆదేశాలు జారీచేసింది. ఈ పథకం కింద కేంద్రం అందించే ఆర్థికసాయం ప్రణాళికా సంఘం ద్వారానే వెళ్తుంది.

పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన ఆంధ్రప్రదేశ్‌ విభజన బిల్లులో మరో సవరణ ప్రతిపాదించాం. పోలవరం బహుళార్థ సాధక సాగునీటి ప్రాజెక్టు కింద ముంపునకు గురయ్యే వారికి పూర్తిస్థాయిలో సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టడానికి వీలుగా అయిదు మండలాలను పూర్తిగా, రెండు మండలాలను పాక్షింగా సీమాంధ్రలో కలపడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా పాల్వంచ రెవెన్యూ డివిజన్‌లోని 1. కుక్కునూరు, 2. వేలేరుపాడు, 3. బూర్గంపహాడ్‌ (పినపాక, మోరంపల్లి బంజర్‌, బూర్గంపహాడ్‌, నాగినిప్రోలు, కృష్ణసాగర్‌, టేకుల, సారపాక, ఇరవండి, మోతపట్టినగర్‌, ఉప్పుసాక, నకిరీపేట, సోంపల్లి రెవెన్యూ గ్రామాలు మినహాయించి) మండలాలు, భద్రాచలం రెవెన్యూ డివిజన్‌లోని 4. చింతూరు, 5. కూనవరం, 6. వీఆర్‌ పురం, 7. భద్రాచలం(శ్రీసీతారామచంద్ర మందిరంతో పాటు భద్రాచలం రెవెన్యూ గ్రామం మినహాయించి) మండలాలను ఖమ్మం జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్‌కు బదిలీచేస్తూ సవరణ ప్రతిపాదించాం. చారిత్రక భద్రాచలం పట్టణం, రామాలయం తెలంగాణలో అంతర్భాగంగా ఉంటాయి. పోలవరం కింద ముంపునకు గురయ్యే బాధితులకు వారి సొంత మండలంలోనే భూమికి భూమి పరిహారం ఇవ్వడానికే ఈ సవరణ తీసుకొస్తున్నాం. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్రమే చేపడుతుంది. అందువల్ల వారికి తగిన సహాయ పునరావాసం కల్పించాలన్న ఉద్దేశంతో ముంపు ప్రాంతంతో పాటు, వారికి పునరావాసం కల్పించే ప్రాంతం కూడా ఒకే రాష్ట్రంలో ఉండాలన్న ఉద్దేశంతో వీటిని సీమాంధ్రలో కలపాలని సవరణ తీసుకొచ్చాం.

ఇరురాష్ట్రాల మధ్య విద్యుత్తు పంపిణీ చేసే అంశంపై బిల్లులో కొంత అయోమయం ఉంది. రాష్ట్రంలోని ఎన్టీపీసీ లాంటి కేంద్ర ప్రభుత్వ రంగ విద్యుత్తు సంస్థల్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్తును గత అయిదేళ్లలో జరిగిన వాస్తవ వినియోగం ఆధారంగా ఇరు రాష్ట్రాలకు పంపిణీచేస్తాం అని బిల్లులో పేర్కొన్నాం. ఇందులో కొంత అయోమయం ఉంది కాబట్టి స్పష్టత ఇవ్వాలని తెలంగాణ, సీమాంధ్ర ప్రజలు కోరడంతో కేంద్ర మంత్రివర్గం దీనిపై స్పష్టత ఇచ్చింది. ఎవరికీ కేటాయించని 15 శాతం విద్యుత్తును మాత్రమే వాస్తవ వినియోగం ప్రాతిపదికన ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేస్తాం. మిగతా 85 శాతం విద్యుత్తును గాడ్గిల్‌ ఫార్ములా ప్రకారం జనాభా నిష్పత్తి ప్రాతిపదికన పంపిణీ చేస్తాం. తాజా కేంద్రమంత్రి వర్గంలో తీసుకున్న మూడు నిర్ణయాల్లో రెండు రాజ్యసభలో చర్చ సందర్భంగా ప్రధానమంత్రి ఇచ్చిన హామీలకు సంబంధించినవి. ఆ రోజు ప్రధానమంత్రి ప్రకటించిన మిగతా నాలుగు హామీలకు ఎలాంటి ఉత్తర్వులు అవసరం లేదు. అవి ఇప్పటికే బిల్లులో అంతర్భాగంగా ఉన్నాయి. వాటి అమలుకు కార్యనిర్వాహక చర్యలు సరిపోతాయి’’ అని జైరాం రమేష్‌ వివరించారు.

