Wed, February 10, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ఈ హనుమంతుడు మృత్యుంజయుడు!''విద్యా విలీనం''ఆ నాటి హామీలను నెరవేర్చండి''తెరాస గూటికి కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే''కాల్పుల్లో అనూహ్య మలుపు''ఉగ్ర మూలం ఐఎస్‌ఐ''వెనక్కు పంపాం.. బహిష్కరణ కాదు''సుశీల్‌ కొయిరాలా కన్నుమూత''వెళ్లిరా నేస్తమా...''రాజ్యాంగం పవిత్రతను కాపాడాలి'
అభివృద్ధి త్రయం.. సీమాంధ్రకు జయం
ఉప్పులూరి మురళీకృష్ణ
ఈనాడు హైదరాబాద్‌
తెలంగాణలో ఎన్నికలు కాగానే....సీమాంధ్రను రెచ్చగొట్టబోతున్నారన్నారు...అసాధ్యమైన హామీలివ్వబోతున్నారన్నారు...ఓట్ల కోసం గిమ్మిక్కులు చేయబోతున్నారన్నారు...మోడీతో ఏవేవో చెప్పించబోతున్నారన్నారు...
...............
మోడీ వచ్చారు... కానీ విద్వేషం రెచ్చగొట్టలేదు...బాబు మాట్లాడారు కానీ నాడు నంద్యాలలో వైఎస్‌ మాదిరి విషం చిమ్మలేదు...
పవన్‌ ప్రసంగించారు... కానీ అరచేతిలో వైకుంఠాలు చూపలేదు...మాయమాటలు చెప్పలేదు...అభివృద్ధి´ గురించి చెప్పారు...నిజాయతీగా చెప్పారు...ఏం చేస్తామో చెప్పారు... ఎలా చేస్తామో చెప్పారు...మనకు ఏమేం అవకాశాలున్నాయో చెప్పారు...
ఇదిగో ఇది గుర్రం... ఇది మైదానమంటూ...మోడీ-బాబు-పవన్‌ల అభివృద్ధి´ జట్టు...వాస్తవాన్ని కళ్ళకు కట్టింది...
భవిష్యత్‌పై భరోసా ఇచ్చింది...రాజధానిని కోల్పోయి ఆందోళనలో ఉన్న ఆంధ్రావనికి వూరటనిచ్చింది!
గుండెల నిండా వూపిరిలూది...గుజరాత్‌ను మించేలా అభివృద్ధి´ సాధించొచ్చని...ఢిల్లీని మించేలా రాజధాని నిర్మించొచ్చని ధైర్యాన్నిచ్చింది!
కోపం, బాధ.... ఆవేదన, ఆక్రోశంతో..నిస్సహాయంగా గొంతెండిపోయినట్లున్న ఆంధ్రావనికి ఓ వూరట మీకు మేమున్నామనే బాసట!
సాఫ్ట్‌వేర్‌ రంగానికి కలికితురాయిలాంటి రాజధానిని కోల్పోయి, విద్య, ఉద్యోగావకాశాలు కోల్పోయి... పరిశ్రమలు, ఉద్యోగాలు, సాగునీటిలో నష్టపోయామన్న తీవ్ర ఆవేదన, బాధ, ఆవేదన, ఆక్రోశం, నిస్సహాయతతో... గొంతెండిపోయిన ఆంధ్రప్రదేశ్‌ ప్రజలపై జోరు వర్షం! మామూలు వర్షం కాదు... పన్నీటి వర్షం కురిసినంత ఆనందం! 24 గంటల వ్యవధిలో సుడిగాలిలా ఆరు సభలు జరిపిన నరేంద్రమోడీ-చంద్రబాబునాయుడు జోడీ ఆంధ్రావనిలో సరికొత్త ఆశలు రేకెత్తించింది. ఢిల్లీయే అసూయపడేలా ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని నిర్మిస్తామన్న నరేంద్రమోడీ హామీ అందరిలో వూపిరిలూదింది! కసిగా ఉన్నాం, ఈ కసితోనే పనిచేద్దాం... చెట్టుకిందే ప్రమాణస్వీకారం చేస్తా... ఆరు నెలల్లో రాజధాని నిర్మించుకుందామన్న చంద్రబాబు మాటలు అందరిలో ధైర్యాన్ని నింపాయ్‌! వీటికి తోడుగా పవన్‌ కల్యాణ్‌ పంచ్‌లు అందరినీ ఆలోచింపజేస్తున్నాయ్‌! ఇక జోడీ కుదిరింది.... మనకూ, మన అభివృద్ధి´కీ... తిరుగులేదనే భరోసా ప్రజల్లో కలిగింది. ఈ ముగ్గురూ కలిసి చేసిన సుడిగాలి బహిరంగ సభలు ఒకవైపు ప్రజల మనసుల్లో ఆనందాన్ని, ధైర్యాన్ని, భరోసాను నింపితే... వైకాపా గుండెలు మాత్రం డీలాపడిపోయాయి.