ఇప్పుడున్న నియోజక వర్గాల ప్రకారమే ఎన్నికలు
రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఇప్పుడున్న నియోజక వర్గాల ప్రాతిపదికనే జరుగుతాయని జైరాం రమేష్‌ చెప్పారు. పోలవరం ముంపు మండలాలను ఖమ్మం జిల్లా నుంచి సీమాంధ్రలో కలపడం వల్ల ఒక లోక్‌సభ, మూడు అసెంబ్లీ నియోజక వర్గాలపై ప్రభావం పడుతుంది కదా? అన్న ప్రశ్నకు జైరాం స్పందిస్తూ ‘‘ఎన్నికల సంఘానికి అన్నీ తెలుసు. వారు తగు నిర్ణయం తీసుకుంటారు. 2014 ఎన్నికలు ఇప్పుడున్న అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల ప్రకారమే జరుగుతాయి. అందులో ఎలాంటి అయోమయం లేదు’’ అన్నారు.

ఆర్డినెన్స్‌ రాష్ట్రపతి పని: మంత్రివర్గం కేవలం సవరణలు ప్రతిపాదించినట్లు మాత్రమే జైరాం రమేష్‌ ఈ సందర్భంగా చెప్పారు. ఆర్డినెన్స్‌ గురించి ఆయన మాట్లాడలేదు. దీని గురించి అడిగినప్పుడు ‘‘ఆర్డినెన్స్‌ అంశం రాష్ట్రపతి కార్యాలయంతో ముడిపడి ఉంటుంది కాబట్టి దాని గురించి నేనేమీ చెప్పలేను. మంత్రివర్గం మాత్రం రాష్ట్ర విభజన బిల్లుకు రెండు సవరణలు, దాని భాషను నిర్ణయించింది. దాన్ని మేం ముందుకు తీసుకెళ్తాం. ఇప్పుడు బిల్లు చట్ట రూపం సంతరించుకొంది. అయినప్పటికీ సవరణలను ప్రతిపాదించాం’’ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ విభజనే తీవ్రమైన అంశం అయినప్పుడు ఈ సవరణల గురించి పార్లమెంటులో చర్చించకుండా ఇప్పుడు ఆర్డినెన్స్‌ జారీచేయడంలో అర్థమేంటని ప్రకాశ్‌కారత్‌ అంటున్నారు కదా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ ‘‘ఇందులో ఒక సవరణను రాజ్యసభలో ప్రధానమంత్రి ఇచ్చిన హామీకి కట్టుబడి తెస్తున్నాం. రెండోది బిల్లులో స్పష్టత కోసం చేపడతున్నాం. ఇవి రెండూ అవసరం. తొలి సవరణ ప్రజల్లో గొప్ప ఆత్మ విశ్వాసాన్ని కలిగిస్తుంది’’ అని జైరాం పేర్కొన్నారు.

వారంలోపు కొత్త రాజధాని ఎంపిక కమిటీ
రాష్ట్ర విభజన బిల్లు చట్ట రూపం దాల్చిన నేపథ్యంలో సీమాంధ్ర రాజధాని ఎంపిక కోసం మరో వారం రోజుల్లోపు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు జైరాం రమేష్‌ ప్రకటించారు. అపాయింటెడ్‌డే గురించి అడిగినప్పుడు ‘‘20వ తేదీ రాజ్యసభలో ప్రధాని సభాముఖంగా ఆరు హామీలు ఇచ్చారు. అందులో 5వ పాయింట్‌ కింద అపాయింటెడ్‌డేను బిల్లు నోటిఫైడ్‌ డే ఆధారంగా నిర్ధారిస్తామని చెప్పారు. అప్పుడే సిబ్బంది, ఆస్తి, అప్పుల పంపిణీలాంటి ముందస్తు కసరత్తు సంతృప్తికరంగా జరుగుతుంది. కేంద్ర, రాష్ట్ర సిబ్బంది పంపిణీకోసం రెండు కమిటీలు వేశాం. ఆ కమిటీలు సోమవారం నుంచి పనిచేస్తాయి. వచ్చే వారంలోపు కొత్త రాజధాని ఎంపిక కమిటీ నియామకం కూడా జరుగుతుంది. మన్మోహన్‌ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వ హయాంలోనే అపాయింటెడ్‌డే ఖరారవుతుంది’’ అన్నారు.