మాయమాటలు చెప్పకుండా.... నిజాయతీగా!
తెలంగాణలో ఓటు పడగానే.... ఆంధ్రప్రదేశ్‌లో నరేంద్రమోడీ, చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడు కలిసి అక్కడి ప్రజల్ని రెచ్చగొడతారని, తెలంగాణకు వ్యతిరేకంగా ఏదేదో ప్రకటిస్తారని, హైదరాబాద్‌ను యూటీగా చేస్తామనే హామీతో మోసం చేస్తారంటూ తెరాస అధినేత కేసీఆర్‌తో పాటు జగన్‌ మీడియా విపరీతంగా ప్రచారం చేశాయి. 2009 ఎన్నికలప్పుడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి తెలంగాణలో పోలింగ్‌ పూర్తి కాగానే... నంద్యాల సభలో మాట్లాడుతూ హైదరాబాద్‌కు వెళ్ళాలంటే మనం వీసా తీసుకోవాలా అంటూ ప్రజల్ని రెచ్చగొట్టారు! విద్వేషాల్ని పెంచే ప్రయత్నం చేశారు. కానీ మోడీ-బాబు అలాంటి చౌకబారు పద్ధతిలో వెళ్ళకుండా రాజనీతిజ్ఞతను ప్రదర్శించారు. రెచ్చగొట్టి పబ్బంగడుపుకోవటానికి ప్రయత్నించకుండా నిజాయితీగా మాట్లాడటం ప్రజల్ని ఆకర్షించింది! సీమాంధ్రుల్లో బాధ ఉందని చెబుతూనే కావాల్సిన అభివృద్ధి´ ఎలా చేస్తామన్న అంశాలపైనే నరేంద్రమోడీ, చంద్రబాబునాయుడులు దృష్టి పెట్టారు. ఎక్కడెక్కడ వెనకంజలో ఉన్నామో... అక్కడ ఆ అంతరాన్ని ఎలా పూడుస్తామో వివరించారు.

నాటి గుజరాత్‌ నేటి సీమాంధ్ర! 
ఒకనాడు గుజరాతీలు ఎదుర్కొన్న పరిస్థితే ఇప్పుడు సీమాంధ్రులకూ వచ్చిందన్న మోడీ పోలిక ప్రజలను ఆకట్టుకున్నది. ముంబయి లాంటి మహానగరం రాజధానిగా ఉన్న మహారాష్ట్ర నుంచి నేటి గుజరాత్‌ ప్రాంతం 50 ఏళ్ల క్రితం విడిపోవాల్సి వచ్చింది. ముంబయి లాంటి మహానగరాన్ని, మొత్తం దేశానికే ఆర్థిక రాజధానిగా ఉన్న నగరాన్ని గుజరాతీలు కోల్పోయారు. అయితే ఇవాళ గుజరాత్‌ దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రం. అదీ గత పదిహేనేళ్లలో సాధించిందే ఎక్కువ. నరేంద్రమోడీ నాయకత్వం వల్లే ఆ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. రేపు ప్రధాని కావడానికి అత్యధిక అవకాశాలున్న అలాంటి మోడీ ఆంధ్రావని అభివృద్ధికి తాను చంద్రబాబుకు తోడుంటానంటున్నారు. చంద్రబాబు ఒకప్పుడు అభివృద్ధి చేసి చూపించిన వ్యక్తి అయితే... నరేంద్రమోడీ ఇప్పటికీ అభివృద్ధి చేస్తున్న నాయకుడు! మరి ఈ ఇద్దరు నాయకులు కలిస్తే? కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబుల పాలన రావడమే కాదు... ఇద్దరూ కలిసి అభివృద్ధికి నడుం బిగిస్తే.... ఐదు, పదేళ్లలోనే ఆంధ్రప్రదేశ్‌ అగ్రరాష్ట్రంగా తయారవుతుందనే నమ్మకం ప్రజల్లో వ్యక్తమవుతోంది. హైదరాబాద్‌కు దీటైన రాజధాని అనడం కాదు... ఢిల్లీ అసూయపడేలా ఆంధ్ర రాజధాని నిర్మిస్తామంటూ నరేంద్రమోడీ ఇచ్చిన హామీ ప్రజల్లో ఆశలు రేకెత్తించింది. 

సీమాంధ్ర పౌరుషం లేని జగన్‌: పవన్‌ కల్యాణ్‌
కవైపు మోడీ-బాబు నిజాయతీగా వాస్తవాల్ని ప్రజల ముందుంచుతుంటే... వారికి తోడుగా పవన్‌ కల్యాణ్‌ పంచ్‌లు సీమాంధ్రుల్లో ఆలోచన రేకెత్తిస్తున్నాయి. పవన్‌ మాటలు సగటు సీమాంధ్రుడి అంతరంగాన్ని ప్రతిబింబిస్తున్నాయంటున్నారు. ఒకపక్క కేసీఆర్‌ ఇష్టమొచ్చినట్లు సీమాంధ్రులను తిడుతుంటే జగన్‌ ఒక్క మాటైనా మాట్లాడారా?.. సీమాంధ్ర పౌరుషం లేని జగన్‌కు సీమాంధ్రకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదు.. అంటూ జగన్‌ను ప్రశ్నించడం.. జరిగిన తెరవెనక మంత్రాంగాన్ని ప్రజల ముందు ఆవిష్కరిస్తోంది. పవన్‌ కల్యాణ్‌కున్న క్రేజ్‌.. యువతలో ఉన్న అభిమానం అన్నీ తెదేపా-భాజపాలకు కలిసొస్తున్నాయి. పవన్‌కల్యాణ్‌ మాటలతో యువతలో కిక్‌ వచ్చిందని అంటున్నారు. కచ్చితంగా పవన్‌ ప్రభావం ఉత్తరాంధ్ర, గోదావరి, కృష్ణా, రాయలసీమ ప్రాంతాల్లో ఉందని, అభివృద్ధి దిశగా ఓటు వేయాలంటున్న ఆయన తపన ప్రజలనూ ఆలోచింపచేసి.. స్పష్టతకు రావడానికి దోహదం చేసిందంటున్నారు.

హార్డ్‌వేర్‌..సాఫ్ట్‌వేర్‌: ఇప్పటి వరకూ సాఫ్ట్‌వేర్‌ గురించి మాత్రమే అంతా ఆలోచించగా... నరేంద్రమోడీ హార్డ్‌వేర్‌ గురించి ప్రతిపాదించి ఆంధ్రావనిలోని అందరిలో ఆలోచన రేకెత్తించారు! తద్వారా ఎన్నికల వేళ ఏదో రాజకీయ ప్రసంగాలు చేయటం కాకుండా నిజంగా రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నారనే నమ్మకం కలుగుతోంది. కంప్యూటర్లు ఇక్కడే ఎందుకు తయారు చేయకూడదు? ఎలక్ట్రానిక్‌ పరికరాలు ఎందుకు తయారు చేయకూడదని అంటూ ఆంధ్రప్రదేశ్‌ను హార్డ్‌వేర్‌ కేంద్రంగా తయారుచేస్తామంటూ మోడీ ఇచ్చిన భరోసా నిరుద్యోగుల్లో ఆశలు రేపుతోంది. ఒకపక్క సాఫ్ట్‌వేర్‌... మరోపక్క హార్డ్‌వేర్‌ రెండు రంగాలనూ అభివృద్ధి చేసుకోవచ్చన్న మాటను తొలిసారిగా మోడీ చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి కావాల్సిన ప్రణాళిక తన దగ్గర సిద్ధంగా ఉందని వెల్లడించడం... ప్రజల్లో ఆయన మాటపై విశ్వసనీయత పెంచేలా ఉంది. 