ముంపు మండలాల బదిలీని వ్యతిరేకించిన జైపాల్‌: ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను సీమాంధ్రలో కలపాలన్న సవరణను వ్యతిరేకించినట్లు కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి చెప్పారు. ‘‘ఈ కొత్త సవరణను నేను వ్యతిరేకించాను. ఫలితంగా భద్రాచలం ఆలయం, భద్రాచలం పట్టణం, బూర్గంపహాడ్‌ మండలంలోని కొన్ని గ్రామాలు తెలంగాణకు ఇచ్చారు. అందువల్ల ఖమ్మం నుంచి భద్రాచలానికి భూ మార్గం ఏర్పడుతుంది’’ అని ఆయన పేర్కొన్నారు. ఇదే సందర్భంగా జైపాల్‌రెడ్డి తక్షణం అపాయింటెడ్‌డే ప్రకటించి రెండు రాష్ట్రాల్లో ఇద్దరు ముఖ్యమంత్రులను నియమించాలని కోరినట్లు తెలిసింది. రెండుప్రాంతాల్లో కూడా కాంగ్రెస్‌కు మెజారిటీ ఉన్నందున ప్రజాప్రభుత్వాలను ఏర్పాటుచేయాలని డిమాండ్‌ చేసినట్లు సమాచారం. అయితే వారంలోపు ఇది సాధ్యం కాదని హోం, న్యాయశాఖ మంత్రులు వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఇదే సందర్భంగా కావూరి సాంబశివరావు సీమాంధ్రకు ప్రత్యేక రాష్ట్ర హోదాను పదేళ్లు పొడిగించాలని డిమాండ్‌ చేసినట్లు సమాచారం. అందుకు ప్రధాని స్పందిస్తూ ‘‘సభలో నేను అయిదేళ్లు చెప్పాను. ఇప్పటికి అంతవరకే పరిమితం అవుదాం. కాలపరిమితి పొడిగింపు గురించి భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు చూసుకుంటాయి’’ అని వ్యాఖ్యానించినట్లు సమాచారం. అపాయింటెడ్‌డే విషయంలో తొందరపడకుండా అన్ని విషయాలూ సంతృప్తికరంగా తేల్చిన తర్వాతే ముందుకెళ్లాలని కావూరి పేర్కొన్నట్లు తెలిసింది.
ప్రత్యేక హోదా అమలు కొత్త ప్రభుత్వంలోనే...?
సీమాంధ్రకు ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం ప్రణాళికా సంఘానికి అప్పగించినప్పటికీ దాని అమలును మాత్రం ఎన్నికల తర్వాత ఏర్పడే కొత్త ప్రభుత్వంలోనే మొదలుకానుంది. ఈ నిర్ణయానికి జాతీయ అభివృద్ధి మండలి(ఎన్డీసీ) ఆమోదం తప్పనిసరి కాబట్టి ఆ సమావేశం తర్వాతే అధికారికంగా ఇది అమల్లోకి రానుంది. దీనిపై జైరాం రమేష్‌ మాట్లాడుతూ ఈ నిర్ణయానికి ఎన్డీసీ ఆమోదం అవసరంలేదని, కేవలం సమాచారం ఇవ్వడం కోసమే దాని ముందుకు తీసుకెళ్తారని చెప్పారు.

నేడు వైజాగ్‌లో జైరాం పర్యటన: కేంద్రమంత్రి జైరాం రమేష్‌ సోమవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. మంగళవారం గుంటూరు, విజయవాడ, బుధవారం వరంగల్‌కు వెళ్లి రాష్ట్ర విభజన వల్ల ఇటు సీమాంధ్ర, అటు తెలంగాణ ప్రజలకు ఒనగూరనున్న ప్రయోజనాల గురించి ప్రచారం చేయనున్నారు.

పదుగురి కోసం ఆరుగురం!

కాలేజీ స్నేహితులకో వాట్స్‌యాప్‌ గ్రూప్‌ చిన్నప్పటి మిత్రులకో ఫేస్‌బుక్‌ గ్రూప్‌ బంధువులందరినీ కలిపేందుకు గూగుల్‌ ప్లస్‌.. ఇలా నేటి సామాజిక మాధ్యమాలని మస్తుగా వాడుకుంటోంది...

అనుష్కలా పేరు తెచ్చుకుంటా!

ోడలింగ్‌లో రాణిస్తూ... వ్యాపార ప్రకటనల్లో మెరుస్తూ సినిమా పరిశ్రమ దృష్టినీ ఆకర్షిస్తుంటారు కొందరు భామలు. అలా కథానాయికలుగా అవకాశాల్ని అందుకొన్నవాళ్లు చాలా...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net