బంగారు తునక... తీరప్రాంతం: దేశంలో సుదీర్ఘ తీరప్రాంతమున్న రాష్ట్రం గుజరాత్‌! 1,600 కిలోమీటర్ల మేర తీరప్రాంతం ఆ రాష్ట్రంలో ఉంది. గుజరాత్‌ అభివృద్ధికి తీరప్రాంతం అత్యంత కీలకంగా ఉపయోగపడింది. ముంద్రా, జఫ్రాబాద్‌, మాండ్వి, భరూచ్‌, పింద్వారా, మంగ్రోల్‌, రాజ్‌పరాలాంటి పదుల సంఖ్యలో నౌకాశ్రయాలను తీరప్రాంతం వెంబడి అభివృద్ధి చేశారు. ఎగుమతులు, దిగుమతులు, అదే ప్రాంతంలో పరిశ్రమలు, ఉద్యోగాలు, మత్స్యసంపద... ఇలా సకల వ్యాపార కార్యకలాపాలకు ఈ నౌకాశ్రయాలు నిలయమయ్యాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌కూ ఓ ప్రత్యేకతుంది. గుజరాత్‌ తర్వాత పొడవైన సముద్ర తీరం ఉన్న రాష్ట్రం మనదే. 973 కిలోమీటర్ల తీరప్రాంతం ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. ఈ తీరప్రాంతాన్ని బంగారు తునకలా మారుస్తామని మోడీ హామీ ఇస్తున్నారు. గుజరాత్‌లో మోడీకున్న అనుభవం ఆంధ్రావనికి ఉపయోగపడుతుందనే ఆశాభావం కనిపిస్తోంది.

యువత ఉద్యోగాలు: మోడీ-బాబు జోడీ కలిసి ఇస్తున్న హామీలు నిరుద్యోగుల్లోనూ నమ్మకాన్ని నింపుతున్నాయి. రాష్ట్రంలో గత ఐదారేళ్లనుంచీ ఉద్యోగాలు లేక... నిరాశతో ఉన్న యువతతో పాటు..... ఇప్పుడు ఇంజినీరింగ్‌, ఎంబీఏ, ఎంసీఏ, డిగ్రీ, పీజీలు చదువుతున్న లక్షల మంది యువతలో, వారి కుటుంబాల్లో మోడీ-బాబుల ధ్వయం ఆశలు రేపింది. తీరప్రాంత ఆధారిత పరిశ్రమలు, కొత్తగా సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ పరిశ్రమల ఏర్పాటు, ఎలక్ట్రానిక్‌ పరికరాల తయారీల కంపెనీలు, పెట్రోలియం, గ్యాస్‌ ఉత్పత్తులు, వ్యవసాయ ఆధారిత ఫుడ్‌ ప్రాసెసింగ్‌... తదితర రంగాల్లో ఆపారమైన ఉద్యోగావకాశాలు కల్పించేందుకు అవకాశాలున్నాయని అంటున్నారు. ఆయా రంగాలన్నింటినీ అభివృద్ధి చేసి లక్షలాది కొత్త ఉద్యోగాలు సృష్టిస్తామని ఆ నేతలు చెప్తున్న మాటలు ప్రజల్లోకి చొచ్చుకెళ్తున్నాయి. 

నీరసపడ్డ వైకాపా
కేంద్రంలో రాబోయే ప్రభుత్వ అండ లేకుండా అభివృద్ధి సాధ్యం కాదన్న ప్రజల అభిప్రాయం, స్వర్ణాంధ్రకు తప్ప స్కామాంధ్రకు ఓటు వేయబోమంటున్న యువత అంతరంగం, రైతు రుణమాఫీ-బీసీలకు సంక్షేమం నినాదాలతో బలంగా ఉన్న తెలుగుదేశం-భాజపాల జోరులో... వైకాపా నీరసపడి పోయింది. గత రెండు రోజుల్నుంచీ జరుగుతున్న పరిణామాలు ఆ పార్టీని కలవరంలో పడేశాయి. ఆ పార్టీ ముఖ్య నేతలంతా మోడీ-చంద్రబాబుల జోడీ ప్రజల్లోకి పోతుండడంతో తమ ఓటు బ్యాంకుకు కనీసం 5-6శాతం చిల్లు పడిందని, ఆ మేరకు వెనకబడిపోయామని ఆందోళన చెందుతున్నారు. సీమాంధ్రులను కేసీఆర్‌ అనరాని మాటలంటున్నా... ఒక్కరోజైనా మాట్లాడే పౌరుషం జగన్‌మోహన్‌రెడ్డికి లేకుండా పోయిందే! సీమాంధ్ర పౌరుషం లేని వ్యక్తికి ఈ ప్రాంతానికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదన్న పవన్‌ కల్యాణ్‌ మాటలకు యువత వెర్రెత్తిపోతుంటే... వైకాపా నేతలు గంగ వెర్రులెత్తుతున్నారు. 
నదుల అనుసంధానం...సీమకు వరం: నీళ్లులేని రాయలసీమకు, ఆంధ్రలోని మెట్ట ప్రాంతాలకు సాగునీరిచ్చే పథకాలను ప్రవేశపెడతామని నరేంద్రమోడీ ఇస్తున్న భరోసా రైతాంగంలో ఆశలు రేపుతోంది. నదుల అనుసంధానం పథకం పూర్తి చేసి వాజ్‌పేయి కలను నెరవేరుస్తామంటున్నారు. గుజరాత్‌లోని ఎడారి ప్రాంతమైన కచ్‌లో కూడా భారీ పైప్‌లైన్‌లతో సాగునీరు తీసుకెళ్లామని మోడీ గుర్తుచేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి, నదుల అనుసంధానం ద్వారా రాయలసీమ రైతులకూ నీళ్లిస్తామనే భరోసా కల్పిస్తున్నారు. పోలవరంతో ఆంధ్రలోని మెట్ట ప్రాంతాలన్నీ సస్యశ్యామలం చేస్తామని చెప్పడం... రైతుల్లో ఆశలు చిగురింపచేస్తోంది. వందమంది కేసీఆర్‌లు వచ్చినా పోలవరం ప్రాజెక్టును ఆపలేరన్న సుస్పష్టమైన హామీ గోదావరి, కృష్ణా తదితర జిల్లా్లలతో పాటు... ఈ నీటిని కృష్ణాకు మళ్లించి వాడుకోవచ్చన్న ఆశను దక్షిణ కోస్తా, రాయలసీమ రైతాంగంలోనూ కలిగించింది.

స్వర్ణాంధ్రా...స్కామాంధ్రా: ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్ర చేసుకుంటారా? స్కామాంధ్రా చేసుకుంటారా? అన్న నరేంద్రమోడీ సూటి ప్రశ్న... ఇప్పటికే ఆలోచనలో ఉన్న ప్రజల్లో ఒక స్పష్టత వచ్చేలా చేస్తోంది. ‘కుంభకోణాలు, దోపిడీ ఎప్పుడు జరిగినా అది అంతిమంగా నష్టం చేసేది ప్రజలకే. కానీ రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడు కుంభకోణాలు జరగడం వేరు... సమృద్ధిగా డబ్బులున్నప్పుడు కొంత పోవడం వేరు. ఇప్పుడు కొత్త రాష్ట్ర పునర్‌నిర్మాణాన్ని కుంభకోణాలు, దోపిడీకి పాల్పడ్డ వారి చేతిలో పెడితే అధోగతే. ప్రతి పైసా అభివృద్ధికే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఈ తరుణంలో స్వచ్ఛమైన పాలకుడు, ప్రతి పైసానూ సద్వినియోగం చేసే నాయకుడు, అభివృద్ధి, సచ్ఛరిత్ర ఉన్న నాయకుడు కావాలి’ అని తిరుపతికి చెందిన పీహెచ్‌డీ పూర్తిచేసిన యువకుడు భువనేశ్వర్‌ అభిప్రాయపడ్డారు. దేశంలో ఒక అగ్రరాష్ట్రంగా, అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఎదగాలా? లేకుంటే కుంభకోణాలతో నేతలు తినగా మిగిలిన పైసలతో అభివృద్ధి లేక కునారిల్లిపోవాలా? అన్నది ఇప్పటికే నిర్ణయించుకున్నామని పలువురు చెబుతున్నారు.మమ్మల్నీ ఉద్యోగులే అనుకున్నారు!

బయోటెక్నాలజీ రంగాన్ని చాలా ఇష్టంగా ఎంచుకున్నారా ఇద్దరు..!కానీ ఆ చదువుకు తగ్గ ఉద్యోగాల్లేవు.. ఈ పరిస్థితుల్లో ఎవరయినా ఉన్నచోటే వేరే ఉద్యోగాలు చూసుకోవడమో...

హాలీవుడ్‌లో మెరుస్తున్న బాలీవుడ్‌

హాలీవుడ్‌లో బాలీవుడ్‌ జెండా ఎగరేస్తే ఎంత బాగుంటుందో... చాలాకాలంగా బాలీవుడ్‌ను వూరిస్తూ వచ్చిన ఈ లక్ష్యాన్ని మన తారలు ఒక్కొరొక్కరిగా సాధిస్తూ వస్తున్నారు....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net